“సగం జీతంతో సర్దుకు పోయేదెట్ల”

“సగం జీతంతో సర్దుకు పోయేదెట్ల..పూర్తి జీతం వస్తేనే నెలాఖరుకు చెల్లింపులు పోను మిగిలేది నామమాత్రంగా.. ఎవరి దగ్గరైనా చేయి చాపక తప్పని స్థితి”.
ఈ కరోన కాలంలో ఇంట్లో రాత్రి పూట ఆలోచనలతో నిద్రపట్టదు..
ఏ తెల్లవారు జామునో ఈ సమస్యలు కలలో వస్తే తటాలున మెలకువ వస్తుంది.మళ్లీ నిద్ర పట్టదు.’


ఏ ఇద్దరు ఉద్యోగస్తులు కలిసినా ఇదే ముచ్చట..ఎవరి ముఖంలోనూ ఆనంద వీచికలు కనబడటం లేదు.
ఉద్యోగి అనగానే అతనేదో పూల పానుపు మీద ఊరేగే అదృష్టవంతుడు అనుకుంటారు చాలామంది.ఆ ఉద్యోగి మీద ఆధార పడిన తల్లిదండ్రులు.. పెళ్లి కావాల్సిన చెల్లెలు..ఉద్యోగం కోసం వెదికే తమ్ముడు…పెళ్లి కేదిగిన కూతురు..పిల్లల చదువులు..ఇలా చెప్పుకుంటూ చాలా ఉంటాయి.

“ఆరు నెలల క్రితమే అమ్మాయి పెండ్లి చేసానండీ…దాచుకున్నవి సరిపోకపోతే అప్పు చేసాను.వడ్డీ పెరుగుతోంది. తొందరగా ఇవ్వమని ఒత్తిడి పెరుగుతోంది.”ఓ తండ్రి అగచాట్లు.
“జాబు రాగానే ..హోమ్ లోన్ తీసుకొన్నాను. ఒక సంవత్సరం అయింది.ఇప్పటికిప్పుడు కిస్తీలు కట్టక పోయినా తడిసి మోపెడవుతున్న వడ్డీతో తిరిగి కట్టాల్సిందేగా..”ప్రభుత్వ బ్యాంకుల్లో లోను తీసుకున్న ఉద్యోగి.
ప్రైవేటు బ్యాంకుల్లో తీసుకున్న వాళ్ళ బాధ వేరేగా వుంది. ఏ నెల కిస్తీ ఆ నెల కట్టాల్సిందే…
“మా అబ్బాయిని మెడికల్ కాలేజిలో జాయిన్ చేసానండీ..డబ్బులు మిగలటం లేదు.ఈ నెల ఫీజ్ కట్టేది ఉంది’ ఇంకో తండ్రి కొడుకు చదువు గురించి బాధ..
పిల్లల చదువుల ఫీజులు కట్టేవారు..అప్పు తీసుకొని ప్లాట్లు కొన్నవారు….ఆరోగ్య కారణాలతో చేబదులు తీసుకున్నవారు…అందరూ బాధితులే…
నాయకులు ఏమైనా మాట్లాడతారేమోననీ ఎదురు చూపులే….
ఫలితం లేదు.
సమస్యలు చైనా నుంచి వచ్చే కరోన కంటే వేగంగా..కొత్తగా రంగ ప్రవేశం చేస్తున్న మిడతల దండుల మాదిరి ముప్పిరిగొంటున్నాయి.
చూస్తుండగానే సగం సగం జీతాలతో రెండు నెలలు గడిచాయి.మూడో నెల కూడా సగం జీతమే అని టీవీ అరుస్తోంది.అప్పటికే ఎండలకు తడారిన గొంతులు..పీచగట్టుకు పోయినట్టైంది.
అమ్మకు కొనవలసిన మందుల చీటి..నాన్నకు కావాల్సిన వస్తువుల లిస్ట్…నేనున్నానంటూ తరుముకుంటూ వచ్చిన చిన్నారి పుట్టిన రోజు….పనుల ఒత్తిడితో తెగిన శ్రీమతి బంగారు గొలుసు.. సర్వీసింగ్ కోసం సిద్ధమైన టూ వీలర్..చిన్నోడు కావాలంటున్న సైకిలు…ఇవన్నీ సగటు ఉద్యోగికి తీరని కోరికలే….
ఇంతకు ముందు ప్రభుత్వ ఉద్యోగి అంటే నాలుగు రాళ్లు వెనక్కు వేసుకునే వాడు అని….కానీ ఇప్పుడు మాత్రం నాలుగు “ఈ ఎం అయి” లు ఎక్కువ కట్టేవాడనీ..
ఎవరి దగ్గరైన చేయి చాచుదామంటే అభిజాత్య మొకటి వద్దని అడ్డుపడుతుంది.
“మీకేమండి ప్రభుత్వ ఉద్యోగస్తులు ” అని ఎక్కడ వ్యంగంగా అంటారేమోననీ..
వేరే వారికి మన బాధలు చెప్పలేము… అలాగనీ అలాగనే వుండలేము.
ఉద్యోగస్తులు ఎక్కువ మంది తోటి ఉద్యోగస్తుల దగ్గరే అప్పులు చేస్తుంటారు.తోటి ఉద్యోగిని చేబదులు అడుగుదామంటే అతనిది తన లాంటి పరిస్థితేనాయే..సమస్యలు చాలా గొప్పవి. రానప్పుడు బాగానే ఉంటుంది …వస్తే మాత్రం మిడతల దండులా ఒకేసారి వస్తాయి.
అప్పట్లో పుస్తకాల్లో మధ్యతరగతి మందహాసం అంటే బుర్రకు తట్టేది కాదు.ఇప్పుడు మాత్రం అవగతమైంది.తనలో అనేక సమస్యలున్నా..ఏడుపు తన్నుకొచ్చినా కూడా ఏమి జరగనట్టే..ఏమి సమస్యలు లేనట్టే నవ్వటాన్ని..అదే మందహాసాన్ని..
మధ్యతరగతి మందహాసం అంటారు.
కొత్త ఇల్లు పాత బడనే లేదు ..అమ్మకానికి పెట్టాడో ఉద్యోగి…
అప్పు అడగాలంటే సిగ్గేస్తున్నా…. పాత అప్పుల వడ్డీలకై కొత్త అప్పుకై ముందుకు బయలు దేరాడు ఇంకో ఉద్యోగి.
చాలా కాలంగా పిల్లల కోసం కాపాడుకొంటున్న ఇంటి స్థలాన్ని అమ్మా లనుకున్నాననీ ఇంట్లో ఆవిడకు చెపితే….ఆమె కండ్ల నిండా నీళ్లు…
చాలా మందికి రెండో ఆదాయం ఉండదు.ఇంట్లో ఖర్చు ఎంత అదుపు చేసుకున్న ధరలు తగ్గేది ఉండదు.జీతాల కంటే వేగంగా పెరిగే వస్తువుల ధరలు జీతాన్ని మిగల కుండా చేస్తున్నాయి.జీవితాలని బలి తీసుకుంటున్నాయి.ఓ ఉపాధ్యాయుడు ఆర్ధిక సమస్యలకు తాళలేక ప్రాణం తీసుకున్నాడన్న వార్త ఏలే వారికి చేరితే బాగుండు.
సమస్యలు కలకాలం వుండవన్నది జగమెరిగిన సత్యం…ఈ లాక్ డౌన్ కాలంలో ఉద్యోగులెవరూ వ్యతిరేక ఆలోచనలు లేకుండా…రేపు మనదే..మనకు మేలు జరిగేది అనే ఆశతో ముందుకు సాగటమే జీవితం.
@షేరు

3 thoughts on ““సగం జీతంతో సర్దుకు పోయేదెట్ల””

Comments are closed.