ఎవరయ్యా దేశద్రోహులు?


ఇటీవల బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులను దేశద్రోహులు అంటూ సంబోధించడం అత్యంత ఆక్షేపణీయం. అయితే మొత్తం బిజెపి ప్రభుత్వమే ఈ దేశ ద్రోహులు అనే పదాన్ని తమ నినాదంగా ముందుకు తీసుకొచ్చారు. ప్రభుత్వానికి నచ్చని వారిని ప్రభుత్వం అప్రజాస్వామికంగా చేస్తున్న పనులను అడ్డుకున్న వారిని ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న వారిని ప్రభుత్వాని నచ్చని వారినందరిని దేశద్రోహులుగా పిలవడం బిజెపికి పరిపాటిగా మారింది.

ఎంపీ అనంత కుమార్ హెగ్డే వ్యాఖ్యలకు వస్తే.. నిజంగానే బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సంస్థను కావాలని దివాళా తీశారా? వారు ఉద్దేశపూర్వకంగా వారి సంస్థలను నిర్వీర్యం చేయగలరా? . మొత్తంగా బిఎస్ఎన్ఎల్ దానంతట అదే దివాలా తీసిందా? అనేది ఆలోచించాల్సిన విషయం. బిఎస్ఎన్ఎల్ ప్రజల పన్నులతో నిర్మింపబడిన దేశం గర్వించదగిన ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ. ఈ దేశ పౌరులకు మొదటగా టెలికాం సేవలు అందిస్తూ ప్రజల్లో మమేకమైన బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఈరోజు దేశద్రోహులు ఎట్లా అయ్యారు? ప్రభుత్వం టెలికామ్ సేవలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ఆ సంస్థ ను కాపాడు కోవడానికి తమ గొంతుకను బలంగా వినిపించడమే వారిని దేశద్రోహులను చేసింది.

అయినా ప్రభుత్వం వారి అధికార బలంతో బిఎస్ఎన్ఎల్ ను ప్రైవేట్ పరం చేస్తూ వేల మంది ఉద్యోగులు ను బలవంతంగా ఇంటికి గెంటి వేసింది. అయితే ఇట్లా ప్రభుత్వ సంస్థల ను నిర్వీర్యం చేసి వాటి స్థానే ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం ఇప్పుడే మొదలు కాలేదు. ఈ కోవలో బిఎస్ఎన్ఎల్ మొదటిదీ కాదు చివరిదీ కాదు. ప్రపంచీకరణ మొదలైన ఆదిలోనే ప్రైవేట్ ,ప్రైవేటీకరణ వల్ల పోటీ వస్తుందని చెప్పిన పాలకులు అసలు పోటీయే లేకుండా కేవలం ప్రైవేట్ సంస్థలు ఉండే విధంగానే వారి యొక్క పాలనా విధానాలను రూపొందించడం మనం గమనిస్తూనే ఉన్నాము.

బిఎస్ఎన్ఎల్ మెరుగైన సేవలు అందించడంలో దానంతట అదే వెనుకబడి పోలేదు. టెలికమ్యూనికేషన్ సేవలకు కావలసినటువంటి అత్యాధునికమైనటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రైవేటు సంస్థలకు కూడా అందించే “ట్రాయి” నీ నిర్వహించేది భారత ప్రభుత్వమే. ప్రైవేటు సంస్థలకు ఇచ్చినటువంటి అత్యాధునికమైనటువంటి 4g ,5g జి సేవలను అందించి ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ కి మాత్రం సరిపడా పూర్తి స్థాయిలో అందించకపోవడం లో ఆంతర్యమేమిటి? లక్షల కోట్ల రూపాయలతో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించి ప్రైవేటు సంస్థలకు అమ్ముతున్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వ సంస్థలకు అందించడానికి మాత్రం వెనుకాడుతున్నాయి.

ఇట్లా బిఎస్ఎన్ఎల్ సేవలను ప్రభుత్వమే కావాలని కుదించి దాని ప్రైవేటీకరణ ను వేగవంతం చేయడానికి, ప్రభుత్వ కుట్ర లను కప్పి పుచ్చుకోవడానికి సంస్థను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న ఉద్యోగుల పై ఉద్యోగుల అసమర్థత వల్లే బిఎస్ఎన్ఎల్ దివాలా తీస్తుందని నింద వేస్తున్నారు.నిజానికి ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయా ప్రభుత్వాలు తీసుకునే విధాన నిర్ణయాల మీదనే వాటి యొక్క పురోభివృద్ధి ఆధారపడి ఉంటుంది.

ప్రజల యొక్క పన్నులతో నిర్మింపబడినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా అప్పజెప్పడానికి ప్రభుత్వాలు మూడు రకాలుగా ప్రయత్నం చేస్తాయి..

  • ఒకటి నిధులను తగ్గించడం,
  • రెండవది లాభాల లో ఉన్నటువంటి సంస్థల వాటాలు విక్రయించడం,
  • మూడవది కావాలని సంస్థలను విస్మరించడం.

నిధులు తగ్గించి నిర్వీర్యం చేస్తున్న వాటిలో బిఎస్ఎన్ఎల్, లాభాల్లో ఉన్న సంస్థల్లో వాటాలు విక్రయిస్తున్న వాటిలో ఎల్ఐసి, ongc, భారత్ పెట్రోలియం, కావాలని అలసత్వంతో విస్మరిస్తున్న బీహెచ్ఈఎల్ ,హెచ్ సి ఎల్, హెచ్ ఎ ఎల్ వంటి సంస్థలు ఉదాహరణ మాత్రమే. ఇటువంటివి అనేకం కలవు.

‘నీతి ఆయోగ్’ ఏర్పాటు తర్వాత వ్యాపారాలు చేయడం ప్రభుత్వాల పని కాదని విధానంగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వం రైల్వే శాఖలో టెలికాం సేవలు అందిస్తున్న బిఎస్ఎన్ఎల్ ను కాదని jio కి టెలికాం సేవలు అప్పగించింది. ఎయిర్ ఇండియా ని అమ్మకానికి పెట్టింది. యుద్ధ విమానాల తయారీలో హెచ్ ఎ ఎల్ నీ కాదని అనిల్ అంబానీ భాగస్వామిగా ఉన్న డస్సాల్ట్ ఏవియేషన్ ఆఫ్ ఫ్రాన్స్ కంపెనీకి అప్పగించింది. ప్రభుత్వ రంగ భీమా సంస్థ స్థానంలో ప్రైవేటు బీమా సంస్థలకు లాభాలు చేకూర్చడానికి lic లో వాటా విక్రయించింది. రైల్వే రంగాన్ని అమ్మకానికి పెడుతున్నది. త్వరలో రాబోతున్నటువంటి జియో బ్యాంకు కోసం బ్యాంకుల ప్రైవేటీకరణకు దారులు వేస్తుంది. విద్యా, వైద్యం, గనుల ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నది. రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నది. అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో లో కూడా ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారు. “ప్రజల యొక్క పన్నులతో నిర్మింపబడిన ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల యొక్క ఆస్తులు”. ఈ ప్రజల యొక్క ఆస్తులను కొంతమంది వ్యక్తుల లాభార్జన కోసం విక్రయిస్తున్న చర్యలను ప్రశ్నిస్తున్న వారిని దేశద్రోహుల ను చేస్తుంది.

బీజేపీ పాలనలో ఈ దేశద్రోహుల జాబితా బిఎస్ఎన్ఎల్ తోనే ముగిసిపోదు. గనుల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్న కార్మికులు, విద్య ప్రయివేటీకరణను వ్యతిరేకించే ఉపాధ్యాయులు విద్యార్థులు, వైద్యం ప్రైవేటీకరణను వ్యతిరేకించే వైద్యులు, సమస్త రకాల సేవలను ప్రజల పన్నులతో నిర్మింపబడిన సంస్థలు ఆస్తులను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకించే వారందరూ దేశద్రోహుల జాబితాలో చేరుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే “ప్రైవేటీకరణను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ దేశద్రోహులే” నని పాలకుల విధానం. నిజానికి ఎవరు దేశ ద్రోహులు? దేశ ప్రజలందరికీ చెందిన దేశ సంపదను, సహజ వనరులను కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్న పాలకులా? లేక దేశ సంపదను, సహజవనరులను కాపాడడానికి మరియు ప్రభుత్వాలు అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నించిన వారా? సేవలను వ్యాపార కోణంలో చూసే రాజకీయ దృక్కోణం వల్లనే ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించడం పాలకులు ఒక విధానంగా తీసుకున్నారు. “ప్రజల యొక్క పన్నుఁలతో నిర్మితమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజల యొక్క ఆస్తులు అని అర్థం.” ఈ ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన ప్రభుత్వమే కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేతులలో పెట్టడాన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలి. బిజెపి ప్రభుత్వం కేవలం ప్రభుత్వ రంగ సంస్థలనే కాక ప్రజల శ్రేయస్సు కోసం రూపొందించిన ప్రజాస్వామిక సంస్థ లను సైతం తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి. వారి పాలనా విధానాలకు అనుగుణంగా ఆయా సంస్థల లో మార్పులు తీసుకు వస్తూ వాటి యొక్క అసలు లక్ష్యాలను నీరుగారుస్తున్నారు. ప్రజలు వారి హక్కులకు ప్రయోజనాలకు భంగం కలిగినప్పుడు మాత్రమే కాక వారి పన్నులతో నిర్మింపబడినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రజల శ్రేయస్సు కోసం నిర్మింపబడినటువంటి ప్రజాస్వామిక వ్యవస్థలకు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలను ప్రశ్నించాలి. ప్రభుత్వ విధానాలను నిలదీయాలి.

అప్పుడే అనంత్ కుమార్ హెగ్డే లాంటి వ్యక్తులు కారు కూతలు కూయకుండా ఈ ప్రభుత్వాలు అప్రజాస్వామికంగా వ్యవహరించకుండా నిరోధించగలం. నిజాలను తెలుపడమే కాక ప్రభుత్వాలు చెప్పే అబద్ధపు సత్యాలను కూడా తెలపడం మనందరి బాధ్యత. ప్రజల ఆస్తులు అయినటువంటి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవడమే కాక ప్రజాస్వామిక వ్యవస్థను, ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నేడు ప్రజలదే.

దిలీప్.వి
జిల్లా కార్యదర్శి
మానవ హక్కుల వేదిక
ఉమ్మడి వరంగల్ జిల్లా

The opinions expressed in this post are the personal views of the author. They do not necessarily reflect the views of https://sars.co.in .Any omissions or errors are the author’s and Our site does not assume any liability or responsibility for them.