తెలుగు మాండలిక కథలస్పూర్తి పాకాల యశోదా రెడ్డి Pakala Yashoda Reddy

తెలుగు మాండలిక కథలస్పూర్తి Pakala Yashoda Reddy

ఐ.చిదానందం


 Pakala Yashoda Reddy

సామాన్య కుటుంబ వాతావరణంలో పెరిగి అసామాన్యమైన కి ఈ స్థాయికి చేరిన వారు,తెలంగాణ భాష పై అమితమైన ప్రేమతో తెలంగాణ భాషలో రచనలు చేసిన వారు, అచ్చ తెలుగు తెలంగాణ ఆడపడుచు పాకాల యశోదా రెడ్డి గారు.వీరు 08 ఆగస్టు 1929 లో జన్మించారు.వీరి తల్లిదండ్రులు సరస్వతమ్మ,కాశీరెడ్డి.యశోదా రెడ్డి ప్రస్తుత నాగర్‌కర్నుల్ జిల్లా,బిజినేపల్లి లో జన్మించారు.

విద్యాభాస్యం :
యశోదారెడ్డి మూడవ తరగతి వరకు మహబూబ్ నగర్ లో, ఉన్నత పాఠశాల విద్యను హైదరాబాద్, నారాయణగూడలోని బాలికల ఉన్నత పాఠశాలలోను పూర్తి చేసారు.రాజబహద్దూర్ వెంకట్రామిరెడ్డి ప్రోత్సాహంతో కళాశాల విద్య కొసాగించి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు, సంస్కృత భాషలలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసారు.


వివాహం :
మా ఊరి ముచ్చట్లు యశోదమ్మ తొలి కథల సంపుటి. దీనిలో తొలికథ గంగిరేగి చెట్టు. ఒక విధంగా చెప్పాలంటే ఇది వీరి ఆత్మకథత్మక కథ. ఈ కథలో పుట్టగానే తల్లిని పోగొట్టుకున ఎచ్చమ్మ , మంచి నక్షత్రంతో పుట్టలేదని తండ్రీ కాశీ రెడ్డి కోపం తో రుక్మిణమ్మ అనే ఆమె కు బిడ్డ ను పెంచుకోమ్మనీ ఇవ్వడం జరిగింది. ఎచ్చమ్మ అచ్చం తండ్రి పోలికలతో ఉంటుంది.కాశీరెడ్డి చెల్లెలు ముత్యాలమ్మ .ఈమె కొడుకు ను మొదట కాశీ రెడ్డి తన రెండవ భార్య కూతురు నీలి కి ఇచ్చి వివాహం చేద్దామని అనుకుంటాడు. కానీ ఎచ్చమ్మ పై అనురాగం పెంచుకుంటున్న కాశిరెడ్డి . ఎచ్చమ్మ కే ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. ఒకసారి ముత్యాలమ్మ కాశీ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు ఎచ్చమ్మ గడగడా ఆంగ్లంలో మాట్లాడటం చూసి ముత్యాలమ్మ కొడుకు రఘునాథ్ రెడ్డి ఆమె దగ్గర అంగ్రేజ్ నేర్చుకోవాలని అనుకుంటాడు. కానీ ఎచ్చమ్మ పెరట్లో ఉన్న పెద్ద గంగిరేగి చెట్టు కాయలు కావాలని షరతు విధించింది. ఆ చెట్టు కాయలు కోసం ఎచ్చమ్మ గోడ ఎక్కింది. ఎచ్చమ్మ గోడ దిగడం కోసం రఘునాథరెడ్డి భుజం మీద కాలు పెట్టి దిగింది. అదీ చూసిన ముత్యాలమ్మ ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఎచ్చమ్మ తన వినేలా లేదనీ అనుకోని కొడుకుని తీసుకుని వెళ్లి పోతుంది. కథలో మేనత్త పాత్రను తన అనుభవంతో చిత్రీకరించింది రచయిత్రి.
నిజ జీవితంలో యశోదారెడ్డి 1947లో కరీంనగర్ జిల్లా మాన కోండూరు సమీపంలో అన్నారం గ్రామంకు చెందిన పాకాల తిరుమల్ రెడ్డి ని ప్రేమ వివాహం చేసుకున్నారు. 1948 లో ఆమెకు పుత్రుడు జన్మించినా విధివశాత్తు 6-నెలల లోపే మరణించాడు.
ఉద్యోగం :
యశోదమ్మ 1955లో హైదరాబాద్, కోఠి మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా ఉద్యోగ జీవితం ప్రాంభించారు. తరువాత రీడర్‌గా, ప్రొఫెసర్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసి, 1989లో పదవీ విరమణ చేసారు.
పదవి భాద్యతలు :
వీరు అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా పనిచేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, లలిత కళా అకాడమీ,సంగీత అకాడమి లలో సభ్యురాలి గా పనిచేశారు. యూనివర్సిటీ అకాడమీ కౌన్సిలర్ మెంబర్ గా , కేంద్ర సాహిత్య అకాడమీ మహావక్త గా ఉన్నారు.

శీర్షిక నిర్వహణ :
1956 లో డెక్కన్ రేడియో ద్వార ఊరబావి ముచ్చట్లు లను మహాలక్ష్మీ ముచ్చట్లు శీర్షికను పత్రికలో నిర్వహించారు. అలాగే పండగలు వచ్చాయి, జెర ఇనుకోవే తల్లి వంటి శీర్షికలను రేడియోలలో నిర్వహించారు.రమారమి 200కు పైగా ఆకాశవాణి ప్రసంగాలు ఇచ్చారు యశోద రెడ్డి.


pakala yashoda reddy వ్యక్తిత్వం :
యశోదారెడ్డి చిన్నతనం నుంచి స్వతంత్ర భావాలు కలిగిన స్త్రీ . వీరికి రకరకాల ఇత్తడి విగ్రహాలను సేకరించే హాబీ కలిగి ఉండేవారట. ప్రముఖ నటి స్వర్గీయ భానుమతి వీరికీ మంచి స్నేహితురాలు.ఈమె యశోద రెడ్డి ని తెలంగాణ పిల్ల పిలిచేవారట. ఒకసారి విశ్వనాధ సత్యనారాయణ గారు కి యశోదా రెడ్డి గారికి మధ్య ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. తెలంగాణ ప్రజలు గోంగూర ను పుంటికూర అని పిలుస్తారు. ఈ పుంటి కూర పదం వినగానే పుండు స్పురణకు వస్తుందని విశ్వనాథవారు ఎగతాళి చేస్తే వెంటనే దానికి సమాధానం గా గోంగూర అనగానే గోకుడు గుర్తుకు వస్తుందని సమాధానం ఇచ్చారట ఇలా యశోద రెడ్డి తన అభిప్రాయాలను నిక్కచ్చిగా ధైర్యంగా చెప్పేవారు.


వీరి రచనలు :
కవితా సంపుటాలు

 • ఉగాదికి ఊయల (1976)
 • భావిక (1976)

కథలసంపుటాలు :

 • మా ఊరి ముచ్చట్లు (1972)
 • ధర్మశాల (1999)
 • ఎచ్చమ్మ కథలు (2000)
 • కర్మ కథల సంపుటి
  పరిశోధన రచనలు
 • తెలుగులో హరివంశాలు (1973-సిద్ధాంతవ్యాసం)
 • భారతం లో స్త్రీ (1990 )
 • “పారిజాతాపహరణం పర్యాలోచన(1973)
 • కథా చరిత్ర (1989)
 • ఆంధ్ర సాహిత్య వికాసం(1974 )
 • ఎర్రప్రెగడ (1972)
  సంపాదకత్వం
 • కావ్యానుశీలనం (డా.కులశేఖర్ రావు తో కలిసి)
 • చిరు గజ్జెలు (వట్టికోట సినారెతో కలిసి)
 • ఆంధ్ర క్రియా స్వరూప దీపిక
 • తెలుగు సామెతలు
  ఇతరములు
 • నేమాని భైరవకవి హరివంశం ఉత్తర భాగం
 • ప్రబంధ వాఙ్మయం (1976)
  *శతక వాఙ్మయము (1980)
 • భారతీయ చిత్ర కళ

కథలు,నవలలు ఒక పరిశీలన :

ఉద్యోగరీత్యా ఆధునికంగా ఎంత ఎదిగినా తెలంగాణపై మాత్రం మాత్రం విస్మరించలేదు యశోదారెడ్డి గారు.తెలంగాణ నుడికారంతో కథలు రాసారు. అలా రాయమని తొలుత ఆమెనూ బెజవాడ గోపాలరెడ్డి రామచంద్ర గార్లు ప్రోత్సహించే వారట.అందుకనే వీరి కథలలో ఉపమానాలు, మాండలిక భాష, నూతన పద ప్రయోగాలు ఎక్కువగా ఉంటాయి.1951లో వచ్చిన విచ్చిన తామర అనే కథ యశోద రెడ్డి తొలి కథ ఇది నాటి సుజాత పత్రికలో ముద్రించబడింది.

మావూరి ముచ్చట్లు కథలసంపుటి :
ఊరబావి ముచ్చట్లు పేరిట ఆకాశవాణి లా చేసిన ప్రసంగాలను యశోదారెడ్డి 1973లో మావూరి ముచ్చట్లు గా కథ సంకలనం తెచ్చారు. ఎచ్చమ్మ అక్కకు రాసే ఉత్తర విషయాలే ఈ కథల సంపుటిలో కలవు. ఈ సంపుటి లో మొత్తంగా పది కథలు కలవు.ఇది గ్రామీణ పరిసరాల అందాలను ప్రకృతి చిత్రం పెట్టింది దీనిలో తొలికథ గంగిరేగి చెట్టు. మరో మ్యానరికం అనే కథలో మేనరికం పేరిట బాల్యవివాహాలు చేయడాన్ని రచయిత్రి వ్యతిరేకించారు. మేనరికం వలన బాల్యంలోనే పెళ్లిళ్లు నిర్ణయించడమును యశోదారెడ్డి ఖండించారు. అలాగే దీనిలో నాగి,పీర్ల పండుగ,మొమ్మేకత,జతగాళ్లు,మా పంతులు,ఎంకన్న,మురారి వంటి కథలు కలవు.


ధర్మశాల కథల సంపుటి :
ధర్మశాల (1999) కథల సంపుటి వ్యవహారిక భాషలో వ్రాయబడింది.దీనిలో ఎక్కువగా ప్రేమకు,కులాంతర వివాహానికి,సామాజిక విషయాలను ఎక్కువగా చర్చించారు.మొదటి కథ ధర్మశాల. దీనిలో గణపతి అనే వ్యక్తి ఇంట్లోకి రావడం నలుగురు వ్యక్తులు చేరడం. వారి వ్యక్తిత్వంను రచయిత్రి చిత్రీకరించారు. కథలో రైతు కుటుంబం కు చెందినవారు రామయ్య సీతమ్మలు.వీరి కుమార్తె వెన్నెల. మరో కుటుంబం నాయుడు గారి అర్ధాంగి తాయారమ్మ ఇంకా రామశాస్త్రి గారి ఇల్లాలు వెంకటమ్మ వీరి కుమారుడు చంద్రశేఖరశాస్త్రి, మరో కుటుంబం గవర్నమెంట్ ఉద్యోగి పరమేశం గారి సతీమణి. ఆ నాలుగు కుటుంబాలు నాలుగు రకాల ఆచార వ్యవహారాలు,ఆర్థిక అవసరాల తీరునుబట్టి వేర్వేరు సంప్రదాయాలను కలిగి ఉన్నాయి.దీనిలో వెన్నెలను పెళ్లి చేసుకోవాలనీ చంద్రశేఖరశాస్త్రి అనుకుంటాడు.కానీ వెన్నెల తల్లిదండ్రులు ఒప్పుకోరు. రైతు కుటుంబం ను బ్రహ్మణ కుటుంబం ఎలా ఆమోదించింది అనేది ఇతివృత్తం.
దార కథలో నాయకుడు శరత్ నాయిక సుభద్ర. దీనిలో దార సుభద్ర కుక్క పేరు. శరత్ కుక్క పేరు మారేల్.అటూ జంతువుల మధ్య ఇటు మనుషుల మధ్య ఒకే రకమైన ప్రేమ ప్రభావం చూపుతుందని చెప్పే కథ ఇది. మరో కథ నిప్పుతో చెలగాటం దీనిలో చంద్రిక శ్రీనివాసరావులు అద్దే కోంపలో ఉంటూ అవస్థపడే తీరును చెప్పారు. మరో కథ అక్కాయ్ చేసిన పెళ్లి.దీనిలో బాగా బతికి చెడిన కుటుంబంలోని దంపతులు రామారావు,శారదలు.వీరుకుండ మార్పిడి వివాహాలు ద్వారా తమ ఆర్దిక పరిస్థితి ఎలా సర్ఢుబాటు చేసుకున్నారో రచయిత్రి చెప్పడం జరిగింది.ఒక రకం గా సమాజం కు ఇలాంటి వివాహాల పై ఒక సూచన ఇచ్చారు యశోదా రెడ్డి. రంగడి ప్రయోజకత్వం కథలో అమాయకుడైన రంగడిని ఎలా ప్రయోజకుడిగా చేయొచ్చు చెప్పారు. గుళ్ళో గంటలు కథలో కురువల పెళ్లి వేడుకల్లో జరిగే తక్కెడ గుండు సంప్రదాయాన్ని వివరించారు రచయిత్రి. తీయ్యటి తీగలు కథలో అరుణ పాత్ర రేడియో కేంద్రానికి రిక్షాలో ప్రయాణించేటప్పుడు రిక్షావాలా తో జరిపిన సంభాషణ అంశాలే ఇతివృత్తం. సీతమ్మగారి సీమ ప్రయాణం,కల కల్ల కాలేదు కథలు స్వప్న ఆధారిత కథలు. మరోకథ సంకుదేముడులో కోయ జాతులలో జరిగిన ఆచారాలను తెలిపె కథ.ఊరు అవతలి బావి కథ ద్వారా దిగువ వారిని చూసే తక్కువ తనపు చూపు పోవాలనీ రచయిత్రి ఆశిస్తారు. సౌభాగ్యవతి కథలో సమాజంకు, కుటుంబం కు మధ్య నలిగి తనువు చాలించిన స్త్రీ ఇతివృత్తం ను తెలిపారు.దీనిలో చివరి కథ మాధవిలత నవ్వింది.శీర్షిక చూడగానే స్త్రీ నవ్వడం లో అర్దమేమిటి ఎందుకు నవ్వింది అనే ఆలోచన అందరిలో కలుగుతుంది. శేఖర్ కథా రచయిత పాత్ర . ఈ కథలో భార్యాభర్తలు తమ సొంత వ్యక్తిత్వంను నిలుపుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ కథ ఇతివృత్తం.దీనిలో ఇతర కథలు ప్రమీల,దిబ్బరొట్టె,సంధి,పేరులో ఏముంది,ఎదల్లోని పోరలు,అందిన కందిరీగ మొదలైనవి.


ఎచ్చమ్మ కథలు సంపుటి :
యశోద రెడ్డి గారిని వారి ఊరి వాళ్ళు యశా , ఎచ్చమ్మ అనీ పిలిచేవారట.అందుకే రచయిత్రి ఆ పేరుతోనే ఎచ్చమ్మ కథలు రచించారు.దీనిలో 20 కథలు కలవు. ఇవన్నీ సామాజిక పరిణామాలతో పాటు మనుషుల ప్రవర్తనను చెప్పినవి. ఈ కథను సుధర్మ పబ్లికేషన్ వారు ప్రచురించారు.
“చెంపా చెంప,చేయి చేయి కల్సి అంత సంబురం తట్టుకోలేక కడలయ్యా తడలు మిన్ను ముట్టినయ్ ” ఇదీ ఎచ్చమ్మ కథలులోని తొలి కథ మోనా లోనిది. ఇలా వీరి కథలలోని భాషను చదువుతే ఒక మాండలిక భాష పదకోశం నే తయారు చేయవచ్చు.మరో కథ జమ్మి లో పల్లెటూరులో దసరా పండుగను వాతవరణ నేపథ్యంను అప్పుడు ఉండే తగాదాలను రచయిత్రి చెప్పారు.ఆనాటి పల్లెల్లో దోరసాండ్ల కు పొగరు,అసూయ ఎలా ఉండేదో చెప్పిన కథ కాలం చెప్పిన తీర్పు . ఈ కథలో దోరసాని పాపవ్వ. మరో కథలో కూతురు కోసం తన అంతస్తుకు మించిన సంబంధం తెచ్చాడు తండ్రి. చివర్లో కట్నం తక్కువ అయి పెండ్లి ఆగిపోయింది. కానీ తిరిగి సంవత్సరం తర్వాత పాత పెళ్లి కొడుకే మామ దగ్గరికి రావడం ఆ పిల్లనే పెండ్లి చేసుకుంటాడు. నిజంగా ప్రేమిస్తే తప్పకుండా అంతస్తులు చూడరనీ ఈ కథ తెలుపుతుంది.మరో కథ మా వూరి ముచ్చట్లు పెద్ద కథలో వచ్చిన వూరి కి వచ్చిన జానపద కళాకారులను వారి కళలను చెబుతూ ఒక ప్రేమ కథను కూడా నింపారు రచయిత్రి. వయస్సు ఎగిసిపడ్డ రాములు ఈనాడు ఎందుకు పనికి రాని సిల్లిపోయిన పాత బోక్కేవోలే రాములు ఈనాడు ఎందుకు పనికి రాని అయిపోయిన అంటూ మాండలిక భాషలో మిఠాయి రాములు కథలో రాశారు.


వీరి ప్రత్యేకతలు :
ఆకాశవాణిలో తెలంగాణ మాండలికంలో తొలి రచయిత్రి యశోద రెడ్డి గారు. కల్పన కలం పేరు గల యశోద రెడ్డి పాలమూరు మాండలికంలో రచనలు చేసిన తొలి కథకురాలు. అంతేకాదు మలేషియాలో జరిగిన తెలుగు కవి సమ్మేళనంలో పాల్గొన కవయిత్రీ. రేడియో లో పిల్లల నాటికలను ప్రారంభించిన గణత కూడా వీరిదే. ఇంకా అధికార భాషా సంఘం చైర్మన్ పదవిని అధిష్టించిన ఏకైక మహిళ యశోదా రెడ్డి గారే.


పురస్కారాలు :
యశోదారెడ్డి గారికి ఆంధ్ర సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి అవార్డు,సుశీల నారాయణ రెడ్డి అవార్డు,నాళం కృష్ణారావు అవార్డు ,సురవరం ప్రతాప్ రెడ్డి అవార్డు వంటి పురస్కారాలు అందుకున్నారు.
అంతే కాదు తెలంగాణ రాష్ర్టం అవతరణ అనంతరం వీరి పేరిట అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. పాకాల యశోదా రెడ్డి పురస్కారం ను 2017 లో రావి ప్రేమలతకు, 2018లో అనిశెట్టి రజితకు ,మరియు డాక్టర్ పి.వసుంధర రెడ్డి గారికి ప్రధానం చేయడం జరిగింది.


పరిశోధన
వీరి పై డాక్టర్ పాకాల యశోదరెడ్డి కథలు-సమగ్ర పరిశీలన (2007) పేరిట ఆడువాల సుజాత గారు పరిశోధించారు.

కథ చెప్పడం అంటే కల్పనలు అల్లడం కాదని నిరూపించిన రచయిత్రి పాకాల యశోదా రెడ్డి. వాస్తవికని నమ్మి ఎన్నో కథలు రాశారు.యశోదారెడ్డి వంద కు పైగా కథలు రాశారు కానీ పుస్తకరూపంలో 63 మాత్రమే వచ్చాయి.వీరి కథలు కొన్నిటిని ఎంపిక చేసి నేషనల్ ట్రస్ట్ వారు పుస్తకంగా వేశారు. వీరి కథలు మనుషుల పట్ల ప్రేమ ను చెప్పే గంభీరమైన కథలు. ఇంతటి గొప్ప విదుషిమణీ 2009 లో మరణించారు.తెలంగాణ కథా రచయిత్రులలో యశోదా రెడ్డి గారి అంతటి ఖ్యాతిని ఎవరు సొంతం చేసుకో లేదనే చెప్పాలి.

ఐ.చిదానందం

తెలుగు బాషోపాధ్యాయులు

తెలుగు రీసేర్చి స్కాలర్

సంప్రదించి రచనలు

 • పి.యశోదా రెడ్డి కథలు (వ్యాసం) – ఎస్.స్పందన
 • తెలంగాణ భాషోద్యమ యోధ పాకాల యశోదారెడ్డి (వ్యాసం)-అనిశేట్టి రజిత
 • యశోదా రెడ్డి కథలు మధుర రస గుళికలు (వ్యాసం)-కోలిపాక శోభారాణి