సేవ seva

సేవ seva

 

ఏదో టైప్ చేసుకుంటూంటే…పక్కనే ఉన్న కిటికీలోంచి చల్లని గాలి వచ్చి తాకుతోంది….కిటికీ రెక్కలు మూసేస్తే బాగుంటుందని,లేచి కిటికీ దగ్గరకు వెళ్ళాను.ఆకాశం నిండా టేబుల్ క్లాత్ మీద ఒలికిన నల్ల సిరా మరకల్లా నల్లని మబ్బులు. గాలికి కొమ్మలు ఊగుతున్నాయి.అప్పుడప్పుడు దుమ్ము ..దానితో పాటు ఎండిన ఆకులు…ప్లాస్టిక్ కవర్లు ఎగురుతూ పోతున్నాయి.
దుమ్ము వచ్చి కంటిలో పడింది..చేతి రుమాలుతో కన్ను మెత్తగా అదుముకుంటూ…కిటికీ రెక్క మూయబోతుంటే..కనిపించిందా దృశ్యం…అలాగే చూస్తుండి పోయాను.
ముగ్గురు ఐదారేళ్ళ పిల్లలు ఆడుకుంటున్నారు.ఇద్దరు అబ్బాయిలు ..ఒక అమ్మాయి…చిన్నగా ఉన్న అబ్బాయి వాళ్లకేదో చెప్పి…విపరీతమైన ఆయాసంతో క్రిందపడిపోయాడు. ఆ అమ్మాయి వెంటనే పక్కనే ఉన్న అబ్బాయితో ఏదో చెబుతోంది. ఆ అబ్బాయి ..రెండు చెవులకు తాడు కట్టుకొని..దాని చివరన అగ్గిపెట్టె లాంటి దాన్ని.. క్రింద పడిన అబ్బాయి ఛాతీ దగ్గర..పొట్ట మీద పెట్టి చూసాడు.తన రెండు చేతులతో ఛాతీ మీద మెల్లిగా కొట్టాడు. అతనిని కూర్చోబెట్టి..ఊపిరి ఎలా తీసుకోవాలో చెప్పాడు. తాను ముఖానికి మాస్కు కట్టుకున్నట్టుగా అతనికి…ఆ అమ్మాయికి కట్టుకొమ్మన్నాడు.చేతులకు పాత గుడ్డలు చుట్టుకొని…ఆ అబ్బాయిని మోసుకొని ప్రక్కకు తీసుకెళ్లాడు.
ముగ్గురు ఆ స్కిట్ బాగా చేసినట్టుగా ..నవ్వులు…కేరింతలు…
అది కరోన పేషంట్ ను ట్రీట్ చేసే విధానమని నాకు అర్ధం అయింది. బహుశా వాళ్ళు అది టీవీ చూసో…అమ్మానాన్నలు మాట్లాడుకుంటుంటే విని అలా చేసారేమో…..
ఇంత చిన్న పిల్లల్లో అలాంటి ఆలోచన వస్తే…..ఎదిగిన మనుష్యులు మాత్రం అమానుషంగా ప్రవర్తిస్తున్నారు.
ఒక యువకుడు తన తల్లి,భార్యతో ఆస్పత్రికి వస్తే…అతని శ్వాస ఇబ్బందిని గమనించి ఏ ఆస్పత్రి వాళ్ళు అడ్మిట్ చేసుకోలేదు.అతను రోడ్డు మీదనే పడిపోయి చనిపోయాడు.అంతా గమనిస్తున్న మనుష్యులెవరూ ముందుకు రాలేదు.
కరోన ఉందని కన్నతల్లిని రోడ్డు మీద వదిలేశారు ఆమె కన్న కొడుకులు.
చని పోయిన మాతృమూర్తికి కరోన ఉందని స్మశానం దాకా కాదు ఆఖరి చూపు కోసం ఎవరూ రాలేదు.
అంతా నీతి వాక్యాలు వల్లించే వారే..ఆచరణలో శూన్యం.
ఇలా ఆలోచనలు సాగుతుంటే…”నాన్న కాఫీ”అంటూ కప్పు అందించింది పాప.
నవ్వుతూ…”ఈ రోజు ఇది ఐదో కాఫీ తెలుసా?”అంది.”రోజుకు రెండు కప్పులకు మించి తాగనన్నావు ..గుర్తుందా…”
“ఏదో టెన్షన్ లో వున్నప్పుడు తాగుతా…”అన్నాను.
“కాదులే…ఆ రైటప్ గురించి ఆలోచిస్తున్నావులే…నేను గమనిస్తూనే వున్నా..”అంది.
నేను రాసిన ప్రతీది చదివి …స్పెల్లింగ్ మిస్టేక్స్ చెప్పేది తానే కాబట్టి..నేను మౌనంగా ఉండిపోయాను.తాను చదివేది ఇంటర్ మీడియటే కానీ నేను రాసేవన్నీ చదివి..చదివి..విషయ పరిశీలన…తెలుగు భాష మీద పట్టు వచ్చాయి.
కాఫీ తాగి …తిరిగి టైప్ చేయటం మొదలుపెట్టాను కానీ కరోనా బాధితుల గురించే ఆలోచలన్నీ…
*********

seva
Image by Gerd Altmann from Pixabay

“అన్నయ్యగారు మీకిది తెలిసిందా? “మా ఇంటి దగ్గరలో వుండే లత అడిగింది.ఆమె ఏది స్పష్టంగా చెప్పదు.ముందు ప్రశ్న వేసి .. తీరిగ్గా చెబుతుంది.
“చెప్పండి..”అన్నాను.
“రోజాకు కరోన పాజిటివ్ వచ్చింది.ఆమెను ఇంట్లో ఉంచే డాక్టర్లు వైద్యం చేస్తున్నారు.”
“కన్ఫమ్ అయిందా”
“లేదు..టెస్ట్ రిపోర్ట్ రాలేదు ఇంకా”
“రిపోర్ట్ చూడ కుండా ..మీరెలా పాజిటివ్ అంటున్నారు..”,కొద్ధి కోపంతో అన్నాను.
“ఆమెకు జలుబు ..జ్వరం ఉంటేనూ..”నసిగింది.
“ఇది వానా కాలం
..ఎప్పుడూ తేమతో.. చల్లగా ఉంటుంది వాతావరణం.మంచి ఆరోగ్యంగా ఉన్న వారికే జలుబు,దగ్గు,తుమ్ములు వస్తుంటాయి. అలాంటిది ఆమె ఆస్తమా పేషంట్…కొద్దిగా ఇబ్బంది పడొచ్చు. ఆ మాత్రం దానికి కరోన అని చెప్పొద్దు. వారిని ఇబ్బందులకు గురి చేయొద్దు,”అన్నాను.
“మీరు ఇంతే..ఏది చెప్పినా నమ్మరు.ఊహు..”అనుకుంటూ వెళ్ళిపోయింది..
వెంటనే మా ఫామిలీ డాక్టర్ ప్రసాద్ గారికి ఫోన్ చేసాను.తాను డాక్టర్ కంటే కూడా మొటివేటర్గా నేను బాగా సలహాలు తీసుకుంటాను. వైద్యంతో పాటు అన్ని విషయాల పట్ల అవగాహన..అంతకు మించి మానవత్వం నిండుగా వున్నవారు.విషయం మొత్తం చెప్పాను.
తాను ఒకటే మాట అన్నారు..
“రోగం కంటే ముందు భయమే మనిషిని చంపుతుంది.ధైర్యంగా వుండమనండి..”
కొన్ని వైద్య సలహాలు ఇచ్చారు.
రోజా భర్తకు ఫోన్ చేసాను.అతను ఫోన్లోనే ఏడ్చినంత పని చేసాడు.అతనికి ధైర్యం చెబుతూ.. డాక్టర్ ప్రసాద్ గారు చెప్పిన వైద్య సలహాలు పాటించ మన్నాను.
వేడి నీళ్లు తాగడం..కషాయం తాగడం…ఇమ్మ్యూనిటి పెంచుకోవడం…ముఖ్యంగా ధైర్యాన్ని కోల్పోక పోవటం.

కిరానా షాపు అతనికి బాదం..జీడీ పప్పు..కిస్మిస్..పిస్తా..నువ్వులు లాంటి బలవర్ధకమైన ఆహార పదార్ధాలను పంపించమన్నాను.
రోజా వాళ్ళ ఆర్ధిక పరిస్థితి తెలుసు కాబట్టి ఓ రెండు వేలు అతనికి ఇచ్చి ..ఆ సరకులు ఇంటిల్లిపాది తినమన్నాను. అతను రెండు చేతులు జోడించాడు… “మీకెమి కాదు మేమంతా ఉన్నాం..”అన్నాను.
ఈ విషయం తెలిసాక మిత్రులు కూడా నాతో కలిశారు. ముందుగా ఆ ఇంట్లో వారికి ఆత్మ విశ్వాసం పెంచుకొనేలా చేసాం…మా అందరి మాటలు వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి.
రేపు టెస్ట్ తాలూకు రిపోర్ట్ వస్తుంది.అది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా ఎదుర్కోవటానికి మేము సిద్ధం…ఆ ఇంటికి మేమంతా అండగా ఉంటాం..ఆ ఇంటికే కాదు మా టౌన్ లో ఎవరికి వచ్చినా కూడా…
మా అందరికి మంచి పని చేస్తున్నాము అనే ఆలోచనతో సంతోషంగా ఉంది.
మంచి అంటే దైవం కదా..
దైవమే మంచి కదా..
ఇది దైవ కార్యమే..
*******

@ షేరు

1 thought on “సేవ seva”

Comments are closed.