బాపూ

“బాపూ….”
***********************
వరసగా రైలు పెట్టెల్లా కట్టించిన విశాలమైన తరగతి గదులు.ఆ గదులకు ఓ చివర ..మెయిన్ గేటుకు ముందున్నది ప్రిన్సిపల్ గది. దానికి ఆనుకుని ఉన్నది స్టాఫ్ రూం.
గోడలకు వేసిన రుగురంగుల జాతీయ నాయకుల బొమ్మలు ఆకర్షణీయంగా ఉన్నాయి.గులాబీ పూవుతో నవ్వులు చిందిస్తున్న నెహ్రు గారు…పుస్తకమే సర్వస్వం అన్నట్టుగా పుస్తకం చేబూనిన అంబెడ్కర్ గారి నిలువెత్తు చిత్రం….మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి గంభీరమైన ఆకారం….బోసినవ్వుల చూడ ముచ్చటైన గాంధీగారు కర్రతో భవిషత్తు తరాలకు దారి చూపుతున్న చిత్ర పటం….భారత దేశ చిత్రపటం…జై కిసాన్ ..జై జవాన్ నినాదాలు….అలా అవన్నీ చూసుకుంటూ వెళితే గతమంతా కళ్ళముందుకు వచ్చినట్టుగా ఉంది.
అన్ని చిత్రాలకు పై భాగాన చిన్న వృత్తాకారంలో గాంధీ గారి బొమ్మ….దాని క్రింద చిన్న అక్షరాలలో ఆర్ అనే అక్షరం రాసి ఉంది.అది తెలుగు టీచరు రాజు గారి పేరులో మొదటి అక్షరం.. ….ఆయనకు నలభై ఐదేళ్ల వయసు ఉంటుంది.అతనికి తెలుగు భాషన్నా.. గాంధీగారన్నా విపరీతమైన అభిమానం.
గాంధీగారి జీవితాన్ని ఔపోసన పట్టినవారు. గాంధీగారి పుట్టుక మొదలు అంతిమ ఘడియ వరకు అన్ని విషయాలు..విశేషాలు తేదీలు..ప్రదేశాలలో సహా చెప్పగలరు. వారి చేతిలో ఎప్పుడూ గాంధీ గారి జీవిత చరిత్ర..లేదా ఆశయాలకు సంబంధించిన పుస్తకమో వుంటుంది.ఎప్పుడూ పిల్లల మధ్యనే ఉండటం వారికి అలవాటు..పిల్లలంతా అతనిని “బాపు సర్”,అని గౌరవంగా పిలుస్తారు.
వేసవి సెలవుల అనంతరం బడి పెట్టి నెలరోజులైంది.ఇంకా కొత్త పిల్లలు అడ్మిషన్ కోసం వస్తున్నారు.ఆరవ తరగతిలో ఎనభై మంది పిల్లలు చేరారు…ఎనిమిదవ తరగతిలోకి అనూహ్యంగా ఆరుగురు కొత్త అమ్మాయిలు చేరారు.వారిలో బాగా బలహీనంగా ఉన్న పాప గౌతమి… బాగా నలిగిన స్కర్ట్ ..తెగిన చెప్పులు…పాత సంచిలో పుస్తకాలు…భయం భయంగా చూపులు….
రాజు గారు ఎనిమిదవ తరగతి క్లాస్ టీచరు.అటెండన్స్ తీసుకుంటూ.. కొత్త అమ్మాయిల పరిచయం చేసుకున్నారు.
తన వంతు రాగానే మెల్లగా లేచి నిలబడింది.నేరుగా వారి వంక చూడటం లేదు..పక్కనే కూర్చున్న అమ్మాయి వంక చూస్తోంది.
“నీ పరిచయం చేసుకొమ్మా…”
“నా పేరు గౌతమి.. ఎం.గౌతమి.ఏడవ తరగతి వరకు నల్గొండలో చదివాను.నాన్న పేరు శీనయ్య….కూలి పని చేస్తాడు. అమ్మ….”అని ఆగింది.
“ఊ…ఆపావే…చెప్పమ్మా..”
పాప కనుల నుంచి నీరు ధారాపాతంగా కారుతోంది.
పాపను దగ్గరగా రమ్మని పిలిచాడు.
అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది.
“ఏడవొద్దు….నీకు తోడుగా ఇంతమంది అన్నలు…అక్కలు..చెల్లెళ్లు… నన్ను మీ పెద్ద నాన్ననుకో…”అనునయించారు.
కళ్ళు తుడుచుకుంది కానీ మాట్లాడం లేదు.ఆమె పక్కనే కూర్చున్న సింధు గట్టిగా..”గౌతమి వాళ్ళమ్మ చనిపోయింది ఎండ కాలం సెలవుల్లో.అమ్మమ్మ తీసుకొచ్చింది ఇక్కడికి.”

అది వినగానే వారు మాట మారుస్తూ…”అరే పిల్లలు…గాంధీ గారు చిన్నప్పుడు ఒక విషయాన్ని నిర్లక్ష్యం చేసి …జీవిత కాలం మొత్తం బాధ పడ్డారు.అదేమిటో తెలుసా మీకు…”అడిగారు.
పిల్లలంతా ఆలోచనలో పడిపోయారు.అంత గొప్ప గాంధీ గారు చిన్నప్పుడు నిర్లక్ష్యం చేసి బాధ పడ్డారా …ఏమై ఉంటుంది…రకరకాల ఆలోచనలు చిన్నారుల మనసుల్లో..అంతా గుసగుసలాడుతూ ఉండిపోయారు.
“నిశ్శబ్దంగా ఉండండి…జవాబు చెబుతారా ఎవరైనా?”
అందరూ మౌనంగా ఉండిపోయారు.తన వంక మెరిసే కళ్ళతో చూస్తున్న గౌతమిని లేపారు.
“ఏమైనా చెబుతావా అమ్మ”
చెబుతానన్నట్టుగా తల ఊపింది.
“చెప్పమ్మా…”
“గాంధీగారి చేతి రాత బాగుండదు.”
“అద్భుతం…నీకు ఎవరు చెప్పారు తల్లి.”
“లైబ్రరీలో ఒక కథల పుస్తకంలో చదివానండీ”
“గొప్ప పని తల్లి.గ్రంధాలయానికి వెళతావామ్మ రోజు.”
“అవునండీ …గ్రంధాలయం మా ఇంటికి దగ్గరలో ఉంది.రోజు వెళ్లి ..చదువుకుంటాను.”
“మా అమ్మవి కదమ్మ..ఎంత గొప్ప మాట చెప్పావు.”ప్రశంసించారు.
“గాంధీగారికి చిన్నప్పుడు చేతి రాత మీద అంత శ్రద్ధ లేదు.వారి నాన్న గారు చెప్పినా….ఉపాధ్యాయులు చెప్పినా మార్చుకోలేదు.తన ఆత్మ కథలో తాను చిన్నప్పుడు చేసిన నిర్లక్ష్యం కారణంగా జీవితకాలం బాధ పడ్డట్టు రాసుకున్నారు.”
ఈ లోపులో గంట మోగింది.
రాజు గారు లేచి…హోమ్ వర్క్ చెప్పి బయటకు వచ్చారు.
ఇంటర్వల్ తర్వాత స్టాఫ్ రూమ్ లో తెలిసింది.గౌతమి అమ్మమ్మది ఈ ఊరేనని…తల్లి చనిపోగానె అమ్మమ్మ తీసుకొచ్చిందనీ….
*****************************
ఫార్మేటివ్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టులో గౌతమికే ఎక్కువ మార్కులు వచ్చాయి.గత సంవత్సరం వరకు మొదటిగా వచ్చేవారంతా వెనుకబడి పోయారు.ఆమె అంటే ఈర్ష పుట్టుకొస్తోంది.
ఎవరితోనూ ఎక్కువగా ముచ్చట్లు చెప్పదు. ఎప్పుడూ ..రాసుకోవడమో.. చదువుకోవడమో చేస్తుంది.స్నేహితులు కూడా తక్కువే….
రాజు గారు పాఠశాల ఆవరణలో ఉన్న చెట్టు క్రింద నీడలో ..కుర్చీలో కూర్చుని..తన రెండు కాళ్ళని అక్కడే ఉన్న బండకు ఆనించి..ఏదో పుస్తక పఠనంలో లీనమయ్యారు.
“సర్…సర్…”ఏడుపు గొంతుతో పిలుపు వినబడేసరికి తల ఎత్తి చూసారు.ఎదురుగా గౌతమి…ముఖమంతా ఎర్రగా కందిపోయింది..కళ్ళు చాలాసేపు ఏడ్చినట్టుగా ఎర్రగా ఉన్నాయి.
“ఏమిటి తల్లి …అలా ఉన్నవేమిటి?”ఆడిగారు.
“నేను స్వప్న జామెట్రీ బాక్స్ తీసుకున్నానట…క్లాసులో అందరూ అదో విధంగా చూస్తున్నారు.”
“చూడనీ… నువ్వు తప్పు చేయనప్పుడు నీకు భయమేమిటీ”
“భయం కాదు సర్..అనుమానం..అవమానం…భరించలేకుండా వున్నాను.”అంది.
“నింద వేయటం…అనుమానించటం..అవమానించటమే సమాజానికి తెలిసింది.సమాజ సూక్ష్మ రూపమే తరగతి గది. ఒకటి గుర్తు పెట్టుకో తల్లి…గాంధీ గారు నమ్మింది.ఆచరించింది ఒకటే…అది సత్యం…అది ఎప్పుడైనా మనల్ని కాపాడుతుంది.సత్యమేవ జయతే…
నీ మీద పడిన నింద నిన్ను ఈ రోజు బాధ పెట్టొచ్చు…రేపు అదే నిన్ను తల ఎత్తుకునేలా చేస్తుంది.ఏమి బాధ పడకు..ఎవరేమి అనుకున్న బాధపడకు..నిన్ను కాదనుకో…గుర్తుంచుకో…బంగారాన్ని మాత్రమే గీచి గీచి చూస్తారు.రాయిని కాదు.”
ఆ మాటలను శ్రద్ధగా విని …అక్కడ నుంచి వెళ్ళిపోయింది.
ఓ వారం రోజుల తర్వాత స్వప్న మేనమామ రాజు సర్ ఉన్నప్పుడే తరగతి గది లోకి వచ్చాడు.”నేను పోయిన వారం స్వప్నను ఇక్కడ వదిలి పెట్టానండీ.. అప్పుడు ఈ జామెట్రీ బాక్స్ నా బైక్ లొనే మర్చిపోయింది.ఇదిగో నీ బాక్స్…”అంటూ ఆ జామెట్రీ బాక్స్  స్వప్నకు ఇచ్చాడు అతను.
ఆ బాక్స్ తీసుకునేటప్పుడు సిగ్గుతో తల క్రిందికి వాలిపోయింది స్వప్నకు.
క్లాస్ మొత్తం కూడా ఆమె గౌతమిని ఎంత అవమానించిందో గుర్తు చేసుకున్నారు.గౌతమి పేదరాలు కావచ్చు కానీ తప్పు చేయదు. కనులతో చూడకుండా ఎవరిమీద కూడా నింద వేయరాదు. అది ఎదుటి మనిషిని ఎంత మనోవ్యధను గురి చేస్తుందో మనం ఊహించలేము. నచ్చని వారి మీద నిందలు వేసి పైశాచిక ఆనందం పొందే వారితో దూరంగా ఉండటం మేలు అనుకున్నారంతా..
నవ్వుతూ గౌతమి వైపు చూసారు రాజు సర్.
ఆమె వారి వైపు చూసింది…ఆశ్ఛర్యంగా ఆమెకు అక్కడ గాంధీ గారు కనబడుతున్నారు నవ్వుతూ..

-sheru