సహాయం

అది ఎండా కాలం..
అందులోనూ ఎడారి ప్రాంతం..
ఎటు చూసినా గుట్టలు గుట్టలుగా ఇసుక…కనుచూపు మేరలో ఇసుక..ఎక్కడైనా ఒక పచ్చని చెట్టు కనబడుతుందా అంటే అదీ లేదు.
వేడి గాలి వేగంగా వీస్తోంది.దానితో పాటు ఇసుక రేణువులు ఎగురుతున్నాయి.కొన్ని చోట్ల ఎత్తైన కొండల్లా ఇసుక…ఇంకా కొన్ని చోట్ల లోతుగా ..ఎవరో ఇసుకంతా తోడుకెళ్లినట్టుగా లోతైన లోయలు..పొరపాటున క్రిందపడితే పైకి రావటం అసాధ్యం..
అంత వేడిలోను.. నిప్పు కణికల్లా కాలుతున్న ఇసుకల్లోంచి బయటికి వచ్చిందా పాము..ఒంపులు తిరుగుతూ సర్రున సాగిపోయింది.
అప్పుడు భయం వేసింది పదేళ్ల కైఫ్ కు…ఏదైనా చెట్టు చాటుకు పోయి దాక్కుందామంటే, అలాంటి అవకాశమే లేదు.
రాత్రి నుంచి నడుస్తున్నాడు..ఇంకో రోజు నడిస్తే కానీ బాగ్దాద్ పట్టణం రాదు.అమ్మ తరపు చుట్టాలంతా అక్కడే వున్నారు.నాన్న బిడారులతో కలసి సరకులు తీసుకెళ్లి ఆరు నెలలయింది.ఇంకా తిరిగి రాలేదు.వర్తకులంతా కలసి గుంపుగా వెళ్లేవారు.దొంగలు..దారి దోపిడీ దారులు ఎక్కడ దాడి చేస్తారేమోననీ బిడారులుగా వెళ్లేవారు.
ఎడారులలో అక్కడక్కడ నీటి సరస్సులు ఉంటాయి.వాటిని ఒయాసిస్సులు అంటారు.వాటి చుట్టూ గ్రామాలు ..పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. ఎడారులల్లో ఎక్కువగా పండే పంట ఖర్జూరమే… అక్కడక్కడ గోధుమలు కూడా పండిస్తారు.అక్కడి వాతావరణాన్ని తట్టుకొనే కొన్ని జంతువుల్లో ముఖ్యమైనది ఒంటె.ఎన్ని ఎక్కువ ఒంటెలు ఉంటే అంత ధనికుడిగా పరిగణిస్తారు.
అలాంటి ప్రాంతాల్లో ఈ బిడారులు తమ సరకుని అమ్మి అక్కడ దొరికే సరకుని తీసుకొచ్చేవారు.ఆరు నెలల్లో ఇంటి కొచ్చేవారు కానీ ఈసారి నాన్న ఇంటికి ఇంకా రాలేదు.ఇంకో వారంలో రంజాను మాసం ప్రారంభం అవుతుంది.
నాన్న తనకు వాగ్దానం చేసాడు..ఈసారి రంజాను పండుగని బాగ్దాద్‌లో అమ్మమ్మ ఇంట్లో చేసుకుందామని.
నాన్న ఇంకా రాలేదు.అమ్మ ఇతర వ్యాపారస్తులని వాకబు చేస్తోంది నాన్న గురించి…వారంతా వ్యాపారం ముగుంచుకొని ముందే వచ్చారు.ఎవరినీ అడిగినా తాము చూడలేదనే అంటున్నారు.
అమ్మ కంగారు చూస్తుంటే తనకు భయం వేస్తోంది…ఇంట్లో ఉన్న వారి చూపంతా గుమ్మం వైపే..ఏ అలికిడి అయినా నాన్న వచ్చాడేమోననీ…
ఒకరోజు పొద్దుపోయాక అమ్మ చెప్పింది..”ఇలాంటి సమయంలో మీ ఇబ్రహీం మామయ్య ఉంటే ..వెంటనే వెళ్లి మీ నాన్న ఎక్కడ ఉన్నా తీసుకొచ్చేవారు.అయనేమో బాగ్దాద్‌లో ఉన్నాడాయే..ఎవరయినా వెళితే కబురు పెడతామంటే పండగ ముందు ఎవరూ వెళ్లట్లేదు”..
కైఫ్ ఆలోచిస్తున్నాడు…ఇక్కడ నుంచి బాగ్దాద్ రెండు రోజుల ప్రయాణం…దారిలో ఎవరిదైనా ఒంటె దొరికితే ఒక్కరోజులో వెళ్లొచ్చు.
“అమ్మా ..నేనే వెళ్లి మామయ్యకు చెబుతాను.”అన్నాడు అమ్మతో.
అమ్మ ఒప్పుకోలేదు.”నువ్వు ఒక్కడివి..అంత దూరం ఒంటరిగానా..వద్దు. ఈలోపు మీ నాన్న వస్తే నన్నే తిడతాడు”.
కైఫ్‌కు ఎటూ తోచటం లేదు.
“అమ్మ ..పక్క ఊరి వారు ఒంటెల మీద బాగ్దాద్ వెళ్లుతున్నారట…నేను వారితో వెళతాను”అన్నాడు.
ఎటూ తోచని స్థితిలో ఉన్న ఆమె “సరే” అంది.


ఏ పని మొదలు పెట్టినా..ముందుగా ‘బిస్మిల్లా’ అని ప్రారంభిస్తే ‘అంతా అల్లానే చూసుకుంటాడు’ అని అమ్మ ఎప్పుడూ చెపుతూ ఉంటుంది.
తెల్లారటానికీ ఇంకా చాలా సమయం ఉంది.స్నానం చేసి..బట్టలు ధరించి ..తలపాగా చుట్టుకొని ..”బిస్మిల్లా”అని బిగ్గరగా అనుకుంటూ ఇంట్లోంచి బయటకు కాలు పెట్టాడు.
పక్క ఊరి నుంచి ఒంటెలు వస్తాయో లేదో తెలీదు..నడక ప్రారంభించాడు.కాళ్ళ క్రింద ఇసుక జారిపోతోంది. ఎడారుల్లో నడక ఇబ్బందికరమే కానీ అతనికి అలవాటే కాబట్టి ఒడుపుగా అడుగులు వేస్తూ బాగ్దాద్ వైపుకు సాగుతున్నాడు.
కొద్దీ సేపట్లోనే సూర్యోదయమైంది.ఎడారిలో సూర్యోదయం అంత అందంగా మరే దృశ్యమూ ఉండదు.తోడుగా తెచ్చుకున్న ఖర్జురపు పళ్ళు తిని.. నీళ్ల సంచిలో నీళ్లు తాగాడు.రెండు రోజులకు సరిపడా పండ్లు..నీళ్లు ఉన్నాయి.
ఎండ పెరిగే కొద్దీ నడక వేగం తగ్గింది..వేగంగా వీస్తున్న గాలిని చూస్తుంటే ..ఇసుక తుఫాను తప్పదేమో అనుకున్నాడు..
నడుస్తూనే వున్నాడు..అక్కడక్కడ ఎడారి చెట్లు ..ఎక్కువగా ముళ్లున్నవి కనపడుతున్నాయి.వాటిలో కొన్ని విషపూరితాలు కొన్నేమో మంచివి..వాటి పండ్లు తినొచ్చు..కాండం కోసి అందులో నీళ్లు తాగొచ్చు.
ఒక ముళ్ల జెముడులాంటి చెట్టు దగ్గర ఆగాడు. అది మంచిదే అని అర్ధమైంది.నాలుగైదు పండ్లు కోసి సంచిలో వేసుకున్నాడు. కాండం కోసి నీళ్లు నింపుకున్నాడు.
ఈలోగా చీకటి పడింది.ఆకాశంలో చుక్కలు మేమున్నామంటూ మెరుస్తున్నాయి.
ఎత్తైనా ఇసుక మేట ఎక్కిపడుకున్నాడు.
పడుకునేటప్పుడు ఒక చేయి లేపి పడుకోవాలి.ఏ అర్ధ రాత్రప్పుడో ఇసుక తుఫాను వస్తే ..ఆ ఇసుక మీద పడి చావాల్సిందే. అందుకే ఒక చేయి లేపి పడుకుంటే…తుఫాను వచ్చేముందు ఇసుక వచ్చి చేతికి తగిలి ..మెలకువ వస్తుంది.దూరంగా పారిపోయి ప్రాణాలని కాపాడుకోవచ్చు.ఒక చేయి లేపి పడుకున్నాడు.


మరుసటి రోజు మళ్లీ నడక ప్రారంభించాడు.
ఏదో ఆలోచిస్తూ నడుస్తోంటే..”ఏయ్ ఎవర్రా అబ్బాయి ..ఒంటరిగా ఎక్కడికి”అని గంభీరమైన స్వరం వినబడేసరికి..ఉలిక్కి పడి వెనక్కి చూసాడు.ఎత్తైన ఒంటె మీద ఇంకా ఎత్తైన, బలమైన మనిషి,బంగారు ఛాయాతో కూచున్నారు.
“అస్సలామువలేకుం. నేను బాగ్దాద్ వెళుతున్నాను మా అమ్మమ్మ ఇంటికి”అని బదులిచ్చాడు.
“నేను అక్కడికే ..పద ఒంటెక్కు”అని చేయి అందిచ్చారతను.ఆ చేయందుకొని ఒంటె మీద ..అతని వెనుక కూచున్నాడు.
“ఏమైనా తిన్నవా.. ఏమి తిన్నట్టు లేవే” అంటూ తన సంచిలోనుంచి రొట్టెలు తీసి ఇచ్చారు.
రొట్టెలు తింటూ ఉంటే, “ఎవరున్నారేమిటీ బాగ్దాద్ లో”అడిగారు అతను.
“మా మామయ్య ఇబ్రహీం ..ఖర్జురాల వ్యాపారి”
“ఓ అతనా మా వీధిలోని ఉంటాడు”అన్నారు.
మాటల్లో తన తండ్రి వ్యాపార నిమిత్తమై వెళ్లి ఆరు నెలలుగా రాని విషయం చెప్పాడు.
“మీ నాన్న పేరు..”అడిగారు.
“కరీం …మీకు తెలుసా?”
ఆ పేరు వింటూనే ..ఒంటెను ఆపి..”నేను వస్తున్న గ్రామం దగ్గర కరీం అనే పేరున్న మనిషి జ్వరంతో బాధపడుతూ ఒక ఇంట్లో వున్నాడు.”
అది వింటూనే…”పొడుగ్గా ..బక్కగా వున్నాడు కదండీ”అడిగాడు.
“అవును…అలాగే వున్నాడు”.
“దయచేసి నన్నక్కడకు తీసుకు వెళ్ళరా…అల్లా మీకు మేలు చేస్తాడు”అన్నాడు కైఫ్.
కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ..”సర్లే పద ..”,అని ఒంటెను వెనక్కు తిప్పారు.
ఆ మండుటెండలో…కాలే ఇసుకలో వేగంగా ముందుకు ఉరికింది ఒంటె.


“అదిగో కనబడేదే ఆ వూరు”అన్నాడు అతను.
దూరంగా చెట్లు కనపడుతున్నాయి.ఆచెట్ల వెనుక ఇండ్లున్నాయి…
ఒంటె మెల్లగా వెళ్లి ఒక ఇంటి ముందు ఆగింది.అది పాడుబడ్డ ఇల్లు..ఎవరూ లేరు.ఎవరో మనిషి మూలుగులు వినిపిస్తున్నాయి.
వెళ్లి చూస్తే ..బక్కగా ..ప్రాణం లేనట్టుగా ఒక మనిషి జ్వరంతో వణుకుతున్నాడు.అప్పుడప్పుడూ దగ్గుతున్నాడు.అతన్ని చూడగాన్నే..”ఇతనే మా నాన్న..”అంటూ పరుగున వెళ్లి తండ్రిని వాటేసుకున్నాడు కైఫ్.
ఇద్దరూ కలిసి ..అతన్ని లేపి ఆ ఊరి వైద్యుని దగ్గరికి తీసుకు వెళ్లారు.
వైద్యుడు అతన్ని పరిశీలించి మందులు వేసాడు.కొద్దిసేపటి లోనే కొలుకున్నాడు కరీం. తన కొడుకుని దగ్గరగా తీసుకున్నాడు.
“ఇంకో గంట ఆలస్యమైతే ఇతను బ్రతికే వాడు కాదు.సరైన సమయంలో తెచ్చారు.ఇప్పుడేమి భయం లేదు”అన్నాడు వైద్యుడు.
తాను బాగ్దాద్ వెళ్లి ..మామయ్యను తీసుకొని ఊళ్లన్నీ వెతికి ఇక్కడికొచ్చేసరికి నాన్న బ్రతికి ఉండేవాడు కాదు. అల్లా దయ వల్ల ఈ మహానుభావుడు సమయానికి సహాయం చేయబట్టి..నాన్నని ప్రాణాలతో చూడగలిగాను’అనుకున్నాడు కైఫ్.
“మీకు నా కృతజ్ఞతలు..మీరే మా నాన్న ప్రాణాలు కాపాడారు”అన్నాడు.
దానికి అతను నవ్వుతూ..”తప్పు అలా అనవద్దు.కాపాడటానికి నేనెవరిని …నువ్వే అన్నావుగా..అల్లా మేలు చేస్తాడని..ఈ మేలు కూడా అల్లానే చేసాడు.అతనికే ఈ స్తోత్రములన్నీ”అన్నారు.
తెల్లని వస్త్రాలు ధరించి..మరింత తెల్లని ఆకారంతో..ఎల్లప్పుడు చిరునవ్వులు చిందిస్తు శాంతమూర్తిగా ఉన్న అతనిని చూస్తూ..కైఫ్ అడిగాడు..
“మీ పేరు తెలుసుకోవచ్చాండీ”..

ఒంటె మీద కూర్చోని వెళ్లిపోతూ… చిరునవ్వుతో తన పేరు చెప్పారు.. “ఈ బాగ్దాద్ ఖలీఫా ..రాజుని.”


  • షేరూ ( గౌస్)