నల్లగొండ జిల్లా నవలా సాహిత్యం | Nalgonda Jilla Navala sahityam

నల్లగొండ జిల్లా నవలా సాహిత్యం Nalgonda jilla navala sahityam

ఐ.చిదానందం

పరిచయం
తెలుగు సాహిత్యంలో “నవల” ప్రక్రియను నిశితంగా పరిశీలించినచో తెలుగులో ఆంధ్ర ప్రాంతం వారు రాసిన నవలలకే ఎక్కువ ప్రచారం జరిగింది. తెలంగాణ నవలాకారుల కు తగిన గుర్తింపు లేక మరుగున పడిపోయారు. ఉదాహరణ కీ తెలుగు లో తొలి నవలా కారుని విషయం ల్లా విమర్శకులు , పరిశోధకులు తెలంగాణ అవతరణ జరిగేంత వరకు కూడా తడకమళ్ళ వెంకట కృష్ణారావు గారిని కనీసం పరిగణన లోకి తీసుకోక పోవడం శోచనీయం.
సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు అందఱి ని ఆకర్షించిన ప్రక్రియ నవల. నల్లగొండ లో చిన్న కథల నుండీ పెద్ద కథలు (నవలిక) దాకా అక్కడ నుండి బృహత్ నవలల వరకు రాసిన రచయితలు కలరు. తెలుగు లో నవలా ప్రక్రియ కు బీజం పడింది ఈ నల్లగొండ జిల్లా నేల లోనే. ఈ జిల్లా నవలాకారులను పరిచయం చేయడం.ఈ వ్యాసం ఉద్దేశ్యం.

నల్లగొండ జిల్లా నవలా రచయితలు
నల్లగొండ జిల్లా మామిళ్ళగూడెం లో జన్మించి తెలంగాణ లో సాహిత్యం కై కృషి చేసిన వారు షబ్నవీసు వెంకట రామనరసింహం (1896-1929). వీరి తల్లిదండ్రులు లక్ష్మీ నారాయణ రావు,రంగాయకమ్మలు. షబ్నవీసు గారు గ్రంధాలయ స్థాపన లో ఎంతో కృషి చేశారు. వీరు 1917 లో ఆంధ్ర సారస్వత నిలయం , 1924 సంస్కారణి అనే గ్రంధమాల ను స్థాపించారు. అంతే కాకుండా తెలంగాణలో పత్రికలు లేని కాలం లో ,పత్రికలకు ఆంక్షలు వున్న కాలం లో ఎంతో ధైర్యం చేసి నీలగిరి పత్రికను స్థాపించి దీనిణీ 1925 వరకు నడిపారు. ఈ పత్రిక తర్వాతే ఒద్దిరాజు సోదరుల తెనుగుపత్రిక ను (1921) ప్రారంభించారు.
షబ్నవీసు గారు సుప్రసిద్దులైన పులిజాల రంగారావు గారి సహుదరి జానకీబాయి ని వివాహం చేసుకున్నారు. కానీ చిన్న వయసులోనే ఆమె మరణించింది. ఆ తర్వాత లక్ష్మీబాయిని పరిణయమాడారు. సంతానం లేనందున రంగారావు గారి కుమారుని దత్త తీసుకున్నారు. విధి కఠినమైనది, క్రూర మైనది
షబ్నవీసు గారి ద్వితీయ అర్ధాంగి కూడా మరణించి దూరమైంది, అలాగే కుమారుడు కూడా ఆస్తమించాడు. షబ్నవీసు తన ప్రైస్ ద్వారా 1921 లో బాలిక విలాపం అనే రచన వెలువరించారు. (నవలిక అనగా పెద్ద కథ ) అలాగే గతించిన తన అర్థాంగిని గురించి రాజ్యలక్ష్మి పేరిట ఒక రచనను ప్రారంభించాడు కానీ అది పూర్తి కాక ముందే షబ్నవీసు స్వర్గస్తులైనారు. అనంతరం శేషాద్రి శేషాద్రి రమణ కవులు ఈ రచనను ఉదయలక్ష్మీ పేరిట పూర్తిచేసి పునర్ముద్రించారు.వీరి పై షబ్నవీసు జీవితం – సాహిత్యం పేరిట షబ్నవీసు ఇందిరా రావు గారు పుస్తకం వెలువరించారు.
బాల్యంలోనే తల్లిదండ్రులతో పాటు పల్నాడు (మాచర్ల) నుంచి దేవరకొండలో స్థిరపడినవారు అజ్మతుల్లా సయ్యద్ (1902-70). వీరు తన సోదరులు సయ్యద్ అలీ తో కలిసి జంటగా తెలుగు సాహిత్య వ్యాసంగాన్ని కొనసాగించారు. వీరే స్వయంగా ప్రమీలా పరిణయం, మార్కండేయ జననం,పిచ్చి లింగ శతకం , సత్య సింధు చరిత్ర , వంటి రచనలతో పాటు గా జాహ్నవి ,సుశీల , సుజాత , ఱంప రాకాసి , మణి అనే నవలలు కూడా రాశారు. ఈ నవలన్నీ స్త్రీ చైతన్య ప్రభోకాలు గా కలవు.చిన్నతనంలోనే కృష్ణా జిల్లా నుంచి మిర్యాలగూడ కు వచ్చి వైద్య వృత్తి లో స్థిరపడిన వారు కోలాహలం లక్ష్మణ రావు(1914). వీరు దాదాపుగా ఇరవై ఐదు నవలలు రాశారు. అవి మధురానుబంధం ,కన్నీళ్ళలో పన్నీటిజల్లు , పరిష్కారం , ఆదర్శ సేవకులు, తులసి , పసివాళ్ల ప్రేమాయణం ,పసిపాపలు, పెంచిన ప్రేమ, ప్రతీకారం , మళ్లీ పెళ్లి లో మాధుర్యం , బతుకు పండింది ,వీరనారి మల్లి , తల్లీ కట్టిన తాళి బొట్టు, పవిత్ర బాంధవ్యం , బతుకు విలువలు, ప్రేమ బిక్ష , హెచ్చుతగ్గులు,ప్రేమ లేని పెళ్లి , జీవిత పరిచయం , పసి పాప బలి వంటి నవలలు రాసారు. వీరి రచనల పై ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పగిడోజు ఏకానంద చారి సమగ్ర పరిశోధన చేస్తున్నారు.
నకరికల్లు మండలం మాధవరం లో జన్మించిన వారు వట్టికోట ఆళ్వారు స్వామి (1915). వీరు దేశోద్దారక గ్రంథమాలను స్థాపించి స్వయంగా ఎన్నో పుస్తకాలను ప్రచురించారు. వీరు తెలుగులో తొలి రాజకీయ నవల ప్రజల మనిషీ ని రాసారు. ఇదీ 1955 లో గ్రంథ మాల ద్వారా ప్రచురితమయింది. ప్రజల మనిషి నవల లో ఒక విధంగా వీరి స్వీయ అనుభవంతో రాసినది ఆనీ చెప్పుకోవచ్చు. దీనిలో కంఠీరవం ప్రధాన పాత్ర. ఈ నవల 1938 పూర్వపు తెలంగాణ పరిస్థితులు కలవు. హైదరాబాదులో కాంగ్రెస్ పుట్టుక , నేపథ్యం కలదు. వట్టికోట జైల్లో ఉన్నప్పుడు ఈ నవల ఆరంభించాడు.నవలలో పాత్రలు గ్రామదోర రామగోపాల్ రావు, హైదర్ ఆలీ ,వెంకట్రావు , కొమురయ్య, కోటయ్య లు. ఈ నవలలో అంజుమన్ ఉద్యమం లో భాగం గా హరిజనులను తురక మతం లో చేర్చుకోవడంతో నవల ఆరంభమవుతుంది. దీనికి సూత్రధారి అయిన హైదర్ ఆలీ నాయకులను దిమ్మే గూడెం లోకి రహస్యంగా రప్పించి ప్రలోభాలతో మతమార్పిడి చెప్పిస్తాడు. ఊళ్ళో అన్యాయాలు విని కంఠీరవం అక్కడికి వచ్చి ఆ తంతును ఆపి వేయిస్తాడు. దీంతో రాజ్య ద్రోహం కింద కంఠీరవం జైలు పాలు అవుతాడు. నవల చివర్లో రామభూపాల రావు శుద్ది కార్యక్రమం లో భాగంగా పంచముల ను తిరిగి హిందువులుగా మార్చడం కథ. వట్టికోట మరో నవల గంగు. ఇదీ అసంపూర్ణ నవల. ఇందులో కమ్యూనిస్టు వ్యక్తి నవనీతం కథానాయకుడు. లంబాడి వ్యతిరేక పోరాటాలు, భూ పోరాటాలు కలవు. దీనిలో కంసాలి పాత్రపేరు నాగభూషణం. ఇతడు దొర కు విధేయుడు. దొర కన్ను నాగభూషణం భార్య అంతమ్మ పై పడింది. విషయం తెలిసిన నాగభూషణం తన భార్య , కూతురులతో పట్టణం చేరుతాడు. అక్కడ కమ్యూనిస్టు పోరాటాలతో చైతన్యం కావడం కథ. దీనిలో 1940-45 తెలంగాణ పోరాట ఉద్యమ చరిత్ర కలదు. వట్టికోట మరో రచన గిర్దావరు. ఇది పెద్ద కథ (నవలిక), తెలంగాణ సాయుధ పోరాటం అనంతరం దొరలు ఎలా మళ్ళీ భూమి ని దక్కించుకున్నారో ఈ రచనలో కలదు.వట్టికోట ఆళ్వారు స్వామి రచనలు పై ఉస్మానియా యూనివర్సిటీ లో కె.వి.ఎస్.సూర్య నారాయణ రాజు 1982లో పరిశోధన చేసారు. అలాగే ఇదే యూనివర్సిటీ లో ప్రస్తుతం గాదె చంద్రశేఖర్ సమగ్ర పరిశోధన చేస్తున్నారు.
సంస్కృత ,ఆంధ్ర భాషాలతో పాటు గా ఉర్దూ , ఆంగ్లం భాషలో ప్రావీణ్యం గల వ్యక్తి పైడిమర్రి వెంకట సుబ్బారావు ,(1916). భారతదేశ ప్రతిజ్ఞ గేయం ను రాసిన వీరు నల్గొండ జిల్లా అనపర్తి గ్రామం కు చెందినవారు. వీరు కాలభైరవుడు అనే నవలను రాశారు.రచయిత గా , విమర్శకుడిగా పేరుపొందిన వారు పుల్లాభట్ల వెంకటేశ్వర్లు (1924). వీరు నల్లగొండ జిల్లా మెళ్ళచెరువు లో జన్మించారు. ఆ తర్వాత వృత్తిరీత్యా ఖమ్మం లో స్థిరపడ్డారు.వీరు తెలుగు నవలా సాహిత్య వికాసం అనే రాశారు ఇది ఇప్పటి కీ పరిశోధకులకు ఉపయుక్త గ్రంథ మే. వీరు సముద్ర ఘోషలు, రాధా , మా ఘంటం అనే నవలలు రాశారు. 1951లో వీరు రాసిన మా ఘంటం నవల ఇప్పటివరకు 6-సార్లు పునర్ముద్రణ చేయబడింద. ఈ నవలలో నిజాం రాష్ట్ర విమోచన ఉద్యమం గురించి కలదు.అలాగే మూఢనమ్మకాల ఖండన, పరోపకార గుణం గురించి కూడా కలదు. బైస్త కులం కు చెందిన మాఘంటం కు , నీలకంఠ అనే బ్రాహ్మణుడికి గల స్నేహం ఇందులో చిత్రీకరించబడింది. ఇది ఆలిండియా రేడియో లో ధారావాహికంగా ప్రసారం అయ్యింది. పుల్లాభట్ల వెంకటేశ్వర్లు రచనలపై ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ లో కూరాకుల శ్రీనివాస్ యాదవ్ పరిశోధన చేస్తున్నారు.ఆదిలాబాద్ రేడియో స్టేషన్ లలో పనిచేసి ఆ జిల్లా సాహిత్య విశేషాలను ప్రజలకు చెప్పినవారు కోట్రా మల్లికార్జున శర్మ (1941). వీరు పెద్దవూర మండలం గరెణ కుంట కు చెందిన వారు. వీరు భావచిత్రాలు కవితా సంపుటిని , నాగరీకం కథా సంపుటి తో పాటు గా అనే స్వర్ణలత అనే నవలను కూడా రాశారు.
సామాజిక చైతన్యం తో సమాజం సాగాలని ఆకాంక్షించిన రచయిత బోయ జంగయ్య (1942) . వీరు మల్లయ్య, ఎల్లమ్మ దంపతులకు చౌటుప్పల్ మండలం పంతంగి లో జన్మించారు. వీరు ఎన్నో కథలు సంపుటాలను వెలువరించారు. అలాగే పావురాలు అనే కవితాసంపుటి తో పాటు జాతర , జగడం ,పుట్టుమచ్చ అనే నవలలను రాశారు. ఇవన్నీ దళిత నేపద్య నవలలే. వీరి జాతర నవల ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమయింది. దీని తొలి ముద్రణ 1985 లో వచ్చింది. దీనిలో పటేల్ సీతయ్య భూస్వామి , అతని కొడుకు పాండయ్య.ఇతడు తన భార్యను పట్టించుకోకుండా బయట స్త్రీలతో తిరగడం తండ్రీ సీతయ్య భరించలేక పోతాడు. కొడుకు కోడలు కు పిల్లలు కలగాలని జాతరలో ఒక రోజూ నిద్ర చేసి రమ్మని అంటాడు. పాండయ్య కు దేవునిపై నమ్మకం లేదు. తనకు బదులుగా జీతగాన్ని ఇచ్చి రాధ తో పంపుతాడు. ఆ తర్వాత రాధా గర్భవతి కావడం, దాంతో పాండయ్య మనసు మారటం జరుగుతుంది. ఈ నవలలో జాతర ఎలా జరుగుతుందో తెలపడంతో పాటు ప్రజలు, నౌకర్లు ,పనివాళ్ళు ,పోలీసులు పూజారులు ఇలా నవలంతా నిండు గా గ్రామీణ నేపధ్యం కనిపిస్తుంది. వీరి మరో నవల జగడం నవల డిసెంబర్ 2003 లో ప్రచురితమైంది. సింగారం గ్రామంలో మల్లయ్య ,ఎల్లమ్మ దంపతుల కోడుకు రాజయ్య. బోయ జంగయ్య నవల లపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సి.వెంకటేశ్వర్లు (2000) పరిశోధన చేసారు. జాతర నవల పై ఎం.శ్రీరాములు 1999 లో హైద్రాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ పరిశోధన చేసారు.
ముదిగంటి సుజాత రెడ్డి (1944) పురుషులు, స్త్రీలు సమానమని పురుషాధిపత్యంను వ్యతిరేకించాలి కానీ, పురుషులను కాదనీ,స్త్రీ,పురుషుల మధ్య మిత్ర వైరుధ్యమే తప్ప శత్రు భావం ఉండకూడదనీ చెబుతూ వీరు నవల ఆకాశంలో విభజన రేఖలు లేవు అనే నవల ను రాసారు. దీనిలో ప్రధాన పాత్రధారి ‘ రాగిణి.
మరో నవల మలుపు తిరిగిన రథచక్రాలు (1994 ) .ఈ నవల ఇతివృత్త కాలం 1946-86. ఇది వీరి మొదటి నవల. రచయిత్రి తాను చూసిన సాయుధ పోరాటాలను దీనిలో పొందుపరిచారు.నవలలో సరళ,రమేష్ ప్రధాన పాత్రలు. సరళ దొర కూతురు, రమేష్ విప్లవ ఉద్యమ నాయకుడు.
బతుకమ్మ జరుపుకుంటున్న సమయంలో ఆడవారి ఒంటిపై నగలు దోపిడీ చేయాలని పథకం వేస్తారు. ఇది తెలుసుకున్న రమేష్ తన దళం తో వస్తాడు. అక్కడ జరిగిన ఘర్షణలో రమేష్ గాయపడగా అతనిని సరళ కాపాడుతుంది. అతని వ్యక్తిత్వం మెచ్చి మనసు ఇస్తుంది. కానీ రామేష ప్రేమ కంటే ఉద్యమమే ఎక్కువ అని ప్రేమను అంగీకరించడు.ఆ తర్వాత జరిగిన ఘటనలో రమేష్ దళం దోర ను చంపి వేస్తుంది. ఇక అక్కడి నుంచి బయటపడిన సరళ దాసు ను వివాహం చేసుకుంటుంది. వీరికి ఆశాలత అనే కూతురు పుడుతుంది. దాసు స్వతహాగా మేకవన్నె పులి. పోలీసు అనంతరం హైదరాబాద్ స్టేట్ ఏర్పడడంతో చాలామంది దాసు అలాగే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ రమేష్ మాత్రం ఇంకా విప్లవోద్యమ కార్యక్రమాల్లో నే ఉంటాడు. ప్రజాస్వామ్యం లోకి రావాలని సరళ ఎన్నిసార్లు కోరినా అతడు అంగీకరించడు.
సరళ కూతురు అశాలత కి పెళ్ళయి పాప జన్మిస్తుంది. ఆతర్వాత సంఘటనలలో ఆశాలత ,ఆమె భర్త చనిపోతారు. పాప బాధ్యత సరళ తీసుకుంటుంది .కానీ తాను కూడా అనారోగ్యంతో మరణం కు దగ్గర కావడంతో రమేష్ ను పిలిచి పాపని అతని చేతిలో పెట్టడం, అప్పుడు రమేష్ విప్లవ కార్యక్రమాలు వదిలి ప్రజాస్వామ్యం లోకి రావడం నవలా ఇతివృత్తం.సంకెళ్లు తెగిపోయాయి నవలలో ఈరయ్య,రంగి దంపతుల కుమారుడు నారాయణ.తన కులవృత్తి మంగలి వృత్తిని ఇష్టంలేక కష్టపడి చదివి గా ఉన్నత స్థానం పొందుతాడు. నారాయణ చిన్నతనం నుంచి స్కాలర్షిప్లతో చదివి నగరంలో కాలేజీలో చదువుతుంటాడు.తనతోపాటు చదువుకునే దొర కొడుకు రామేశ్వరరావు ఎంత గా అవమానిస్తున్న వాటినన్నిటిని భరించి అనల అనే అమ్మాయి ప్రోత్సాహంతో సత్యానంద తీర్థ స్వామి బోధనతో కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదిస్తాడు.
చెరబండ రాజు గారి నవలల విషయం కు వస్తే ఈ రచనలన్నీ కూడా కమ్యూనిజం దృక్పధం తో రాసినవే. 1975-78 ప్రాంతం లో జరిగిన రైతు ఉద్యమాలను అణిచి వేయుటకు పోలీసులు ఎంతోమంది ఉద్యమకారులను నిర్భంధంలోకీ నెట్టింది.ఆయినా సరే ఉద్యమం వేడి ఏమాత్రం తగ్గలేదు. ఈ విషయం ను తెలుపుతూ చెరబండ గారు మా పల్లె(1978) అనే నవలను రాసారు. దీనిని వీరు జైలు లో ఉండి రాయడం విశేషం. 1981 వ కాలం లో వీరు రాసిన నవల ప్రస్థానం. దీనిలో భూస్వాముల దోపిడీకీ తాళలేక రైతులు వలస కూలీలు గా మారి పట్టణాలకు తరలిపోవడం అనే దుస్థితిని చిత్రీకరణ చేసారు.

పేదలు; కూలీలు బండ మనుష్యులు కావొచ్చు. కానీ శ్రమను నమ్ముకుని బతికే ఆ రాతి మనుషులు ఒక్కొక్కరు కలిసి చేతులు కలిపితే ఆ తాకిడి కీ జ్వాలా జనించి.అదీ భూ అహంకారులను కాల్చివేస్తుంది. ఇదే విషయం తో పేద రైతులు ; వ్యవసాయ కూలీలు కలిసి సంఘటితం అయ్యి సమస్యల పరిష్కారం కనుగొనాలి అనీ తెలుపుతూ చెరబండ గారు *నిప్పురాళ్లు* అనే నవల రాసారు. కాలం మారుతుంది ; కాలం మార్పు కోరుతుంది ; మార్క్సిజం పేరు తో ఉన్మాదం పెంచి పోషిస్తున్న మేధావులు ఉన్నారు. సిద్దాంతం పేరుతో రాద్దాంతాలను ప్రచారం చేసే రోజులి(అ)వి . మారుతున్న మార్క్సిజం జీవన విధానం గురించి సిద్దాంతం కు ఆచరణ కు మధ్య ఉండాలిసిన సమన్వయం గురించి తెలుపుతూ చెరబండ రాజు దారి పోడుగునా (1985) అనే నవల రాసారు. నల్గొండ జిల్లాలో అన్నమాచార్య సంకీర్తన ప్రచార సమితి లో సభ్యులు గా ఉండి అనేక సమ్మేళనాలను నిర్వహించిన వారు బోయినేపల్లి వెంకటేశ్వర రావు (1955) . వీరు తిప్పర్తి మండలం ఇందుగులకు చెందినవారు. వీరు అందని శిఖరాలు , జీవిత బంధాలు అనే నవలలను రాశారు.10 ఏండ్ల వయసులోనే శివ స్తోత్రం , సీతారామకళ్యాణం వంటి పద్య కవితా రచనలు చేసిన ప్రతిభాశాలి తోట నరసింహ వీర భోగ వసంత రాయ్ (1955). వీరు చండూరు మండలం లో జన్మించారు. వీరు శుభోదయం , రణభేరి కవితా సంపుటాలను , నల్లగొండ జిల్లా చరిత్ర (1989) అలాగే 15 దాకా రచనలు చేసిన వారు. ఇంకా వీరు ఆత్మ బలి (1974) , భగ్న ప్రేమికులు (1975), ఇది ఈ దేశం కథ (1978) , ఢమరు ధ్వని (1983) , మన్నే బంగారం , మగువ తిరగబడితే , జడ్జిమేంట్, ప్రేమ పురాణం వంటి నవలలు రాశారు. వీటిలో ఇది ఈ దేశం కథ చారిత్రక నవల గా చెప్పుకోవచ్చు. ఇది ఐదు భాగాలుగా ప్రచురితమైంది. దీనిలో నల్లగొండ జిల్లా సాంఘిక, ఆర్థిక , దేశ కాల పరిస్థితులు కలవు.సాహితీ మేఖల సభ్యుడిగా నల్గొండ జిల్లా సాహిత్యం లో కృషి చేసిన వారు పున్న అంజయ్య (1961). వీరు చండూరు మండలం లో పరమేశం , రంగమ్మ దంపతులకు జన్మించారు. వీరు విశ్వరూప విమల చరిత్ర శతకం (1981), నల్లగొండ సాహిత్య చరిత్రలను రాశారు. అలాగే రౌడీయిజం అనే నవల కూడా రాసారు. కానీ ఇదీ అముద్రితం.ఎందరో రచయితల గ్రంధాలకు ఆర్థికంగా సహాయం చేసిన వారు మందడి కృష్ణారెడ్డి (1956) . వీరు కనగల్లు మండలం తిమ్మాజి గూడెం కు చెందిన వారు. వీరి వ్యక్తిత్వాన్నీ మెచ్చి కవిరత్న నీలా జంగయ్య గారు తన చారిత్రక గేయ కావ్యమైన చిత్కళ రచనను అంకితం ఇచ్చారు. మందాడి వారు స్వయంగా రచయిత గా మందాడి కథలు తో పాటుగా బానిస అనే నవలను కూడా రాశారు. కానీ ఇది అముద్రితంగా ఉంది.మునుగోడు మండలం గూడపూర్ కు చెందిన వారు నన్నూరి సత్తిరెడ్డి (1963) . వీరు జానపద గేయాలను ఎన్నో సేకరించి జనపది పదాలు , ఎర్ర చుక్కలు , లాలి పాటలు ప్రచురించారు. అలాగే కొడ గట్టిన పల్లెటూరు అనే నవలను రాశారు. వేముల ఎల్లయ్య, వరంగల్ జిల్లాలోని జనగామ తాలూకా, 1973 జూలై 06 లో జన్మించారు. కానీ ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఉంటున్నారు. వీరు కక్క, సిద్ధి, అనే నవలలను రాసారు. మరో రచయిత స్కైబాబా ఆపా అనే నవలను రాశారు.నల్లగొండ జిల్లా నకరికల్లు లో జన్మించిన వారు యం.డి.చైతన్య. వీరి అసలు పేరు మహమ్మద్ అబ్దుల్లా.వీరు 500 దాకా కథలు రాసారు. అలాగే శిథిల గుహలు , సత్యభామా శపథం , రేపటి డైరీ , కాల్లగర్ల్ అనే నవలలు రాసారు. దీనిలో కాల్లగర్ల్ నవల కన్నడం లో కూడా అనువదించబడింది.మరో రచయిత నోముల సత్యనారాయణ చైనా దేశపు నవలను కుటుంబం పేరుతో అనువదించారు.ఇది సృజన పత్రికలో ధారావాహికం గా ప్రచురితం అయ్యింది.మరో రచయిత ఎలికట్టె శంకర్ రావు 2010 లో దేవుని రాజ్యం పేరిట నవలను రాసారు. దీనిలో రైతు సమస్య చిత్రణ కలదు.

భువనగిరి ప్రాంత నవలా రచయితలు
తొలితరం నవల రచయిత్రులలో పేర్కొనదగినవారు శేష భట్టార్ వెంకట రామానుజరావు (1900-44). వీరు మోత్కూరు మండలం దత్తప్పగూడెం కు చెందిన వారు.వీరి తల్లిదండ్రులు కృష్ణమాచార్యులు , రాజమ్మ దంపతులకు జన్మించారు. న్యాయవాది విద్య పై మక్కువ తో ప్లిడర్ వృత్తిని చేపట్టి వివిధ ప్రాంతాలలో మంచి లాయర్ గా పేరుగాంచారు. అనంతరం అధ్యాపకుడిగా మారారు.శేషాద్రి రమణ కవులు రాసిన ఉదయలక్ష్మి (షబ్నవీసుగారి అర్ధాంగి గూర్చి ) పద్య కావ్యం కు పేరడీ గా నిశాలక్ష్మీ గ్రంధం రాసారు. ఇవే కాకుండా అనేక గ్రంధాలు రాసిన వారు. ఇంకా నల్లగొండ జిల్లా చరిత్రను రాశారు. అలాగే ప్రకృతి ని ఇతివృత్తంగా తీసుకుని ప్రాకృత దాంపత్యం అనే నవలను రాశారు. ప్రకృతిని ఈశ్వరుడుగా , భూమి వసుంధర (నాయిక) ఆకాశం విష్ణు పాదుడు (నాయకుడు) పర్వతాలు (వన వాసులు) గా తీసుకుని నవలా రచన చేసారు. అలాగే బహ్రైనూర్ అనే మరో నవల కూడా రాసారు.
1951లో రచనా రచనా వ్యాసంగము కు శ్రీకారం చుట్టి ఇంతింతై వటుడింతై రీతిలో నాటికలు , నవలలు , చరిత్రలు; పరిశోధనలు ,శాసనాలు ఇలా ఎన్నో ప్రక్రియ లలో సాహిత్య సేవ ను చేసినవారు బి.ఎన్.శాస్త్రి (1933) వీరు విష్ణు కుండనీల శాసనాలను వెలికి తీసారు. అన్నింటి కీ మించి వీరు నల్లగొండ , ఆదిలాబాద్ , మహబూబ్ నగర్ జిల్లా సర్వస్వాలను తయారు చేశారు. అలాగే వీరి సంపాదకత్వంలో 1981లో మూసి సాహిత్య పత్రిక ప్రారంభమై ఇప్పటికీ నాణ్యమైన సాహిత్యాన్ని అందిస్తూనే ఉన్నది.బి.ఎన్ శాస్త్రి గారు సంధ్యారాగం, పరివర్తన ,జీవన గమనం , విప్లవ జ్వాల , వాకాటక మహాదేవి, తూక్ఖాదేవి అనే నవలలు రాసారు. దీనిలో తూక్ఖాదేవి నవల కృష్ణదేవరాయల భార్య గురించి రాసింది. అలాగే వాకాటక మహాదేవి విష్ణుకుండనిల కాలపు నవల. ఈ రాజుల చరిత్ర ను తెలంగాణ సంబంధాలను చర్చించిన నవల. ఈ రాజవంశం పై ఉన్న ఏకైక నవల ఇది. వీరి మూడవ నవల విప్లవ జ్వాల. ఇందులో తెలంగాణ సాయుధ పోరాటం గురించి కలదు.భువనగిరి వీరవల్లి లో జన్మించిన రచయిత కుంభం యాదవరెడ్డి (1938) . వీరు హైదరాబాదులోని కేశవ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో హిందీ అధ్యాపకులుగా పనిచేశారు. దిగంబర కవుల లో ఒకరిగా 1965 నుండీ నిఖిలేశ్వర్ గా పేరుపొందారు. ప్రజాసాహితి పత్రిక సంపాదకులుగా పనిచేసిన నిఖిలేశ్వర్ మండుతున్న తరం (1972), ఈనాటికే (1984) వంటి కవితా సంపుటాలను, భారతీయ కవిత (1991) , శతాబ్దాల సాక్షిగా నా మహానగరం (1991)వంటి రచనలు చేశారు. అంతేకాకుండా మరో భారతదేశం అనే నవలను కూడా రాశారు. ఇది హిందీ నుంచి అనువదించబడినది. ముక్తవరం పార్థసారథి (1944) మిణుగురులు అనే 35 కథల సంపుటిని వెలువరించారు. అలాగే నవల రచన కూడా చేసినట్లు తెలుస్తుంది కానీ వివరాలు తెలియగరావు.
కల్లోనికుంట రామన్నపేటలో కృష్ణా రెడ్డి , లక్ష్మమ్మ దంపతులకు జన్మించిన వారు ఏనుగు నరసింహారెడ్డి (1968) వీరు ఉత్తమ కవిగా , ఉత్తమ విమర్శకులుగా పేరు పొందారు. వీరు పల్లె బతుకు , శతక పద్యాలు , ఎన్ కౌంటరు , కొత్త పలక , తెలంగాణ రూబాయిలు వంటి రచనలు చేసారు. అలాగే వీరు విద్యార్థిగా ఉన్నప్పుడే పగిలిన గుండెలు అనే పేరున నవల రాశారు. ఇది నాటి ఒక పత్రిక లో ధారావాహికంగా వచ్చింది.మరో రచయిత తిరునగరి అంజనేయులు సంఘం అనే నవలను రాశారు.ఇది 1948 నాటి తెలంగాణా పరిస్థితులను, పోరాటాలను చిత్రీకరించింది.ఇది రచయిత స్వీయ అనుభవాలకు సంబంధించిన నవలగా చెప్పవచ్చు.మరో రచయిత పెండేం వాసుదేవ రావు నవలా రచయితే కాక రాజకీయ వేత్త కూడా.వీరు మాడపాటి హనుమంత రావు ను అసెంబ్లీ ఎన్నికలలో ఓడించిన వారు. వాసుదేవ రావు గారు రాసిన నవల గుసగుసలు. కానీ ఇది అముద్రితం.

సూర్యపేట ప్రాంత నవలా రచయితలు
తడకమళ్ళ వెంకట కృష్ణారావు (1830) తెలుగులో తొలి నవల రాసిన వారు. వీరు మునగాల మండలం బేతవోలు లో కుట్టెన, వెంకమ్మ దంపతులము జన్మించారు. ఆ తర్వాత కనకమ్మ రామచంద్రయ్య దంపతులకు దత్తతగా వెళ్లారు. తర్వాత మద్రాసు కు వెళ్ళిన తడకమళ్ల తన అవసాన దశలో తిరిగి బేతవోలు కి వచ్చారు. తడకమళ్ళ వారు కామందకము, లీలావతి గణితం, కామరూప చరిత్ర, రామావతార కాల నిర్ణయం వివరణం వంటి రచనలు చేసారు. తెలుగులో మొదటి నవల ఏది అని తీవ్ర చర్చ జరిగినప్పటికీ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి చరిత్ర రచనను ముంగిలిలో ప్రస్తావించడం అలాగే సంగిశెట్టి శ్రీనివాస్ లాంటి పరిశోధకులు ఆధారాలతో తొలి నవలగా వారి రచన పేర్కొనడం . తెలుగులో తొలి నవల గా కంబుకరచరిత్ర గా నిర్ధారణ అయింది. 1866 లోనే తడకమళ్ళ వారి రచనలు కామరూప కథ అలాగే తెలుగు-వెలుగు ముగ్ద కూడా వెలువడాయి.
ఉత్తమ ఉపాధ్యాయ నాయకుడి గా పంచాయతీరాజ్ ఉపాధ్యాయ దినపత్రికను నడిపిన వారు కొల్లు మధుసూదన్రావు (1914). వీరు మునగాల మండలం జగన్నాథపురం లో జన్మించారు. వీరు బాల నాటికలు(1980), స్వప్న జీవులు(నాటిక) లను రాసారు. అలాగే 1988 లో రాష్ర్టస్థాయి ఉత్తమ అధ్యాపకులుగా , 1992 లో జాతీయ ఉత్తమ అధ్యాపకులు గా పేరొందారు.అలాగే వీరు శిక్ష అనే నవలను కూడా రాశారు.నడిగూడెం మండలం సిరిపురం లో జన్మించిన రచయిత చివలూరు లక్ష్మీనరసింహాచార్యులు (1916). వీరు తెరువరి నాటకం , విక్రాంతి (గీత కావ్యం), స్వప్నవాసవ దత్త (గేయ కావ్యం) వేణుగోపాల శతకం (1988) తో పాటుగా ఎగిరే పళ్ళాలు అనే అముద్రిత నవలను కూడా రాశారు.
తెలంగాణ వారి సంస్కృతి వికాసమును చాటి చెప్పినవి ఆంధ్ర మహాసభలు ఈ సభల చరిత్ర ను గ్రంథస్తం చేస్తూ హైదరాబాద్ సంస్థానం లో రాజకీయ వికాసం ఆంధ్ర మహాసభ అధ్యక్షులు అనే గ్రంధం ను రాసిన వారు కొండపల్లి వెంకట శేషగిరిరావు (1930). వీరు కోదాడ మండలం అనంతగిరి లో జన్మించారు. వీరు శ్రీకృష్ణశతకం,శ్రీ వెంకటేశ్వర శతకం తో పాటుగా చీకటి వెలుగు అనే నవలను రాశారు.అవధాని సూర్యనారాయణ , రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించినవారు , సంస్కృతాంధ్ర భాషల్లో పండితులు గా భాషా వాచస్పతి బిరుదు పొందిన వారు సోమయాజుల లక్ష్మీ నరసింహ శాస్త్రి (1940). వీరు చిలూకూరు మండలం బేతవోలు లో జన్మించారు.వీరు కర్ణ హృదయం (నాటిక) , పిల్లలమర్రి చరిత్ర , నృసింహ కటాక్షం(నాటకం), శారద కటాక్షం తో పాటుగా గిరిజ అనే అముద్రిత చారిత్రక నవలను రాశారు.
దేవులపల్లి క్రిష్ణమూర్తి స్వగ్రామం సూర్యాపేట తాలూకలోని పెన్‌పహాడ్‌ మండలం అనంతార గ్రామం. దేవులపల్లి పెద్ద నర్సింహా, రాములమ్మ దంపతులకు 1940 జూన్‌ 14న జన్మించారు. ఆయనకు ముగ్గురు సంతానం. 1998లో తహశీల్దార్‌గా ఉద్యోగ విరమణ చేశారు.

దేవులపల్లి కృష్ణమూర్తి విద్యాభ్యాసం సూర్యాపేటలో జరిగింది. 1958లో హెచ్‌ఎస్‌ పూర్తి చేశారు. నల్లగొండ సాయంత్రం కాలేజ్‌లో 1968లో బీఎ పూర్తిచేశారు. 1960లో ఎల్‌డిసిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. 1984లో ప్రమోషన్‌పై మోతె మండలంలో తహశీల్దార్‌గా పనిచేశారు. అక్కడి నుండి సంస్థాన్‌నారాయణపురం, హాలియా, మేళ్లచెర్వు, మర్రిగూడ, వేములపల్లి మండలాల్లో పనిచేసి 1998లో ఉద్యోగ విరమణ పొందారు. తాను విన్నవి కన్నవి భద్రపరచాలనే ఆలోచనలతో 2009 నుండి రచనలు ప్రారంభించారు. గ్రామీణ వాతావరణం, ప్రజల జీవన స్థితిగతులపై 2009లో ఊరు వాడ బ్రతుకు(నవల) రచించారు. 2013లో సంచార జాతులకు సంబంధించి బయటి గుడిసెలు(నవల), మరో రచయిత జాత శ్రీ (1943). వీరు మంఠంపల్లి మండలం గుండ్లపల్లి గ్రామం కు చెందినవారు. వీరు కపోతం , చలివెంద్రం,ప్రభంజనం వంటి కథల సంపుటాలతో పాటుగా నవలా రచన కూడా చేసినట్లు తెలుస్తుంది.
ఆంధ్రప్రభ , సాహితీ మిత్ర, ప్రజాపోరాటం వంటి పత్రికలలో రచనలు చేసిన వ్యక్తి ముడుంబై పురుషోత్తమాచార్యులు (1948). వీరు హుజూర్నగర్ లో జన్మించారు. నీడలేని చెట్టు అనే అముద్రిత నవలను రాశారు. అలాగే మల్లాది వసుంధర దేవి గారి నరమేధం అనే నవలను నాటకంగా రాశారు. ఇదీ 1985లో రేడియో నాటకంగా ప్రసారం అయ్యింది.సూర్యాపేటకు చెందిన వనం సావిత్రి నాథ్ గారు హిందీ భాషకు గాను సాహిత్య రత్న అనే అవార్డు పొందినవారు. వీరు సుమహారం (1992) అనే కవితా సంపుటిని రచించారు.దీనితో పాటుగా పెద్ద కథ అయినా ఒక నవలికను రాసినట్లు తెలుస్తోంది.

ఇంకా మరికోందరు
బంకించంద్రుని అనువాద నవల అయిన కృష్ణకాంతుని మరణశాసనం (1910) రచనను అదే పేరుతో తెలుగులో అనువదించిన వారు చిల్లరిగే శ్రీనివాసరావు. ఈ నవల ఒరియా,కన్నడ భాషల్లో అనువాదం అయింది.దీనిని వెంకట పార్వతీశ్వర కవులు కూడా తెలుగులో అనువదించారు.బంకించంద్రుని మరో నవల శైవలిని కూడా చిల్లరిగే శ్రీనివాసరావు అనువదించారు. దీనిని శైవలిని చంద్రశేఖరం పేరుతో తల్లాప్రగడ సూర్యనారాయణ గారు కూడా అనువదించారు. ఇవే కాకుండా చిల్లరిగే శ్రీనివాసరావు అభాగిని , ఛద్మవేషి (1924), శ్రీధర విజయం వంటి నవలలను కూడా రాశారు. ఇవ్వన్నీ కూడా అనువాదాలే. మరో రచయిత ఊటకూరు సత్యనారాయణ శశికళ అనే నవలను, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి జర్మనీ యుద్దం నవలను, వనం నరసింహ రావు షర్మిలాబాయి అనే నవలలను రచించారు.ఇంకా 1996 లో కందిమళ్ళ ప్రతాప రెడ్డి బందూక్ అనే నవల ను రాసారు. వీరు నల్లగొండ జొన్నల గడ్డ ప్రాంతం కు చెందిన వారు. బందూక్ నవల నల్లగొండ సాయుధ పోరాట విశేషాలకు సంభందించినది.అలాగే కందిమళ్ళ ఇతర నవలలు ఖానూన్ , చేగువేరా , భగత్ సింగ్ లు. వీరి రచన పై తెలంగాణ సాయుధ పోరాటం బందూక్ నవల (2009) ఆనీ డా.వింధ్యావాసిని ఉస్మానియా యూనివర్సిటీ లో పరిశోధన పత్రం సమర్పించారు.

ముగింపు
తెలంగాణ ఏర్పడిన తరువాత అస్తిత్వవాదం తో తెలుగు సాహిత్యం సాగుతుంది. ఇలాంటి సమయం లో మన సాహిత్యం ను మనం మననం చేసుకోవడం ఎంతైనా వుంది. నల్లగొండ జిల్లా అనే కాదు ఏ జిల్లా సాహిత్యం అయిన విమర్శల వల్ల , పరిశోధన ల వల్ల మరింత రాటు దేలగలదు. అలాగే మరుగుపడిన ఎంతో మంది సాహితీ వేత్తలు బయట కు రాగలరు. నల్లగొండ నవలా విషయం కు వస్తే ప్రస్తుతం నల్లగొండ జిల్లా నవలా సాహిత్యం పై ఉస్మానియా యూనివర్సిటీ లో ఎం.సైదులు పరిశోధన చేస్తున్నారు. చివరగా నల్లగొండ జిల్లా లో రచయిత లకు కొదవ లేదు. కావాలిసిందల్లా కాసింత ప్రోత్సహం , గుర్తింపు. ఈ జిల్లా పై ఇంకా ప్రత్యేకం గా పరిశ్రమ చెస్తే ఎందరో కవులు రచయితలు , అనేక సాహిత్య విశేషాలు బయటకు రాగలవనీ తెలియచేసుకుంటూ…….

ఐ.చిదానందం తెలుగు బాషోపాధ్యాయులు తెలుగు రీసేర్చి స్కాలర్

సంప్రదించిన గ్రంథాలు

  • తెలంగాణ నవలా సాహిత్యం – సం.టి.శ్రీ రంగ స్వామి
  • నల్లగొండ జిల్లా కవులు-పండితులు – డా.శ్రీ రంగాచార్య
  • తెలంగాణ సాహిత్య చరిత్ర – సం.డా.జి.బాల శ్రీనివాసమూర్తి