“అవ్యక్తం… “


@షేరు


మధ్యాహ్నం…
ఆ పట్టణానికి దూరంగా రోడ్డు మీద ఒక బైక్ వచ్చి ఆగింది.ఓ యువకుడు…ఇద్దరు ముసలి దంపతులు వున్నారు బైక్ మీద.ముసలి దంపతులు బలవంతంగా…దిగలేక దిగలేక దిగారు.ఆ యువకుడు వాళ్లకు సంబంధించిన దుస్తుల సంచులు రెండు అక్కడ పడేసి వెనకకు చూడ కుండా వెళ్ళిపోయాడు.
ముసలి తల్లి కింద పడిన రెండు సంచులు తీసుకొని ..వాటికంటిన దుమ్ము దులుపుతోంది.
ముసలి తండ్రి మాత్రం వేగంగా బైక్ మీద వెళ్తున్న యువకుడిని చూస్తున్నాడు.అతని కళ్ల నుండి ధారాపాతంగా కన్నీరు కారుతోంది.వణకుతున్న చేతులతో కన్నీరు తుడుచుకుని భార్య వంక దీనంగా చూసాడు.
ఆమె మాత్రం అదేమీ పట్టించుకోకుండా ..”పదండి.అలా చెట్టు కింద కూచుందాం.”అంది.
అతనికి మాత్రం గతమంతా కళ్ల ముందు కదులుతోంది.


“నీకు కొడుకు పుట్టాడు.ఇప్పుడే మీ అత్త గారింటి నుంచి ఫోన్ వచ్చింది”చెప్పింది అమ్మ సంతోషంగా.
ఆ రోజుల్లో ల్యాండ్ లైన్ ఫోన్ పెట్టించుకునే స్థోమత లేదు వారికి.నాలుగు ఇళ్ల అవతల ఓ గవర్నమెంటు అధికారి వున్నాడు.అతనింటికి ఫోన్ వస్తే..వాళ్ళు సమాచారం ఇచ్చారు.
కొడుకు పుడితే కోట్ల ఆస్తి కలసి వచ్చినట్టు…ఆనందాలన్నీ సొంతమైనట్టు..శరీరం గాలిలో తేలినట్లైంది మధుకి.
“అమ్మ నేను అక్కడికి వెళ్తానమ్మ”అన్నాడు తల్లితో.
“ముందు ఇంట్లోకి వచ్చి భోం చేసి వెళ్ళురా”అంది అమ్మ.
“ఆకలిగా లేదమ్మా …బస్సు అందితే రెండు గంటల ప్రయాణం..అక్కడికి వెళ్లి తింటా..మరీ ఆకలి అనిపిస్తే హోటల్లో ఏమైనా టిఫిన్ చేస్తలే”అని బదులు ఇస్తూనే …రోడ్డు మీదకు వచ్చాడు. బస్ స్టాండులో అడిగితే ..ఇంకో అరగంటకు కానీ బస్సు రాదన్నారు అక్కడ ఉన్నవారు.
మనసంతా అప్పుడే పుట్టిన కొడుకు చుట్టే తిరుగుతోంది.ఎప్పుడెప్పుడు వెళ్లి వాడిని చూద్దామా …ఎలా ఉన్నాడో వాడు.తల్లి మాదిరిగా తెల్లగా ఉన్నదా…తన మాదిరిగా చామనఛాయగా ఉన్నాడా…ఆస్పత్రిలో కాన్పు అయిందా….ఇంట్లో అయిందా..
రకరకాల ఆలోచనలు …
నిమిషాలు భారంగా గడుస్తున్నాయి.
కొద్దీ ఆలస్యంగానైనా బస్సు వచ్చింది.
కిటికీ పక్కన సీట్లో కూచున్నాడు.
అంతా ఆనందమే..కిటికీలోంచి కనపడే ఆకాశం…కనపడే చెట్లు…పుట్టలు..కొండలు…పక్షులు…అన్నీ ఆనందంగానే ఉన్నాయి.ఏ ఆలోచన మనసులో కదలినా నవ్వు వస్తోంది…
అత్తగారి ఊరు వచ్చింది.అందరూ దిగుతున్నారు.వాళ్ళను తోసుకుంటూ దిగి ముందుకు వెళ్ళాడు.
ఇంట్లోనే కాన్పు అయ్యిందట.కాళ్ళు కడుక్కొని …బాబు ఉన్న గదిలోకి వెళ్ళాడు.వెచ్చని దుస్తుల్లో గాఢ నిద్రలో వున్నాడు …పక్కనే నిద్ర పోతున్న లత అలికిడికి నిద్ర లేచింది. చాలా నీరసంగా ఉంది
తను.
బాబు తన తల్లి మాదిరిగా తెల్లగా ఉన్నాడా?.అక్కడ ఉన్న కుర్చీలో కూర్చోని అలా చూస్తుండిపోయాడు బాబుని.
ఇక ఆ రోజు మొదలు బాబుతోనే లోకమైంది.వాడిని అపురూపంగా చూసుకుంటున్నాడు.వాడు పెరుగుతూ ఉంటే వాడితో పాటే ఆనందాలు పెరుగుతున్నాయి ఇంట్లో.
ఏది వండినా.. ఏది తెచ్చినా ముందు వాడికే…వాడు ఏడిస్తే భార్యను కొట్టినంత పని చేసేవాడు.
“మరీ అంత గారాబం చేయకండి.వాడు చెడిపోతాడు.ఇప్పటి నుంచే వాడిని హద్దుల్లో పెట్టాలి”అంది లత భర్తతో.
“ఏమి అవసరంలేదు.మావాడు బుద్ధిమంతుడు.”
భర్త ఎంత చెప్పినా వినడని అర్థమై చెప్పడం మానేసింది.
బాబుని బడిలో చేర్పిస్తూనే..టీచర్లకు చెప్పాడు.”మా వాడికి చదువు రాక పోయిన పర్లేదు మీరు మాత్రం వాడిని కొట్టొద్దు”
మధుకి కొడుకు మీద వున్న ప్రేమ తెలుసు కాబట్టి టీచర్లు కూడా బాబుని ఏమనే వారు కాదు.స్వతహాగా తెలివైన బాబు చదువుల్లో ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకునే వాడు.

లత తను మళ్లీ గర్భవతిని అయిన విషయాన్ని భర్తకు చెప్పింది.అది విన్న మరుక్షణమే ఆస్పత్రికి తీసుకు వెళ్లి అబార్షన్ చేయించాడు.మరుసటి వారమే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు.’ఉన్న ఒక్క బాబుని చూసుకుంటే చాలు..ఇంకా పిల్లలొద్దు’అనేవాడు. కొడుకుని ఓ మంచి ప్రయివేటు స్కూల్లో వేసాడు.
బాబుకి జలుబు చేసినా… జ్వరమొచ్చినా నానా హంగామా చేసేవాడు.
అమ్మ విసుగ్గా,”ఊర్లో అందరికీ వున్నారురా పిల్లలు నీకే కాదు.మరీ ఇంత గారాబం పనికి రాదు.”అంది.
“మా వాడు అందరిలా కాదు.నేను వీడిని ఇలానే పెంచుతాను.”
కొడుకు మొండితనం తెలిసిన ఆమె మౌనంగా ఉండిపోయింది.
“మీరు పట్టించుకోకండి అత్తయ్య”చెప్పింది కోడలు.
ఒకరోజు క్లాసులో పక్కనే కూర్చున్న అబ్బాయి కొట్టాడని కంప్లైంట్ తెచ్చాడు .పిల్లవాడి ఏడుపు చూసి తట్టుకోలేక…కొట్టిన అబ్బాయి ఇంటి మీదకు వెళ్లి వాడి అమ్మానాన్నలతో ఓ రెండు గంటల మాటల యుద్ధం చేసాడు.
దానితో ఊర్లో వారందరికీ అర్ధం అయ్యింది ఆ పిల్లవాడి జోలికి వెళ్ళొద్దనీ…
వాడి పుట్టిన రోజు అయితే ఓ పెద్ద పండగ సంబరమే..ఉదయాన్నే లేచింది మొదలు నిద్ర పోయేంత వరకు పాలనీ, పరమన్నామనీ,పులిహోరనీ.. నాన్ వెజ్ ఐటమనీ.. ఫ్రైడ్ రైసనీ ఏర్పాట్లు చేయించేవాడు.ఓ పెద్ద కేకు తెచ్చి పిల్లలందరి ముందు కోయించేవాడు.బాబు ఎంత ఆనందపడితే దానికి రెట్టింపు ఆనందం కలిగేది మధుకి.
ఇంటర్లో చేర్చేందుకు హైద్రాబాద్ బాబుని తీసుకెళ్లాడు.అన్ని జాగ్రత్తలు చెప్పి వచ్చాడు కానీ మనసులో సమయానికి తింటాడా లేదా…ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తాడా…ఇలాంటి ఆలోచలనలతో స్థిమితంగా ఉండేవాడు కాదు.ప్రతి ఆదివారం వెళ్ళేవాడు అక్కడి.ఏనాడు మార్కుల గురించి మాట్లాడలేదు.
ఇంటర్ కాగానే అక్కడే ఉన్న మంచి కాలేజిలో ఇంజినీరింగ్లో జాయిన్ అయ్యాడు.కాలేజ్ ఫీజు కోసం రెండు ఎకరాలు అమ్మినా దిగులు పడలేదెప్పుడు.
ఇంజినీరింగ్ పట్టా చేతికి రాగానే సాఫ్ట్ వేర్ ఉద్యోగం దొరికింది.మంచి జీతం…కొడుకు కంటే కూడా తండ్రికే ఆనందం ఎక్కువ కలిగింది.మొదటి జీతం తీసుకొచ్చి తండ్రి చేతుల్లో ఉంచాడు.కాళ్లకు నమస్కరిస్తున్న కొడుకుని హత్తుకొని అలాగే కొద్దిసేపు ఉండిపోయాడు.ఆనందంతో మాట రావటం లేదు.
తల్లి దండ్రులిద్దర్నీ కూర్చోబెట్టి,”ఉన్నదే మనం ముగ్గురం ..నేనక్కడ…మీరిద్దరు ఇక్కడ.మీరిద్దరు నా దగ్గరికి రండి.అంతా కలిసే ఉందాం.కొత్త ఊరిలో ఉన్నట్టు ఉంటుంది.పరిచయాలు పెరుగుతాయి.”మెల్లగా చెప్పాడు.
“లేదురా…పల్లెటూర్లకు అలవాటు పడ్డ ప్రాణాలు పట్నంలో పొసగలేవు. నువ్వు సెలవు దొరికినప్పుడల్లా ఇక్కడికి రా…మధ్యలో మేమూ వస్తూ..పోతూ ఉంటాం కదా”చెప్పాడు మధు.
కొడుకుతో తండ్రికి ఎక్కువ అటాచ్మెంట్ కనుక తల్లి మౌనంగా వాళ్ళ సంభాషణ వింటోంది.
“సరేలే నాన్న నీ ఇష్టం,” అని తండ్రితో అన్నాడు కానీ తల్లిని అభిప్రాయం అడగలేదు.తాము ఏమి చెప్పినా..కాదు అన్న నమ్మకం.
ఉద్యోగం వచ్చి ఒక సంవత్సరం అయిందో లేదో దూరపు చుట్టాలమంటూ భాస్కరం గారు వచ్చారు.అవి ఇవి మాట్లాడుతూనే తన తమ్మునికి అందాల రాశి అయిన కూతురు ఉందని..డిగ్రీ దాకా చదువుకుందనీ…సభ్యత సంస్కారం తెలుసునని…పెద్దలను గౌరవిస్తుందని చెప్పారు.
మధు వింటూండి పోయాడు.పక్కనే ఉన్న శ్రీమతి కూడా మౌనంగానే ఉండిపోయింది.
చివరికి మధూనే,”ఇప్పుడే కదండీ ఉద్యోగంలో చేరింది.ఇంకో సంవత్సరం ఆగుదామనీ….”అని చెబుతూ ఉంటే….మధ్యలో కలగ చేసుకొని..”మీ ఇష్టం నేను కాదనను..కాకపోతే ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళండి.నచ్చితే సరి.లేకపోతే ఆలోచిద్దాం…
ఏమంటారు”అన్నాడు.
అతని మాటల్లో ఏ మంత్రం ఉందొ కానీ సరే అన్నారు.వచ్చే ఆదివారం చూస్తామన్నారు.
అతను సంతోషంగా వెళ్ళిపోయాడు.
మధు ఆలోచిస్తూనే కొడుక్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు.మొదట ఒప్పుకోలేదు.మాట ఇచ్చామని చెబితే సరే నన్నాడు.
ఆదివారం రానే వచ్చింది.
ఓ ఇద్దరు దగ్గరి చుట్టాలతో కలిసి కార్లో అమ్మాయి వారి ఊరు వెళ్లారు.భాస్కరంగారు దగ్గర ఉండి బాగా మర్యాదలు చేశారు.
విశాలమైన హాల్లో అందరిని కూర్చో పెట్టారు.టీలు…శీతల పానీయాలు తీసుకు వచ్చి ఇస్తున్నారు.కొద్ధి సేపటికి అమ్మాయిని తీసుకు వచ్చారు.అమ్మాయి బక్కగా ఉన్నా ఆకర్షణీయంగా ఉంది.అమాయకత్వానికి చిరునామా తానే అన్నట్టుగా ఉంది ఆమె ముఖం.అడిగిన ప్రశ్నలకు పొదుపుగా జవాబిచ్చింది.గొంతు కూడా బాగా ఉంది.
“ఇక వెళ్ళొస్తామండి,”చెప్పాడు మధు.
“శుభవార్త వినిపించండి”నవ్వుతూ అన్నాడు భాస్కరం.
“ఇంటికి వెళ్లి..మాట్లాడుకున్నాక…ఏ విషయము చెబుతాం”అని చెప్పి ..బయటకు వచ్చి కార్లో కూర్చున్నారు.
బాబు మొహంలో ఎలాంటి భావము లేదు.
అందరికి అమ్మాయి బాగా నచ్చింది.
మధు తన ప్రమేయమేమి లేనట్టు కొడుకు మీదకు నెట్టేసాడు…”చేసుకునేది ..కాపురం చేసేది వాడు. వాడికి నచ్చితే చాలు”
“ఏమంటావు రా”పిన్ని వరసైనా ఆవిడ బాబును భుజం పట్టుకు ఊపుతూ అడిగింది.
“ఇంటికి వెళ్ళాక చెబుతా…”
“సరే నీ ఇష్టం…’
కారు ఊరు వైపుకు వేగంగా ఉరికింది.


రాత్రంతా ఆలోచించి …పొద్దున్నే హైద్రాబాద్ పోవటానికి బయలు దేరుతూ…తండ్రి దగ్గరకు వెళ్లి,”మీ ఇష్టం నాన్న…మీరు..అమ్మ ఎలా అనుకుంటే ..అలా చేయండి”అని చెప్పి వేగంగా వెళ్ళిపోయాడు.
ఈ విషయం భాస్కరంకు చేర వేయడంతో… లాంఛనాలు మాట్లాడుకోవటంతో… చకచకా పెళ్లి పనులు జరిగిపోయాయి….
ఫంక్షన్ హాల్లో పెళ్లి జరిగి పోయింది..
ఓ నెల వరకు మామూలుగా..అమాయకంగా ఉన్న కోడలు మీనా తన అసలు రంగు బయటపెట్టింది. అత్త మామ అంటే ఆమెకు పడేది కాదు.ఇది గమనించిన మధు అమెని కొడుకు దగ్గరే ఉంచాడు.నెలకోసారీ చుట్టపు చూపుగా పోయినా…..మోహమంతా మాడ్చుకొని ఉండేది.ఆమె ఇబ్బందిని గమనించి మధు భార్యను తీసుకొని ఇంటికి వచ్చాడు.
కోడలు తీరుకు చాలా బాధ పడిపోయింది లత.ఒక్కగానొక్క కొడుకు…ఇలా దూరంగా ఉండటం అదీ తన భర్తకు కొడుకుకు మధ్య దూరం పెరగడం చూసి కన్నీళ్లు పెట్టుకుంది.
మధు మాత్రం లోపల ఎంత బాధ పడుతున్న కూడా పైకి మాత్రం గంభీరంగా ఉండేవాడు.బాబు సంతోషంగా ఉంటే చాలు అనుకునే వాడు.
మూడేళ్లు గడిచాయి.
పాపా..బాబు పుట్టారు.వారిని దగ్గరకు తీసుకుంటే కోడలు భరించలేకపోతోంది.
కోడలు చూడనప్పుడు పిల్లల్ని దగ్గరగా తీసుకొని ముద్దాడటం అలవాటైంది వారికి.
పిల్లలిద్దరినీ హైద్రాబద్ లొనే ఓ పెద్ద స్కూల్లో వేశారు.
‘అమ్మ నాన్నలకి వయసు పెరిగింది.వారికి తోడుండాలని’ హైద్రాబాద్ తీసుకు వచ్చాడు బాబు.
బాబు ఆఫీసుకు వెళ్తే చాలు కోడలు నోరు మూసుకునేది కాదు.ఏదో నెపం మీద అత్త మామలిద్దరినీ తేలికగా మాట్లాడేది.
ఓ రెండు సంవత్సరాలు భరించారు.మూడో సంవత్సరం కొడుకుని కూర్చో పెట్టి తాము ఊరికి వెళతామని చెప్పారు.”అక్కడ ఉన్న ఇల్లు, పొలం అమ్మేద్దాం…”అని చెప్పి బేరం పెట్టాడు.ఎంతకు అమ్మాడో… ఎవరికి అమ్మాడో కూడా చెప్పలేదు.అడిగే ధైర్యం కూడా చేయలేకపోయారు మధు,లతలు.

ఆఫీసు పని మీద పది రోజులు వేరే ఊరు వెళ్ళాడు బాబు.ఇలా నెలకు అయిదు పది రోజులు వెళ్ళటం అలవాటే…
ఈ పది రోజుల్లో నరకం చూపించింది వారికి మీనా.ఓ పూట తింటూ..ఓ పూట అభోజనంగా ఉండేవారు.సమయానికి మందులు కూడా వేసుకోవట్లేదు.ఇద్దరికీ వయసు ఇంకో పదేళ్లు మీద పడ్డట్టయింది.బాగా కృంగి పోయారు.
మీనా బాగా కోపంతో కేకలు వేస్తున్నప్పుడు వచ్చాడు బాబు…అతనితో మధు ఏదో చెప్పపోతోంటే…మీనా ఏడుపు లంకించుకుంది.వీరి గొడవ చూడలేక …అమ్మ నాన్నలిద్దరినీ బట్టలు సర్దుకొమ్మని చెప్పి బైక్ తీసాడు.
మధు ..లత తమ తమ సంచులతో బయటికి వచ్చారు.
మీనా ఏడుస్తూనే బయటకు వచ్చి ఇదంతా చూస్తోంది.
బాబు బైక్ స్టార్ట్ చేస్తే..మధు కూర్చున్నాడు.వెనుకనే లత కూడా తన సంచి..తన భర్త సంచి పొదివి పట్టుకుంది.
అలా ఆ ముగ్గురూ బయటకు పోగానే ..ఎక్కడ లేని ఆనందంతో ఇంట్లోకి వెళ్లింది మీనా.


గతమంతా గుర్తు చేసుకొని బాధ పడుతున్న భర్తతో..”ఇక చాలు లెండి ఆలోచించింది అలా ముందుకు పోదాం పదండి”అంది లత.
కళ్ల నీళ్లు తుడుచుకుని బలంగా అడుగులు వేస్తూ భార్య వెనకే నడవ సాగాడు మధు.అరవై ఏళ్ల శరీరం అంతగా సహకరించటం లేదు.అందులో షుగర్ జబ్బు కూడా…లత మాత్రం ముందుకే నడుస్తోంది.
దూరంగా ఏదో ఊరు కనపడుతోంది.ఊరి దగ్గర ఏదో బస్టాండ్ లాంటిది కూడా ఉంది.మెల్లగా నడుచుకుంటూ అక్కడికి చేరుకున్నారు.
అక్కడే ఉన్న దిమ్మ మీద కూర్చున్నారు.బాటిల్ లో నీరు భర్తకు అందించింది.త్రాగి క్రింద పెట్టాడు దానిని.
ఇప్పుడు ఎటు వెళ్ళాలి?
ఎక్కడ ఉండాలి??
ఇద్దరి మదిలో ఇవే ప్రశ్నలు.చేతిలో డబ్బు కూడా లేదు.
చుట్టాలింటికి వెళితే..కన్న కొడుకే కాదన్నవారిని చుట్టాలు మాత్రం దగ్గరికి తీస్తారా???…
రకరకాల ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి.
అనాధశ్రయాలు కూడా తమకు తెలీదు.ఇలా ఆలోచిస్తోంటే తెలియకుండానే కన్నీళ్లు కారుతున్నాయి.
చీకటి పడుతోంది.
ఊర్లో లైట్లు వెలుగుతూ ఉన్నాయి.
రోడ్డు మీద ఆగకుండా వాహనాలు తిరుగుతున్నాయి.
అప్పుడు ఆ బస్ స్టాండ్ ముందొక కారు వచ్చి ఆగింది.
ఎవరో ఇద్దరు యువ దంపతులు దిగారు.
అతనికీ తన కొడుకంతా వయసే ఉంటుంది.
వీళ్ళని చూసి,”మధు గారంటే మీరే కదా?”అడిగాడు అతను.
అవుననీ తలా ఊపుతూ.. ఆశ్చర్యంగా..”మీరెవరు..మా గురించి మీకు ఎవరు చెప్పారు…ఇక్కడ ఉన్నామని ఎలా తెలిసింది.”మధు అడిగాడు.
“ముందు కారు ఎక్కండి. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం”..
ఇద్దరినీ జాగ్రత్తగా కార్లో కూర్చోబెట్టి..మంచి నీళ్ళు అందించారు.
కారు ముందుకు కదిలింది.
ఓ ఇరవై నిముషాలు ప్రయాణం చేసాక .. ఓ ఇంటి ముందు ఆగింది కారు. రెండొందల యాభై గజాల స్థలంలో ఇల్లు…ఇంటి ముందు రేకుల షెడ్డు…ముందు ఖాళీ స్థలం..ఈ మధ్యనే నాటినట్టున్న కొబ్బరి..మామిడి.. చెట్లు..అరటి మొక్కలు…అందంగా పొదరిల్లులా ఉంది.
కారు శబ్దం వినగానే ఇంట్లోంచి బయటకు వచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారు మధు..లతలు…
“రండి నాన్న..అమ్మ..”అని వారి సంచులని చేతపట్టుకొని…వారిద్దరినీ పొదివి పట్టుకొని ఇంట్లోకి తీసుకు వచ్చాడు బాబు.
ఇంట్లో కొద్దీ ఫర్నీచర్ అయినా అందంగా పేర్చి ఉంది.
వంటగదిలో కొత్త గ్యాస్ స్టవ్…దాని మీద పాల గిన్నె…ట్యూబ్ లైట్ల కాంతిలో ఇల్లంతా వెలిగి పోతోంది.
“మీరే తొలిసారిగా స్టవ్ వెలిగించి..పాలు పొంగించాలటమ్మా బాబు చెప్పాడు”,అంది ఆ యువతి.
బాబు వారిద్దరినీ పరిచయం చేశాడు…”నా ఫ్రెండ్ సాయి…వాడి భార్య… నీ పేరే లత…'”
“ఇదంతా ఏమిట్రా”అంది లత.
“నేను నా పెళ్లయి నప్పటి నుంచి గమనిస్తూ ఉన్నానమ్మా…మీరంటే మీనకు ఇష్టం లేదు.ఈ మధ్య మరీ ఎక్కువ చేస్తోంది.అది గమనించి..ఊర్లో ఉన్న ఇల్లు..పొలం అమ్మి ఇక్కడ మీ కోసం ఇల్లు కొని ..మీ కనుగుణంగా మార్చాను.నాన్నకు ఇష్టమని కొబ్బరి చెట్లు…అరటి మొక్కలు..
నీకు ఇష్టమని పూల మొక్కలు…మిమ్మల్ని ఇద్దరినీ చూసుకోవడం కోసం ….”అంటూ బయటకు చూసాడు…ఓ మధ్య వయస్సున్నావిడ అక్కడికి వచ్చింది.
“వీరే మా అమ్మా, నాన్న …బాగా చూసుకోవాలి.ఏ లోటు రానీయొద్దు.రెండు రోజుల కొకసారి నేను వస్తుంటాను.ఇదిగో ఈ సెల్ ఫోన్ దగ్గరుంచండి..ఇవి మందులు…””అని అప్పగిస్తుంటే ఆనందంతో మాట రాలేదు మధుకి …లతకి…
మళ్లీ కన్నీళ్లు…
ఈసారి కొడుకుకు తమ మీద నున్న ప్రేమతో….

@Sheru