“వజ్రం”

“వజ్రం”


వజ్రం

ఆకాశం నిండా నల్లని మబ్బులు కమ్ముకుంటున్నాయి.గాలి స్తంభించినట్టైంది…ఉక్కపోతగా ఉంది.చెట్లన్నీ శిలలైనట్టు..ఆకులు కూడా కదలడం మానేసాయి. సెలవులన్నీ అయిపోయాయి.
చింటూకి చిన్నప్పటి నుంచి ఒక అనుమానం…ఎండలు బాగా వున్నప్పుడు..బయటకు వెళ్లి ఆడుకోలేని పరిస్థితుల్లో సెలవులు ఇచ్చి..వాతావరణం చల్లబడ్డాక ..వర్షాలు పడుతోంటే..ఆడుకునే సమయంలో స్కూలుకు పంపుతారు.ఇదెక్కడి న్యాయం…
చింటూఏడవ తరగతి పాసయ్యాడు.ఇక ఎనిమిదో తరగతి చదవాలి.
శ్రీశైలం వెళ్లే దారిలో ..ఎత్తైన కొండలు దాటుకుని ..లోతైన లోయల్లోకి వెళితే అక్కడ ..లోయకు పైన..కొండలను ఆనుకొని ..అడవి ప్రాంతంలో వుంది ఆ ఊరు..రంగయ్య గూడెం.

ఎనిమిదో తరగతికి శ్రీశైలం వెళ్లి చదువు కోవాలి. అక్కడే వసతి గృహంలో ఉండాలి.

ఒక రోజు చింటూ లోయలో దిగి పండ్లు కొస్తూంటే…ఒక రాయి మెరుస్తూ బంగారంలా కనపడింది..దానిని చేతుల్లో భద్రంగా తీసుకుని ఇంటికొచ్చాడు.అది బంగారం రాయి కావొచ్చనీ …..ఒక చిన్న ఆశ.
ఆ రాయిని చేతుల్లోకి తీసుకున్న నాన్న శివయ్య తలాడిస్తూ..”ఇది బంగారం రాయి కాదు…అలా కనిపిస్తుందంతే”అన్నాడు.
ఎక్కడలేని నిరుత్సాహం కలిగింది చింటూకి… బయట పందిరి క్రింద వేసిన నవారు మంచం మీద పడుకొని ఆలోచిస్తున్నాడు.
లత టీచర్ గుర్తుకు వచ్చింది.ఆమె చెప్పిన బంగారం కథ గుర్తుకు వచ్చింది.బంగారం వల్ల చాలా ఉపయోగాలున్నాయి…విలువైనది కూడా.
తాను టీచర్ని అడిగాడు..”బంగారం కన్నా విలువైనవి ఇంకా ఏమి లేవా టీచర్? “
“ఎందుకు లేవు…వజ్రాలు ఇంకా విలువైనవి.మంచి వజ్రం ఒకటి ఉంటే చాలు …ఒక ఊరిని కొనేయ వచ్చు”చెప్పింది టీచర్.
“వజ్రాలు ఎక్కడ దొరుకుతాయి టీచర్?”
“నదీ పరివాహక ప్రాంతాల్లో ..ఎక్కువగా తొలకరి వర్షాలు పడ్డప్పుడు…మట్టిలోపల ఉన్న వజ్రాలు బయటపడతాయి.గనుల్లో చాలా లోతుకు తవ్వుకుంటూ పోతే ముడి రూపంలో వజ్రాలు దొరుకుతాయి.వాటిని శుభ్రం చేసి సానబడితే మిలమిల మెరిసే వజ్రాలవుతాయి.”ఓపికగా అన్నీ విషయాలు వివరంగా చెప్పింది టీచర్.
టీచర్ చెప్పినవన్నీ గుర్తుకొస్తున్నాయి.ఒక్క వజ్రం దొరకాలి. గొప్పోడుగా మారాలి.ఇదే ఆలోచన.
నది ఒడ్డున వ్యవసాయం చేసుకుంటూ వుండే పెదనాన్న వచ్చాడు.అతనిచ్చే డబ్బులు తీసుకోకుండా..”పెదనాన్న …మీరు ఉండేది నది పక్కనే కదా” అడిగాడు.
“అవును ..”
“నది దగ్గర వర్షాలు పడ్డప్పుడు వజ్రాలు దొరుకుతాయట…మా టీచర్ చెప్పింది”చింటూ చెప్పేది విని భళ్ళున నవ్వాడు పెదనాన్న.
” ఏరా.. నీ మనసు వజ్రాల వైపు మళ్లింది.వజ్రాలు కావాలా ..ఏంది”అడిగాడు.
“ఒక్క వజ్రం దొరికితే చాలు పెదనాన్న ..ఊరినే కొనెయ్యొచ్చు”అన్నాడు చింటూ కళ్ళింత పెద్దగా చేసుకొని.
“వజ్రంతో ఊరిని కొనేయాలనే… నీకంటే పెద్దోళ్ళు…సంవత్సరాల తరబడి వెతుకుతున్నా కూడా.. దొరుకుతున్నవి చిన్న చిన్న ముక్కలు మాత్రమే… వాటితో జీవితాలు మారిపోవు”చెప్పాడు పెదనాన్న.
“మరి ఎలా ..పెద్ద వజ్రం కావాలంటే?”అడిగాడు.
“అది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు”చింటూ కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు.
“ఎక్కడో నాకు చెప్పవా పెదనాన్న”
“మరి దానికి కొన్ని కఠోర నియమాలున్నాయి.నువ్వు పాటిస్తావో లేదో అని అనుమానం”
వెంటనే అతని చేతిని బలంగా పట్టుకొని ఊపుతూ..”ఆ నియమాలన్నీ పాటిస్తా…చెప్పవా..”అంటూ ప్రార్ధించసాగాడు.
“అయితే విను..ప్రతి రోజు బడికి వెళ్లి బాగా చదువుకో..నువ్వు ఎంత బాగా చదివితే నీలో ఉన్న వజ్రం అంత బాగా మెరుస్తుంది”
“నాలో వజ్రామా ..”ఆశ్చర్యంగా చూసాడు చింటూ.
“అవును.ప్రతి మనిషిలోనూ వజ్రం ఉంటుంది.కానీ చాలా మంది దానిని పట్టించుకోరు.పట్టించుకున్న వారంతా గొప్పవాళ్లవుతారు.”అది విని మరింత ఆసక్తిగా ముందుకి వంగి..”మా టీచర్లు ఎవరూ కూడా నాలో ఉన్న వజ్రం గురించి చెప్పలేదుగా”అని ఆడిగాడు.
“ఈ విషయం అందరికీ చెప్పేది కాదు….నీకు తెలిసినా రహస్యంగా ఉంచాలి.”
“సరే పెదనాన్న..నేను ఎవరికి చెప్పనులే.”
“అయితే విను…
నువ్వు ఇప్పటి నుంచి తెల్ల వారక ముందే నిద్ర లేవాలి.రేపటి పాఠాలను ఈరోజే చదువుకోవాలి.స్కూల్లో ఎవరినో ఓడించేందుకు కాకుండా నిన్ను నువ్వు గెలిచేందుకై చదవాలి. ఎంత బాగా చదువుతూంటే ..నీలో ఉన్న వజ్రం అంత బాగా వెలుగుతుంది.నువ్వు బాగా చదువుకుంటూ పోతే ..పెద్దయ్యాక నీ నుంచి దానికదే బయటకు వస్తుంది.అప్పుడు నువ్వే గొప్పోడివి అవుతావు”
పెదనాన్న చెప్పింది విని..”మీరు చెప్పినట్టే చేస్తా…ఆ వజ్రాన్ని సొంతం చేసుకుంటా….” సంకల్పం చేపట్టిన వాడిలా చెప్పాడు.
అది విని పెదనాన్న ..చింటూ భుజం తడుతూ “భేష్”అన్నాడు.
అది మొదలు..సూర్యోదయం కంటే ముందే లేవటం.. పాఠాలు చదువుకోవడం…రాసుకోవడం… ఇదే పని.ఏమాత్రం అజాగ్రత్త చేసినా వజ్రం బయటకు రాదనే భయం.ఈ విషయం కూడా ఎవరికీ చెప్పేవాడు కాదు.


రోజులు వారాలుగా..వారాలు నెలలుగా..నెలలు సంవత్సరాలుగా మారినాయి… చింటూ యవ్వనంలోకి వచ్చాడు కానీ ఆ వజ్రం కోసం మాత్రం చదువు ఆపలేదు.
అన్ని రకాల పరీక్షలు రాస్తున్నాడు.
జిల్లా అధికారిగా ఉద్యోగం వచ్చింది.ఓ ఆరు నెలల తరువాత ఇంటికి వచ్చాడు.
చింటూని కలుద్దామనీ పెదనాన్నకూడా వచ్చాడు.
మాటల్లో..”ఏరా చింటూ వజ్రం దొరికిందా”అని అడిగాడు.
చింటూ గతం గుర్తొచ్చి నవ్వాడు.
“ఆ రోజు నువ్వు నన్ను అడిగింది ఇంకా నాకు గుర్తుంది. వజ్రం దొరికితే గొప్పోడు కావాలి..ఊరు కొనాలి.అంతేనా”
మళ్లీ చిరునవ్వు నవ్వాడు చింటూ.
పెదనాన్న కొనసాగించాడు.
“బయట ఏదో దొరుకుతుందనే ఆశతో వెతుకుతుంటాం…మనలోనే ఉన్న విలువైన వజ్రం..అదే నిరంతర కష్టం..దాన్ని మరచిపోతాం.నువ్వు దాన్ని గుర్తించావు.గొప్పోడివి అవటమే కాదు కొన్ని ఊర్లకు అధికారివి అయ్యావు.నువ్వే నిలువెత్తు వజ్రమైనావు”..
పెదనాన్న మాటలు పూర్తికాగానే..వంగి అతని కాళ్ళకు నమస్కారం చేసాడు చింటూ..


@షేరు