telugulo purana sahityam

తెలుగు లో పురాణ సాహిత్యం

తెలుగు లో పురాణ సాహిత్యం

ఐ.చిదానందం


telugulo purana sahityam

పరిచయం :
పురాణ” శబ్దానికి “పూర్వ కాల కథా విశేషం” అన్న అర్ధం నిరూఢమై ఉంది. క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నాటికే ఈ వాఙ్మయం లభిస్తుంది. కానీ ఆ తర్వాత కాలం లో అది రూపు సంతరించుకొంది అని తెలుస్తుంది. యజ్ఞసమయంలో ఋక్సామచ్ఛందాలతో పాటు ఉచ్చిష్ట రూపమై పురాణం ఆవిర్భవించిందని అధర్వణ వేదంలో తొలిసారిగా ప్రస్తావింపబడింది. శతపథ బ్రాహ్మణం, బృహదారణ్యకోపనిషత్తు, గోపథ బ్రాహ్మణం వంటి గ్రంధాలలో పురాణ ప్రశంసలున్నాయి.
పురాణ వాఙ్మయం ఆవిర్భావం :
పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండవ స్కందం చెప్తుంది. వ్యాస మహర్షి పురాణ సంహితను నిర్మించి తన సూత శిష్యుడు రోమహర్షునికి ఉపదేశించాడు. అతడు దానిని భాగాలుగా చేసి సుమతి, అగ్నివర్చుడు, మిత్రాయువు, శాంశపాయనుడు, అకృతవర్ణుడు, సావర్ణి అనే ఆరుగురు శిష్యులకు బోధించాడు. వీరిలో అకృతవర్ణుడు, సావర్ణి, కాశ్యప శాంశపాయనులు వేరువేరుగా మూడు పురాణ సంహితలను రూపొందించారు. రోమహర్షుని మాతృకతో కలిసి ఈ గ్రంధజాతమంతా పురాణ వాఙ్మయానికి మూలమయింది. ఈ విధంగా పరిశీలిస్తే అప్పటి యాఙ్ఞికులైన బ్రాహ్మణుల అధీనంలో ఉన్నవాఙ్మయాన్ని వ్యాసుడు విషయ క్రమం ప్రకారం పునర్వ్వస్థీకరించి, కాలానుగుణంగా అవుసరమైన మార్పులతో లోకులకు తెలియజేయమని బ్రాహ్మణేతరులైన సూతులకు అప్పగించాడు.
పురాణ విస్తరణ :
ఆపస్తంభ ధర్మ సూత్రాలలోని ప్రస్తావనల ఆధారంగా క్రీ.పూ. 600-300నాటికే పురాణ వాఙ్మయం ఒక ప్రత్యేక శాఖగా రూపుదిద్దుకొందని, కాలానుగుణంగా ఉపదేశికుల బోధలను సంతరించుకొంటూ క్రీ.శ. 12వ శతాబ్దివరకూ మార్పులు చెందుతూ వచ్చిందని ఊహించవచ్చును.
అష్టాదశ (18) పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు.
పురాణ లక్షణాలు :
కూర్మపురాణంలో చెప్పబడిన పురాణ ఉపోద్ఘాతము ప్రకారం

సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ
వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం

సర్గము, ప్రతి సర్గము, వంశము, మన్వంతరము, వంశాలచరిత్ర అనే పంచలక్షణాలు కలిగినదే పురాణం. అనగా సర్గము – సర్వ ప్రపంచ సృష్టిని విస్తరించేది,ప్రతి సర్గము – సకల ప్రపంచము లయమయ్యే లక్షణం తెలిపేది (ప్రళయం), వంశము – పృథు, ప్రియ వ్రతాదుల వంశోత్పత్తిని వివరించుట,మన్వంతరము – ఏ కల్పంలో ఏ మనువు కాలంలో ఏమి జరిగిందో తెలుపుట వంశాలచరిత్ర. ఇవే కాకుండా భాగవతంలో పురాణం మరో ఐదు లక్షణాలు కలిపి పది లక్షణాలు చెప్పబడ్డాయి.

సర్గోప్యశ్చ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ
వంశో వంశానుచరితం సంస్థాహేతు రపాశ్రయ
దశభిర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదు:

అనగా సర్గము (సృష్టి), ప్రతిసర్గము (ప్రళయము), వృత్తి (వ్యాపారము), రక్షా (పరిపాలవ), అంతరము (మన్వాదుల కాలము), వంశము (వంశాదుల విషయము), వంశానుచరితము (సూర్య, చంద్ర వంశస్థుల కథనాలు), సంస్థా (స్థితి), హేతువు (కారణము), అపాశ్రయము (ఆశ్రయ విషయాలు) అనే పదీ పురాణ లక్షణాలు కలవు.

పురాణాల విభజన
సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందము లో చెప్పబడింది.

మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్

పైన చెప్పిన వాటిలో:

“మ” ద్వయం — మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
“భ” ద్వయం — భాగవత పురాణం, భవిష్య పురాణం
“బ్ర” త్రయం — బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
“వ” చతుష్టయం — విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం
మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:

అ — అగ్ని పురాణం
నా — నారద పురాణం
పద్ — పద్మ పురాణం
లిం — లింగ పురాణం
గ — గరుడ పురాణం
కూ — కూర్మ పురాణం
స్క — స్కంద పురాణం
(వికీపిడియా సౌజన్యంతో….)
పురాణాల వర్గీకరణ :
ఈ 18-పురాణాలు త్రిమూర్తి స్వభావం గా 3-రకములుగా వర్గీకరణ చేయబడినవి.అవి వైష్ణవ పురాణాలు: విష్ణు పురాణం, భాగవత పురాణం, నారద పురాణము, గరుడ పురాణం, పద్మ పురాణము, వరాహ పురాణం, వామన పురాణము, కూర్మ పురాణం, మత్స్య పురాణము
బ్రహ్మ పురాణాలు: బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణము, భవిష్య పురాణం,
శైవ పురాణాలు: శివ పురాణము, లింగ పురాణము, స్కంద పురాణం, అగ్ని పురాణం.
పద్మ పురాణంలో, ఉత్తర ఖండం నందు మూడు లక్షణాలను అనుగుణంగా పురాణాలను వర్గీకరించింది;అవి,సత్వ గుణ పురాణాలు:విష్ణు పురాణం, భాగవత పురాణం, నారద పురాణము, గరుడ పురాణం, పద్మ పురాణము, వరాహ పురాణం,రాజస గుణ పురాణాలు : బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణము, భవిష్య పురాణం, వామన పురాణము బ్రహ్మ పురాణము , తామస గుణ పురాణాలు :మత్స్య పురాణము, కూర్మ పురాణం, లింగ పురాణము, శివ పురాణం స్కంద పురాణం, అగ్ని పురాణాలు.
తెలుగు సాహిత్యం లో పురాణాలు రాసిన కవులు
విష్ణు పురాణం :
పులస్త్యుడు తనకు తెల్సిన శ్రీ మహావిష్ణువు కథను వశిష్ట మహర్షికి చెప్పాడు. ఇతని ద్వారా పరాశరుడు కి కథ చేరింది. ఇలా లోకంకు ఈ కథ పరిచయం అయినట్లు తెలుస్తుంది. విష్ణుపురాణంలో సాగర మధనం,శ్రీ మహాలక్ష్మి ఆవిర్భావం,ధృవోపాఖ్యానం, పృథు చక్రవర్తి చరిత్ర, భరతుని వృత్తాంతం వంటి కథలు కలవు. సంస్కృత పురాణాల్లో అతి ప్రాచీనమనీ ఈ పురాణంను అంటారు. మైత్రయుడు అనే మహర్షి అడిగిన ప్రశ్నలకు పరాశరుడు చెప్పిన సమాధానాలే విష్ణు పురాణం. సంస్కృతంలో విష్ణుపురాణం రెండు భాగాలుగా కలదు. మొదటి భాగం విష్ణువు మహత్యం ను తెలిపేది.రెండో భాగంలో ధర్మ విషయాలు కలవు. వెన్నెలకంటి సూరన(16వ శతాబ్దం) సులభ రీతిలో ఈ పురాణం ను రాశాడు. ఇందులో ఏడు,ఎనిమిది ఆశ్వాసాల లో శ్రీకృష్ణుడు చరిత్ర కలదు. శమంతకమణి ని శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు ఆశించారనీ ఈ కావ్యం లో కలదు. శృంగార రసభరిత కథలు ఉన్నప్పటికీ కవి సభ్యత లోటు లేకుండా ఔచిత్యంను పాటించాడు. మారిష కథ, తారాశశాంక కథ, ఉషా అనిరుద్ ల వివాహం కథలు సరసంగా రాశాడు.ఈ కావ్యం లో ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని విష్ణుభక్తుడి గా మార్చినట్లు కలదు(అధారం-విజ్ఞానసర్వస్వం-తెలుగు భాషా సమితి), సంస్కృత మూలం ను అనుసరించి తెలుగులో విష్ణుపురాణము విపులంగా రాసిన కవి తుపాకుల అనంత భూపాలుడు.ఈ పురాణము నే రాసిన మరొక కవి పశుపతి నాథుడు (14వ శతాబ్దం-ఉత్తరార్థం) రచన లభ్యమైన ఈ రచన ప్రసక్తి ప్రబంధ రత్నావళి లో కలదు. వెంకటగిరి పాలకులలో ఒకరు కుమార యాచమ నాయకుడు. ఇతని ప్రోత్సాహంతో ముడుంబ అప్పయ్య దీక్షితులు విష్ణుపురాణాన్ని తెనిగించారు. విష్ణు భక్తుల చరిత్రలను గాథలను వర్ణిస్తూ ద్విపద కావ్యంగా విష్ణుపురాణం వ్రాసినవారు చక్రవర్తి రాఘవాచారి. వీరు ఈ పురాణ మొదటి భాగంలో యమలోక వర్ణన,పాపాత్ములు చేసే పాతక వివరాలు ఉన్నాయట.రెండో భాగంలో విశిష్టాద్వైత మత స్థాపకులు రామానుజాచార్యులు గురించి కలదు (ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం-9సంపుటం) , విష్ణు పురాణం నే రాసిన మరొక కవి దిట్ట కవి వెంకటామాత్యుడు-2.
పద్మ పురాణం :
ఐదు వేల శ్లోకాలతో సంస్కృతంలో రాయబడిన పురాణం పద్మ పురాణం.దీనిలో మధుకైక భటుల చరిత్ర,దేవ రాక్షసుల జననం,పద్మ గంధిచరిత్ర, శ్రీరామ నామ మహిమ,శ్రీహరి మహత్యం వంటి కథలు కలవు.
కవి సార్వభౌమ బిరుదు గల శ్రీనాధుని తాత పేరు కమలనాభామాత్యుడు. ఇతడు పద్మ పురాణం సంగ్రహం గా రాశారు. ఈ కావ్య ప్రసక్తి శ్రీనాథుని కాశీఖండం లోనూ,భీమ ఖండం లోను కలదు.విష్ణుకథ ప్రధానంగా సాగే ఈ పురాణమును 11 ఆశ్వాసాల కావ్యం గా రాసిన వారు మడికి సింగన. వీరు పురాణ ఉత్తరఖండం(1420) పేరిట రాశారు. వీరి ఈ రచనలో భాగవత రామాయణ గాథలు ఎక్కువ.రుక్మిణీ పురోహితుని కోడుకు చేత శ్రీకృష్ణుడికి రాయబారం పంపినట్లుగా మార్చి రాశాడు. (ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం-4-సంపుటం), గోలకొండ నవాబుల ఆస్థానకవి గణేశ్వరుడు. ఇతని ప్రోత్సహం వల్ల కామినేని మల్లారెడ్డి పద్మ పురాణాన్ని రచించారు.పరమశివుడు శంభు భట్టారకుడు అనే పేర అయోధ్య నగరం ప్రవేశించి శ్రీరామచంద్రునికి వినిపించిన పురాణ కథాసారం ఇదీ. శ్రీ రామ కథ సంక్షిప్తంగా కలదు.
లింగ పురాణం :
త్రిమూర్తులలో శివుని రూపమునకు పూజ లేదు. అతడి లింగరూపంనకే పూజ కలదు. దీనికి కారణం భృగువు శాపం కారణం కలదు. ఈ లింగ పురాణం లో సతీదేవి మరణం,పార్వతీ దేవి జననం వంటి వృత్తాంతము కలవు.దీనినే కామినేని ఎల్లారెడ్డి -2 (1500 )తెనాలి రామకృష్ణ కవి (నిర్ధారణ కాలేదు) రాసినట్లు తెలుస్తోంది.
గరుడ పురాణం :
గరుత్మంతుడు అనే పక్షి తన తల్లి వినత దాస విముక్తికై ఇంద్రుడి తో సైతం పోరాడినాడు. ఇలాంటి విశేషాలతో గరుడ పురాణం కలదు. ఇందులో యమపుర వర్ణన, పాపులకు వేసే శిక్షల వివరాలు కలవు. ఈ పురాణం ను పింగళి సూరన (16వ శతాబ్దం) లో తెలుగు లో అనువదించాడు.
నారదీయ పురాణం :
శ్రీ మహావిష్ణువు యే నారదుడను దేవర్షి రూపమున కర్మ నిర్మోచకంబైన వైష్ణవ మంత్రమును చెప్పెను అనీ భాగవత పురాణం లో కలదు. ఇందులో అన్నదాన మహిమ, ఇంద్రద్యుమ్నాహారాజు చరిత్ర, గోపాల క్షేత్ర మహిమ వంటి కథలు కలవు. ఈ పురాణము పిల్లలమర్రి పిన వీరుడు అనువదించినట్లు తెలుస్తుంది. కానీ ఇది అలభ్యం.
మార్కండేయ పురాణం :
దీనిలో 137 అధ్యాయాలు , 9000శ్లోకాలు కలవు.దీనిలో పాతివ్రత్య మహత్యం,కౌశికుడి కథ,మను సంభవం వంటి ఇతివృత్తాలు కలవు. మార్కండేయుడు మృకండని పుత్రుడు. ఇతడు అల్పాయుష్మంతుడు జన్మించి శివానుగ్రహం తో చిరంజీవి అయినాడు. ఈ పురాణం ను మొట్ట మొదటిసారిగా తెలుగులోకి మారన (1291) అనువదించాడు. ఇతని మార్కండేయ పురాణంలోని కథలే శంకర కవి హరిచంద్రోపాఖ్యానం గా రాసాడు. పెద్దన మన చరిత్రకు, మట్ల అనంత భూపాలుడి బహుళాశ్వ చరిత్రకు ఈ పురాణమే మూలం. అలాగే ప్రౌఢ కవి మల్లన్న , కవి మారన రాసిన యమలోక వర్ణన ను తీసుకొని రుక్మాంగద చరిత్ర ను ఒక సంగ్రహంగా రాశారు. మార్కండేయ పురాణం ధర్మ సందేహాలు నివృత్తి చేయుటకు పుట్టింది. జైమిని మార్కండేయుని సందేహం తీర్చమని అడిగితే ధర్మ పక్షులను పంపి సందేహ నివృత్తి చేయటం ఇందులోని ప్రధాన విషయం. మారన రాసిన మార్కండేయ పురాణం ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధము. దీనిని గన్నయ సేనానికి అంకితమిచ్చారు.
ఈ పురాణానే తెలుగు లో 16వ శతాబ్దంలో పొన్నతోట ఔబళ కవి పది అశ్వాస లతో గ్రంథం రాశారు. అలాగే ఈ పురాణ గాధ నే సులభ వచనంలో మార్కండేయ పురాణం సంగ్రహంగా తిమ్మరాజు లక్ష్మణ రాయకవి(19వ శతాబ్దం) రచించారు. మార్కండేయుడు పద్మశాలి వంశస్తులకు మూలపురుషుడు.పద్మశాలీల ప్రోత్సాహంతో 16వ శతాబ్దంలో ఎల్లకర నరసింహ కవి మార్కండేయ చరిత్రను ద్విపద కావ్యం రాశారు. ఇదే పేరుతో భాగవత మేళ నృత్య నాటకంగా మేరత్తూరు వేంకటశాస్త్రి గారు రాశారు.ఇది సులలిత కేశిక వృత్తి లో ఉంది. ఇదీ భక్తి రూపకమైన సంగీత రూపకం.

వామన పురాణం :
బలి చక్రవర్తి ముల్లోకాలను ఆక్రమించి పాలించుచుండెను. దేవతల ప్రభావం తగ్గిపోయి ఇంద్రుడు రాజ్యము పోగొట్టుకున్నాడు. దేవతల మొరతో శ్రీమహావిష్ణువే రాక్షసులను అణుచుటకు వామనుడై అదితి,కశ్యపుల కు జన్మించాడు. బలిచక్రవర్తి దగ్గరకు వామనుడు వచ్చి మూడడుగుల నేలను కోరాడు. అలా తన పాదములతో వామనుడు రెండు అడుగులతో సమస్త విశ్వం ను ఆక్రమించాడు. అలాగే మూడవ పాదం ను వామనుడు బలి తలపై పేట్టి అతనిని రసాతలము నకు అణగదొక్కేను.ఈ వామన పురాణంలో నర నారాయణ చరిత్ర,అంధకాసుర చరిత్ర,వినాయక వృత్తాంతం వంటి అంశాలు కలవు.
సుభాషితాలను తెలుగులో రాసిన వారు ఎలకూచి బాల సరస్వతి.(1600) ఇతడు వామన పురాణమును కూడా తెనిగించాడు.మరో కవి ఓబళకవి. ఇతడు పది అశ్వాసాల కావ్యంగా వామనపురాణం అని రాశారు. ఇతనికి ఈవని వెంకటేశ కవి సాయం చేసినట్లు తెలుస్తుంది. ఇతడు 7,8 అశ్వాసాలు వ్రాశాడట. ఆనంద కానన మహత్యం వ్రాసిన కవి లింగమగుంట రామకవి.ఇతడు కూడా వామన పురాణం ను రాసాడు.
వరాహపురాణం :
హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని జుట్టుముట్టి సముద్రమున ఉత్తరమున ముంచి వేశాడు. విష్ణువు వరాహరూపుడై ఆ రాక్షసుడిని చంపి పుడమిని లేవనెత్తాడు.ఈ వరహ పురాణంలో సూర్యచంద్ర వంశ రాజుల చరిత్ర కలదు.ఇది వరహరూపంలో శ్రీ మహా విష్ణువు భూదేవికి చెప్పిన పురాణం.దీనిని నంది మల్లయ ఘంట సింగనలు (1485) లో 12 ఆశ్వాసాల కావ్యం గా రాశారు. ఇందులో దుర్జనోపాఖ్యానం,గౌతమ్యుపాఖ్యానం,ధర్మవాదోపాఖ్యానం వంటి వర్ణనలతో నడిపారు కవి. ఇందులో వ్రతాలు,నోములు, దానాల గురించిన వివరాలు కలవు ఉన్నది (ఆంధ్రసాహిత్యచరిత్ర- పింగళి లక్ష్మీకాంతం) అయితే వరహ పురాణం లోని రెండు భాగాలలో కవులు కేవలం మొదటి భాగం నే అనువదించారు. ఇలా పూర్వ భాగాన్ని మాత్రమే రాసిన మరో కవి హరి భట్టు(1621),ఇతడు దీనిలోని కైవల్యఖండంను మాత్రమే తెనుగించాడు.
మత్స్య పురాణం :
హయగ్రీవుడు (సోమకాసురుడు) అను దనుజుడు చతుర్వేదములను అపహరించి సముద్రములో దాగి యుండేను. విష్ణువు మత్స్య (చేప) రూపమున అవతరించి ఆ అసురుని సంహరించి వేదములను రక్షించెను.ఈ పురాణం లో అగస్త్య చరిత్ర,త్రిపురాసుర వధ,యయాతి చరిత్ర , దేవయాని కచ వృత్తాంతం వంటి ప్రధాన ఇతివృత్తం లు కలవు.
ఈ పురాణము తెలుగులో 16వ శతాబ్దంన హరిభట్టు అనే కవి ఐదు అశ్వాసాలు కావ్యంగా రాశారు. కానీ ఇది సంగీత రచనకు పూర్తి తెనిగెంపు కాదు. విష్ణు పూజా ఫలం, తులసి మహత్యం వంటి కథలు ఇందులో కలవు. శబ్దాలంకారాలు తో చిత్రకవితా విశేషాలతో మత్స్య పురాణము కాణాదము పెద్దన సోమయాజి 18వ శతాబ్దంన రచించారు. దీనిని రాజా బహిరి పామ నృపాలుడు నికి అంకితము ఇచ్చారు. ఈ పురాణం నే సులభ వచనంలో మత్స్యపురాణం సంగ్రహముగా తిమ్మరాజు లక్ష్మణ రాయకవి,పువ్వాడ వెంకట రామారావు గార్లు జంట గా రచించారు.
కూర్మ పురాణం :
అమృతం కోసం దేవతలు,దానవులు కలిసి మంథర పర్వతమును కవ్వముగా చేసి వాసుకిని తాడుగా చేసి సముద్రము ను మధించినారు. కొంతకాలం మధించగానే పర్వతం మునిగిపోయేను.అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మ రూపం లో (తాబేలు రూపంలో) మంథర పర్వతం కు అడుగున చేరి అమృత సాధనకు సహకరించాడు. కూర్మ పురాణం లో 14 లోకాలు వివరణ,దేవదానవుల కలహం వంటి అంశాలు కలవు.
తామస పురాణాలలో ఒకటైన కూర్మపురాణం ను రాజలింగ కవి తెలుగులో తొలిసారిగా అనువదించారు. ఇది పురాణ కథ అయినా ప్రబంధ ధోరణిలో కలదు. (ఆరుద్ర -సమగ్రాంధ్ర సాహిత్యం-9-సంపుటం), ఈ పురాణంనే మలయమారుత కవి మల్లన రాసినట్లు తెలుస్తోంది. పురాణ కథ లను సులభమైన వచనంలో రాసిన కవి తిమ్మరాజు లక్ష్మణ కవి (19వ శతాబ్దం-పూర్వార్థం) ఇతడు కూర్మపురాణం సార సంగ్రహం పేరిట కూర్మ పురాణాన్ని తెనుగెంచినాడు.
నారసింహ పురాణం :
హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుండి అనేక వరాలు పొందిన వాడు.ఇతనిని సంహరించుటకు శ్రీమహావిష్ణువు నరసింహుడి రూపము ఎత్తాలిసి వస్తుంది.
ఈ నరసింహ పురాణము 8004 గద్య పద్యాలతో ఎర్రన్న తెనుగించినాడు.ఇదే రచనను కొటికలపూడి కోదండరామ కవి,బారిగడ్పుల ధర్మయామాత్యులు వంటి వారు విడి విడి గా రచించారు. సంస్కృతంలో నృసింహపురాణం రెండు భాగాలుగా కలదు. ఈ పురాణంలోని ఉత్తర భాగము హరిభట్టు (1530)రచించారు. ఆయితే కవి మరణాంతరం అతని పుత్రుడు ప్రోలుగంటి రంగ మంత్రి కి అంకితం ఇచ్చారు. మరో కవి ప్రొలుగంటి చెన్నశౌరి కూడా నరసింహ పురాణం ను ద్విపద కావ్యం రాశారు.
బ్రహ్మాండపురాణం :
దీనిలో యుగముల విభజన గోకర్ణ క్షేత్ర మహిమ,మనువు సంతతి పాలించిన ద్వీప విశేషాలు కలవు. ఈ పురాణం ను కావూరి ఎల్లయ్య ఆరు అశ్వాసాలుగా రాసారు. ఇందులో బలరామకృష్ణుల అవతార కథ కలదు.ఈ కావ్యం సంస్కృత బ్రహ్మండ పురాణం లోని అర్ధ పంచక వివరణ ఖండాన్ని మాత్రమే తెనిగించినట్లు కవి చెప్పుకున్నారు(ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం)
వాయు పురాణము :
ఇదీ శైవ పురాణము, ఇందులో 24,000 శ్లోకములు ఉన్నాయి. ఈ పురాణము నాలుగు (పాదములుగ విభజించబడింది. బాణభట్టు తన రచనలైన కాదంబరి, హర్షచరిత్ర ఈ వాయు పురాణాన్ని గురించి ప్రస్తావించాడు. పర్షియన్ యాత్రికుడు అలె బెరూని కూడా తన రచనలో అష్టాదశ పురాణాల గురించి ప్రస్తావించాడు.అందులో వాయుపురాణం క్రీ.శ 600 కు పూర్వనుంచే అత్యంత పవిత్రమైన గ్రంథంగా లెక్కించబడేదని తెలియజేశాడు.
కల్కి పురాణం :
శంభళపురమున విష్ణుశయుడు,సుమతిలకు పుట్టిన కుమారుడు కల్కి. ఇతడు పరశురాముడు వద్ద విద్యలు నేర్చుకున్నాడు. ఇతని భక్తికి మెచ్చిన శివుడు కరవాలమును,బాణమును,గుఱ్ఱమును,చిలకనూ బహుమతిగా ఇచ్చాడు. విష్ణువే కలియుగాంతంలో కల్కి గా అవతరించును అనీ సకల ధర్మము ధర్మము నిలుపును అనీ కల్కి పురాణంలో కలదు. ఈ పురాణము తెలుగులో రంగరావు కేశవరావు రచించారు. ఈ పురాణంనేం భవిష్యత్ పురాణం అనీ అంటారు.సంస్కృతంలో ఇది బ్రహ్మ,సూర్య,విష్ణు,శివ అనే నాలుగు పర్వాలుగా కలదు.
వీటితో పాటు గా శివ పురాణంను వెంకట పార్వతీశ కవులు,ముద్దుం బాలంభట్టు(1834),స్కందపురాణంను నల్లా రెడ్డి (17వ శతాబ్దం),బ్రహ్మండ పురాణం కావూరి ఎల్లయ్య ,భాగవత పురాణం-పోతన వంటి కవులు రచించారు.
ఈ పై పురాణాలతో పాటు మరో 18 ఉప పురాణాలు కూడా ప్రచారంలో కలవు అవి:
నరసింహ,శివధర్మ,దౌర్వాస,నారదీయపురాణము,కాపిల,మానవ,ఔసనశ,బ్రహ్మాండ,వారున,కౌశిక,లైంగ,సాంబ,సౌర,పారాశ,మారీచ,భార్గవ,స్కాంద,సనత్కుమార పురాణలు. అయితే వీటి సంఖ్య పై స్పష్టత లేదు.ఇంటి కృష్ణమూర్తి గారన్నట్లు పురాణలన్నీ ప్రతీకాత్మకతలే.
పురాణాల పై పరిశోధనలు :
మార్కండేయ పురాణం,జన జీవనం-ఎం.సుప్రీయ(1999-కాకతీయ యూనివర్సిటీ),మారన మార్కండేయ పురాణం ప్రబంధ కథా మూలం -జి.వి.సుబ్రహ్మణ్యం(1969-ఉస్మానియా యూనివర్సిటీ-ఎం.ఫిల్),పోతన భాగవతానుశీలన(1969-ఉస్మానియాయూనివర్సిటీ-ఎం.ఫిల్),మడికి సింగన పద్మోత్తరఖండం (1986-మద్రాసు యూనివర్సిటీ)-డి.కె.శాంతకుమారి,హరిభట్టు వరహపురాణం సంశోధిత పత్రి(1974-మద్రాసు యూనివర్సిటీ–ఎం.ఫిల్)-డి.చిన్ని కృష్ణయ్య,కూర్మ పురాణం-రాజ లింగ కవి సంశోధిత పత్రి(1982-మద్రాసు యూనివర్సిటీ–ఎం.ఫిల్)-జీ.గుణశేఖర్,నారదీయ పురాణం -సమగ్ర పరిశీలన(2007-ప్రాచ్య ఉస్మానియాయూనివర్సిటీ )-హెచ్.వామన మూర్తి.

పురాణాలు కాని పురాణాలు :
‘ వైదిక పురాణ సాంప్రదాయంలో మహా పురాణాలు,ఉప పురాణాలు లతోపాటు గా వీరశైవ,జైన మరియు ఇతర సంప్రదాయంలో పురాణాలు చెప్పబడ్డాయి. వీటితో పాటుగా కొందరు కవులు స్థలపురాణం ను,పురాణ వ్యక్తులను,హేతువాద విషయాలను సంచయితగా ఒక సంపుటంగా రాసి వాటికి పురాణం అనీ పేరు పెట్టినారు. వాటిలో కొన్ని చూస్తే…
బసవ పురాణం :
ఇది పాలురికి సోమనాధ కవి రచించిన ప్ర్రథమాంధ్ర ద్విపద గ్రంథము. ఏడు ఆశ్వాసాలు గల ఈ గ్రంథము శివ సంబంధమైన అనేక కథలు ఉన్నాయి. గూడ వేంకట సుబ్రహ్మణ్యం సంక్షిప్త పరచి పరిష్కరించారు.
చెన్న బసవ పురాణం :
అత్తలూరి పాప కవి (19వ శతాబ్దం) రాసిన ఈ పద్య కావ్యం లో చెన్న బసవుని వృత్తాంతం కలదు. కళ్యాణ పురాధిపతి అయినా బిజ్జలుని మంత్రి బసవేశ్వరుని కి చెన్న బసవుడు మేనల్లుడు.
ఆదిత్య పురాణం :
ఎలకూచి పినయాదిత్యుడు (17 వ శతాబ్దం) లో రాసిన ఆదిత్య పురాణం 8 ఆశ్వాసాల కావ్యం. ఆంధ్ర సాహిత్య పరిషత్కార్యాలయంలో ఉన్న ఈ పురాణపత్రిని పోంపూరి గురువ మంత్రి కి అంకితం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆదిపురాణం :
ఇది జైన కావ్యం. ఇందులో మొదటి తీర్థంకరుడైన పుర దేవుని ఇతివృత్తం కలదు.జినసేనుడు అనే కవి సంస్కృతంలో రాయగా కన్నడంలోకి ఆది కవి పంపడు అనువదించాడు.అలాగే వాగీంద్ర చూడమణీ పేరు గల కవి కూడా ఈ రచనను చేసినట్లు తెలుస్తుంది.కానీ అది అలభ్యం అనీ అప్పకవి దీనిని పేర్కొన్నాడు.అలాగే జైన కవిరత్నత్రయంలోని ఒకడైన సర్వ దేవుడు (953) తెలుగు లోకి అనువదించినాడు. బుుషభ దేవ దీర్ఘంకరుని చరిత్ర వర్ణన ఇందులో కలదు.దీనిలో ఆరు పద్యాలే లభించినట్లు తెలుస్తుంది.
జినేంద్ర పురాణం :
కన్నడ కవి పద్మ కవి తెలుగు లో జినేంద్ర పురాణాన్ని రాసినట్లు తెలుస్తోంది. దీని ప్రస్తావన ప్రబంధ రత్నావళి లో కలదు.
కన్యకా పురాణం :
దీనికి వైశ్య పురాణం అని అంటారు. ఇది వైశ్యుల ఇలవేల్పు అయిన కన్యక పరమేశ్వరి యొక్క కథ. దీనికి మూల వృత్తాంతం స్కాంద పురాణంలోని కలదు. కరుణ రసాత్మక కథ ఇది.
కుసుమశ్రేష్టి పెనుగొండ పట్టణవాసి కూతురు వాసవి కన్యక. ఈమెను విష్ణువర్ధనుడు అను రాజు చూసి మోహించడం.వివాహం కోసం రాయబారం పంపుతాడు విష్ణువర్ధనుడు. వివాహం ఇష్టంలేని కన్యకా రాయబారం లో తిరస్కరిస్తుంది.ప్రతీకారంతో దండెత్తి వస్తాడు రాజు.అప్పుడు కన్యకా అగ్నికి ఆహుతి అవుతుంది.పుష్పక విమానంలో శివుడు ప్రత్యక్షమై ఆమెను తీసుకెళ్లడం జరుగుతుంది. వాసవి కన్యకా పార్వతీదేవి అంశ అనీ వైశ్యులు నమ్మకం.
తెలుగులో ఇటికెల తిమ్మయ్య యక్షగానంగా రాశారు. అయితే ఇది ప్రదర్శనకు అనువు గా లేదు. దీనిలో తాళ ప్రధానములైన దరువులు ద్వివచనములు ఎక్కువ.(ఆంధ్ర యక్షగాన వాఙ్మయ చరిత్ర -ఎస్వీ జోగా రావు )
దీనినే భాస్కరాచార్యులు(1500) రాసినట్లు ఆరుద్ర పేర్కొన్నారు.నైమి శారణ్యంలో సాలంకాయన మహర్షి వైశ్య రుషులకు చెప్పిన కథ నే వీరు చెప్పారట.కానీ చారిత్రకం కాదని కల్పితమని పండితుల అభిప్రాయం కవి స్తుతి లో పోతన ను పేర్కొన్నాడు.
మరికొన్ని పురాణేతి పురాణాలు :
పంచ స్థలీ పురాణం అనువాదం ఆలూరి కుప్పనకవి,భార్గవ పురాణం కాండూరి వెంకట దాసు (18వ),బహిరీ పామ నాయకుడు (1730),గౌడ పురాణం ద్విపద గా మల్లికార్జున సిద్ద యోగి (1700),నాసికేత పురాణం -తిరుమల నాధ కవి (18వ),దేవాంగ పురాణం భద్ర కవి లింగకవి,పర్వత పురాణం నాగలూటి శేష నాధుడు(1590),పోలమ రాజు , మను వంశ పురాణం పోచి రాజు వీరన్న(18వ),మల్లు పురాణం -నుదురుపాటి వెంకన్న,సిద్దేశ్వర పురాణం ద్విపద దండి విశ్వనాథయ్య,సగర పురాణం గడిశాస్త్రులు రామచంద్ర శాస్త్రి,వైష్ణవ పురాణంను దాస కవి ,సూత పురాణం ను త్రిపురనేని రామస్వామి చౌదరి,వృషభ పురాణంను పేర్వారం జగన్నాథం వంటి వారు రచించారు.

పురాణాలన్నీ రమ్యంగా ప్రాచీన మానవుని సుఖదుఃఖాలను ఉత్తాన పదాలను తెలుపుతాయి. అష్టాదశ పురాణం లో సగం మాత్రమే తెలుగులో సంపూర్ణంగా ఆవిష్కరించబడ్డాయి మిగిలినవి వివిధ ప్రక్రియ రూపంలో తెలుగులో వ్రాయబడినవి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు భారతీయ ప్రతీకలైన అద్భుత రసం తో కూడి ఉన్నవి కామ మోక్షాలు అను ప్రతిపాదించే ఈ పురాణాలను అర్థం చేసుకొని అవగతం చేసుకుంటే,మనకు కావలసినంత జీవ జీవ చైతన్యం ప్రసాదిస్తాయి. అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఐ.చిదానందం

తెలుగు బాషోపాధ్యాయులు

తెలుగు రీసేర్చి స్కాలర్