అమ్మ చెప్పిన కథలు 2


అమ్మ చెప్పిన కథలు 2

దువా (ప్రార్ధన)
ఖలీఫాలు రాజ్యాలను పరిపాలించే రోజులవి.పర్షియా దేశానికి దగ్గరలో ఉన్న యెమెన్ దేశాన్ని సద్గుణ సంపన్నుడు,న్యాయకోవిదుడు అయిన ఖలీఫా కైఫ్ పరిపాలిస్తున్నాడు.అతని పాలనలో ప్రజలందరూ సుఖంగా జీవిస్తున్నారు.
ఒయాసిస్సుల నిండా నీళ్లు పుష్కలంగా ఉండేవి.ఖర్జూరపు తోటలు,గోధుమ చేలు, రకరకాల పండ్ల తోటలు,పూల వనాలు కనులకింపుగా ఉండేవి.
దూర ప్రాంతాల నుండి వర్తకులు తమ సరుకులను తీసుకు వచ్చి, విక్రయించి,ఓ వారం రోజుల పాటు అక్కడే ఉండి వెళ్లేవారు.వారి వస్తువులకు పూర్తి రక్షణ ఉండేది.
శుక్రవారం వచ్చిందంటే అక్కడ పండగ వాతావరణం కనపడేది.
జనం తమ స్వంత ఒంటెల మీద కూర్చొని ప్రయాణం చేసేవారు.ఎవరి దగ్గర ఎక్కువ ఒంటెలు ఉంటే వారినే ధనికులుగా గుర్తించేవారు.
దైవ భక్తి ఎక్కువగా ఉండేది.ఇతరులకు సహాయం చేయటం…పెద్దల పట్ల గౌరవం…పేదల పట్ల సహానుభూతితో మెలిగేవారు.
ఏ వ్యాపారి కూడా అధిక ధరలకు వస్తువులను అమ్మేవాడు కాదు.కొద్ధి లాభం చూసుకొని అమ్మేవారు.
అనుకోకుండా ఒకసారి ఇసుక తుఫాను వచ్చింది.చేతికొచ్చిన పంటలు మొత్తం దెబ్బతిన్నాయి.ప్రజల కళ్ళల్లో బాధ…ఎటూ తోచని నిస్సహాయ స్థితిలో వున్నారు.వేగుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ఖలీఫా కైఫ్ పొరుగు దేశాల నుండి కావాల్సిన ధాన్యాన్ని తెప్పించాడు.తన దేశంలో ఉన్న ప్రతి ఇంటికి ఉద్యోగస్తుల ద్వారా చేర్చే ప్రయత్నం చేసాడు.ఆ మరుసటి సంవత్సరం సకాలంలో వర్షాలు పడి విస్తారంగా పంటలు పండాయి.
కష్ట కాలంలో తమను ఆదుకున్న తమ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఖలీఫా కైఫ్ తన రాజ్యంలో ప్రజల బాగోగులు చూడటం కోసం నెలకు ఒకటి రెండుసార్లు మారు వేషంలో తిరిగేవాడు.అలా తిరుగుతున్న సమయంలో …..చీకటి వేళా…అందరూ ఇళ్లకు చేరుకునే సమయంలో…ఒక ఇంటి పక్కనుంచి వెళుతుండగా ఎవరో గట్టిగా మాట్లాడుకుంటున్నట్టు శబ్దాలు వినబడ్డాయి.
ఖలీఫా అక్కడే ఆగి…కిటికీ ప్రక్కన నిలబడి చెవులు రిక్కించాడు.
” మీ అమ్మ నాన్నలను పోషించటమే కష్టంగా ఉంటే…ఇప్పుడు మీ అక్క కూడా భర్త చనిపోగానే పిల్లల్ని తీసుకొని ఇక్కడకు వచ్చింది.ఎంత ఇబ్బందిగా ఉందొ తెలుసా?”అది ఆ ఇంటి ఇల్లాలి స్వరంలా ఉంది.
“మెల్లగా మాట్లాడు…వాళ్ళు వింటే బాధ పడతారు.సుఖాల్లో వున్నప్పుడు కాదు మనిషి కష్టాల్లో ఉన్నప్పుడే మనం చేయూతనివ్వాలి.మనం కాకపోతే అక్కకు దిక్కు ఎవరు చెప్పు.దేవుడు మనకు తగిన సహాయం చేస్తాడు…”ఆమె భర్త ఆమెతో అన్నాడు.
“నేనేమైన మీ అక్కను వెళ్ళిపొమ్మన్నానా?మనకు ఇబ్బందిగా ఉన్న విషయం చెప్పాను.”అంది.
“అంతా పై వాడే చూసుకుంటాడు. నువ్వు నిద్రపో..”అతను అన్నాడు.
ఖలీఫాకు మొత్తం పరిస్థితి అర్ధం అయింది.వెంటనే తన వేగులను పిలిచి ఆ గ్రామానికి ఆనుకొని ఉన్న పూల తోటల బాగోగులను చూసుకునే బాధ్యతను ఆ స్త్రీ మూర్తికి ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చాడు.


అమ్మ చెప్పిన కథలు 2

సుభిక్షంగా ఉన్న దేశాలను చూస్తే పొరుగు దేశాల వారికి ఎప్పుడూ కంటగింపే…ఎప్పుడు అవకాశం దొరుకుతుందా …ఎప్పుడు దాడి చేద్దామా అని చూస్తున్నారు.
పంటలు చేతికి వచ్చాక ప్రజలంతా పండగ చేసుకుంటున్నారు.ఊరి బయట ఉన్న తోటలోకి వెళ్లి అక్కడే భోజనాలు వండుకొని ..ఆటపాటలతో…ఆనందంగా గడుపుతారు.
ప్రజలంతా అలా ఆనందంగా పండుగ చేసుకునే తరుణంలో….ఓ వేగు పరుగులు పెడుతూ రాజభవనంలోకి వచ్చాడు.
రాజు గారి ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు.
“నువ్వు తెచ్చిన కబురు ఏమిటీ?”అడిగాడు ఖలీఫా.
“మహాప్రభో …పొరుగు దేశం ఖలీఫా గారు తన సైన్యాన్ని తీసుకొని మన మీదకు దండయాత్ర చేస్తున్నాడు.వందల సంఖ్యలో సైనికులు….ఒంటెలు..గుర్రాలు వస్తున్నాయి..”
అదివింటూనే ఖలీఫా సైన్యాదక్షుడిని పిలిపించాడు.
మంత్రులతో కలిసి ఆ సైన్యం మీద ఎలా దాడి చేయాలో నని ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నారు.
తెల్ల వారింది.
శత్రు సైన్యం దేశ సరిహద్దులకు కొద్దీ దూరంలో గూడరాలు వేసుకున్నట్టు వార్త వచ్చింది.
అప్పటికప్పుడు సైన్యాన్ని సిద్ధం చేయమని సైన్యాదక్షుడికి చెప్పి.. మంత్రులతో సమాలోచన మందిరం లోకి వెళ్ళిపోయాడు ఖలీఫా.
దేశమంతా చాటింపు వేయబడింది…శత్రు దేశం వారు ఏ క్షణమైనా దాడి చేయొచ్చనీ.. అప్రమత్తంగా ఉండాలనీ…యువకులు సైన్యానికి సహకరించడానికి సిద్ధంగా ఉండాలని..
ఎక్కడా చూసినా..విన్నా…ఇవే కబుర్లు…యుద్ధం గురించి.
తెల్ల వారక ముందే శత్రు సైన్యం మీద విరుచుకు పడ్డారు ఖలీఫా సైనికులు.కానీ శత్రువుల బలం ముందు ఎక్కువ సేపు నిలబడలేక పోయారు.రెండవ రోజు అలాగే జరిగింది.
మూడవ రోజు ఖలీఫా స్వయంగా యుద్ధరంగానికి వెళ్లారు కత్తి ..డాలు చేతుల్లో తీసుకొని.
చెంగున గుర్రం శత్రువుల మధ్యలోకి దూసుకు వెళ్ళింది.ఖలీఫా గారి కత్తి ధాటికి అనేక తలలు తెగిపడుతున్నాయి.శత్రు సైన్యం వెనక్కు తగ్గింది.

రెండవ రోజు శత్రు సైనికులు ఎక్కువ సంఖ్యలో ఖలీఫాను చుట్టుముట్టారు.అతను ఎక్కువ సేపు వారి ముందు నిలబడలేక పోయాడు.శత్రు సైనికుడు బలంగా కత్తి విసిరేసరికి ..అతని చేతిలో ఖడ్గం రెండు ముక్కలయింది.ఇక చావు తప్పదనుకున్నాడు…ఓ పదునైన ఖడ్గం గాల్లో లేచి అతని మెడను తాకపోయింది.
అప్పుడు జరిగింది అది…
ఆకాశంలో నుండి ఓ రొట్టె వచ్చి ఖలీఫా మెడకు అడ్డు వచ్చింది.గొంతు తెగి పోయేదే…కానీ ఆ రొట్టెకు తగిలి విరిగి క్రిందబడింది ఆ శత్రువు ఖడ్గం.
ఖలీఫాకు అదంతా కలలా ఉంది.
ఆకాశం నుండి రొట్టె రావడమేమిటీ..అది ఇనుప రొట్టెలా మారి తన మీద పడే కత్తి దెబ్బలను కాపాడట మేమిటి…అంతా రహస్యంగా ఉంది.
వెంటనే మరో ఖడ్గాన్ని చేతిలోకి తీసుకొని శత్రు సంహారం సాగించాడు.అతని మీదకు ఖడ్గాలు వచ్చిన ప్రతిసారి రొట్టె వచ్చి కాపా డుతూనే ఉంది.అతని ధాటికి భయపడి శత్రువులు పారి పోయారు.
ఆరు రోజుల తర్వాత విజయంతో తన రాజ గృహానికి బయలు దేరాడు ఖలీఫా.దేశమంతా పండగ వాతావరణం…అందరూ సంతోషంగా ఉన్నారు.
ఖలీఫా రాజ గురువులను…మత పెద్దలను పిలిపించి ….ఆకాశం నుండి రొట్టె రావడమూ.. తాను ఆపదలో ఉన్న ప్రతిసారి కాపాడటం గురించి చెప్పాడు.అలా ఎందుకు జరుగుతుందో కారణం తెలుసుకొమ్మని చెప్పాడు.
వారంతా
వారితో వారు చర్చించుకుని…గ్రంధాలు తిరగేసి..ఖలీఫాతో,”మహా రాజా…మీరు యుద్ధంలో వున్నప్పుడు…మీరు యుద్ధంలో గెలవాలని… మీకు ఏమి కాకూడదని..క్షేమంగా ఉండాలని అల్లాను నిరంతరం కోరుకుంటున్నారెవరో…వారి ప్రార్ధన(దువా) వల్లనే అలా జరిగిందని చెప్పారు.
“అలా ప్రార్ధన చేసిన వారిని ఎలా కనుక్కోవడం?”ఖలీఫా గారు అన్నారు.
“ముందుగా మీ కుటుంబం నుంచి ప్రారంభించండి మహారాజ”చెప్పారు మత గురువులు.
ఖలీఫా గారు తన అమ్మ నాన్న దగ్గరికెళ్లి ‘తన గురించి ప్రార్ధన చేసారా’ అని అడిగితే…”నువ్వు కడుపులో ఉన్నప్పటి నుండి నీ క్షేమం కోసం ప్రార్ధన రోజు చేస్తున్నాం బేటా”అని చెప్పారు.
అతను తన భార్యను అదే ప్రశ్న అడిగాడు.
“మీరు యుద్దానికి వెళ్లాకా మా అమ్మానాన్న వస్తే..రోజులన్నీ ముచ్చట్లతోనే గడిచి పోయాయి. మీరు అసలు గుర్తుకు రాలేదండి”అంది ఆమె.
అతనికి ఆమె సమాధానం రుచించలేదు లేదు.
రాజ దర్బారులో ఉన్న వారందరినీ ఒక్కరొక్కరుగా పిలిచి అడగసాగాడు. అవే సమాధానాలు…అందరూ అయిపోయారు వంట మనిషితో సహా.
అతనికి ఈ ఆలోచనతో ఆకలి వేయటం లేదు.నిద్ర పట్టడం లేదు.
ఓ వెన్నెల రాత్రి పై గదిలో కూర్చొని బయటకు చూస్తున్నారు.ఓ యువతి తల మీద కొంగుతో…భయభయంగా వంటశాల నుంచి బయటకు వెళుతోంది.వెంటనే వంట మనిషిని పిలిపించాడు.ఆమె భయపడుతూ వచ్చి నిలబడింది.
“ఇంత క్రితం ఓ యువతి వంటశాల నుంచి బయటకు వెళ్ళటం చూసాను.ఆమె ఎవరు? ఇంత పొద్దు పోయాక వెళుతుందేమిటీ??”
అతని మాటలకు భయపోయింది ఆమె.వణకుతూ,”ఆ అమ్మాయిని నాకు సహాయంగా ఉంటుందని బేగం సాహెబాని అడిగి పనిలోకి తీసుకున్నానండీ…ఆరు నెలల నుంచి ఇక్కడే పని చేస్తుంది. అందరూ భోజనాలు చేసాక గిన్నెలు కడిగి వెళుతోంది.”చెప్పింది.
“నేను యుద్దానికి వెళ్ళినప్పుడు ప్రార్ధన చేసిందేమో అడిగావా?”
“అవసరం లేదండి. ఆమె చాలా పేదరాలు. ముసలి తల్లితండ్రులు వున్నారు.ఎప్పుడూ వంటశాలలోనే ఉంటుంది.దానికి మీ సంగతులు ఏవీ తెలియవు…”
“అవసరమా…లేదా అన్నది నీకు అనవసరం.రేపు ఆమె రాగానే నా దగ్గరికి పంపు…ఇక నువ్వు వెళ్లొచ్చు.”
వెళ్లొచ్చు అనే మాట వినగానే,”సరే ..మహారాజా..”అంటూ వంగి వంగి నమస్కారం పెడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది.


తెల్లవారు జామున……వంట మనిషి ఒక యువతిని తోడు తీసుకొని ఖలీఫా గారి దగ్గరకు వచ్చింది.
ఖలీఫా వంట మనిషిని వెళ్లి పొమ్మని సైగ చేశారు.ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోయింది.
ఏ విషయము తెలియని ఆ యువతి భయంతో వణకుతోంది.కళ్ల నిండా నీళ్లు..ఏ క్షణమైనా క్రిందకు జారెట్టు ఉన్నాయి.తల వంచి నిలబడింది.తల ,ముఖం మొత్తం ముసుగులో ఉన్నాయి.
“నీ పేరేమిటి?”
“ముస్కాన్ మహారాజా..”వినయంగా జవాబు ఇచ్చింది.
“నేను యుద్దానికి వెళ్ళింది తెలుసా?”
“తెలుసు మహారాజా”
“అప్పుడు నువ్వేం చేసావు చెప్పు”అడిగాడు ఖలీఫా.
“నాకు తినేందుకు రోజు మూడు పూటలా మూడు రొట్టెలిస్తారు.ఒకటి నేను తిని రెండు మా అమ్మ నాన్నలను తీసుకు వెళ్తానండీ”చెప్పింది.
“నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమి చేసావో చెప్పు?”గట్టిగా ఆడిగే సరికి ఆమె ఏడవటం ప్రారంభించింది.
“ఒక తప్పు చేసానండీ”అంది.
“అదేమిటో చెప్పు”
“నేను రోజూ తినే ఆ రొట్టెను తినకుండా… నా దేశాన్ని…ప్రజలను కాపాడే ఖలీఫా గారికి ఎలాంటి ప్రమాదం జరగొద్దని… క్షేమంగా ఉండాలని అల్లాను వేసుకుంటూ ఆ రొట్టెను బిచ్చగాళ్లకు వేసే దాన్నండీ.అలా మీరు యుద్ధం చేసినన్నీ రోజులు చేసానండీ”భయపడుతూ చెప్పింది.
ఖలీఫా గారికి విషయం అర్ధం అయింది.కన్నతల్లి..కట్టుకున్న భార్య…చుట్టాలు…స్నేహితులు ..ఎవరూ చేయని పని ముస్కాన్ చేసింది.తాను పస్తులుండి..ఆ రొట్టెను బిచ్చగాడికి వేసింది.ఆమె ప్రార్ధన వల్ల.. అల్లా దయతో ..ఆ రొట్టె ప్రతి రోజూ తనను యుద్ధం లో కాపాడింది.తాను ఈ రోజు బ్రతికి ఉన్నదంటే ఆమె దువానే కారణం..”అని ఆలోచించి.. మహారాణి గారిని పిలిపించి.. “ఈ రోజు నుంచి వంటశాలలో నువ్వు పని చేయాలి”..అని ఆజ్ఞపించాడు..
ముస్కాన్ ను వివాహం చేసుకొని మహారాణిని చేసాడు.
ఇతరుల మేలు కోసం మనం చేసే దువా(ప్రార్ధన ) ఎప్పటికీ వృధా కాదు.
@షేరు