ఈ దేశం ఎవరిది…!?

By వెంకట్ రాజారెడ్డి

ఈ దేశం ఎవరిది…!? ఈ ప్రశ్న నాకు తెలిసి భారతదేశ అస్తిత్వం ప్రారంభం నుంచి ఉన్నదనుకుంటా !

అంతకంటే ముందు మనందరికీ తెలిసిన విషయాలు కొన్ని మననం చేసుకుందాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఈ ఆరేళ్లలో అభివృద్ధి సమగ్రంగా జరగడం లేదు. దక్షిణ తెలంగాణ లోని ప్రాజెక్టులు ముఖ్యంగా రంగారెడ్డి ౼ పాలమూరు ఎత్తిపోతల ను నిర్లక్ష్యం చేసారని , ఉత్తర తెలంగాణ ప్రాజెక్టుల మీద దృష్టి కేంద్రీకరించి అభివృద్ధి అంతా అక్కడే జరుగుతుందని , రాజకీయపరంగా కూడా ఆ ప్రాంతానికి అధిక ప్రాధాన్యతనిచ్చి దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్నారని , ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్ లో ఆ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తలెత్తుతుందని కొందరు నాయకుల అభిప్రాయం. మరి ఈ తెలంగాణ ఎవరిది ? స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇక్కడి మెజారిటీ ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా ఒకే భాష పేరుతో ఆంధ్ర ప్రాంతంలో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పరచడం జరిగింది. ఉన్నన్ని రోజులు అనుమానాలూ , అవమానాలే. మన కేసీఆర్ సార్ పరిభాషలో చెప్పాలంటే రెండున్నర జిల్లాల ప్రజలు మాట్లాడే భాషను గొప్ప భాషగా చిత్రీకరించి , మిగిలిన ప్రజలను రెండో తరగతి ప్రజలుగా భావించడం వల్ల , అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కావడం వల్ల , పారిశ్రామిక , చిత్ర పరిశ్రమ రంగాల్లో ఒకే ప్రాంతం, మరీ ముఖ్యంగా ఒకే సామాజిక వర్గ ఆధిపత్యం ఉండటం వల్ల , రాష్ట్రమంతా మా జాగీరు అనుకోవడం వల్లనే ఆత్మగౌరవం, అభివృద్ధి నినాదం తో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది . మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరిది ?? పురాణాల్లో చెప్పబడి పురాతనమైన జంబూద్వీపంలో భాగమైన ఈ భరత వర్షం ఎవరిది ??? కొందరి అభిప్రాయం ప్రకారం ఉత్తర భారత ప్రజలు బయటనుంచి వచ్చిన ఆర్యులని , దక్షిణ భారత ప్రజలు ద్రవిడులని , ఆర్యుల , ద్రావిడుల మధ్య యుద్ధమే రామాయణం అని చెప్తారు. చిన్నగున్నప్పుడు రామాయణం చూస్తుంటిమి. అందులో రాజును ఆర్యన్ అని పిలిచేవారు. అర్థం కాకపోయేది. వీళ్ళ మాటల వల్ల వారు ఆర్యులన్నమాట. కానీ ఆర్యన్ అంటే జాతి వాచక పదం కాదని , అది గౌరవ వాచక పదమని మాన్యులు శ్రీ అంబేద్కర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ దేశాన్ని విడగొట్టడానికి ఆర్య , ద్రావిడ సిద్ధాంతాలు బ్రిటిష్ వారు , ఇంకా కొందరు విచ్చిన్నకర శక్తులు ప్రాచుర్యంలోకి తెచ్చినవి కానీ నిజం కావు. స్వాతంత్ర్యనికి ముందు కానీ , ప్రస్తుతం కానీ రాజకీయ రంగంలో వివక్ష స్పష్టంగా చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైన శాఖలు ఉత్తరాది వారికే కేటాయిస్తారు. ముంబై లో ఉంది సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికే అవకాశాలు వస్తాయి. దక్షిణాది సినిమాలను జాతీయ అవార్డులలో నిర్లక్ష్యం చేస్తారు. ఇక క్రికెట్ లో ఒకప్పుడు ముంబై ఆటగాళ్లు , ఒకసారి కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఏడుగురు ఆటగాళ్లు భారత జట్టులో ఉన్నారు. ఉత్తర భారత రైల్వే ప్రాజెక్టులు కానీ , పెద్ద ,పెద్ద ప్రాజెక్టులు గాని చకచకా పూర్తవుతాయి. కానీ దక్షిణాది ప్రాజెక్టులు నత్తనడక నడుస్తాయి. ఇలా వివక్ష అయితే ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని కమల్ హాసన్ , పవన్ కళ్యాణ్ లాంటివాళ్ళు దక్షిణ భారత దేశం ప్రత్యేక దేశంగా మారుతుందని హెచ్చరిస్తారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులను భారతీయులుగా చూస్తారా ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ! మరి ఈ దేశం ఎవరిది. బొంబాయి , గుజరాత్ , యూపీ , లేదా హిందీ మాట్లాడే ప్రజలదేనా ?? ఇదే విషయం మీద ఒక సినిమా వచ్చింది2019 లో హిందీ లో" పెనాల్టీ " ఇండియన్ ఫూట్ బాల్ టీం కు సెలెక్ట్ కావడానికి మణిపూర్ నుంచి వచ్చి యూపీ లో SRMU లో చదవడానికి వచ్చిన లుకరం. వీడు ఔట్ సైడర్ అంటూ బాగా ఆడినప్పటికీ టీమ్ కు సెలెక్ట్ చేయని మేనేజ్మెంట్ , అనాధలు , మాటలు రానివారు లాంటి వాళ్ళతో కూడిన జట్టు ఫైనలిస్టు లను ఓడించడం. తర్వాత లుకరం కాలేజ్ జట్టుకు ఎంపిక కావడం ఇదీ కథ. అందులోని కథాంశమే ఈ దేశం ఎవరిది?? ఔను ఎవరిది మరి ?? బ్రిటిష్ వారు మనదేశానికి స్వాతంత్య్రం ఇస్తూ భారత్ ఒక దేశంగా మనుగడ సాధించలేదు అని. వాళ్ళు అన్నది కరెక్ట్. ఎందుకంటే వందల భాషలు , మాండలికాలు, ప్రపంచంలో ఉన్నన్ని మతాలు , కట్టు, బొట్టు , తినే తిండి బట్టి కులాలు , ఎక్కడైనా ఏ దేశంలో నైనా ఉంటాయా ?? అయినప్పటికీ భారత దేశం ఇప్పటికీ ఏకతాటిపై ఉందంటే కారణం మనమంతా ఒక్కటే , మనది భారత జాతి అనే భావనే కారణం. ఇప్పటికీ ఎక్కువమంది శరణార్థులకు రక్షణ కల్పించే దేశం , ఐక్యరాజ్య సమితి శాంతి దళాల్లో ఎక్కువ భాగస్వామ్యం కలిగే దేశం , తను స్వయంగా డబ్బు లేనిదైనప్పటికీ మానవతా దృక్పథంతో మందులు లాంటి అత్యవసర సరుకులు అందించే దేశం , వసుధైక కుటుంబం అనే భావనను చెప్పడమే కాదు , ఆచరించే ఏకైక దేశం భారత దేశమే. భారతీయ సంస్కృతి అటువంటిది , అది అందరినీ అక్కున చేర్చుకుంటుంది. దాని కేంద్ర స్థానం భారతదేశమైతే దాని పరిధి ఈ విశాల ప్రపంచం.

ఇప్పుడు చెప్పండి ఈ దేశం ఎవరిది ???

లోకాస్సమస్తా సుఖినోభవంతు..! ౼౼ తెలంగాణ రాజిగాడు