మన బాధ్యత లేదా?

మన బాధ్యత లేదా?


లక్షల మంది చదువుకున్న వారు ప్రయివేట్ పాఠశాలల్లో టీచర్లుగా పని చేస్తున్నారు.ఉదయం స్టడీ అవర్ పేరుతో తెల్లవారు జాము నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఏదో ఒక క్లాస్ లో ఉండాల్సిందే.తరగతిలో కూచొని పాఠాలు చెప్పకూడదు.ఎప్పుడూ నిలబడే ఉండాలి. ఏదో ఒక అనారోగ్యంతో ఒక పది నిమిషాలు కూర్చుంటే…సీసీ కెమెరాల ద్వారానో…స్పెషల్ అసిస్టెంట్స్ ద్వారానో సమాచారం తెచ్చుకొని.
పిల్లల ముందే కూర్చో వద్దని సలహాలు..
లేకపోతే ఆఫీస్ గదిలో అవే సలహాలు.ఎదురు జవాబు చెబితే ఉద్యోగం ఊడుతుంది.బయట మళ్ళీ ఉద్యోగం దొరుకుతుందో లేదో తెలియదు.మౌనమే మందు తరహాలో నోరు మూసుకుని బాధలు,అవమానాలు భరిస్తూ..సహిస్తూ ఉద్యోగం చేస్తున్న వారెందరో……ఓ గర్భవతి అయిన టీచర్ పాఠం చెబుతూ మధ్యలో నోట్స్ కరెక్షన్ కోసం కొద్దిసేపు కూచున్నందుకు ఉగ్యోగం నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి కలిగింది.
పిల్లలందరూ ఒకే రీతిన వుండరన్నది జగమెరిగిన సత్యం.వారిని సముదాయించి..బుజ్జగించి పాఠాలు చెప్పేక్రమంలో ఎవరైనా తుంటరిని ఒక దెబ్బ వేస్తే…అదేదో పెద్ద నేరమైనట్టు..అమ్మానాన్నలు వచ్చి గోల చేసి..నానా మాటలనేసి పోతారు. వారు అలా వెళ్ళగానే స్టాఫ్ మీటింగ్…పిల్లల్ని కొట్టకుండా ఎలా దారికి తేవాలో చర్చ. రెండో సారి కనుక ఇలా జరిగితే ఇంటికి వెళ్లాల్సిందేనని హుకుం జారీ చేస్తారు.
ఉదయం నుండి సాయంత్రం వరకు స్కూల్లోనే ఉండి వ్యక్తిగత జీవితాలకు దూరమవుతున్నారు టీచర్లు.పండుగలకు కూడా ప్రత్యేక క్లాసులు తీసుకోవటం కోసం స్కూలుకు రావాల్సిందే.
లేటుగా వస్తే సెలవు పడుతుంది. ఖర్మగాలి తనకు గాని..తన ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగ లేకపోతే….ఓ గంట పర్మిషను దొరకదు.హాఫ్ డే లీవ్ తీసుకోవాలిసిందే..
ఇక ఎండా కాలం వస్తే.. ఊరంతా తిరిగి అడ్మిషన్లు చేయించాలి.కొన్ని స్కూల్స్ టార్గెట్స్ కూడా పెడుతుంటాయి.పక్క స్కూల్లో ఎక్కువ మంది చేరినా కూడా ఈ టీచర్లదే తప్పు.
టెన్త్ క్లాస్ లో అందరికీ ఏవన్ గ్రేడ్ రావాలి.
ఇన్ని టెన్షన్స్ మధ్య టీచర్ల ఆరోగ్యం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. వారికి వయసు పెరుగుతూ ఉంటుంది.అనారోగ్య సమస్యలు కలుగుతుంటాయి.ఇంట్లో తామే ప్రధాన సంపాదన దారుడు లేదా సంపాదన దారురాలో అయితే నరకం కనపడుతుంది.
నెల పూర్తయ్యాక జీతాలు ఒకటో తారీకునే ఆశించటం అత్యాశే అవుతుంది. తమకు నచ్చిన తేదీల్లో జీతం ఇస్తుంటారు.
కరోన పేరుతో మార్చిలో సగం జీతాలు మాత్రమే చాలా మంది ఇచ్చారు.ఏప్రిల్ ..మే నెల జీతాలు లేవు..ఇవ్వరు.
ఇంటి అద్దె..కరంటు బిల్లు…కిరాణా వస్తువులు…బియ్యం..మెడికల్ బిల్లులు..అన్నీ చెల్లించ వలసిందే.దేనినీ ఆపలేము.
స్కూల్ వారిని ఏప్రిల్ జీతమో..
.అడ్వాన్స్లో ఇవ్వమంటే…పిల్లలు కరోన పేరు చెప్పి ఫీజులివ్వలేదు.మేము ఇవ్వలేము అని స్కూళ్ల వారి జవాబు.మరి టీచర్లు ఎలా బ్రతకాలి.ఎవరి దగ్గర చేయి చాపలేరు..ఎవరికీ చెప్పుకో లేరు.


వలస కార్మికులకు ఉదారంగా భోజనాలు పెడతాం….
ఏదైనా పండగ వస్తే భారీగా చందాలు ఇస్తాం… ..
ఎక్కడో ఏ రాష్ట్రంలోనో వరదలు వస్తే అందరిని అడిగి మరీ డబ్బులు సేకరిస్తాం…
ఇంత ఉదారంగా వుండే మనం మన పిల్లలకు చదువు చెప్పే టీచర్లను ఈ కరోన కష్ట కాలంలో ఆదుకో లేమా…
ఆర్ధిక ఇబ్బందులు వేరే వారికి చెప్పుకోలేక…అప్పులు చేయటానికి మొహమాటం అడ్డొచ్చి….భారంగా రోజులు వెళ్లదీస్తున్న ప్రయివేట్ టీచర్లకు చేయూతనీయలేమా..ఇందులో మన బాధ్యత లేదా..
మన పిల్లల బంగారు భవిష్యత్తుకు దారి చూపే టీచర్లను ఆదుకోలేమా…..మన ఇంటి దగ్గరగానో..వీధి లోనో..ఊర్లోనో ఉన్న ప్రైవేట్ టీచర్లకు కొద్ధి మొత్తంలో సహాయం చేస్తే తప్పా..
మనం చేసే ఆ చిన్ని సహాయం ఆ టీచర్లకు మందులు గానో..ఆహారం గానో..ఇంటద్దె గానో..కరెంటు బిల్లు గానో ఉపయోగ పడితే మనకంత కంటే కావాల్సిందే ముంది..
@షేరు (గౌస్)

6 thoughts on “మన బాధ్యత లేదా?”

  1. D D Srinivasa Rao

    Daily wagers are far better than the private teachers. They have unions and labour courts. Private teachers should have a right platform to give their voice against exploitation.

  2. Thanq for bringing awareness……
    If anyone there in such situation, plz bring to our notice.
    Cell: 949 444 333 4
    -HHNH

Comments are closed.