తెలుగు లో హైదరాబాద్ చిత్రణ మరియు నగర జీవన చిత్రణ

తెలుగు లో హైదరాబాద్ చిత్రణ మరియు నగర జీవన చిత్రణ

ఐ.చిదానందం

పరిచయం
పారిశ్రామిక విప్లవం వల్ల నగరాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి ఉపాధి కేంద్రాలుగా మారాల్సిన నగరాలు నేడు నిరుద్యోగంతో అల్లాడుతున్నాయి.నగరాలల కష్టాలు, నియమ నిబంధనలను అన్ని విచిత్రంగానే ఉంటాయి. పట్టణం లో స్త్రీల బ్యూటీ పార్లర్, గోల్డ్ షాప్లు ,చీరల వ్యాపారం ,ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, ప్రైవేట్ స్కూల్లో టీచర్ల కష్టాలు, రెడీమేడ్ కల్చరు, ఇవన్నీ ఎండమావుల్లా మనల్ని ఆకర్షిస్తాయి.
Urbanity అనే పదానికి సమానార్థకంగా నగర జీవితం అనే పదం తీసుకోవచ్చు. హైదరాబాద్ అనేది తెలంగాణకు గుండెకాయ. ఇది నాలుగు వందల ఏండ్ల తెలంగాణ సాంస్కృతిక కళా వైభవం. నిజాం ప్రభువులు కూడా హైదరాబాద్ నే రాజధాని గా చేసుకుని పరిపాలించారు. ఇలాంటి హైదరాబాద్ నగరం పై నవలలు , కథలు , ఆత్మకథలు నాటకాలు, వ్యాసాలు ,కవిత్వం,పరిశోధనలు ఇవన్నీ కూడా విస్తారంగానే వచ్చాయి. వాటిలో కొన్నిటిని పరిశీలన చేయడం,పరిచయం చేయడం ఈ వ్యాస ఉద్దేశ్యం.
కావ్యాలలో హైదరాబాద్ ప్రస్తావన
హైదరాబాద్ పోలీస్ చర్య విలీనం పై, 1946-54 విశాలాంధ్ర కోసం, నిజాం పాలిత హైదరాబాద్ రాజ్యంపై , విలీనం వల్ల ఏర్పాడ యుద్ధవాతావరణం పై తెలుగు కవులు తమ కావ్యాలలో చిత్రీకరించారు. వాటిలో కొన్ని కవి రాజమూర్తి-మహైక , సినారె జలపాతం , విశ్వగీతి, కూరు రంగురావు శరద్గార, అష్టకాల నరసింహ శర్మ శిథిల విపంచి మొదలైనవి
కవిత్వం లో నగరచిత్రణ
ఆనాటి హైదరాబాద్ సూఫీ సంస్కృతి పై తెలంగాణ జీవన రీతి పై సరోజినినాయుడు గారు కవితలు రాసారు. సరోజినీ శత జయంతి సందర్భంగా ఆమె కవితల్లో 50 కవితలను ఎంపిక చేసి మహాకవి సినారె ముత్యాలకోకిల గా అనువాదం చేశారు.
అలిశెట్టి ప్రభాకర్ ఆంధ్రజ్యోతి దిన పత్రిక లో ఆరున్నరెళ్ళ పాటు తుది శ్వాస విడిచే వరకు సిటీ లైఫ్ పేరిట హైదరాబాద్ నగర జీవితాన్ని తన మినీ కవిత్వంలో చిత్రీకరించారు.
నగరం అర్దం కాని రసాయన శాల
నగరం చిక్కుముడిని పద్మవ్యూహం అంటూ వారు రాసిన కవితలు ఇంకా చెరిగిపోనివి.హైదరాబాద్ కవుల సంకలనం పేరిట ప్రముఖులు రాసిన కవితలు ఈ నెల వెన్నెల కాయనీ వెలువడినది.దీనిలో 49 కవుల కవితలు కలవు. ఇందులో అమ్మంగి వేణుగోపాల్ ముందుమాటలో చెప్పినట్లుగా ” తెలంగాణ కవి మౌలికంగా నగర కవి కాదు, నగరంలో ఉన్న కవి మాత్రమే ” అనేది అక్షర సత్యం. ఈ సంకలనం పూర్తి గా హైదరాబాద్ నగరం పై రాసిన కవిత్వం కాకపోయినా ప్రధానంగా నగర జీవితం పైనే కలదు.వేముగంటి మురళి రాసిన ఆ కెఫ్ మూతపడింది కవిత లో
ఆ కేఫ్ దానంతట అది మూతపడలేదు
బర్మిటికి పుట్టుకొచ్చిన కోత్త రుచులు
జబర్దస్తీగా మందు పెట్టించారు
అంటూ గొప్ప గొప్ప చర్చలకు, మంచి స్నేహం ,వేడి వేడి చాయ్లకు, భాయ్ భాయ్ పలకరింపులకు నిలయం అయిన కెఫ్ లు మూతపడటంను కవి చిత్రీకరించాడు.బస్ డ్రైవర్ జీవనం గురించి కవి కాంచనపల్లి చెప్తూ
విశ్రాంతి కోసం
పట్నం పల్లె వైపు కదిలిపోతుంటే
తను మాత్రం డ్యూటీలోని
స్క్వార్ చేసే ఆదాయ పంటవుతాడు
అనీ చెబుతూ పండుగలు , ఫంక్షన్లలు అన్నీ త్యాగం చేసి డ్యూటీ చేసి డ్రైవర్ జీవితం ఇందులో కలదు.కాళోజీ తర్వాత తెలంగాణ పై అంతటి ప్రేమ ను తమ కవిత్వం లో కురిపించిన వారు సబ్బని లక్ష్మీనారాయణ. వీరు హైదరాబాద్ నగరంపై హైదరాబాద్…ఓ! హైదరాబాద్ అనే దీర్ఘ కవితను 2009 లో రాశారు.
హైదరాబాద్… ఓ….హైదరాబాద్
భాగమతి కి భాగ్యనగర్
చార్ సౌల్ సాల్ కా సుందర్ షహర్
ఎవరు నిర్మించరమ్మా నిను
ఎప్పుడు నిర్మించారు
చార్మినార్ నీ గుండెల పై ఎగిసి నిలుచున్న
నిలువెత్తు సుందర హర్మ్యం
అంటూ సబ్బని తన కవిత్వంలో హైదరాబాద్ ను సుదీర్ఘంగా ప్రస్తావించారు.
నగర జీవితం వెర్రితలలు, వికృతం అవుతున్న రూపాలను పరిణామాలను కవులు తమ కవిత్వం లో చిత్రీకరించారు.హైదరాబాద్ నగరం పై ఇతర కవితలు చూస్తే కవితలు చింతపట్ల సుదర్శన్- హైదరాబాద్…హైదరాబాద్, వై.శ్రీరాములు నగరం ఒక నల్ల గాయని , వేముగంటి మురళి ఆ కేఫ్ మూతపడింది, ఏనుగు నరసింహారెడ్డి నిద్ర పువ్వు , కె.విమల-జాడ,
స్వీయ చరిత్రలలో నగర చరిత్ర
హైదరాబాద్ రాజ్యం కావడానికి దారితీసిన పరిస్థితులను ప్రముఖుల ఆత్మకథల్లో మనం చూడవచ్చు.అవి రావి నారాయణరెడ్డి -నా జీవిత పథం లో , స్వామి రామానంద తీర్థ గారి ఆత్మకథ లో,నాటి హైదరాబాద్ సైనికాధికారి జనరల్ ఇద్రాస్ ఆత్మకథ సెవెన్ రూల్స్ , కె.ఎ.ముణ్షి ఎండ్ అఫ్ ఆన్ ఎరా , అలాగే హైదరాబాద్ చివరి ప్రధాని మీర్ లాయక్ ఆలీ ఆత్మకథ ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ వంటి రచనలలో హైదరాబాద్ చరిత్ర ను చూడవచ్చు. ఇంకా షాకత్ అజ్మీ గారి ఆత్మకథ కైఫీ అండ్ మై సేల్ఫ. ఇది కూడా హైదరాబాద్ నగర చరిత్రను నగర జీవితాన్ని చిత్రీకరించింది.
కథలలో నగర చిత్రణ
కాసుల ప్రతాప్ రెడ్డి రాసిన కథ ఒక రోజు. ఇది నగరం లోని జర్నలిస్టుల జీవితాన్ని తెలియజేసింది. దీనిలో ప్రశాంత్, రోజా అనే జర్నలిస్టుల పాత్ర చిత్రీకరణ చేయబడింది. వీరి జీవితంలో ఉండేటువంటి అస్ఠిరతను, టెన్షన్ ను రచయిత చెప్పారు.
అంపశయ్య నవీన్ రాసిన కథ చివరి కానుక. ఇది కూడా జర్నలిస్టుల జీవితాన్నే చెప్పింది. కథలో రోహిత్ ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ పని నిమిత్తం రోహిత్ ఢిల్లీ వెళ్లి ఉంటాడు.ఒక అమ్మాయి కూడా అదే ట్రైన్ లో ప్రయాణిస్తుంది.ఆ తర్వాత వారి మాటలు కలిశాయి. ఇద్దరు ఒకరికి ఒకరు తమ వివరాలను చెప్పుకున్నారు. ఆ తర్వాతే వారికి తెలిసింది వారిద్దరు చిన్ననాటి స్నేహితులనీ, ఆ రజిత అనే అమ్మాయి నీ చిన్నప్పుడు రోహిత్ ప్రేమించాడు. ఇప్పుడు ఆమెకు పెళ్లి కూడా అయిపోయింది , కానీ రోహిత్ కు ఇంకా పెళ్లి కాలేదు, ఏమైన అలా ఆమె కలవడం రోహిత్కు ఒక మధుర జ్ఞాపకం గా ఉంది. ఇలా జర్నలిస్టుల మధ్యతరగతి జీవనాన్ని చిత్రీకరించారు రచయిత.సమాజంలో గౌరవం, బాధ్యత గల వృత్తి పోలీసు. ఈ ఉద్యోగం పై అంపశయ్య నవీన్ గన్ అండ్ యూనిఫామ్ కథ లో అమృతరావు కళాశాలలో అధ్యాపకులు. అమృత రావు కు అనుకోకుండా వచ్చిన ఆ వృత్తి అంటే అంతగా ఇష్టం ఉండదు. ఆర్థిక ఇబ్బందుల వలన తప్పనిసరిగా ఉద్యోగం చేస్తాడు.ఆ తర్వాత కొంత కుదురుకున్నాక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి తనకు ఇష్టమైన పోలీసు ఉద్యోగం సంపాదించుకున్నాడు.అంపశయ్య నవీన్ రాసిన మరో కథ అధికారి.దీనిలో పోలీసుల లంచగోండి తనం గురించి కలదు.
కాలువ మల్లయ్య రాసిన తీపి కథ లో డాక్టర్.అశోక్ కుమార్ 90 ఏళ్లు గల వ్యక్తినీ బతికించడానికి ఎంతో కృషి చేస్తాడు.కానీ ఇతడు మరణిస్తాడు. ఈ 90 ఏళ్ల వృద్ధుడు పేరు రామయ్య. ఇతనే అంతకు ముందు యుక్తవయసులో ఒకసారి,మిడి వయసులో మరోసారి ఈ డాక్టరు దగ్గరకు వచ్చినప్పుడు వైద్యం చేసి కాపాడాడు. తొంబై ఏండ్లు వచ్చిన ఈ వృద్ధుడికి ప్రాణం మీద తీపి ఉంటుంది. అలాగే డాక్టరు కు వృత్తి పైన అంకితభావం తో అతని బతికించడానికి శ్రమ పడతాడు. ఈ కథలో నగరానికి చెందిన డాక్టర్ వాళ్ల వృత్తి ఎలా ఉంటుందో రచయిత చిత్రీకరించారు.కాలువ హలో మల్లయ్య రాసిన మరో కథ లో విశ్వనాథం పేద కుటుంబానికి చెందిన వ్యక్తి l. అలాంటి పేద కుటుంబం నుంచి వచ్చిన విశ్వనాథం విశ్వవిద్యాలయ పదవికి ఎలా చేరాడు అనేది కథ లో కలదు. అంపశయ్య నవీన్ రాసిన రుణం తీర్చుకున్నాడు కథ కూడా నగరం లోని అధ్యాపక వృత్త పై కలదు.
నగరంలో కోట్ల విలువైన కాంప్లెక్సులు, వందలకొద్దీ భవనాలు వస్తువులతో నిండి ఉంటాయి. అలాంటి వాటిని దొంగల భయం లేకుండా రక్షించేవాడు గూర్ఖా. ఇలాంటి గూర్ఖాల వృత్తిని జీవితాన్ని జాతశ్రీ రాసిన సబ్ ఠీక్ ణహీ హై కథలో చిత్రీకరించాడు. దీనిలో ధనీ రాం అనే నేపాలీ నగరం కు వచ్చి ఉద్యోగం చేస్తాడు. జీవితాన్ని ప్రాణాలకు తెగించి సాహసోపేతమైన కార్యాలతో ఇలా తన వృత్తి ని నిర్వహిస్తాడో కలదు.
కె వి నరేందర్ రాసిన వీకేండ్ కథలో కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే జంటలు నగరంలో చర్చించింది. అలాగే శ్రీపాద స్వాతి గారు రాసిన నవల కూడా ఇదే పేరుతో వారి జీవితాలను వివరించిందే.
జ్వాలాముఖి రాసిన ఇమానలక్ష్మి జిందాబాద్ , కె వి నరేందర్ చిన్ని ఆర్ట్ , షేఫి బుక్ స్టాల్ వంటివీ నగరంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారిని గురించి ఉన్నాయి. చిన్ని ఆర్ట కథలో ఆర్టిస్టుల జీవితంలో ఉన్న ఒడిదుడుకులను రచయిత చిత్రీకరించారు.షేఫి బుక్ స్టాల్ కథలో నగరంలో పుస్తకాలను ట్రైలో పెట్టి అమ్మేవారి జీవితాలు తెలియచేయబడ్డాయి.కె.వి.నరేందర్ రాసిన మరో కథా పేపర్ బాయ్. దీనిలో సుందరం పాత్ర ద్వారా న్యూస్ పేపర్లు వేసే చాలీచాలని జీవితాలు ఆ జీతాలతో ఎలా గడిచాయో రచయిత వివరించారు. కథలో సుందరం కు 12 ఏళ్లు మాత్రమే . చదువు మానేసి పొద్దున 4:30 కే లేచి సైకిల్ తొక్కుకుంటూ పేపర్ వేసి డబ్బులు సంపాదించడం నేర్చుకుంటాడు.
హైదరాబాద్ నగరంలో జాగీర్దారీ వ్యవస్థ రద్దు కావడం వలన ఒక సంక్షోభం వచ్చింది. ఈ విషయాన్ని చెబుతూ కవిరాజమూర్తి నేను గరీబోన్ని అనే కథ వచ్చింది. అలాగే వీరి మరో కథ చీకటి రాత్రి కూడా ఈ నేపధ్యంలో కొనసాగింది. కె.వి.నరేందర్ రాసిన కథల సంపుటి ” సిటీ ” (2007), ఇందులో మొత్తం గా 13 కథలు కలవు.ఈ కథలన్నీ నగరీకరణను చిత్రీకరించిన కథలే. దీనికి ముందు మాట అంపశయ్య నవీన్ రాశారు.
కొత్వాల్ రామిరెడ్డి మనవరాలు మోహిని రాజన్. వీరు ఆంగ్ల రచయితలతో కలిసి అవర్ బిల్డ్ డేస్ అనే కథల సంకలనం ప్రచురించారు. ఇది హైదరాబాద్ రాజ్యం లో ఆంతర్యుద్దం కు దారితీసిన పరిణామాల కథల రూపంలో చెప్పారు. ఇందులో మొత్తంగా 17 కథలు కలవు.వీటిలో జిలాను భాను , హీరాలాల్ మోరియా, కాళోజీ వంటి వారి కథలు కలవు.
నవలలో నగర చిత్రణ
నగర జీవితాన్ని సంపూర్ణంగా చిత్రీకరించిన మరో నవల నవీన్ రాసిన అంపశయ్య. ఈ నవల హైదరాబాదులోని ఉస్మానియా లో చదువుతున్న రవి అనే విద్యార్థి జీవితాన్ని ప్రతిపాదికగా తీసుకుని రచయిత హైదరాబాద్ వర్ణన చేశారు.నవల లో విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయ జీవితంతో పాటు హైదరాబాద్ సంస్కృతిని విశ్లేషించారు. నవీన్ రాసిన మరో నవల ముళ్ళపోదలు లో కూడా హైదరాబాదులోని నిరుద్యోగ సమస్య జీవన గతులు, స్థితిగతులు వారి ఇబ్బందులు కలవు.భాస్కరభట్ల కృష్ణారావు రాసిన వెల్లువలో పూచిక పుల్ల నవల. ఇదీ గ్రామీణ జీవితంలోని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని జీర్ణించుకోలేక నగరానికి చేరుకొని జీవితాన్ని కొనసాగించిన మధుసూదనరావు కథ.నగర జీవితాన్ని ప్రతిబింబించే తొలి తెలంగాణ నవల గా దీన్ని పరిగణించవచ్చును అనీ కాసుల ప్రతాపరెడ్డి తన తెలంగాణ నవల – నగర జీవితం అనే వ్యాసంలో పేర్కొన్నారు.దాశరథి రంగాచార్య రాసిన నవల మాయ జలతారు.జలతారు అనగా ఎండమావి. పొట్ట పోసుకోవటం కు వచ్చిన పేదవారిని చిత్రీకరణ చేశారు రచయిత. నగరంలోని మురికివాడల్లోని మోసాలకు అన్యాయాలకు గురయ్యే ప్రజలను గురించి రచయిత ఇందులో చిత్రీకరించారు.ముదిగంటి సుజాత రెడ్డి రాసిన నవల మలుపు తిరిగిన రథచక్రాలు లో హైదరాబాద్ కు చెందిన వర్ణన కలదు. దీనిలో స్త్రీపాత్ర జట్కా బండి లో నగరం లో ప్రయాణించడం , అద్దె కోంపలో అవస్థలను ఆధునిక జీవనశైలి వంటివి చెప్పడం జరిగింది.
పరవస్తు లోకేశ్వర్ రాసిన నవల సలాం హైదరాబాద్.ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడి నగరాన్ని బాగు పరిచి తాము బాగుపరిచిన వారు ఎందరో కలరు. నవలలో 1875 సిపాయిల తిరుగుబాటు , ఇరానీ హోటళ్లు , తందూరీ రోటీలు ఇవన్నీ నవలలో కలవు. సలాం హైదరాబాదు లో ముఖ్యంగా మూడు వస్తువులు కలవు. ఇవి 1578-70 వరకు గల చరిత్ర కాలం. దీనిలో స్వామి అని పిలవబడే విద్యార్థి స్వగతం, హైదరాబాద్ చరిత్ర , తెలంగాణ ఉద్యమం నేపథ్యం కలదు.దీనిలో 1969 లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కళ్లకు కట్టినట్లు చిత్రించారు.రచయిత టర్కీ కి పాత పేరు తుర్కయెనిస్తాన్ అనీ రచయిత వివరించారు. గోల్కొండ వజ్రాల గనులకు ప్రసిద్ది.అప్పట్లో ముత్యాలు రత్నాలు రాసులుగా పోసి కూరగాయలా అమ్మేవారని రచయిత రాసారు. అనిశెట్టి రజిత గారు ఈ నవల ను గురించి చెబుతూ ఈ శతాబ్ది అద్భుతమైన చారిత్రక నవల అని అన్నారు. రచయిత తన ముందుమాటలో నేను మాట్లాడే హైదరాబాద్ యాస భాషలు వాడాను అని చెప్పుకున్నారు.కాని ఇది సంభాషణ వరకే పరిమితమని హైదరాబాద్ యాస పూర్తి గా వాడ లేదని విమర్శకులు మద్దిపాటి కృష్ణారావు అభిప్రాయపడ్డారు.మాదిరెడ్డి సులోచన రాసిన నవల జన్మభూమి దీనిలో ఆనాటి పోలీస్ చర్య ను ముస్లిం కోణం లో రాయబడింది.
ఇతర నవలలు అశోక్క మిత్రన్ జంటనగరాలు(అనువాదం) , భాస్కరభట్ల కృష్ణారావు యుగ సంధి , జిలానీ బాను ఐవాన్ గజల్ , బోలిముంతల శివరామకృష్ణ మృత్యుంజయులు,వట్టికోట గంగు నవల ఇవన్నీ కూడా ఏదో ఓక విధం గా హైదరాబాద్ నగరం ను చిత్రీకరించినది.
పరిశోధన
తెలుగు నవల హైదరాబాద్ జన జీవన చిత్రణ (ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ) లో సిహెచ్.సోమా చారి గారు పరిశోధన చేస్తున్నారు.

ఐ.చిదానందం

తెలుగు బాషోపాధ్యాయులు

తెలుగు రీసేర్చి స్కాలర్

  • హైదరాబాద్ విలీన నేపథ్యంలో ఇంటిగ్రేషన్ లిటరేచర్ (వ్యాసం) సామిడి జగన్ రెడ్డి
  • తెలంగాణ కథ,వర్తమాన జీవన చిత్రణ – ఎం.దేవేంద్ర
  • పట్టణ కవుల పల్లె కవిత్వం (వ్యాసం) – చెమన్
  • తెలంగాణ నవల నగర జీవితం (వ్యాసం)- కాసుల ప్రతాప రెడ్డి