“పుత్రోత్సాహం”

ఇంటి ముందు కారు వచ్చి ఆగింది.
ఎత్తుగా ఉన్న యువకుడు దాని లోంచి దిగాడు.తాను వచ్చేదాకా కారును పక్కన ఆపమని డ్రైవర్ కు చెప్పి గబగబా ఇంట్లోకి వచ్చాడు. అతని రాకను గమనించిన సహజ గట్టిగా నాలుగు ఇండ్లకు వినబడేలా అరిచింది.”అమ్మా… రాజా అన్నయ్య వచ్చాడు”
ఆ అరుపు వింటూనే వంట గదిలోంచి ఉన్నపళంగా బైటకు వచ్చింది భారతమ్మ.ఆమెకు యాభయ్యేళ్ళ పైనే వయసు ఉంటుంది.ఆమె మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనబడుతోంది.
“నాన్న ఎటెల్లారు ” చెల్లి ఇచ్చిన వాటర్ బాటిల్ అందుకుంటూ అడిగాడు.
“మందుల కోసం వెళ్లారు.అలాగే కూరగాయలు కూడా తీసుకొని మెల్లగా వస్తారులే..”అంది కొడుకు చేతిని తన చేతిలో తీసుకుంటూ.
“వచ్చేముందు ఫోన్ చేయొచ్చుగా అన్నయ్య “అంది సహజ.
“ఇది సడన్ ట్రిప్.అనుకోకుండా జరిగింది.మా కలెక్టర్ గారు ఎంక్వయిరీ కోసం వస్తూ నన్ను కూడా రమ్మంటే.. వచ్చాను.పనయ్యాక తాను హైద్రాబాద్ వెళ్లారు.నేను ఇక్కడికి వచ్చాను”
రాజా గ్రూప్ వన్ ఆఫీసర్ గా సెలెక్టు అయ్యి సంవత్సరం దాటింది.ట్రైనింగ్ అయ్యాక హైద్రాబాద్ లో పోస్టింగ్ ఇచ్చారు.ఇంకా పెండ్లి కాలేదు. ఇంకో సంవత్సరం ఆగాలని కండీషన్ పెట్టాడు.
“ఈరోజు ఉండి పోరా”అంది భారతమ్మ.
“లేదమ్మా…అక్కడ చాలా పనులున్నాయి.వారం తర్వాత వస్తాలే”చెప్పాడు.
అవీ ఇవీ మాట్లాడుతూ వుండగానే శీనయ్య గారొచ్చారు.నాన్నను చూడగానే లేచి ముందుకొచ్చి.. అతని చేతిలోని సంచులను అందుకున్నాడు.
“నీ జీతమంతా మీ అమ్మకే పంపుతున్నావు.ఖర్చుల కైనా ఉంచుకోవా..”
తండ్రి మాటలను విననట్టుగానే ..వేరే మాటలాడసాగాడు.
“అన్నయ్య నీ ఫ్రెండ్స్ కు నువ్వింత వరకు ట్రీట్ ఇవ్వలేదట.నీ మీద కోపంగా వున్నారు.అమ్మకు కూడా చెప్పారు”.
“ఒకే ..ఈసారి వచ్చినప్పుడు చూసుకుంటాలే”చెప్పాడు.
“భోజనం వడ్డిస్తా.. తిందువు గానీ రా” అంటున్న ఆమె మాటలకు అడ్డుపడుతూ..”లేదమ్మా నేను ఇప్పుడే కలెక్టర్ గారితో తిని వచ్చాను.ఇక నేను బయలుదేరతాను.”అని చెప్పి బయటకు నడిచాడు.
అతనితో పాటు ముగ్గురు బయటకు వచ్చారు.
కారెక్కి కూచొని చేయి ఊపుతుండగానే కారు ముందుకు కదిలింది.


చెప్పినట్టుగానే పది రోజుల్లో ఇంటికి వచ్చాడు రాజా.అతని రాక తెలిసిన అతని స్నేహితులంతా వచ్చారు.నవ్వులు కేరింతలతో సందడిగా ఉంది.ఇంటి పైన ఓ గది.. దాని ముందు రేకుల షెడ్డు ఉంది.
అందరూ అక్కడే గుమిగూడారు.
వేడివేడి పకోడీలు..బజ్జీలు..కాఫీలు ఎన్ని సార్లు పంపినా కొద్దిసేపట్లోనే తినేసి.. మళ్ళీ కావాలంటూ ఆర్దర్లు.
ఆ రోజు సాయంత్రం ఆ టౌన్ లొనే ఉన్న పేరొందిన హోటల్లోనే పార్టీ …
కేవలం క్లాస్మేట్లు.. ఫ్రెండ్స్ మాత్రమే..

సరిగ్గా నాలుగంటలు అవుతుందనగా..అంతా క్రిందకు వచ్చారు.రిఫ్రెష్ అయ్యి ఆరు గంటల కల్లా హోటల్ దగ్గరుండాలని అనుకోని అందరూ వెళ్లిపోయారు.
ఒక్కసారిగా ఇల్లంతా ప్రశాంతమై పోయింది.
రెస్ట్ రూమ్ లోకెళ్లి స్నానం చేసి..టీ త్రాగుతూ రిల క్స్ అవసాగాడు రాజా.
శీనయ్య గారు మేడ పైన ఉన్న కుర్చీలు ..ప్లేట్లు క్రిందికి తీసుకు వస్తున్నారు.
అది చూసి,”నేను తెచ్చే వాడిని కదా నాన్న”అన్నాడు.
“ఊరికే కూచొని బోర్ కొడుతుంది…ఇలా చిన్న చిన్న పనులు చేస్తే ఎక్సర్సైజ్ చేసినట్టుంటుంది.”
కొడుకుకు ఏ పనీ చెప్పటం అతనికి ఇష్టం ఉండదు..
సరిగ్గా ఐదున్నర కల్లా ఓ ఐదుగురు స్నేహితులొచ్చారు.
“నాన్న వెళ్ళొస్తాం..”చెప్పాడు తండ్రితో.
“సరే..వెళ్ళిరా”
అది విని కూడా..మళ్లీ చెప్పాడు.
“నాన్న వెళ్ళొస్తా”
ఇదంతా గమనిస్తున్న భారతమ్మ అక్కడికొచ్చి ..
“వాడు పార్టీకు వెళుతుంటే డబ్బులు ఇవ్వాలని తెలీదు.
వాడి దగ్గర డబ్బులు లేవు …మీరు ఇవ్వండి” గట్టిగా చెప్పింది.
“అది నాకు తెలుసండీ…వాడు డబ్బులు కావాలని అడుగుతాడేమోననీ”..
అతని మాట పూర్తి కాకుండానే ఆమె అందుకుంది.”వాడెప్పుడైనా డబ్బులు అడిగాడా…మీరే ఇస్తారుగా ..ఇవ్వండి”
జేబులోంచి రూపాయల కట్ట తీసి ఆమె కిచ్చాడు.ఆమె దాన్ని కొడుకు చేతిలో ఉంచింది.
రాజా ఆ డబ్బులు తీసుకొని విజయ గర్వంతో స్నేహితులతో ముందుకు నడిచాడు.
తాను ఎన్ని లక్షలు సంపాదించినా నాన్న చేత్తో ఇచ్చిన ఆయన డబ్బును ఖర్చు చేయటంలో థ్రిల్లే వేరు.
తన కొడుకు గ్రూప్ వన్ ఆఫీసరైనా సరే తన దగ్గర డబ్బులు తీసుకొని వెళుతూంటే ఆ ఆనందం మాటల్లో చెప్పనలవి కాదు.
కొడుకు చిన్నపిల్లాడిలా తండ్రి దగ్గర డబ్బులు వసూలు చేయడం..
తండ్రేమో మొండికేసి మెల్లగా ఇవ్వడం..మధ్యలో తాను మధ్యవర్తిత్వం చేయడం …ఈ అనుభూతి..ఆనందం కలకాలం ఇలాగే ఉంచు దేవుడా అని భగవంతుణ్ణి మనసులో మొక్కుకుంది భారతమ్మ.

✍️ షేరూ


( ఈమధ్య టీవీలో ఒక ఇంటర్వ్యూలో..
ఒక యువ నటుడు
కోట్లు సంపాదించినా కూడా..ఇంకా తండ్రి దగ్గరే ఖర్చులకు డబ్బులు తీసుకుంటాడని తెలిసాక..
అతని ఆలోచన స్ఫూర్తితో..ఈ కథ.)


4 thoughts on ““పుత్రోత్సాహం””

Comments are closed.