అమ్మ చెప్పిన కథలు 1 – sheru

“శ్రమజీవి”………

ఎగసిపడే అలలతో అల్లకల్లోలంగా ఉంది సముద్రం.చేపల వేటకు వెళ్లిన వారంతా వేగంగా తెడ్లు ఆడిస్తూ తీరం వైపు వస్తున్నారు.చీకటి పడటానికి ఇంకా చాలా సమయం ఉంది కానీ నల్లటి మేఘాలు ఆకాశం నిండా కమ్ముకోవటంతో చీకటిగా ఉంది.వేగంగా గాలులు వీస్తున్నాయి.గాలి చప్పుడు..సముద్రపు అలల చప్పుడుతో కలిసి భయంకరమైన కొత్త ధ్వనులు పుట్టుకొస్తున్నాయి.

బరువుగా ఉన్న తెప్పను బలమంతా ఉపయోగించి ..ఇసుకలో ఈడ్చుకుంటూ తీసుకొచ్చి అక్కడ ఉన్న పెద్ద బండ రాయికి తాడుని చుట్టూ తిప్పి కట్టాడు మీనయ్య. ఖాళీగా ఉన్న సంచిని, వలను తీసుకుని దగ్గరలో ఉన్న తన ఊరి వైపు నడిచాడు.
అది ఒక చిన్న ఊరు.వందకు పైగా ఇళ్ళుంటాయి. అన్ని చిన్న చిన్న ఇళ్లే… ఎక్కువ మంది సముద్రంలో చేపల వేటతోనే బ్రతుకు వెళ్లదీస్తుంటారు.వేటకు వెళితే వచ్చిన చేపలను అమ్మి….వచ్చిన డబ్బులతో కావలసిన బియ్యం..పప్పు..నూనెలను తెచ్చుకుంటారు.
గత రెండు రోజుల నుంచి వేట సాగటం లేదు.ఇంట్లో బియ్యం…సరకులు లేవనీ ..ఈ రోజు తెచ్చే చేపలను అమ్మి సరకులు తెమ్మని అతని భార్య దేవమ్మ చెప్పింది.
వారికి ముగ్గురు చిన్న పిల్లలు..
ఆ రోజు కూడా ఖాళీ చేతులతో వచ్చిన భర్తను చూసి నిట్టూర్చింది.
పక్కనే ఉన్న పిన్ని ఇంటికి వెళ్లి కొద్ధి బియ్యాన్ని తెమ్మని పెద్దమ్మాయికి చెప్పింది.ఆ అమ్మాయి బయటకు వెళ్ళింది.
చిన్న చిన్నగా చినుకులు పడుతున్నాయి.ఏ క్షణమైనా భారీ వర్షం కురిసేలా ఉంది.అప్పుడప్పుడు ఆకాశంలో బంగారు తీగల్లా మెరుపులు…ఒళ్ళు జలధరించేలా ఉరుములు…
పెద్దమ్మాయి గిన్నెలో తెచ్చిన బియ్యంతో తయారు చేసిన వేడి వేడి గంజి గిన్నెలో పోసి అందరికీ ఇచ్చింది దేవమ్మ..
గంజి తాగుతూ ఆలోచనలో పడిపోయాడు మీనయ్య. ఈ వర్షం ఇలాగే కురిస్తే…రేపు ఎల్లుండి కూడా చేపల వేట ఉండదు. పిల్లలు పస్తులుండాలి.ఇంత కష్ట పడ్డా రేపటికంటూ ఏమి మిగుల్చు కోలేక పోతున్నాడు.సముద్రుడు తనను కనికరించటం లేదు.ఎంతో మంది ఇలా సముద్రంలోకి వెళ్లి అలా చేపలతో వచ్చి …బాగా ధనం సంపాదించి పెద్ద పెద్ద ఊర్లకు వెళ్లి….ఇండ్లు కట్టుకొని సుఖంగా జీవిస్తున్నారు. తాను మాత్రం గుంజకు కట్టిన మేకలా ఇక్కడే తిరుగుతున్నాడు.
అక్కడి ప్రజలంతా సముద్రిడిని ఇష్ట దైవంలా కొలుస్తారు.అతని దీవెన లేనిదే ఎవరూ గొప్ప వాళ్ళు కాలేరని నమ్ముతారు.
బయట వర్షం కుండపోతగా కురుస్తోంది. భార్యా పిల్లలు నిద్రలోకి జారుకున్నారు.మీనయ్య మాత్రం కిటికీలోంచి మెరుపుల వెలుగుల్లో కనపడే సముద్రాన్ని చూస్తున్నాడు.
అర్ధరాత్రి అయింది.
అతను మాత్రం ఇంకా అలానే కూర్చున్నాడు.కంటి మీదకు కునుకు రావటం లేదు.
వర్షం కురవడం ఆగింది.చూరులోంచి జారిపడే చినుకుల శబ్దం మాత్రం స్పష్టంగా వినబడుతోంది.
ఉన్నట్టుండి గుడిసె ప్రకాశవంతమైంది.ఒక బంగారు కడ్డీ అక్కడ పడింది.కనపడీ కనపడనట్టున్న ఓ ఆకారం
“నేను నీకు సహాయం చేయటం లేదన్నావుగా.ఇదిగో తీసుకో ఈ బంగారు కడ్డీ ….నువ్వు కోరుకున్న జీవితాన్ని గడుపు.కానీ ఒక షరతు” అంది.
“కృతజ్ఞతలు.ఆ షరతు ఏమిటో చెప్పండి”అన్నాడు అతను.
“ఇప్పుడు నేను నీకు ఒక ప్రశ్న వేస్తాను.సరైన జవాబు చెబితే.. ఈ క్షణమే ఈ బంగారమంతా నీదే..లేకపోతే ఈ బంగారం మాయమవుతుంది.”
అతను నవ్వాడు.
” అదృష్టం ఉంటే బంగారం నాదవుతుంది లేకపోతే లేదు'”..
“నేను ఇచ్చిన బంగారంతో నువ్వు ఇల్లు…వస్తువులు కొంటావు.ఆనందంగా వుంటుంటావు.అప్పుడు కొద్దిరోజుల తర్వాత నేను వచ్చి అవన్నీ తీసుకు వెళితే ఏమి చేస్తావు?”
మళ్లీ నవ్వాడు…
పక్కనే మూలకు ఉంచిన వలను,సంచిని,తెడ్డుని తీసుకొని చూపిస్తూ ….”మీ బంగారం వున్నా ..లేకున్నా నా కష్టం..నా వల, నా తెడ్డు, పడవ నాకున్నాయి. నన్ను నేను నమ్ముకున్నాను.విశాలమైన సముద్రం ఉంది.శ్రమజీవికి జగమంత దాసోహం…”అన్నాడు.
అది విన్న అదృశ్యశక్తి పూర్తిగా సంతృప్తురాలై “శ్రమజీవి ముందు ఎవరైనా తల వంచాల్సిందే.అతనికి ఓటమి లేదు. ఈ బంగారం నీదే..'”
వెంటనే వెలుగు వెళ్లిపోయింది.
గుడిసె నిండా చీకటి.
అతను ఉలిక్కిపడి లేచి చూసాడు.
మెరుస్తూ బంగారు కడ్డీ అక్కడ ఉంది.
@షేరు