“అమ్మ మాట”

చాలా సంవత్సరాల క్రిందట…
చిన్న చిన్న రాజ్యాలు …వాటి చుట్టూ దట్టమైన అడవులు.. కొండలు…స్వచ్ఛమైన నదులు…….
అలాంటి ఒక రాజ్యంలో వీరవరం అనే ఊరు ఉంది.దాని పక్కనే నది ప్రవహిస్తోంది.అన్ని కాలాల్లోనూ నది నిండా నీళ్లుండటం దాని ప్రత్యేకత.పైన ఎక్కడో కొండల్లో పుట్టి ఇక్కడి దాకా వచ్చి ..ఇక్కడ నుంచి క్రిందకు ఎంత దూరం పోతుందో ఎవరికీ తెలీదు.
ఆ ఊరికి ఉత్తరం దిక్కులో.. తాటి ఆకులతో కప్పిన పెద్ద ఇల్లు ఉంది.దాని ముందు విశాలమైన ఖాళీ స్థలం …దానిలో రకరకాలైన పూల చెట్లు..ప్రహరీ గోడకు పక్కనే కొబ్బరి చెట్లు ఎత్తుగా పెరిగాయి.అక్కడే బావి..చుట్టూ అరటిచెట్లతో చూడముచ్చటగా ఉంది.


“అమ్మా.. నేను అలా నది దగ్గరికి వెళ్లి ఆడుకొని వస్తా”అని తల్లికి చెప్పి,తిరిగి సమాధానం కోసం ఎదురు చూడకుండా బయటికి పరుగెత్తాడు పన్నెండేళ్ల చింటూ.


తండ్రి చిన్నప్పుడే ఎవరికీ చెప్పకుండా ఊరు వదలి వెళ్లిపోయాడు.తల్లి మునెమ్మనే పిల్లాడికి అన్నీ తానే అయి పెంచుతోంది.
ఆమె బైటకు వచ్చి చూస్తే చింటూ లేడు.ఎదిగే పిల్లలు రెక్కలొచ్చిన పక్షుల్లాంటి వారు ..ఒకచోట స్థిరంగా వుండరు.
చింటూ పరుగెత్తుకంటూ వెళ్లి అప్పటికే ఆటలు ఆడుతున్న స్నేహితులతో కలిశాడు.నవ్వులు,కేరింతలతో ఆటలు ఆడుతున్నారు.
“నేను ఈసారి వచ్చే కలప దుంగలను అమ్మి మా నాన్నతో కలసి తీర్ధ యాత్రకు వెళ్తా” చెప్పాడు వినోద్ స్నేహితులను ఉద్దేశించి..
నదికి పై భాగాన దట్టమైన అడవిలో కొద్దిమంది చెట్లు నరికి ..వాటిని నదికి అవతల వైపుకు తరలిస్తోంటే…..కొన్ని దుంగలు జారి నీటిలో పడి ..క్రిందకు వస్తూంటే…ఇక్కడి పిల్లలు నదికి అడ్డంగా ఈదుకుంటూ వెళ్లి ఆ దుంగల్ని తెచ్చుకుంటూ వుంటారు.బలంగా ఉన్న పిల్లలైతే రెండు మూడు దుంగలు ఎక్కువ తెచ్చుకొని ఎక్కువ సొమ్ము చేసుకుంటారు.కానీ చింటూ మాత్రం బక్కచిక్కి బలహీనంగా ఉంటాడు కాబట్టి వారానికో ..పది రోజులకో.. రెండో మూడో దుంగలు తెచ్చి అమ్మి సొమ్ములు చేసుకుంటాడు.
ఈ విషయంలో పిల్లలంతా చింటూని ఎగతాళి చేస్తుంటారు.
వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ తల్లికి చెప్పేవాడు.
ఆమె ఎప్పుడూ ఒకటే చెపుతుంది “నీకంటూ ఒక రోజు వస్తుంది.అప్పుడు నిన్ను చూసి ఎగతాళి చేసినవారే నిన్ను చూసి ఈర్ష పడతారు”అని.


చింటూ మాత్రం తల్లిని,”నువ్వెప్పుడూ ఇదే మాట చెపుతున్నావు ..నా జీవితంలో మార్పు ఎక్కడమ్మా”అని.
ఆమె మాత్రంనవ్వి ఊరుకునేది.
ఎప్పటిలాగే ఈరోజు కూడా పిల్లలందరికీ దుంగలు దొరికాయి.


చింటూకీ మాత్రం ఒక్క పుల్ల దొరక లేదు.
అందరూ సంతోషంగా ఆ పెద్ద కర్ర దుంగల్ని తీసుకు వెళుతుంటే..తాను మాత్రం ఖాళీ చేతులతో వున్నాడు…
అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది తనకు కూడా నాన్న ఉంటే ఈ విషయంలో సహాయం చేసేవాడనీ..
చూస్తుండగానే పడమటి దిక్కున సూర్యుడు అస్తమిస్తున్నాడు.చీకటి తెరలు కమ్ముకుంటున్నాయి.చింటూ మాత్రం నది వంక చూస్తూ అలాగే కూర్చుండి పోయాడు.


బాగా పొద్దుపోయినా కొడుకు రాకపోయేసరికి మునెమ్మ అక్కడికి వచ్చింది.కొడుకుని దగ్గరగా తీసుకొని సముదాయించి “రేపు నీకు మంచి జరుగుతుంది” అని చెప్పి ఇంటికి తీసుకు వెళ్ళింది.
పడుకున్నాడన్నా మాటే కానీ కంటి మీదకు కునుకురావట్లేదు.
అర్ధరాత్రప్పుడు నిద్ర పట్టింది.

కోడి కూతతో మెలకువ వచ్చి..ఉన్నపళంగా లేచి నది దగ్గరికి పరుగెత్తాడు.
నది ప్రవాహ చప్పుడు తప్ప ఎలాంటి అలికిడి లేదు.అప్పుడప్పుడు పక్షుల కూతలు వినపడుతున్నాయి.
నది నీళ్లు బలంగా ఒడ్డుకు తాకుతుంటే చూస్తున్నాడు…
యధాలాపంగా నది పైభాగానా చూసాడు.


ఒక దుంగ కొట్టుకొని వస్తోంది.
గభాలున నదిలోకి దూకాడు.అలవోకగా ఒక చేతితో దుంగను చేతపుచ్ఛుకొని…మరో చేత్తో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు.
నాలుగైదు గజాలున్న దుంగ..బాగా ఎండిపోయింది.దానిని భుజం మీద వేసుకొని ఇంటికొచ్చాడు.
“అమ్మా..అమ్మా “అంటూ తల్లిని పిలిచాడు.


నిద్రకళ్ళతో ఆమె వచ్చి దుంగని చూసి..”ఇంత పొద్దున్నే ఎందుకు వెళ్లావురా” అంది.
దగ్గరగా వచ్చి చూస్తే దుంగలో పగుళ్లున్నాయి.. పగుళ్లున్న దుంగని ఎవరు కొనరు.
చాలా నిరాశ కలిగింది.


కనీసం పొయ్యిలోకైనా పనికొస్తుందని గొడ్డలితో బలంగా ఒక దెబ్బ వేశాడు.నీళ్లలో నాని ఉన్న దుంగ రెండుగా చీలింది.దానిలోంచి పట్టు వస్త్రంతో ఉన్న మూట బయట పడింది.


తల్లి కొడుకులిద్దరు ఆశ్చర్యంగా ఆ మూటను విప్పితే …తళుక్కున మెరుస్తున్న బంగారు నగలు.
వ్యాపారస్తులు దొంగల భయంతో నగలను తాము ప్రయాణిస్తున్న పడవలో దుంగల్లో దాయటం పరిపాటి.అలాంటి ఆ దుంగ నది ప్రవాహ వేగానికి జారీ నీటిలో పడి ఉంటుంది.


“అమ్మ నువ్వు చెప్పింది నిజమే…నాకు అదృష్టం వరిస్తుందన్నావు.ఇదిగో ఇలా నిజమైంది”అని నగలను తల్లి ఒడిలో వేసాడు చింటూ.

వారి ఆనందానికి అవధులు లేవు.

– షేరు(గౌస్)

1 thought on ““అమ్మ మాట””

  1. N Harshavardhan Raju

    బాగుంది.కళ్ళకు కట్టినట్టుగా ప్రకృతి సౌందర్యాన్ని చూశా
    ……..

Comments are closed.