బిస్కెట్ బాక్స్ 1 , biscuit box story

biscuit box story

శివ,శంకర్ ఇద్దరు బాల్య మిత్రులు. ఓకే ఊరు వాళ్ళు. పేదరికం కారణంగా చిన్నప్పటి నుంచి వీరిద్దరూ హైదరాబాదు లో ఒక బిస్కెట్ కంపెనీలో పనిచేసేవారు. వీరిద్దరిదీ ఒకే మాట ఒకే బాట.శివ బిస్కెట్ లను చాలా రుచి గా తయారు చేసేవాడు. తక్కువ గా మాట్లాడుతూ ఎక్కువ గా పని చేసేవాడు. శంకరేమో మాట్లాడి ఒప్పించే పనుల్లో, సేల్స్ లో మంచి అనుభవం సంపాదించ గలిగాడు. సరుకు ఎలా అమ్మాలో, మార్కెటింగ్ స్కిల్స్ అన్నీ అతనికి బాగా తెలుసు. వీరిద్దరిదీ ఓకే కోరిక, తమ ఊరికి దగ్గరలో లో ఉన్న పట్టణం లో బిస్కెట్ కంపెనీని స్థాపించి, తాము చిన్నప్పటినుండి పడ్డ కష్టాలన్నీ తీరాలనుకునేవారు. మన బాల్యమంతా పనిలోనే గడిచిపోయిందని, తినడానికి తిండీ,సరైన బట్టలు లేని ఈ జీవితం నుండి బాగా సెటిల్ అయ్యే జీవితం గురించి వీరు కలలు కనేవారు…….


కొంతకాలానికి…. కొంత బ్యాంకు లోను, కొన్ని సొంత డబ్బులతో, ఒక పేరున్న పట్టణంలో ఒక షెడ్ అద్దెకు తీసుకొని, కొన్ని బేకింగ్ మిషనరీస్ తో తక్కువ బడ్జెట్ లో “శివ-శంకర్” బిస్కెట్ కంపెనీని స్థాపించారు. వీరి కఠోర శ్రమ ఫలితంగా, శివ రుచికరమైన చాయ్- బిస్కెట్స్ తయారు చేయగా శంకర్ అద్భుతంగా ఆ బిస్కెట్స్ ని టీ దుకాణాలలో, చాయ్ కోట్లలో, కేఫ్ లలో, సేల్స్ చేసి వారి కంపెనీని ముందుకు తీసుకెళ్ళ సాగారు. వీళ్ళు కనిపెట్టిన “వెనిల్లా ఫ్లేవర్ చాయ్-బిస్కెట్” రుచి అందరికీ బాగా నచ్చడంతో వీటికి మంచి గిరాకి ఏర్పడి బాగా ఆర్డర్లు వచ్చేవి. శివ ఫ్రెష్ స్టాక్ తయారు చేసి, అందమైన ప్యాకెట్లలో సిద్ధం గా ఉంచేవాడు. శంకర్ ఆ స్టాక్ ని సరైన సమయంలో డెలివరీ చేసి అకౌంట్స్ క్లియర్ చేసేవాడు. సరైన నిర్ణయాలు, ఖచ్చితమైన క్రమశిక్షణతో, వారి కంపెనీ లాభాల బాట పట్టింది. దీంతో సొంత స్థలంలో సొంత కంపెనీ, పక్కపక్కనే రెండు ఇళ్లు నిర్మించుకుని తమ కుటుంబాలతో స్థిరపడ్డారు.

శివ ఎప్పుడూ లుంగీ కట్టుకొని పిండి కలుపుతూ, పిండిని మిక్సింగ్ చేసే యంత్రాలతో, బేకింగ్ మిషనరీస్ తో బిజీగా ఉండేవాడు. తన భార్య అడిగే ప్రశ్నలు…. స్టాక్ అమ్మితే ఎన్ని డబ్బులు వచ్చాయి? ఎంత స్టాక్ అమ్మారు? బ్యాంకు లోన్ ఎంత క్లియర్ చేశారు? అని అతని భార్య అడిగే ప్రతి విషయానికి శంకర్ కే తెలుసునని చెప్పేవాడు. పొద్దస్తమానం బిస్కెట్లు తయారు చేసే శివ తో ఆమెకు చిర్రెత్తుకొచ్చేది. కష్టమంతా మా ఆయనే చేస్తుంటే…శంకర్ మాత్రం హాయిగా… సూటు బూటు తో, వాహనాలలో తిరుగుతున్నాడనుకునేది.

ఇటు శంకర్ భార్యామో…..ఎప్పుడు చూసినా మా ఆయన తిరుగుతూనే ఉంటాడు. ఒక్క రోజు కూడా ఇంటిపట్టున ఉండడు. తృప్తిగా నాలుగు ముద్దలు తినడు. ఒక్కోసారి రెండు మూడు రోజులు కూడా ఇంటికి రాడు. ఎప్పుడూ బిజీ నే…. మా ఆయన కంపెనీ కోసం ఇంత కష్టపడుతుంటే.. శివ ఫ్యామిలీ మాత్రం హాయిగా ఇంట్లో ఉంటూ…కలిసి తింటూ ఆనందంగా ఉన్నారనీ, కష్టం మాది,సుఖం వాళ్లది అనుకునేది.

స్నేహితుల ఇద్దరి భార్యల వ్యక్తిగత అభిప్రాయాల భేదాల వలన కుటుంబ సంబంధాలు దెబ్బతిని, వీరి మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు జరిగేవి. శివ,శంకర్ వీరిని ఎంత వారించినా …
మేము గొప్పంటే మేము గొప్పని ఎదురుపడి వాదులాడు కొనేవారు.ఇవి రోజు రోజుకూ మరింత పెరిగి, చిలికి చిలికి గాలి వానలా మారి చివరకు శివ-శంకర్ కంపెనీని రెండు ముక్కలుగా విడగొట్టే స్థాయికి చేరాయి. ఇవి భరించలేని శివ,శంకర్ వేరువేరుగా కంపెనీలు పెట్టుకొనుటకు నిర్ణయించుకున్నారు.దాంతో శివ,”శివ బిస్కెట్స్”,అనే కంపెనీగా, శంకర్, “శంకర్ బిస్కెట్స్”అనే మరో కంపెనీగా విడిపోయి
రెండు వేరు వేరు కంపెనీలుగా.. వేరు వేరు వ్యాపారాలు చేయడం మొదలుపెట్టారు.

విడిపోయిన కొత్త “శివ బిస్కెట్స్ కంపెనీ”లో శివ- బిస్కెట్స్ తయారు చేసేవాడు అదే సమయంలో సేల్స్ కోసం తిరగలేక పోయేవాడు. ఒకవైపు సేల్స్ లేక స్టాక్ మొత్తం అలాగే మిగిలిపోయేది.కొత్త ఆర్డర్స్ రాకపోవడంతో పాత కొత్త స్టాకు మొత్తం పేరుకుపోయేది. శివ తన భార్య తో కలిసి ఎంత తిరిగి సేల్స్ చేసిన మార్కెటింగ్ అరకొరగా జరిగి ఆ కంపెనీకి క్రమంగా నష్టాలు రాసాగాయి.

విడిపోయిన కొత్త “శంకర్ బిస్కెట్స్ కంపెనీ”లో ఆర్డర్స్ విపరీతంగా ఉన్నా.. వీరు తయారు చేసే బిస్కెట్లు ఇంతకుముందు లా రుచిగా లేవని… తీసుకున్నవారు ఆ స్టాక్ మొత్తం తిరిగి వెనుకకు పంపించేవారు. దీంతో చేసే పనే డబుల్, డబుల్ గా చేసి ఆర్డర్స్ ను అందించలేక, బిస్కెట్లు రుచిగా తయారు చేయలేక… మాట పోగొట్టుకొని, కొత్తగా తయారు చేసిన బిస్కెట్లు మొత్తం పనికిరాని స్టాక్ గా అయి కంపెనీకి
నష్టాలు రాసాగాయి.

ఆరు నెలలు గడిచే సరికి రెండు కంపెనీలు దాదాపుగా దివాలా తీసే స్థాయికి చేరుకున్నాయి. దీంతో భార్యాభర్తల మధ్య తప్పు నీదంటే నీదని గొడవలు పెరిగిపోయాయి. ప్రతి పని నువ్వంటే నువ్వు అనుకొని తీవ్రంగా దూషించు కొనేవారు. ఒక్కోసారి కలిసి తప్పు చేశామని బాధపడేవారు.

“శివ” ఎప్పుడూ తన ప్రాణ మిత్రుడి నుండి విడిపోయి నందుకు ఎంతో బాధ పడేవాడు, వాడిని తలచుకొని చిన్నప్పట్నుంచి వారు కలిసి బతికిన రోజులను గుర్తు తెచ్చుకొంటూ… వాడెలా బతుకుతున్నాడోనని ఆలోచిస్తూ… ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరి గా తనలో తాను కుమిలి పోతుండేవాడు. ఒకవైపు వ్యాపారంలో నష్టపోవడమే కాక , మరోవైపు తన భర్త ఈ పరిస్థితిని చూసిన… శివ భార్య వారి పవిత్రమైన స్నేహాన్ని సరిగ్గా అర్థం చేసుకోనందుకే, తను చేసిన పనుల వల్లే …. ఇలా జరిగిందని తాన కి తానే ఎంతో బాధపడేది.

శంకర్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఎప్పుడూ బిజీగా అందరితో మాట్లాడుతూ ఉండే, శంకర్! వ్యాపారం లేక ఇప్పుడు తనలో తాను పిచ్చిపిచ్చిగా.. మాట్లాడుకుంటూ తన స్నేహితున్ని తలుచుకొని ఏడుస్తుండేవాడు. అతని పరిస్థితిని చూసిన శంకర్ భార్య తన వల్లనే వచ్చిన ఈ పరిస్థితికి తనకు తానే కుమిలి పోయేది.

ఇదిలా ఉండగా ఒకరోజు రెండు విచిత్ర సంఘటనలు ఇద్దరి ఇళ్లలో చోటుచేసుకున్నాయి
.
ఒకటేమో.. శంకర్ ఇంటి ముందు ఆవరణలో ఎవరో…. ప్రతిరోజు రాత్రి చాయ్-బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్న పెద్ద పెద్ద బాక్స్ లను తన ఇంటి ఆవరణలో విడిచి వెళుతున్నారు…. ఇది ఎవరు చేస్తున్నారో శంకర్ కి అర్థమవ్వట్లేదు. స్టాక్ మాత్రం చాలా నాణ్యమైన బిస్కెట్స్, మంచి రుచి, వాసనతో ఇవి డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

రెండవ దేమో… శివ అకౌంట్లో ఎవరో ఏక మొత్తాలుగా డబ్బులు జమ చేస్తున్నారు. ఫోన్ లో మెసేజ్ లు చూసుకుంటున్న శివకు ఈ డబ్బులు, ఎవరు క్రెడిట్ చేస్తున్నారో? ఎందుకు క్రెడిట్ చేస్తున్నారో?అర్థమవ్వట్లేదు.

ఇలా జరిగిన వింత సంఘటనల వలన … ఎలాగైతేనేమి అప్పటికప్పుడు వారిద్దరూ కొన్ని అప్పటి పరిస్థితులను సర్దుకొని నిలదొక్కుకున్నారు.

ఒక రోజు రాత్రి ….అసలు ఎవరు ఈ పెద్ద పెద్ద బిస్కెట్ బాక్సులను తమ ఇంటి ఆవరణలో వదిలి వెళుతున్నారో తెలుసుకుందామని శంకర్ ఫ్యామిలీ…. ఆ రాత్రి ఆ వచ్చే వారి కోసం మాటు వేసి ఎదురు చూశారు…… ఆరోజు బయట బాగా చీకటిగా ఉంది. వీరు ఒకపక్క రహస్యంగా దాక్కున్నారు.కొంతసేపటి తర్వాత ఎవరో రానే వచ్చారు…. చడీ చప్పుడు కాకుండా మొత్తం ఇద్దరు వ్యక్తులు బాక్సుల ను ఒకదాని తర్వాత ఒకటి ఇంటి ఆవరణలో దించుతూ కనిపించారు…… శంకర్ అతని భార్య నిదానంగా, మెల్లిగా….. చప్పుడు కాకుండా అక్కడికెళ్లి ఒక్కసారిగా వారిద్దరికీ ఎదురుగా నిలబడ్డారు. వారు వారి మొహాలకు మాస్కు ధరించి ఉన్నారు. మీరెవరు ? అని అడగగానే…………
ఒక్కసారి ఆ ప్రాంతమంతా నిశ్శబ్దం అలముకుంది. వారేం మాట్లాడడం లేదు, వారిలో వారు ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు. శంకర్ నిదానంగా వారు వేసుకున్న ఆ మాస్క్ తొలగించగానే…. వారెవరో కాదు శివ మరియు అతని భార్య…..

ఒక్కసారిగా వీరిని చూసిన శంకర్ మరియు శంకర్ భార్య అవాక్కయ్యారు. అప్పుడు శివ బెదురు, బెదురుగా మాట్లాడుతూ అరేయ్ శంకర్! ఈ స్టాక్ ను అమ్ముకుంటూ……
ఇఖ మీరైనా హాయిగా బతకండి రా! మేము ఈ రోజే ఈ ఊరు విడిచి వెళ్లి పోతున్నాం.జాగ్రత్తగా, సంతోషంగా ఉండండని అన్నాడు….. వెంటనే అతని భార్య కూడా తను చేసిన తప్పులను క్షమించండి, సేల్స్ చేయడం ఎంత కష్టమో తెలుసుకోలేకపోయాను. కంపెనీ కోసం, మా కోసం పాటుపాడిన మిమ్ములను తప్పుగా మాట్లాడి మీ మనసును గాయపరిచి నందుకు
అన్నయ్యా,వదినలైన మీరే నన్ను క్షమించాలని వేడుకుంది.

వెంటనే శంకర్, శివ ను ఆలింగనం చేసుకొని…..మీకున్న ఇంత గొప్ప హృదయంతో… మా గురించి ఆలోచించి మాకు తెలియకుండా ఇంత స్టాక్ దింపి మమ్ములను ఆదుకున్న ఈ ప్రేమ..ఈ ప్రపంచంలోఎక్కడైనా దొరుకుతుందా? లేదు. కాని అది మాకు లభించింది. మమ్మల్ని విడిచి వెళ్లొద్దని ప్రాధేయపడ్డారు. అసలు తప్పు తమదేనని మమ్మల్ని క్షమించమని వేడుకున్నారు. మా వల్లే మిమ్మల్ని దూరం చేసుకున్నామనీ, బిస్కెట్స్ రుచి గా తయారు చేయడం ఎంత కష్టమో… బాగా అనుభవించామనీ, బుద్ధి వచ్చిందని కన్నీరుమున్నీరయ్యారు.

ఆ రాత్రి ఒకరినొకరు క్షమించమని అడుగుతూ.. మా అకౌంట్లో డబ్బులు వేసింది మీరేనని మాకు ఖచ్చితంగా తెలిసు….. అవును …మీరే కదా? వదినా! అని శివ భార్య శంకర్ భార్య ని హత్తుకుని …. నవ్విన మొహాన్ని గమనించిన ఆమె… ఇంత మంచి మనసున్న మిమ్మల్ని క్షోభ పెట్టానని … తప్పైందనీ, చెప్తూ….ఒకరికొకరు కన్నీరుకారుస్తూనే ఉన్నారు…….

ఇక నవ్వుకుంటూ…. వారి మనసులోని అన్నీ అపోహలు పటాపంచలై శివ,శంకర్ మరియు వారిద్దరి భార్యలు, మీరు గొప్ప! అంటే, కాదు మీరే గొప్ప!! అని కలిసిపోయారు. మేకింగ్, సెల్లింగ్… రెండూ రెండు కళ్ళ లాంటి వని… ఒకటి ఎక్కువ.. ఒకటి తక్కువ కాదని రెండు సమానమని వారు అంగీకరించారు.వారి మనసులు తీయని బిస్కెట్ లయ్యాయి.

స్నేహం విలువైనదనీ, నిజమైన స్నేహితులను ఎవరూ విడదీయలేరని, పని అనే పదానికి అసలైన నిర్వచనాన్ని వారు తెలుసుకున్నారు. పని నైపుణ్యాల కున్న శక్తిని వారు అర్థం చేసుకున్నారు. కుక్క పని గాడిద,గాడిద పని కుక్క చేయలేవని తెలుసుకున్నారు.తిరిగి శివ-శంకర్ బిస్కెట్ కంపెనీ పాత వైభవాన్ని సంతరించుకుంది……..

మరి ఒక బిస్కెట్ టేస్ట్ చేస్తారా?.😃…….. . బాయ్

N.హర్ష వర్ధన్ రాజు.