చెక్క బొమ్మ

మరణానంతర జీవితం Star Voice

ఖాజా మియ

అనగా ఒక ఊరు.ఆ ఊరు ఎప్పుడు కరువు తో నిండుకొని ఉండేది.నీటి బావులు పూర్తిగా ఎండిపోయినాయి. తాగడానికే నీరు కష్టం గా ఉండేది . అందువలన అక్కడి ప్రజలందరూ
అడవి మీదే ఆధారపడి జీవించేవారు . నసీమా అనే 10 సంవత్సరాల పాప వారి తల్లిదండ్రులతో కలసి ఆ అడవికి వెళ్లి అడవిలో దొరికే తేనె ఇతర పండ్లను తెచ్చి వాటిని వారానికి ఒకసారి సంతలో అమ్మి దానితో వచ్చిన సొమ్ముతో బ్రతికే వాళ్ళు. ఒకరోజు వారు ముగ్గురు తేనె కోసం అడవిలో వెతుకుతూ ఉండగా ఒక చెట్టు తోర్రలోకి చూశారు అక్కడ వారికి ఒక చెక్క బొమ్మ కనిపించింది ఆ బొమ్మ ఆ పాపకు కు బాగా నచ్చింది వారి తల్లిదండ్రులు తేనెపట్టు నుండి తేనెను సేకరించే లోగా ఆ పాప చెక్క బొమ్మ తో ఆడుకో సాగింది. సీసాలలో పట్టగా మిగిలిన తేనే ను నసీమా
తింటూ ఆ చెక్క బొమ్మ మూతికి కొద్దిగా రాసింది ఆశ్చర్యంగా ఆ బొమ్మ తేనెను పీల్చుకో సాగింది. ఇది నచ్చి వారి తల్లిదండ్రులు కూడా తేనెను ఆ బొమ్మ నోటికి అందించారు. అది పీల్చుకో సాగింది ఇది వారికి చాలా బాగా నచ్చింది. ఆ రోజు రాత్రి నసీమా చెక్క బొమ్మ తో మాట్లాడుతున్నట్లు గా తనతో తానే మాట్లాడుతూ తన దగ్గరే పడుకోబెట్టుకొని నిద్ర పోయింది. మధ్యరాత్రి వంట గదిలో పాత్రల శబ్దం అవుతుందనీ లేచి చూడమని నసీమా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నను లేపింది.అతను వెంటనే లైట్ వేసి చూశాడు. కొన్ని తేనే సీసాలు ఖాళీ అయ్యాయి. ఈ వింత పరిస్థితి కి భార్య భర్త, మరియు నసీమా ఆశ్చర్యపోయారు ఎవరు తీసుకెళ్ళారో అర్థం కాక చుట్టూ వెతికారు ఎవరూ కనిపించలేదు చెక్క బొమ్మ మాత్రం తేనే సీసాల పక్కన ఉండడం గమనించారు. నసీమా ఆ చెక్క బొమ్మను ఎత్తుకొని ముద్దు చేస్తూ తన దగ్గరే పడుకో పెట్టుకుంది. ఉదయం తిరిగి అడవికి తన తల్లిదండ్రులతో పాటు చెక్క బొమ్మను కూడా తీసుకు వెళ్ళింది. ఆ రోజు ఒక గుహ పక్కన వారు తేనే సేకరిస్తున్నారు. నసీమా చెక్క బొమ్మ తో పాటలు పాడుకుంటూ ఆడుకో సాగింది. ఒక్కసారిగా గుహ నుండి పెద్ద కొండచిలువ నసీమా ను నోట కరుచుకుని గుహలోని కి లాక్కొని వెళ్ళింది. నసీమా వాళ్ళ నాన్న అమ్మలు ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయారు. కొంతసేపటికి గుహ నుండి పెద్ద శబ్దాలు వస్తూ గిలగిలా కొట్టుకుంటూ కొండచిలువ బయటికి వచ్చి పొట్ట పలికి చనిపోయింది ఆ పొట్ట నుండి నసీమా మరియు చెక్క బొమ్మ క్షేమంగా బయట పడ్డారు అది చూసి వారి తల్లిదండ్రులు ఎంతో ఆశ్చర్యపోయారు. ఇది ఎలా జరిగిందో వారికి అర్థం కాలేదు. కానీ ఆ పాపకు చెక్క బొమ్మ కు స్నేహం మరింత పెరిగింది. ఆ రోజు రాత్రి కూడా నసీమా చెక్క బొమ్మను ముద్దు చేస్తూ తనదగ్గరే పడుకోబెట్టుకొంది.కొద్దిసేపటి తర్వాత తిరిగి పాత్రల శబ్దం అవ్వసాగింది.ఈ సారి అందరూ ఒక్కసారిగా లైట్ వేసి చూడగా మరికొన్ని తేనె సీసాలు ఖాళీ అయ్యాయి ముగ్గురు అన్ని దిక్కులు చూడగా ఎవరు కనిపించక పోగా చెక్క బొమ్మ మాత్రం తిరిగి తేనె సీసా ప్రక్కనే ఉంది. తను వారంలో అమ్మాల్సిన సరుకంతా ఖాళీ అవుతుండటం తో నసీమా వాళ్ళ నాన్నకు బాగా కోపం వచ్చింది. ఇదంతా ఈ చెక్క బొమ్మ పనేనని, దీనిని పెరట్లోని నీళ్లు లేని బావి లో పడేస్తాని నసీమా దగ్గర్నుంచి బొమ్మను గుంజు కో సాగాడు నసీమా ఇది తనకు ఇష్టమైన ఆ బొమ్మని అలా చేయద్దని తన తండ్రిని వేడుకొంది. ఇది ఎవరిని నష్ట పరచదని ఏడ్చింది .కానీ దీనీ వల్ల నాన్న తనకు వారంలో రావాల్సిన ఆదాయం అంతా నష్టం అయిందని ఇలాగే కొనసాగితే మరింత నష్టం వస్తుందని బలవంతంగా నసీమా దగ్గర్నుంచి బొమ్మను గుంజుకొని బావిలో పడవేశాడు. కిటికీ దగ్గర నుంచి తన పెరట్లోనే పాడుబడ్డ బావిలో బొమ్మను విసిరేయడం నసీమా చూస్తూ ఎంతగానో బొమ్మ కోసం ఏడవసాగింది. అలా ఏడుస్తూనే కిటికీ దగ్గరే కూర్చుంది కానీ వాళ్ళ అమ్మా నాన్నలు నిద్ర పోయారు. ఆ కిటికీ దగ్గరే కూరుపాట్లు పడుతున్న నసీమా చేతికి నీళ్లు తగిలినట్లు అవ్వగానే లేచి చూసింది .తన చేతి దగ్గరి వరకు ఆ బావి నీళ్లు నిండి పొర్లు కుంటూ నసీమా చేతి వరకు చెక్క బొమ్మ వచ్చింది . పెరడు మొత్తం నీటితో తడిచింది. బావి నీళ్లతో నిండిపోయింది . ఇది చూసిన నసీమా తల్లిదండ్రులకు భయం వేసింది. వారిద్దరూ ఆ చెక్క బొమ్మను అడవిలో ఎక్కడినుంచి తేచ్చామో అక్కడే పారేయడానికి నిర్ణయించుకొన్నారు. తిరిగి నసీమా చేతినుండి బొమ్మను గుంజుకుని అడవి వైపుగా పరిగెత్త సాగారు. వారి వెనక నసీమా కూడా పరిగెత్తింది. అటువైపునుంచి అడవిలో నివసించే కొయ్య జాతి కొయ్య వాళ్ళు తమ దేవత అయిన కొయ్య బొమ్మను దొంగిలించిన వారికోసం వెతుకుతున్నారు .కొయ్య వాళ్ళు అసలే దేవతలకు మనుషులను నరబలి ఇచ్చే వాళ్ళు. వాళ్లకు నసీమా తల్లిదండ్రుల చేతులలో ఈ చెక్క బొమ్మను చూసి తమ దేవతను దొంగిలించిన వారు వీరే నని వారిని బంధించారు. నసీమా తల్లిదండ్రులను బలి ఇచ్చే సమయం రానే వచ్చేసింది. నసీమా ఎంతగానో చెక్క బొమ్మ కోసం అమ్మా నాన్న కోసం వెతుకుతూ అక్కడికి కి చేరింది. కొద్ది క్షణాలలో నసీమా తల్లిదండ్రుల ప్రాణాలు బలి కావాల్సి ఉండగా నసీమా ఒక్కసారిగా చెక్క బొమ్మను తన దగ్గరకు ప్రేమగా
పిలుచుకుంది. నసీమా అక్కడి కి రాగానే పెద్ద గా గాలి వీచింది. ఆ గాలిలో చెక్క బొమ్మ నసీమా చేతికి చిక్కింది. వెంటనే కొయ్య వారంతా స్పృహ కోల్పోయారు. నసీమా తన తల్లిదండ్రులను తీసుకొని ఇంటికి చేరేసరికి పెరడు లో విత్తనాలు మొలకెత్తాయి…… నిండిన బావి తో కళకళలాడుతూ ఉంది. ఆ ఊరి వారంతా వీరికి అదృష్టం కలిసి వచ్చిందని అనుకున్నారు. క్రమంగా నిండిన బావి నీరు ఊరు మొత్తం పారుతూ విత్తనాలను మొలకెత్తించ సాగింది .వారందరూ ఎందుకిలా జరుగుతుందో అర్థం కాక నసీమా ను వారి తల్లిదండ్రులను ఎంతగానో ఆదరించారు. మీవల్లే మా కష్టాలన్నీ తీరాయి అన్నారు. అప్పుడు నసీమా ………… “మూఢభక్తి అమ్మను బొమ్మ చేసింది .”కాని స్నేహం, ప్రేమ బొమ్మను కూడా అమ్మ ను
చేసిందని ” చెప్పింది………..
కాబట్టి పిల్లలు స్నేహం ఎంత గొప్పదో తెలుసుకున్నారుగా…. మీ స్నేహితులకు మీ నిజాయితీ అయిన స్నేహాన్ని పంచండి అది ఎప్పుడూ అందర్నీ కాపాడుతుంది.

  • HARSHAWARDHAN RAJU . N