గోల్డ్ కాయిన్

గోల్డ్ కాయిన్

ఆ రోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఒక ఉన్నత పాఠశాలలో ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. షేక్ అబ్దుల్
ఖాలిక్ గారు ఆ పాఠశాలలో పనిచేసే బయాలజీ టీచర్. ఆయన గత కొన్నేళ్ళుగా ఆ పాఠశాలలో పనిచేసి ఆ నెల చివరన అనగా అక్టోబర్ 31న రిటైర్ అవుతున్నారు. షేక్ అబ్దుల్ ఖాలిక్ గారు ఆ సమావేశంలో మాట్లాడుతూ… చివరన ఒక ముఖ్య ప్రకటన చేశారు. తను ఈ నెలలో ఒక ప్రాజెక్ట్ వర్క్ పోటీని తన రిటైర్మెంట్ చివరి ఇనెల సందర్భంగా నిర్వహిస్తున్నాననీ అందులో గెలిచిన వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇస్తానని చెప్పారు. ఈ పోటీలో పాఠశాలలోని అభిరుచి ఉన్న 6-10వ తరగతి చదివే విద్యార్థులందరూ పాల్గొనవచ్చని తెలియజేశారు. అది విన్న విద్యార్థులందరూ చప్పట్లు కొడుతూ… ఆ ప్రాజెక్ట్ వర్క్ ఏమిటో చెప్పాలని అడిగారు. ఈ ప్రాజెక్ట్ వర్క్ గేమ్ చాలా సింపుల్ అనీ ఈక్రింది విధంగా వివరించారు…… ఈ పోటీలో పాల్గొనే వారందరికీ తాను ఒక్కొక్కరికి ఒక్కొక్క కోడిగుడ్డు ఇస్తానని, వారు దానిని ఏదైనా కోడిపెట్ట దగ్గర పొదిగించి, కోడి పిల్లగా మార్చి ఈనెల అనగా అక్టోబర్ 31వ తేదీ ఉదయం 10 గంటలకల్లా సబ్మిట్ చేయాలనీ, వెంటనే జరిగే సమావేశంలో లో విజేతలను ప్రకటిస్తానని చెప్పాడు. ఆ పాఠశాల నుండి ఈ ప్రాజెక్టు వర్క్ గేమ్ పోటీలో దాదాపుగా 50 మంది పాల్గొన్నారు. పాల్గొన్న వారంతా కోడిగుడ్డు ని తీసుకుని నవ్వుతూ వెళ్లారు. జైనబ్ ఏడవ తరగతి చదివే చక్కని అమ్మాయి. తను కూడా ఈ గేమ్ లో పాల్గొని కోడిగుడ్డు తీసుకొని ఇంటికి వెళ్లి…… వాళ్ళ అమ్మానాన్నలతో గోల్డ్ కాయిన్ గెలుస్తాననీ, దానికి అమ్మానాన్న సహాయం చేయాలని అడిగింది. ఈ ప్రాజెక్ట్ వర్క్ గేమ్ గురించి తెలుసుకున్న వారి కుటుంబం చాలా సంతోషంగా ఆ వర్క్ ని స్వీకరించారు. 21 రోజుల‌ సమయం తొందర్లోనే గడిచిపోయింది. మొదట్లో పిల్లలందరూ తమ కోడిగుడ్లు పిల్లలు గా మారట్లే దని దిగాలు పడ్డారు. కానీ మెల్లిగా ఒకరితర్వాత మరొకరు తమ కోడి గుడ్లు కోడీపిల్లలుగా మారు తున్నాయన్నారు. క్రమంగా 25వ రోజు నాటికి అందరి కోడిగుడ్లు పగిలి కోడిపిల్లలయ్యాయ
నీ, తమ తమ స్నేహితుల తో సంతోషంగా ఉన్నారు. కానీ జైనబ్ కోడిగుడ్డు మాత్రం కోడి పిల్ల గా మారలేదు,ఈ 25 రోజులు అన్ని జాగ్రత్తలు పాటించినా ఆ కోడి గుడ్డు కోడి పిల్ల గా ఎందుకు మారలేదో వారి కుటుంబానికి అర్థం కాలేదు. దీనితో జైనబ్ చాలా బాధపడుతూ….ఇక ఆ కోడి గుడ్డు… కోడి పిల్ల గా మారదని తెలుస్తున్నా… 26,27 వ రోజు వరకు కూడా పిచ్చి గా ఎదురు చూసింది. రోజురోజుకు మరింత సమయం దగ్గర పడేసరికి ఆ పాప లో మరింత బాధ, ఒత్తిడి పెరిగి ఏడవటం మొదలు పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న వాళ్ల బాబాయి మస్తాన్…. అప్పటికే గడువు పూర్తి చేసుకున్న వేరే కోడిగుడ్డు ను…. మార్చమని సలహా ఇచ్చాడు. పిల్లలు లేని మస్తాన్ కు జైనబ్ అంటే చాలా ఇష్టం. అయినా సరే ఆ పాప ఒప్పుకోలేదు, అలా చేయడం తప్పు అని చెప్పి వారించింది. దానికి మస్తాన్ అదేం తప్పుకాదని మనం గుడ్డు మార్చిన సంగతి ఎవరూ గుర్తించరనీ,….. తద్వారా గోల్డ్ కాయిన్ గెలుచుకోవచ్చనీ, ….. ఇదంతా ఈరోజుల్లో కామన్ అని చెప్పాడు. తాను ఓడిపోయినా తన నిజాయితీని కోల్పోనని జైనబ్ తెగేసి చెప్పింది. తెలివి తక్కువ పిల్ల, మొండి ఘటం అని నవ్వుకుంటూ వెళ్లాడు. అక్టోబర్ 31వ తేదీ రానే వచ్చింది. మిగిలిన వారందరూ వారి వారి కోడి పిల్లలను చిన్న చిన్న పంజరాల లో పెట్టి సబ్మిట్ చేయడానికి వెళ్తున్నారు. కానీ జైనబ్ కోడిగుడ్డు – గుడ్డు గానే మిగిలిపోయింది. ఇది తట్టుకోలేని ఆ పాప నేను ఓడిపోతున్నానని తన తల్లి ని గాట్టిగా పట్టుకొని ఏడుస్తూ…. కూర్చుంది. అప్పుడే వాళ్ల బాబాయి మస్తాన్ అక్కడికి తిరిగి వచ్చాడు….. ఆయన మాట్లాడుతూ…. తన బేటీ ఏడుపును తను చూడలేనని, తన దగ్గర ఒక కోడి పిల్ల ఉందని దాన్ని తీసుకెళ్లి గోల్డ్ కాయిన్ గెలవమనీ, ఆటలో ఓడిపోవద్దనీ బతిమలాడాడు. అప్పుడు తన బాబాయి ని ఆప్యాయంగా హత్తుకుని. ….. ఆపని నేను చేయలేను చాచా….అని ఏడ్చింది. అప్పుడు తన తల్లి, నీవు చెప్పిన పని చెప్పిన విధంగా ప్రాజెక్టు వర్క్ పూర్తిచేశావనీ…. కోడిగుడ్డు పిల్లగా మారకపోవడం నీ తప్పు కాదనీ , తప్పు చేసే అవకాశం ఉన్నా , తప్పు చేయని బంగారు తల్లీ!!నీవు గోల్డ్ కాయిన్ గెలవలేకపోయినా నీ మనసే బంగారమనీ, ఇది కేవలం ఆట మాత్రమేననీ అర్థం చేసుకోమని… సర్దిచెప్పి పాఠశాలకు పంపించింది. ఆ గుడ్డును చేతిలో పట్టుకొని 10 గంటలకు సబ్మిట్ కౌంటర్ వద్దకు చేరింది. కోడి పిల్లలను సబ్మిట్ చేసిన తన స్నేహితులు అందరూ సంతోషంగా ఉన్నారు. జైనబ్ చేతిలోని గుడ్డును చూసి ఒక్కసారిగా అందరూ హేళనగా నవ్వారు. కొందరు స్నేహితులు దురదృష్టవంతురాలనీ, చెడ్డవారికి ఇలాగే జరుగుతుందనీ, వేస్ట్ అని గుసగుసలాడారు. జైనబ్ కోడిగుడ్డును సబ్మిట్ చేసి ఒక మూలన మౌనంగా కూర్చుంది. అది గమనించిన షేక్ అబ్దుల్ ఖాలిక్ గారు వెళ్లి పక్కన కూర్చుని ఏం జరిగిందని అడిగారు. అందరూ నన్ను వేస్ట్ అంటున్నారనీ….. ప్రాజెక్ట్ వర్క్ మొత్తం సక్రమంగానే చేశాననీ కానీ కోడి గుడ్డు… కోడి పిల్లగా మారలేదని చెప్తూ…. నన్ను క్షమించండి సార్ , నేను ఓడిపోయాను అని బాధతో కుమిలిపోయింది. సారు కళ్ళు చెమ్మగిల్లాయి. సన్నగానవ్వి, వెళ్లి అందరితో కలిసి కూర్చోమని సర్ది చెప్పాడు. విజేతలని ప్రకటించే సమయం రానే వచ్చింది. విజేతల లిస్ట్ ను ప్రధానోపాధ్యాయులు తెరిచి చదవడం ప్రారంభించారు. ఆ ప్రాంగణం అంతా నిశ్శబ్దంతో నిండిపోయింది. విద్యార్థులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు ఈ ప్రాజెక్ట్ వర్క్ గేమ్ విజేత……. “జైనబ్ ఫ్రమ్ 7వ తరగతి “……….అని ప్రకటించారు. ప్రాంగణమంతా గోలగోలగా మారింది. కోడిపిల్ల కు బదులుగా ఉత్తి కోడిగుడ్డును మాత్రమే తెచ్చిన ఆ పాప ఎలా విజేత అవుతుందని ప్రాంగణంలోని స్కూల్ కమిటీ చైర్మన్, మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. అప్పుడు షేక్ అబ్దుల్ ఖాలిక్ గారు మాట్లాడుతూ…. నేను అందరికీ వెజిటేరియన్ ఎగ్ ఇచ్చాననీ…. అందులో కోడి పిల్లలు తయారయ్యే అసలు పిండం ఉండదనీ…. ఇది శాకాహారుల కోడిగుడ్డని దీనిని పొదిగించడం వలన పిల్లలు రావని….. ఇదే నేను విద్యార్థులకు పెట్టిన అసలైన పరీక్ష అని స్పష్టం చేశాడు….. జైనబ్ ని వేదిక మీదికి పిలవగానే ప్రాంగణమంతా చప్పట్లతో మారు మోగిపోయింది.జైనబ్ గోల్డ్ కాయిన్ స్వీకరించి అందరితో శభాష్…. అనిపించుకుంది. అక్కడే దూరంగా ఎదురుచూస్తున్న తన బాబాయి దగ్గరికి వెళ్లి గాఢంగా హత్తుకుని !! మనం గెలిచాం బాబాయ్….. అని నవ్వింది. తన బాబాయ్ మాట్లాడుతూ బేటీ ! నీ ద్వారా నేను జీవిత పాఠాన్ని నేర్చుకున్నాననీ , నిన్ను ఆ అల్హా చల్లగా చూస్తాడనీ!!! ఆనందపడ్డాడు.ప్రధానోపాధ్యాయులు గారు మాట్లాడుతూ గెలుపు ముఖ్యం కాదని గెలిచే మార్గం ముఖ్యమైనదనీ, అది పాటించే వారి జీవితం గోల్డ్ కాయిన్ లోని గోల్డ్ లాంటిదని చెప్పారు. కోడిగుడ్డు 21,22 వ రోజు తర్వాత కూడా కోడి పిల్లగా మారలేదని గ్రహించిన విద్యార్థులు …అప్పటికే పొదిగిన గుడ్ల తో వచ్చిన కోడీ పిల్లలనో, లేదా వేరే కోడిపిల్లనో, ఒకరిని చూసి మరొకరు తెచ్చి సబ్మిట్ చేశారు. కోడి పిల్ల ని తెచ్చి గోల్డ్ కాయిన్ తీసుకెళ్లాలని ఆశ తప్ప అసలు మార్గాన్ని మరిచారు.”తప్పుడు మార్గం చాలా సులువుగా ఉంటుంది కానీ ఫలితం సున్నా …… కానీ అసలైన మార్గం కష్టంగా ఉంటుంది కానీ ఫలితం అమృతంలా ఉంటుంది’.జీవితమనే ఆట లో కూడా సరిగా ఆడకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది . కానీ మనం ఎప్పటికైనా ఖచ్చితమైన మార్గాన్నే ఎంచుకోవాలని చెప్పారు…. షేక్ అబ్దుల్ ఖాలిక్ గారి రిటైర్మెంట్ – వీడ్కోలు సమావేశం ….ఆ……సారు నిర్వహించిన ప్రాజెక్ట్ వర్క్ గేమ్ తీరు…. ఆయన నేర్పించిన పాఠం…. అందరి హృదయాలను ఆకట్టుకున్నది. చూశారుగా పిల్లలు నిజాయితీ లో ఉన్న బలం ఏంటో….. మీరు మీ జీవితంలో కూడా పాటిస్తారు గా……..
బాయ్….. హర్షవర్థన్ రాజు