మట్టి మనిషి

matti manishi మట్టి మనిషి

అది ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో జయమ్మ అనే ఒక మంచి మనిషి ఉండేది. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు “మొద్దు”.వాడి అసలు పేరు వేరే ఉన్నా అందరూ వాణ్ని “మొద్దోడ” అని పిలవడంతో వాడికి ఆ పేరే స్థిరపడిపోయింది. మొద్దోడు పేరుకు తగ్గట్టుగానే నల్లగా, ఎత్తుగా, పొడవుజుట్టు తో బలంగా ఉండేవాడు. వీడికి దాదాపుగా పాతికేళ్ళ దాకా ఉంటాయి. వాడు మోటు మనిషి, కాయకష్టం, వ్యవసాయం, ఎడ్ల తో సహవాసం తప్ప వేరే లోకం తెలియదు. వాళ్ళ అమ్మ తో తప్ప, వాడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు, వాడి పనేదో వాడు చేసుకునేవాడు. “మొద్దోడు” ఉదయాన్నే తన 2 ఎడ్ల తో, అరకని కట్టి వాటిని తీసుకొని తన 5 ఎకరాల బాయి దగ్గరికి వెళ్ళేవాడు. వాళ్ళ అమ్మ ఇంటి పనులు పూర్తి చేసుకొని సద్ది మూట తీసుకొని చల్క దగ్గరికి చేరేది. మధ్యాహ్నం వరకు చేనులో వారు పనిచేసి, బావి దగ్గర ఉన్న పెద్ద చెట్టు కింద కలిసి అన్నం తినేవారు. రాత్రి వాళ్ళ అమ్మ మంచం మీద పడుకుంటే, వాడు పక్కనే చాప మీద పడుకునేవాడు. పడుకోబోయే ముందు వాళ్ళ అమ్మ చెప్పే విషయాలు,మాటలు వాడికి బాగా నచ్చేవి. చిన్న, చిన్న పిట్ట కథలు చెబితే వాటిని విని వాడు బాగా సంబరపడిపోయేవాడు. కథలలోని చిన్న చిన్న మాటలకే మురిసిపోయి, నవ్వేవాడు. వాడి నిష్కల్మషమైన నవ్వుని, అమాయకత్వాన్ని చూసిన తనతల్లి …..వీడు ఎలా బతుకుతాడో ! ఏమో! అని బాధ పడేది. కష్టం చేసి వచ్చిన వాడికి తన తల్లి చెప్పిన, కథలు,మాటలతో వాడు హాయిగా…. నిద్రపోయేవాడు. వాడికి తన తల్లి తప్ప మరో ప్రపంచం తెలియదు……

మట్టి మనిషి హర్ష
మట్టి మనిషి

ప్రతిరోజు తనకంటే ముందే నిద్రలేచే వాళ్ళ అమ్మ ఒక రోజు మాత్రం తెల్లవారిన తరువాత కూడా నిద్ర పోతూనే…. ఉంది. తను అమ్మను నిద్ర లేపడం ఎందుకని… అమ్మే అన్నం తీసుకుని బావికాడికి వస్తుందని భావించి బయటికి….. బయలుదేరుతున్నాడు… కానీ తన లోపలినుండి నుండి ఏదో తెలియని బాధ, దుఃఖం తనని గడపదాటనివ్వడం లేదు. అప్రయత్నంగా కళ్ళ నుండి నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి…. యధాలాపంగా ఎడ్ల దగ్గరికి వెళ్ళాడు….అవి ఢీలా పడి, దిగాలుగా ఉన్నాయి… అవి కూడా ఎంతకీ…. బయలుదేరడం లేదు. రోజటికంటే ఆనాటి ఎడ్ల విపరీత ప్రవర్తన చూసి వాడు ఒక్కసారిగా బావురుమని పెద్దగా ఏడవసాగాడు. చుట్టుపక్కల వాళ్ళు…….
వాళ్ళ అమ్మ జరిగిపోయిందన్నారు. చుట్టాలు వాడి రోదనను చూడలేకపోయారు. వాడేప్పుడూ ఎడ్ల దగ్గర…. లేదంటే మంచం పక్కన చాపమీద ఒంటరిగా కుర్చునేవాడు. ఖననం పూర్తయి ఇరుగుపొరుగు వారు,బంధువులు అందరూ వెళ్ళిపోయినా వాడు మామూలు మనిషి కాలేకపోయాడు. మంచం పక్కన చాప మీద పడుకొని, ఒంటరిగా రోదిస్తూ తిండి తిప్పలు మానేశాడు. ఎడ్లు కూడా గడ్డి తినడం లేదు… కనీసం నీళ్లు కూడా ముట్టడం లేదు. అప్పటికి బాయికాడికి వెళ్లక దాదాపుగా 20 రోజులు గడిచిపోయింది. చేను కాడి పనులన్నీ పక్క పొలం కాంతమ్మ చూస్తుంది. 25 వ రోజు కల్లా మొద్దోడు బాగా నీరసించి పోయాడు. వాడి పరిస్థితి మరీ దీనంగా మారింది…… వాడు ఎడ్ల దగ్గర మంచం వేసుకుని దాని పక్కన చాప వేసుకొని పడుకుంటున్నాడు.. వాడు మాటిమాటికి ఎడ్లను వాటేసుకొని ఏడుస్తూనే ఉన్నాడు.
ఆ రోజు రాత్రి వాడికి ఆ మంచంపైన ఒక పెద్ద వెలుగు, వెలుగుతూ కనిపించింది… వాడు లేచి వెలుగు వైపు చూశాడు. ఆ తెల్లటి వెలుగులో
వాళ్ళ అమ్మ కనిపించి, వాడితో మాట్లాడింది. తను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లాననీ, నీవు దిగులు చెందవద్దని, మామూలుగా మారి నీ పని నువ్వే చేసుకోవాలనీ, త్వరలో నీ జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుందనీ ఆమెతో స్నేహం గా చక్కగా మాట్లాడాలనీ… త్వరలో మనం కలుసుకుంటామని.. చెప్పింది. వాడిని ఎవరి దగ్గరా ఆహారం తీసుకోవద్దనీ, తినవద్దని… చెప్తూ…నేనెప్పుడూ నీతోనే ఉంటానని వాడిలో ధైర్యం నింపింది.తన తల్లితో చాలా సేపు మాట్లాడిన తరువాత…. ఆమె వాళ్ల ఎద్దులను వాటి తలలపై నిమురుతూ ఎద్దులను ఎంతో ప్రేమ చేసింది. మొద్దోడ్ని బాగా చూసుకోవాలని వాటికి చెప్పింది …అవి ఆనందంగా తల అటూ ఇటూ ఊపాయి…….. దాంతో వాడి దుఃఖం కొంత తగ్గి కుదుట పడి అమ్మ చెప్పినట్టే చేస్తానని నిశ్చయించుకొన్నాడు.

తర్వాతి రోజున వాడు త్వరత్వరగా రోజు వారి ఇంటి పనులు పూర్తి చేసుకొని, సద్దిమూట తో,ఎడ్లను తీసుకొని బాయి దగ్గరికి చేరుకున్నాడు. బాయికాడ దాదాపుగా నెల రోజుల నుండి పంట కావలి కాస్తున్న కాంతమ్మ కుటుంబానికి కృతజ్ఞతలతో దండం పెట్టాడు.కాంతమ్మ వాళ్ళ కుక్క మొద్దోడ్డ్ని చూసి తోక ఊపింది. దాంతో మొద్దోడు చేతితో దాని తల నిమిరాడు… నెమ్మదిగా వెనుతిరిగిన కాంతమ్మకు …. ఆ 5 ఎకరాల పంట భూమి,పెద్ద వ్యవసాయ బావి, ఆ భూమి గెట్లు….. ఇదివరకు ఎన్నో సార్లు చూసినా కూడా ఇప్పుడు అవి కొత్తగా కనిపిస్తూ బాగా నచ్చాయి…. ఈ భూమి తన సొంతమైతే ఎంత బాగుండో…. అనుకుంటూ, దీనిని ఎలాగైనా వశం చేసుకోవాలనుకుంది. కాంతమ్మ కుట్ర మనిషి. వడ్డీ వ్యాపారం,కల్తీ పాలు,ప్రాంసరీ నోట్లను మార్చేసి జనాల దగ్గర డబ్బులు గుంజేది.వడ్డీ లకు వడ్డీలు కట్టి భూములను వాల్చుకొనేది. ఇప్పుడేమో “మొద్దోడి” భూమి పై కన్ను పడింది… ఎలాగూ వీడిని ఊళ్లో ఎవరూ పెద్దగా పట్టించుకోరు.. వీడి అడ్డం తొలగించుకుంటే భూమి నా సొంతం అవుతుందని ఆలోచించసాగింది. వాడి కోసం రోజూ మధ్యాహ్నం భోజనం పట్టుకొని వెళ్లి, వాడితో మాట కలిపేది. కానీ మొద్దోడు ఆహారం తీసుకోవద్దని వాళ్ళ అమ్మచెప్పిన మాట గుర్తుకు వచ్చి, కాంతమ్మ తెచ్చిన ఆహారం ముట్టు కొనేవాడు కాదు, మామూలుగా,పొడిపొడిగా మాట్లాడేవాడు….. ఇఖ ఇలాగైతే లాభం లేదనుకొని….ఒకరోజు ఎవరూ లేని సమయంలో కాంతమ్మ మొద్దోడి బావి దగ్గరికి చేరింది. అక్కడ చెట్టు కింద ఉన్న..మొద్దోడి అన్నం క్యాన్లో(సద్దిమూట) చిన్న సీసాలో తీసుకొచ్చిన వాసన,రుచి లేని విషాన్ని ఎవరు గమనించకుండా ఆ అన్నంలో రహస్యంగా కలిపింది.అప్పుడు సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంట సమయం అయింది. మొద్దోడు అన్నం తినడానికి చెట్టు కిందికి వచ్చాడు…. రోజులాగే అన్నం తినడానికి తన క్యాను మూత తెరిచాడు,అన్నం ముద్దను నోట్లో పెట్టే ఆఖరి నిమిషంలో…. దూరంగా ఉన్న వాడి ఎద్దు వేగంగా వచ్చి వాడిని బలంగా గుద్దేసింది. వాడు ఎగిరి వెల్లకిలా పడ్డాడు.అన్నం క్యాను ఎగిరి కిందపడి, అన్నం నేల పాలయింది. అసలే బాగా పనిచేసి ఆకలితో వచ్చాడు.. ఆ సమయంలో అన్నం మొత్తం మట్టిలో పడటంతో వాడికి ఈ …ఎద్దు చేసిన పనికి మొద్దోడి కి విపరీతమైన కోపం వచ్చింది. కర్ర తీసుకొని దాన్ని విపరీతంగా …..బాదాడు. ఎన్నడూ కొట్టని మొద్దోడు….ఆ రోజు ఎద్దును విపరీతంగా కొట్టడంతో, ఆ రెండు ఎడ్లు చాలా భయపడ్డాయి. భయం భయం గా దూరం, దూరంగా జరిగి ఎక్కడో దూరంగా నిల్చున్నాయి. ఆకలితో, కోపంతో ఉన్న మొద్దోడు కొన్ని నీళ్ళు తాగి చెట్టు కింద విసుగ్గా ….ఆ కింద పడ్డ అన్నాన్ని చూస్తూ… కూర్చున్నాడు…. అలా చూస్తూ ఉండగానే ఒక్కసారి గా కాంతమ్మ వాళ్ళ కుక్క అక్కడికి ఉరికి వచ్చి కిందపడిన..ఆ.. అన్నాన్ని గబాగబా తిన్నది.వెంటనే ఆ కుక్క గిర్రున తిరిగి నేల మీద పడి నురుగులు కక్కుతూ చనిపోయింది. అది చూసిన మొద్దోడు ఒక్కసారిగా దిమ్మతిరిగి, ఎగిరి పడ్డాడు.వామ్మో!! ఏదో జరిగింది …..ఎన్నడూ లేనిది నా ఎద్దు నా మీదికి వచ్చిందంటే….. అది నన్ను కాపాడే ఉంటుందని వాడికి అర్థమైంది…. వెంటనే ఉరికి వాడు ఎద్దు ని గట్టిగా వాటేసుకొని, తన దగ్గరికి ఆప్యాయంగా తీసుకుని, నా ప్రాణం కాపాడవా !!అని ఏడుపు మొహం పెట్టాడు. నాకు మీరు తప్ప ఇంకా ఎవరు ఉన్నార్రా! అనీ… తను తొందరపడి కొట్టినందుకు బాగా ఏడ్చాడు…. కొంచెం సేపు తరువాత కాంతమ్మ … ఏమీ తెలియనట్టుగా ఆ చెట్టు కిందికి చేరింది… ఒక్కసారిగా.. అక్కడ ఆ చనిపోయిన వాళ్ల కుక్కను చూసి షాక్ తిన్నది. అనుకోని ఈ సంఘటనతో కంట నీరు పెట్టుకొని, నా కుక్క ను నువ్వే చంపావని దభాయించింది. తనకేం తెలియదని, అయినా మీ కుక్క ని నేను చంపితే నాకేం వస్తుందనీ…… పెద్దమనుషులను పిలవమని చెప్పాడు. పెద్దల దాకా పోతే తన మీదికే వస్తుందని… మింగలేక కక్కలేక మిన్నకుండి పోయింది. కాంతమ్మ కుటుంబం తమ పెంపుడు కుక్క చనిపోయినందుకు వారు ఎంతో బాధ పడ్డారు. దీనివలన కాంతమ్మ మొద్దోడి పై మరింత కక్ష సాధింపు మొదలు పెట్టింది.

కొన్ని రోజుల తర్వాత విడిని ఎలా మట్టుపెట్టాలో నని ఆలోచించి మరొక పన్నాగం పన్నింది…ఈసారి కాంతమ్మ మొద్దోడీ బావి మోటార్ స్టార్టర్.. లో.. గ్రీన్ బటన్ దగ్గర కరెంటు పోల్ నుంచి వచ్చే కరెంటు వైరును తెరిచి ఉంచింది. దానిని చూడకుండా గ్రీన్ బటన్ నొక్కితే వైర్ స్లీవ్ తో షాక్ తగిలి మనిషి క్షణాల్లో….చనిపోతాడు. ఇలా మొత్తం సెట్ చేసి మొద్దొడి కోసం ఎదురు చూసింది….తెల్లవారేసరికి మొద్దోడు బాయి దగ్గరికి రానే వచ్చాడు. యథాలాపంగా రోజు ఆన్ చేసినట్టుగానే మోటార్ గ్రీన్ బటన్ స్విచ్ ని ఆన్ చేశాడు…. కానీ మోటార్ ఆన్ అవ్వలేదు. ఎన్నిసార్లు ఆన్ చేసిన మోటార్ ఆన్ అవ్వలేదు. సరే తర్వాత…. చూసుకుందామని పంట కాలువ, దుగాలు పార తో సరిచేయ సాగాడు.దూరం నుంచి చూస్తున్న కాంతమ్మ మొద్దోడి కి ఎందుకు షాక్ కొట్టలేదో !! అర్థం కాలేదు. కొంతసేపయిన తర్వాత నిదానంగా కాంతమ్మ ఆ బావి దగ్గరికి చేరి స్టార్టర్ ని ఓరగా.. గమనించసాగింది. చెట్టు పక్కనే ఉన్న ఎద్దు ఒక్కసారిగా.. వేగంగా కాంతమ్మ మీదికి రాబోయింది. కాంతమ్మ వెంటనే పరిగెత్తి, తప్పించుకో బోయి అదుపుతప్పి ఆ…. పెద్ద వ్యవసాయబాయి లోకి కాలుజారి పడిపోయింది. ఒకవైపు బాయి గోడల దెబ్బలు, మరోవైపు బావి నీళ్ల లోని కరెంట్ షాక్…. రెండిటి తో…..బావి లోపల పడ్డ కాంతమ్మ గిలగిలా కొట్టుకొంటూ…. పెద్ద,పెద్దగా అరవసాగింది. ఆ అరుపులు విన్న మొద్దోడు అక్కడికి వేగంగా చేరుకొని చుట్టుపక్కల మొత్తం పరిశీలించాడు. వెంటనే కరెంట్ ఆఫ్ చేసి బావి లోకి దూకాడు. అతికష్టం మీద ఒడ్డుకు చేర్చి భుజాన వేసుకొని ఊర్లో ని హాస్పిటల్ కి చేర్చాడు. కాంతమ్మ కరెంట్ షాక్ తో శరీరం మొత్తం నల్లగా కాలిపోయింది…. ఆ దెబ్బలకు కాలు, చేయి విరిగి మంచాన పడింది. సరైన సమయంలో మొద్దోడు కాపాడాడనీ, లేదంటే ప్రాణమే పోయేదని డాక్టర్ చెప్పాడు. అసలు అక్కడికి ఎందుకు వెళ్లావు ? అని అందరూ అడిగిన మాటకు ఏ సమాధానం చెప్పలేక ….మొద్దోడు చేసిన సహాయానికి ఏడుస్తూ…వాడు గ్రీన్ స్విచ్ నొక్కినప్పుడు కరెంట్ లేదు.కానీ నేను బాయిలో పడ్డప్పుడు…. అదే సమయంలో కరెంట్ వచ్చింది. వాడిని ఏదో శక్తి రక్షిస్తుంది. వాణ్ని ఎవరూ ఏమి చేయలేరంటూ
చేతులెత్తి మొక్కసాగింది…. నేను వాడికి అపకారం చేయాలనుకున్నా కాని వాడు నాకు ఉపకారం చేశాడు. నేను చాలా పెద్ద తప్పు చేశానని బాధ పడింది. నాకు తగిన శాస్తి జరిగిందని,అందుకే చెడపకురా చెడేవు అని చెప్తారని రియలైజ్ అయ్యింది.వాడి రుణం నేను తీర్చుకోలేనిదని అందరితో చెప్పేది. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ కాంతమ్మ … మొద్దోడి గురించి కాంతమ్మ అందరికీ ఎంతో గొప్పగా చెప్తుండేది…….దాంతో కాంతమ్మ బిడ్డకు ఈ విషయాలన్నీ బాగా అర్థమై మొద్దోడు పై మంచి అభిప్రాయం కలిగింది. ఒకరోజు కాంతమ్మ ను చూడడానికి వచ్చిన మోద్దోడు ఆ అమ్మాయిని చూశాడు. వారు ఒకరిని ఒకరు చూసుకోగా…. మా అమ్మ చెప్పిన అమ్మాయి ఈమే నని వాడికి అనిపించింది.
ఎవరితోనూ మాట్లాడని మొద్దోడు … కాంతమ్మ బిడ్డతో చాలా చనువుగా, చక్కగా మాట్లాడేవాడు….. ఇది గమనించిన కాంతమ్మ….. నాకు మొద్దోడి 5 ఎకరాల భూమి నచ్చింది …నా బిడ్డకు వాడు నచ్చాడని…
వారిద్దరికీ వివాహం జరిపించింది. అప్పటి నుండి కాంతమ్మ మొద్దోడి ఎద్దులను మాత్రం బాగా చూసుకునేది……. కొన్ని రోజులకు వారికి ఒక పాప జన్మించగా….. మొద్దోడు అమ్మా ……అని పిలిస్తూ…. నాకు మా అమ్మే పుట్టిందని….. తిరిగి వాళ్ళ అమ్మ ను కలుసుకున్నానని చెప్పేవాడు.

యన్. హర్ష వర్ధన్ రాజు,