Online Classes Dr.BVS PRASAD గారి అభిప్రాయం

Dr. BVS PRASAD

Online Classes


Dr. BVS PRASAD గారి అభిప్రాయం

ఆన్లైన్ టీచింగ్ మంచిదా?. కాదా?? … అనే విషయం మీద ప్రముఖ చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డాక్టర్ బి.వి.ఎస్. ప్రసాద్ గారి అభిప్రాయం.
1.గంటలు గంటలు చెవి లో ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవటం వలన … బయటి చెవి లో ఉండే మృదు లాస్తి ఎముక దెబ్బ తింటుంది.
2.నిదానంగా వినికిడి లోపాలు మొదలవుతాయి … ఎందుకంటే శబ్దం కర్ణభేరికి దగ్గర గా రిలీజ్ అవుతోంది కాబట్టి … మరీ ముఖ్యంగా చిన్న పిల్లల్లో …
3.ఎప్పుడైతే సౌండ్ అడ్జస్ట్ కాదో … కాన్సన్ట్రేషన్ దెబ్బ తింటుంది … చిన్న చిన్నగా తలకాయ నొప్పి వస్తుంది.
4.తల నొప్పి ఎక్కువైతే కళ్ళు తిరగడం … చూపు లో తేడా రావడం … దానితో ఒక్క సారిగా కోపం, చిరాకు, ఆందోళన, అసహనం మొదలవుతాయి … ఇవన్నీ ‘ మైగ్రైన్ ‘ లక్షణాలు …
5.కొంతమందికి వారికి తెలియకుండా లోపలి జలుబు ఉందనుకోండి … దాని మీద ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవటం వలన … చెవి సెన్సిటివ్ అయి … నొప్పి మొదలవుతుంది.
6.చెవి సమస్య లు ఉన్న వారు … ఇయర్ ప్లగ్స్ వాడకూడదు.
ఇవీ స్థూలంగా …
ఇక జనరల్గా …
1.కంటి చూపు తగ్గుతుంది.
2.మైగ్రైన్ … మొదలవుతుంది.
3.టీచర్ … స్టూడెంట్ ఇంటరాక్టివ్ సెషన్ ఉండదు … ఉదాహరణకు ఒక డాక్టర్ చెయ్యి పట్టుకోకుండా … ఫోన్లో ట్రీట్ మెంట్ చెబితే … దీన్నే టెలీమెడిసిన్ అంటారు … ఇందులో రోగి సంతృప్తి చెందలేడో … ఆన్లైన్ టీచింగ్ కూడా అంతే. ఆన్లైన్ టీచింగ్ కేవలం ప్రొఫెషనల్ కోర్స్ చదవే వారికి మాత్రం ఉపయోగ పడుతుంది … ఎందుకంటే వారికి మెచ్యూరిటీ లెవల్స్ బాగా ఉంటాయి కాబట్టి.

చిన్న పిల్లల కు ఆన్లైన్ టీచింగ్ మంచిది కాదు … వాళ్ళను బెత్తం పట్టుకొని క్లాస్ లో కూర్చోబెట్టి లెసన్ చెప్పడమే కొంచెం కష్టం గానే ఉంటే ఒక్కడినే లాప్ టాప్ ముందు కూర్చో బెట్ట గలమా … ఎగ్జామ్స్ నిర్వహించగలమా … అదే క్లాస్ లో అయితే జరుగుతోంది. ఇంకొకటి ఏ వయసు వారికైతే ఒక 45 నిమిషాలు క్రమశిక్షణ గా కూర్చో గల శక్తి ఉంటుందో … వారికి ఈ సదుపాయం ఒకే … నాకు తెలిసినంత వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు లేక ఆ పై చదువులు చదివేవారు మాత్రమే సరిపోతారు.తర్వాత లాప్టాప్ కొనడం, నెట్ యూసేజ్, వైఫై సౌకర్యాలు కల్పించడం కొంచెం కష్టం కాక పోయినా … ఒక ఉదాహరణ … గుర్రాన్ని తొట్టి వరకు తీసుకెళ్ళగలం … కాని బలవంతంగా తాగించలేముగా … ఇది కూడా అంతే … 👍🏼💐
గత రెండు రోజుల నుంచి పేపర్లలలో “ఆన్ లైన్ క్లాసుల” గురించి ఎక్కువగా వార్తలు కనబడుతున్నాయి. ఆరోగ్యరీత్యా చెవులకు..కండ్లకు చాలా ఇబ్బందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.తొమ్మిదో తరగతి చదివే అమ్మాయిని ఆన్ లైన్లో విసిగిస్తుస్తున్నారని వారి మీద కంప్లైంట్ నమోదు చేసినట్టు వార్త.

సంబంధిత స్కూల్ నుంచి..కాలేజి నుంచి ఫోన్లో సమాచారం “మీ అబ్బాయి లేదా అమ్మాయి ఈ రోజు రెండు క్లాసులు వినలేదు.మీరు శ్రద్ధ తీసుకోవాలి.ఆన్ లైన్ పరీక్షలు మిస్ కావొద్దు”.
వారేమో టీచర్లని..లెక్చర్లనీ ఖాళీగా కూర్చో పెట్టి జీతాలు ఎందుకు ఇవ్వాలని..ఆన్ లైన్ క్లాసులు.


ఆన్ లైన్ పాఠం వినాలంటే…
ఇంట్లో సిస్టం లేదా లాప్ టాప్ ఉండాలి.కనీసం స్మార్ట్ ఫోన్ అయినా ఉండాలి.ఇవి రెండూ ఉంటే సరిపోదు.ఇంట్లో వైఫై కనెక్షన్ ఉండాలి.లేదా సరిపోయినంత డేటా రీచార్జ్ చేసుకోవాలి.
రోజుకు 2 జీబి లేదా 3 జీబి డేటా ఖర్చవుతుంది.రిఛార్జ్ చేయాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది.
పిల్లలు లెసన్స్ వింటున్నారా?

తమకు నచ్చిన పాటలు వింటున్నారా??

ఎవరూ చూడకుండా వేరే బొమ్మలు చూస్తున్నారా???

ఈ ప్రశ్నలు ప్రతి తల్లి తండ్రిలోనూ కలగడం సహజం…పనులన్నీ మానుకొని వారి వెంట తిరుగుతూ ఉండటం అసాధ్యం.పెద్దవారు ఏదో పని మీద బయటకు వెళుతుంటారు.ఒకవేళ ఖాళీగా ఉండి వారినే చూస్తుంటే అదో సమస్య…కొన్ని చెప్పుకుంటే బాగుండదు.
ఆన్ లైన్ పరీక్షలదో ప్రహసనం….
“నాన్న నాకు హెల్త్ బాగాలేదు.ఈ రోజు ఆన్ లైన్ పరీక్ష రాయను. వాళ్ళు నీకే ఫోన్ చేస్తారు.ఇదే విషయం చెప్పు”అది ఆర్డరో..రిక్వెస్టో అర్థమై చావదు. పిల్లల మీద ప్రేమ వాళ్ళు ఏమి చెప్పినా సరే అనవలసిందే…

పిల్లలకు కావలిసిన టెక్స్ట్ బుక్స్ కొనిస్తే వారే చదువుకుంటారు.ఎలా చదవాలో…ఏవి ముఖ్యమనవో అప్పుడప్పుడు సలహాలు ఇస్తే బాగుంటుంది.కానీ ఇలాంటి ఆలోచన పాఠశాలల ..కళాశాలల యాజమాన్యాలు చేయటం లేదు.

ఒక్కోసారి మనమీద మనకే కోపం వస్తుంది.
కూర గాయల మార్కెట్ దగ్గర తోసుకుంటూ జనం…
మటన్, చికెన్ షాపుల దగ్గర అది ఆదివారమైతే చెప్పనవసరం లేదు…
మందు దుకాణాల దగ్గర..అదో అద్భుతాదృశ్య కావ్యం…
బ్యాంకుల్లో..ఎలైసీ ఆఫీసులో..జనం..జనం…
రోడ్డు మీద బైకులు..కార్లు..బస్సులు..ఒకదానికొకటి పోటీపడి ముందుకు పోతున్నాయి..ఒక్కోసారి తాక్కుంటూ కూడా…
రైళ్లు తిరుగుతున్నాయి..విమానాలు ఎగురుతున్నాయి..వీటన్నింటికీ లేని భయం పాఠశాలలకు..కాలేజీలకు ఉంది.
ప్రభుత్వం కంటే ముందు మనకే భయమెక్కువ…చదువు ఈరోజు కాకపోతే రేపోస్తుంది. కరోన..మరొనా లాంటి జబ్బోస్తే అమ్మో…ఊహించటానికే భయమేస్తోంది.
పిల్లలు చదువులకు వెళ్లకుండా ఇంట్లో ఎప్పుడూ టీవీ చూస్తూంటే…వారి భవిష్యత్తు మీద అల్లుకున్న బంగారు కలలన్నీ ఛిద్రమైనట్టు..గుండెల్లో కెలికేసే బాధ..
“ఆన్ లైన్ క్లాస్ లేదా ఈరోజు”అని పిల్లలను అడగగానే ..రికార్డెడ్ ఆన్సర్ లాగా..”ఇప్పటిదాకా ఆన్ లైన్ క్లాసులు విన్నాను.అనుమానం ఉంటే అమ్మని అడుగు..”అని చెపుతుంటారు.
అమ్మ అస్తమానం తన పనుల్లో మునిగి ఉంటుంది.ఆమెకు పిల్లలు ఆన్ లైన్లో వింటున్నారా.. ..లేదా అని పట్టించుకునే తీరిక ఉందా… ‘వింటున్నారు లెండి’అనే రొటీన్ సమాధానం ఆమె నుంచి వస్తుంది.ఇదే పిల్లలకు కావాల్సింది.అమ్మంటే ప్రొటెక్టీవ్ లేదా సేఫ్ జోన్ లాంటిది.

కేరళలో తొమ్మిదో తరగతి చదివే చిన్నారితల్లి తన ఫ్రెండ్స్ అందరూ ఆన్ లైన్ క్లాసెస్ వింటూంటే తాను మాత్రం స్మార్ట్ ఫోన్ కొనలేక ..డబ్బుల్లేక..అమ్మానాన్నని అడగలేక …అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకుంది గత వారం క్రిందట.
అంత చిన్న వయసులో పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు ఎందుకు అనే ఆలోచన పాఠశాలల యాజమాన్యాలకు..తండ్రులకు ఉండదు.
మాబ్ సైకాలజీ ..తనకు అంత ఇష్టం లేక పోయినా..పక్కవాడు చేస్తున్నాడు కాబట్టి మనం చేయాలి.అంతే.. మనం ఎందులోనూ తక్కువ కాదు…ఈ ధోరణి సర్వత్రా వుంది.
పాఠశాలల..కాలేజీల యాజమాన్యాలు ఒక విషయం పట్టించుకోవటం లేదు.
ఎంతమంది పిల్లలకు ఇంట్లో కంప్యూటర్లు ఉన్నాయి.?
ఎంత మందికి లాప్ టాప్లు ఉన్నాయి?.
ఎంతమందికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి..?
ఒక వేళ కంప్యూటర్లో….లాప్ టాప్లో..స్మార్ట్ ఫోన్లో వున్నా కూడా..వైఫై పెట్టించుకునే స్తోమత వారిలో ఎంత మందికి ఉంది.చాలా తక్కువ మంది మాత్రమే అలా చేస్తున్నారు.
స్మార్ట్ ఫోన్లు వున్నా కూడా రీఛార్జ్ చేయించుకునే వారు ఎంతమంది. రోజుకు కనీసం 3జీబి కావాలంటే నెలకు మూడు వందలు ఖర్చు చేయించాలి.ఇది అందరికీ సాధ్యమా.

“నేను ల్యాపీ లో క్లాస్సెస్ వింటున్నా..”
“నేను సిస్టంలో…”
“నేను స్మార్ట్ ఫోన్ లో”…

మరి పై మూడు సదుపాయాలు లేని వారి సంగతేమిటి.

అలా వినలేక పోతున్న ఆ టీనేజీ పిల్లల మానసిక స్థితి ఏమిటీ…

తక్కువ రేటులో వస్తున్న స్మార్ట్ ఫోన్ కొన్నా.. రీ ఛార్జ్ మాటేమిటీ?

క్లాసులు వింటున్నామని తప్పుడు వీడియోలు చూసి దారి తప్పితే…
ఎవరు భాద్యులు…
చెవులు..కండ్లకు ఆరోగ్య సమస్యలొస్తే…భవిష్యత్తులో ఎంత ఇబ్బంది…
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు..
విజ్ఞులు..పెద్దలు ..అందరూ కూర్చొని ఆలోచించి ఎలా చేస్తే బాగుంటుందో…ముఖ్యంగా పేద పిల్లలకు స్మార్ట్ ఫోన్ సమస్య….రిఛార్జ్ సమస్య…
లేకుండా మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం..


షేరు