plasma therapy పై కరోనా రోగులకు చిగురించిన ఆశలు

కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ని కనిపెట్టడానికి ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వ్యాధిని నియంత్రించడానికి యాంటీవైరల్ డ్రగ్స్ కూడా అందుబాటులో లేవు. వీటి ఆవిష్కారానికి మరింత సమయం పట్టవచ్చు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో “plasma therapy” ని ప్రయోగాత్మకంగా, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ICMR (Indian Council for medical Research) న్యూఢిల్లీ వారు అనుమతినిచ్చారు. ఈ ప్లాస్మా థెరపీని సైంటిఫిక్ గా “కన్వల్ సెంట్ ప్లాస్మా థెరపీ” అని కూడా అంటారు. దీని గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

మామూలుగా ఏదైనా వ్యాధికి గురైన వ్యక్తి దానిని తట్టుకొని, ఆ వ్యాధి ని జయించి, తిరిగి కోలుకునే క్రమంలో……. ఆ వ్యక్తి లోనికి ప్రవేశించి వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులైన “యాంటీజన్” లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన “యాంటీబాడీలను” వారి రక్తంలో శరీరం తనకు తానుగానే తయారు చేసుకుంటుంది. “యాంటిజెన్” లంటే వ్యాధిని కలుగజేసే సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలు, వైరస్ లు. అలాగే “యాంటీబాడీలు” అంటే సూక్ష్మ క్రిములను, బ్యాక్టీరియాలను,వైరస్ లను ఎదుర్కొని నాశనం చేసే శక్తివంతమైన కణాలు. ఈ విషయాన్ని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే! యాంటీజన్ లను పాకిస్తాన్ సైన్యం అనుకుంటే, యాంటీబాడీలను భారత సైన్యం గా భావించవచ్చు. వ్యాధిని అరికట్టే యాంటీబాడీలు శరీరంలో పుష్కలంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. ఒకవేళ యాంటీబాడీలు, యాంటీజన్ లను నియంత్రించ లేకపోతే యాంటీజన్ ల లోడు ఎక్కువై అనారోగ్యానికి లోనవుతారు. ఈ యుద్ధం మనషి శరీరంలో ప్రతిక్షణం జరుగుతూనే ఉంటుంది.

సాధారణంగా రక్తాన్ని రెండు పార్టులుగా విభజించవచ్చు. సాలిడ్ పార్ట్ గా ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్ లెట్స్ ( వీటినే రక్త ఫలకికలు, థ్రాబో సైట్స్ అంటారు) అనుకుంటే, లిక్విడ్ పార్ట్ గా ప్లాస్మా ఉంటుంది. తెల్ల రక్త కణాలను WBC అంటారు. ఇవి శరీరంలోని రక్షణ యంత్రాంగాన్ని నిర్వహిస్తాయి. శరీరంలోకి ప్రవేశించే అనేక రకాల ఇన్ఫెక్షన్స్ ని నాశనం చేస్తాయి. అంటే ఇవి సమాజంలో పోలీసు యంత్రాంగం, రక్షక దళాలు చేసే పనిలాంటిదే. అంటే శత్రువుల బారి నుండి శరీరాన్ని కాపాడుతాయన్న మాట. WBC లో లింఫోసైట్స్, మోనోసైట్స్, బేసోఫిల్స్, ఇసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అనే రకాలు ఉంటాయి. మళ్ళీ లింఫోసైట్స్, T-లింఫోసైట్స్, B- లింఫోసైట్స్ అని 2 రకాలుగా ఉంటాయి. వీటిని పోలీసు మరియు మిలటరీల లోని వివిధ రకాల బెటాలియన్ లు గా పోల్చుకోవచ్చు. వీటి వ్యవస్థ ఎంత సమర్థవంతంగా పని చేస్తుంటే ఆ వ్యక్తి శరీరంలో అంత ఇమ్యూనిటీ స్థాయి గరిష్టంగా పెరిగి ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకినా ఆ వ్యక్తి జబ్బున పడే అవకాశం ఉండదు.

ఇక రక్తంలోని లిక్విడ్ పార్ట్ ప్లాస్మా. దీని లో “ఫైబ్రినోజిన్” అనే ప్రోటీన్ పదార్థం తో పాటుగా వ్యాధిని ఎదుర్కొనే శక్తివంతమైన యాంటీబాడీలు ఈ ప్లాస్మా లోనే ఉంటాయి. ఈ ప్రోటీన్ కారణంగానే తెల్లరక్తకణాల లోని B-లింఫోసైట్సే ఇమ్యూనిటీ కి కొలమానాలైన శక్తివంతమైన యాంటీబాడీలను తయారు చేస్తాయి. వచ్చిన వ్యాధికి తగ్గట్టుగానే యాంటీబాడీలను రూపొందిస్తాయి. జబ్బులు మారే కొద్దీ వాటిని ఎదుర్కొనే యాంటీ బాడీల డిజైన్ కూడా మారుతూనే ఉంటుంది. ఈ ప్రోటీన్ గతంలో ఆ శరీరం ఎదుర్కొన్న అన్నీ జబ్బుల యాంటీబాడీలను కూడా మెమరీ సెల్స్ రూపంలో సేవ్ చేసి ఉంచుతుంది. దీనివలన తిరిగి ఎప్పుడు ఎలాంటి ఇన్ ఫెక్షన్ సోకినా మెమరీ లో సేవ్ చేసుకున్న అలాంటి యాంటీబాడీలనే విడుదల చేసి శరీరాన్ని రక్షిస్తుంది. ఉదాహరణకు: పోలియో ను ఎదుర్కోడానికి పోలియో వైరస్ నే (ఇనాక్టివ్) చుక్కల మందుగా ఇవ్వడం వలన పోలియోను పూర్తిగా రూపు మాపాగలిగారు.అలాగే డిఫ్తీరియా, తట్టు, మరెన్నో వ్యాధులు…. Etc.,

కరోనా ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న వారిలో ఇలాగే తయారైన శక్తివంతమైన యాంటీబాడీలను “ప్లాస్మోఫెరిసిస్”అనే రక్తాన్ని వడకట్టే పరికరం ద్వారా వ్యాధి నుండి బయటపడ్డ వ్యక్తి నుండి ప్లాస్మా ను సేకరించి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఈ ప్లాస్మా ద్రవ రూపంలో లేత పసుపు వర్ణంలో ఉంటుంది. ఫైబ్రినోజిన్ అనే ప్రోటీన్ ను తొలగించిన ప్లాస్మానే సైంటిఫిక్ గా “సీరం” అంటారు. సింపుల్ గా నెత్తురు సొన అని అర్థం చేసుకోవచ్చు.
ఇలా వ్యాధి నుండి సురక్షితంగా బయటపడి, ఇతరులకు సహాయం చేయుటకు సిద్ధంగా ఉన్న వ్యక్తినే దాత అంటారు. ప్రతి దాత నుండి దాదాపుగా 800 మి.లీ వరకు ప్లాస్మాను సేకరించవచ్చు. రక్తదానం చేసేవారు ఒకసారి రక్తదానం చేసిన తర్వాత మరలా రక్తదానం చేయడానికి కనీసం 56 రోజులు ఆగాలి. కాని ప్లాస్మా దానం చేసే వారి రక్తంలో RBC ని తీసుకోరు కాబట్టి దాత వారంలో రెండు,మూడు సార్లు కూడా ఈ ప్లాస్మాను దానం చేయవచ్చు. అయితే ఈ దాత వయస్సు 18-65 సం.ల లోపు లోనే ఉండాలి. అంతేకాకుండా ఈ ప్లాస్మా దాత కు హెచ్ఐవి, సిఫిలిస్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, లాంటి వ్యాధులు ఉండకూడదు. దాంతో రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కనీసం 10గ్రాముల పైన, సరైన బరువుతో ఆరోగ్యంగా ఉండాలి. కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండా 15 రోజుల పూర్తైన తర్వాతే ఈ ప్లాస్మాను సేకరించాలి. ఇలా సేకరించిన ప్లాస్మా ను ఒక్కొక్కరికి 200 Ml చొప్పున దాదాపుగా ఇద్దరి నుండి నలుగురు గ్రహీతల వరకూ కూడా సమకూర్చవచ్చు. ఇలా దాతల నుంచి సేకరించిన ప్లాస్మాను ల్యాబ్ లో ప్రత్యేక పరిస్థితులలో -30 డిగ్రీ సెంటీ గ్రేడ్ వద్ద ఒక సంవత్సరం వరకూ నిలువ చేయవచ్చు.

ఈ థెరపీ ని మొదటిసారిగా జర్మనీ లో పిల్లల్లో డిఫ్తీరియా వ్యాధి నియంత్రణకు 1890 లో అడాల్ఫ్ బేహరింగ్ ఈ పద్ధతిని ఉపయోగించాడు.1918 లో స్పానిష్ ఫ్లూ కి, 1930 లో మీసిల్స్, 2002 లో SARS, 2009 లో H1N1, 2014లో EBOLA, 2015 MERS వ్యాధులకు ఈ థెరపీ ని ఉపయోగించారు. సాధారణంగా డెంగ్యు ఫీవర్ వచ్చినప్పుడు కూడా ప్లేట్లేట్ కౌంట్ పూర్తిగా తగ్గిపోయినప్పుడు మార్పిడి చేసే ప్లాస్మా ఎక్స్చేంజ్ కూడా ఈ ప్లాస్మాథెరపీ వంటిదేనని చెప్పుకోవచ్చు.

plasma therapy

ఈ కన్వల్ సెంట్ ప్లాస్మా థెరపీ వలన గ్రహీతలోకి వచ్చే ఇమ్యూనిటీని “ఆర్టిఫిషియల్ పాసివ్ ఇమ్యూనిటీ” అంటారు. ఈ విధంగా లభించిన పాసివ్ ఇమ్యూనిటీ వలన కరోనా పేషెంట్ రికవరీ వేగంగా జరుగుతుంది కానీ ఇది యాక్టివ్ ఇమ్యూనిటీ లా పని చేయలేదు. తనకు తానుగా వ్యాధిని తట్టుకొని నిలబడిన వారికే శక్తివంతమైన యాంటీబాడీలు పెరిగి యాక్టివ్ ఇమ్యూనిటీ ని కలిగి ఉంటారు. ఇలా పాసివ్ ఇమ్యూనిటీ పొందిన వ్యక్తి తిరిగి కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. ఈ పాసివ్ ఇమ్యూనిటీ తాత్కాలికమైనది. కానీ యాక్టివ్ ఇమ్యూనిటీ పెంపొందిన వ్యక్తికి రెండవ సారి ఒక వేళ కరోనా సోకిన ఆ వైరస్ ని తట్టుకునే శక్తి పెరుగుతుంది. అంత త్వరగా అనారోగ్యానికి గురికాలేరూ. దీనికి కారణం తనలో పెరిగిన యాక్టివ్ ఇమ్యూనిటీనే.

plasma therapy

ఈ కన్వల్ సెంట్ “plasma therapy” , పాసివ్ ఇమ్యూనిటీని మాత్రమే కలిగిస్తుంది. ఒక ప్రాంతం వారి ప్లాస్మా మరొక ప్రాంతం వారికి ఉపయోగపడదు. ఈ థెరపీ ప్లాస్మా ఎక్స్చేంజ్ కి, ప్లాస్మా ఇచ్చే దాత కు, గ్రహీతకు దాదాపు గా 100 కి.మీ రేడియస్ లోపల ఉన్నవారికే మెరుగైన ఫలితాలను ఇస్తుంది. అంటే హైదరాబాదులో ఉన్నవారి ప్లాస్మా విజయవాడ వారికి పనికి రాకపోవచ్చు. దీనికి కారణం వైరస్ ప్రాంతాన్ని బట్టి కొన్ని మార్పులకు లోనవుతుంది. అలాగే ఈ ప్లాస్మా థెరపీ కీ అందరూ ఒకేలా స్పందించకపోవచ్చు. మరియు దాత స్వచ్ఛందంగా ఈ ప్లాస్మోఫెరిసిస్ ల్యాబ్ కు రావాల్సి ఉంటుంది. దీనికి రెండు నుండి మూడు గంటల సమయం పడుతుంది. అంతేకాకుండా ఈ థెరపి లో దాత నుండి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ మరియు ఎలర్జీలు కూడా గ్రహీతకు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని పరిమితులకు లోబడి మాత్రం ఈ థెరపీ చక్కగా పనిచేస్తుందని చెప్పవచ్చు.

ఏదేమైనప్పటికీ ఈ ప్లాస్మా థెరపీ కరోనా వైరస్ బారిన పడి చివరి దశలో ఉన్న రోగులకు , ప్రస్తుత పరిస్థితులలో సంజీవనిలా పని చేస్తుందని చెప్పవచ్చు. కరోనాను జయించిన వారు ప్లాస్మా దానం చేయుటకు ముందుకు వచ్చేలా ప్రతి ఒక్కరిని అవగాహన పరచాలి. దీనిని మరింత గా ప్రోత్సహించేలా ప్రజలలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. మరియు మరింత మెరుగైన పరిశోధనలు, ఉన్నతమైన ఫలితాలను రాబట్టవలసిన బాధ్యత శాస్త్రవేత్తల పైన ఉంది. అప్పటివరకు కరోనా ను నివారించే వ్యాక్సిన్ కోసం ఎదురు చూడవలసిందే……

N. హర్ష వర్ధన్ రాజు.
harsha.raju713@gmail.com.

ఇక్కడ క్లిక్ చేయండి