“కదిలే స్వేద నది”

ఉన్నపళంగా ఎడారిలోంచి
పాతాళ గంగ ఉబికొచ్చినట్టు..

మోడువారిన చెట్టు
పూలతో…ఆకులతో గుభాళించినట్టు

మూసుకు పోయిన తలుపులన్నీ
ఒకేసారి తెరుచుకున్నట్టు

అందరు దేవుళ్ళు
కూడ బలుక్కొని వరాలిచ్చినట్టు

కొందరేమో అన్నం ప్యాకెట్లు
మరికొందరేమో బిస్కిట్లు
ఓ తల్లేమో నీటి బాటిళ్లు
ఇంకో తండ్రేమో తువాళ్ళు

అదిగదిగో చిన్నారి తమ్ముడు
అమ్మానాన్నలతో ఎగురుకుంటూ
తన చెప్పుల్ని..
ఒంటిమీద బట్టల్ని సైతం
నడుచుకుంటూ వస్తున్న
కదిలే నదిలా కనిపిస్తున్నా
శ్రమ జీవులకిస్తున్నాడు

మండుటెండలో తను తినకున్న
వారికి తినిపిస్తూ
బ్రేవ్ మంటున్నాడో యువకుడు

దాతృత్వం వరదలై ప్రవహిస్తోంది
మానవత్వం మనసారా నవ్వుతోంది..

చెప్పులే లేని కాళ్ళు విమానమెక్కాయి
సోను సూదన్న వీపు ఆసరా తీసుకొని

మానవత్వం పరచుకొంటోంది
నా దేశం నిండా…

సౌభాతృత్వం వెల్లివిరుస్తోంది
నా అమ్మల.. అక్కల దానగుణంతో….

ఇక భయం లేదు..
మళ్లీ పురుడు పోసుకుంది మానవత్వం
నా దేశంలో..

  • షేరు ( గౌస్ )

2 thoughts on ““కదిలే స్వేద నది””

Comments are closed.