లాక్ డౌన్ లో…… ఇల్లాలు

వీధి అంతా లాక్ డౌన్..
ఊరంతా లాక్ డౌన్…
రాష్ట్రం….దేశం…ప్రపంచం …అంతా లాక్ డౌన్….
టీవీల్లో వార్తలు…నిజాలో అబద్ధాలో చూడక తప్పదు …
చేతిలో వెచ్చని టీ…
సమయసందర్భం లేకుండా..
ఎల్ల వేళలా టీ…
జాబ్ కెళ్లక నెల దాటింది.ఇంట్లో కూచోని కూచొని విసుగు పుడుతోంది.బద్దకం అలవాటైంది.సోమరితనం దానికి తోడైంది.తిన్నాక చేయి కడుక్కునెందుకు సింక్ దగ్గరికి కూడా పోలేనంత బద్దకం…
“నాన్న ఈ రోజు బజ్జీలు తింటే ఎలా ఉంటుంది.”చింటూ గాడి కోరిక.
“బజ్జీ మిరప కాయల్లేవు.”రివ్వున సమాధానం వంటింట్లోంచి బయటకు వచ్చింది.
“సరే ఉల్లిగడ్డలున్నాయిగా..బజ్జీలు కాకపోతే పకోడీలతో సరిపెట్టుకుంటాం”…


ఈ లాక్ డౌన్ సమయంలో ప్రతి ఇంటా కనపడే దృశ్యమే ఇది…
కానీ ఒక్కటి మాత్రం ఎవరూ పట్టించుకోకుండా(?) అలవోకగా వెళ్ళిపోతుంది.
అదే..
ఇల్లాలి గురించి ..
పని మనిషి రావట్లేదు.ఇంట్లో పనంతా తనే చేసుకుంటోంది.ఉదయం లేచింది మొదలు రాత్రయ్యి పడుకొనేంత వరకు పని ….పని…పని…
ఇల్లు ఊడవటంతో మొదలు…టీ..టిఫిన్..భోజనం…రెండు కూరలు..అదనంగా అప్పుడప్పుడు అప్పడాలు..వడియాలు వేయించటం…మాసిన బట్టల్ని వాషింగ్ మెషిన్లో వేసి..వాటిని ఆరేసి…ఐరన్ చేసి..మళ్లీ టీ..మళ్ళీ భోజనం…మధ్యలో టిఫిన్ల లాంటి గొంతెమ్మ కోరికలు…అంతా చేసినా ఏదో వంకా.. ఉప్పు తక్కువైందనో….ఎక్కువైందనో..ఎదో ఒకటి…రెస్టు అనేది సుదూర స్వప్నం..
ఇల్లాలు కూడా ఒక మనిషే..ఆమెకు కూడా విశ్రాంతి అవసరం అన్నా ఆలోచన మగవారికి రాక పోవటం బాధాకరం…కనీసం పిల్లలన్నా ఒక చేయి వేస్తారంటే..ఉహూ అదీ లేదు.


తరతరాలుగా కొనసాగుతున్న ఈ హింస(?)కు పునాది ఏనాడో పడింది.కొడుక్కీ వంటింట్లో పని నేర్పక పోవటం…వాడు బలాదూరుగా తిరగేసి ఏ అర్ధరాత్రో ఇంటికి రావటం తిని పడుకోవటం…..వాడికి జాబ్ వచ్చాక పెళ్లి చేస్తే..’మా అమ్మ నాకు పని చెప్పలేదు…నేర్పలేదు ..నాకేమి రాదు’…అని చెప్పటం…కనీసం తన కొడుక్కైనా వంట నేర్పడం చేయరు.
ఇది తరతరాలుగా కొనసాగుతోంది..
దీనిని ఇకనుంచైనా బ్రేక్ చేయాలి.
కూతురికి మాత్రమే కాదు కొడుక్కి కూడా వంట రావాలి…ఇంటి పని రావాలి.
కొడుక్కి పెళ్లయ్యాక తన భార్యకు చేదోడుగా ఉండాలి.ఆమె పనిలో సహకరించాలి. ఆమె పుట్టింటికి వెళ్లినప్పుడో…ఆమెకు ఆరోగ్యం బాగాలేనప్పుడో… తాను వంట చేసుకొని పిల్లలకు ..భార్యకు తినిపించేలా ఉండాలి.
కొడుకు మంచి భర్తగా మారాలంటే తల్లి ముందుగా కొడుకుని కూతురుతో పాటు అన్ని పనులు నేర్పించాలి.
డిగ్నిటీ ఆఫ్ లేబర్…శ్రమైక జీవన సౌందర్యం అనేవి కలిసి మెలసి పనిచేస్తేనే అవగతమవుతాయి.
సానుభూతి ..జాలి చూపటం కాదు
తాము పనిలో భాగం పంచుకోవాలి.


ఈ లాక్ డౌన్ పుణ్యమాని అందరం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఒక రోజంతా ఆమెకు సెలవునిద్దాం..
భర్త ..పిల్లల చేతి వంట రుచి కూడా ఆమెకు చూడనిద్దాం.ఎందరికో ఎన్నెన్నో సహాయాలు చేస్తున్నాం.. మెప్పు పొందుతున్నాం…ఇంట్లో మన కోసం సంవత్సరాల తరబడి కష్టపడే తన కోసం మనం కష్టపడలేమా…
చేసే ప్రతి పనీ జ్ఞాపకంగా మారుతుంది.అది తీయటి గుర్తుగా మారి పెదవుల మీదకు చిరునవ్వుగా వస్తే…బ్రతుకు ధన్యం…


‘ఒకే అమ్మ నేను పిండి కలుపుతాను” చింటూ.
“నేను ఉల్లిగడ్డలు కొస్తాను”నాన్న.
“నేను స్టవ్ దగ్గర నూనె పని చూసుకుంటాను” కూతురు.
‘నేను టేస్ట్ చూస్తాను”అమ్మ.
మార్పు అనేది చిన్నచిన్న పనులతోనే ప్రారంభం అవుతుంది.

గౌస్

8 thoughts on “లాక్ డౌన్ లో…… ఇల్లాలు”

Comments are closed.