అమ్మ చెప్పిన కథలు 3.

“సమయస్ఫూర్తి”


మన దేశానికి స్వాతంత్య్రం రావాటానికి సరిగ్గా యాభై సంవత్సరాలకు ముందు…..
చిన్న చిన్న గ్రామాలు ఉండేవి.ఎక్కడో ఒక చో ట పెద్ద పట్టణాలు ఉండేవి.ఎటూ వెళ్లినా అడవులే ఉండేవి.విపరీతంగా వర్షాలు కురిసేవి.వాగులు ..వంకలు …చెరువులు నీళ్లతో కళకళలాడేవి.
చుట్టూ అడవి..మధ్యలో ఆ ఊరు.
ఆ ఊర్లో కొత్తగా పెళ్ళైన జంట.వీరేశం పొలం పనులు చూసుకునే వాడు. లత ఇంట్లో పని చూసుకునేది.
అన్నదమ్ములు వేరు పడ్డారు.ఊరికి ఆనుకుని ఉన్న స్థలం అతని వాటాగా వచ్చింది.ఆ స్థలంలోనే ఒక పెద్ద తాటాకుల గుడిసె వేసుకున్నారు.దగ్గరలో ఇల్లు అనేది లేదు.కొద్దీ దూరం వెళితే గానీ వీధి మొదలవదు.
లతకు పాటలు పాడటం వచ్చు.ఆమె స్వరంలో అమృతం ఉందేమో విన్న వారంతా మంత్ర ముగ్దులవుతుంటారు.రోజూ సాయంత్రమైతే చాలు ఈ పాట పాడు అక్కా… ఆ పాట నేర్పు చెల్లి అంటూ చుట్టుపక్కల ఆడ వారంతా గుమిగూడుతుంటారు.ఆ ముచ్చట్లతో..పాటలతో సమయం ఇట్టే గడిచి పోతుంది.మధ్య మధ్యలో దేశభక్తి కథలు…సాహస కథలు..దేవుళ్ళ కథలు చెప్పుకుంటూ వుంటారు.వూరికి దూరంగా ఉన్నప్పటికీ ఊర్లో ఆడ వారందరికీ ఆప్తురాలైంది.
ఆ ఊర్లో ఎవరిదైనా పెండ్లయినా..శుభ కార్యమైనా ఆమె ఉండాల్సిందే.చూడ చక్కనైన ఆకారం….ఎవరైనా కనపడితే తానే ముందుగా నవ్వుతూ పలకరించేది.

ఓ రోజు నలతగా ఉంటే కొద్ధి పాటి వైద్యంలో ప్రవేశమున్న ..అందరితో ప్రేమగా పెద్దమ్మ అని పిలిపించుకునే ఆ పెద్దావిడ ఇంటికి వెళ్ళింది.లతను బాగా పరీక్షించి.. కొన్ని ప్రశ్నలు వేసాక.. నవ్వు ముఖంతో..”నువ్వు తల్లి కాబోతున్నావే తల్లి…పండంటి బిడ్డని కనబోతున్నావే తల్లి.”అంది.
ఆ మాట వినగానే…ఎక్కడలేని కంగారు..భయం పుట్టుకొచ్చాయి.గబగబా నడుచుకుంటూ ఇంటికి వచ్చింది.


తనకంటే అందంగా ఉన్న చిన్నారి పాపను తీసుకొని ఇంటికి వచ్చింది లత. ఆమెకు తోడుగా అమ్మను తీసుకొచ్చింది. తొమ్మిది నెలల తర్వాత ఇంటి కొచ్చేసరికి ఇల్లంతా పడావు పడినట్లుంది.ఇల్లంత శుభ్రం చేస్తుంటే…ఆమె రాకను తెలుసుకున్న కొంత మంది ఆడవాళ్లు కూడా వచ్చారు.ఒకరేమో పాపాయిని ఆడిస్తోంటే.. మిగతా వారేమో ఆమెకు ఇంటి పనిలో సహాయం చేస్తున్నారు.కొద్ధి సేపట్లోనే ఇంటి రూపు రేఖలు మారిపోయాయి.కొత్త ఇల్లులా అందంగా తయారైంది.
పాప పెరుగుతూ ఉంటే చుట్టూ పక్కలా స్నేహితురాళ్ల రాక కూడా బాగా పెరిగింది.
ఒక రోజు పిన్ని గారు ఇంటికి వస్తూనే ఒక వార్తను తీసుకొచ్చారు.దేశం ఉత్తరం దిక్కు నుంచి దోపిడీ దారుల ముఠాలు వచ్చాయని ఇండ్లు…దుకాణాలు దోచుకొంటున్నారనీ..ఆడవారిని తమ వెంట తీసుకు పోతున్నారనీ…
లతకు కంగారు మొదలైంది.తన ఇల్లేమో వూరికి దూరంగా ఉంది.పగలైతే జనం తిరుగుతుంటారు కానీ రాత్రయితే ఒక్కరు కనబడరు.తన భర్త అన్ని పనులు పూర్తి చేసుకొని ఒక్కొక్కసారి అర్ధరాత్రి వేళ వస్తుంటాడు. అప్పటి వరకు తాను ఒంటరిగానే..చిన్న పాపతో ఉండాలి.రకరకాల ఆలోచనలు చుట్టుముడుతున్నాయి.ఒక పక్కన చెప్పలేని భయం వేస్తోంది.
అదే విషయం భర్తకు చెబితే…అతను నవ్వి,”మన దగ్గర ఏముందని వస్తారు దోచుకోవడానికి.బాగా డబ్బున్న వారు భయపడాలి కానీ మనం కాదు.ఆ దోపిడీ దారుల గురించి మనం వెంటనే ఇక్కడనుంచి వేరే ఇంట్లోకి మారలేము కదా…”అన్నాడు.
“అయినా నాకు భయంగానే ఉంది.నువ్వు మాత్రం ఇప్పటి నుంచి పొద్దుపోయే వరకు ఇంటికి రావాలి ఎంత పనున్నా సరే..”
“అలాగే…చీకటి పడే లోగా ఇంటికొస్తాను కానీ ఒక విషయం గుర్తుంచుకో…..శత్రువు వచ్చినప్పుడు ఉండాల్సింది భయం కాదు సమయస్ఫూర్తి…నిదానంగా ఆలోచించి ఆ సమస్య నుంచి ఎలా బయట పడాలో పధకం వేయాలి.అక్కడ నుంచి తప్పించుకొని ..నలుగురి సహాయం తీసుకోవాలి.అదే మనకు రక్ష…”అంటూ ధైర్యం చెప్పాడు.
ఆమె తల అయితే ఊపింది కానీ మనసులో గూడుకట్టుకున్న భయం మాత్రం అలానే ఉండిపోయింది.
రోజులు గడచిపోతున్నాయి.ఎవరి పనుల్లో వారుండి పోయారు.దోపిడీ దార్ల గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తున్న… ఎవరూ పెద్దగా ప్రాముఖ్యత నివ్వటం లేదు వాటికి.
ఒకరోజు వీరేశం హడావుడిగా ఇంటికొచ్చాడు.”నేను నా స్నేహితులం కలసి పట్నం పోతున్నాము.మేము సరకులు తీసుకొని వచ్చేసరికి రేపు సాయంత్రం అవుతుంది.జాగ్రత్తగా ఉండు …భయం లేదులే”అని చెప్పాడు.
“వీలైతే రాత్రికల్లా రండి.అసలే దోపిడీ దారులు తిరుగుతున్నారు.”అంది.
“సరేలే….పనైపోతే వస్తాం…”అంటూనే వెళ్లి పోయాడు అతను.
రాత్రికి తోడుగా ఎవరినైనా పిలుద్దామంటే ఎవరూ వచ్చేట్టు లేరు.చీకటి పడక ముందే తలుపులు వేసి పడుకుంది.పాప కూడా నిద్ర పోయింది.
తాటకులతో కప్పిన గుడిసె కాబట్టి వెచ్చగా ఉంది.గుడిసె బయట చిమ్మ చీకటి.నర సంచారం అనేదే లేదు.కీచురాళ్ల చప్పుడు మాత్రం వినపడుతోంది.
భర్త చెప్పిన ధైర్య వచనాలు గుర్తు చేసుకొని గాఢ నిద్రలోకి జారిపోయింది.
సరిగ్గా మధ్య రాత్రి ఏవో చప్పుళ్ళు అవుతూంటే నిద్ర లేచింది.తలుపును తడుతున్నారెవరో…ఇంత రాత్రి వేళ ఎవరై వుంటారు…భర్త వీరేశం వచ్చాడేమోననీ…తలుపు దగ్గరకు వెళ్లి.
“ఎవరూ..”అంది.
“నేనే..తలుపు తీయి”
ఆ స్వరం తన భర్త స్వరంలా లేదు.
“నేను తీయను.ముందు మీరు ఎవరో చెప్పండి.”
“నువ్వు తలుపు తీయక పోతే ..తలుపులు బద్దలు కొట్టుకొని లోనికి వస్తాం…తలుపులు తెరువు”కర్కశంగా ఉన్న ఓ గొంతు పలికింది.
“నేను తీయను”మొండిగా చెప్పింది.
ఆ మాట వినగానే తలుపుల మీద బలమైన దెబ్బల శబ్దం విని ..భయంతో వణకుతూ తలుపులు తెరిచింది.
ఆమెను తోసుకుంటూ పది మంది దోపిడీ దారులు లోపలికి వచ్చారు.అందరూ బలిష్టంగా..కండలు దీరి ఉన్నారు. ఎవరి ముఖంలో కూడా ప్రేమ..దయ ..జాలి అనేవి లేవు.చాలా మోటుగా వున్నారు.
వారిలో నాయకుడిలా వున్నవాడి జుట్టు కొద్దిగా నెరసింది.
వాడు ఆమెను చూస్తూ..”మేము చెప్పినట్టు వింటే నిన్నేమి చేయం.”అన్నాడు.
ఆమె భయంతో ..ఎటూ తోచక తలా ఊపింది.
“మేము మొత్తం పది మందిమి ఉన్నాము.మాకు ఆకలిగా ఉంది. మాకు అన్నం వండి పెట్టు”అన్నాడు.
ఆమె ‘సరే’ అంది.
వాళ్ళు దోచుకోచ్చిన బంగారం ..డబ్బు సంచులను అక్కడే ఓ మూలన పెట్టారు.
ఆమె వేడివేడిగా అన్నం కూరలు వండింది. ఈ లోపు భర్త చెప్పిన మాటలు గుర్తు చేసుకుంది. ఆలోచనతో.. సమయస్పూర్తితో పని చేయాలి’.
ఇప్పుడేమి చేయాలి…
ఆలోచిస్తోంది…
“ఏమిటీ ఆలోచిస్తున్నావు…అన్నం వడ్డించు”గట్టిగా అరిచాడోకడు.
రెండు వరసల్లో విస్తారకులు వేసింది.అందరికి అన్నం ..కూరలు వడ్డించి.. ఇరుకుగా ఉందని పాపని బయట పడుకోపెట్టింది.
వాళ్లంతా కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటే..చప్పుడు చేయకుండా బయట తలుపు వేసి ..గొళ్ళెం పెట్టింది.అంతకు ముందే తెచ్చిన నూనెను ఇంటి చుట్టూ తాటాకుల మీద పోసి..నిప్పంటించింది.
ఎండిన తాటాకుల మంట భగ్గున ఎగిసింది.
చిన్నపాపను భుజం మీద వేసుకొని పరుగున ఊర్లోకి వెళ్లి విషయం చెప్పింది.
ఊర్లో జనం అక్కడికి వచ్చేసరికి ఇల్లంతా కాలి పోయింది.అందులో ఆ దోపిడిదారులు కూడా బాగా కాలిపోయారు.కాలిపోతున్న డబ్బు..బంగారు సంచులను బయటకు తెచ్చారు జనం.
ఆ పది మంది దోపిడీ దారుల కోసం చాలా రోజుల నుంచి ప్రభుత్వం పట్టుకోవాలని చూస్తోంది. ఇప్పుడు శవాలై దొరికారు.
తెల్లరేసరికల్లా ప్రభుత్వాధికారులు వచ్చారు.ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు.
వీరేశం రాగానే ‘ఇదంతా నువ్వు ఇచ్చిన ధైర్యమే”అంది.
ప్రభుత్వం వారు వారికి ఒక కొత్త ఇల్లు కట్టి ఇచ్చారు.ఆ దంపతులు తమ పాపతో హాయిగా ఆ ఇంట్లో ఉండిపోయారు.
ధైర్యం..సమయస్ఫూర్తి ఎప్పుడూ విజయం వైపుకు దారి చూపిస్తాయి.
@షేరు

2 thoughts on “అమ్మ చెప్పిన కథలు 3.”

Comments are closed.