ఆకాశంలో అద్భుతం

ఆకాశంలో అద్భుతం

ఆకాశంలో అద్భుతం: సుందర ఖగోళ ప్రక్రియ – మూఢనమ్మకాలను రూపుమాపే ఘటన

21 జూన్ 2020 ఆదివారం న అంతరిక్షంలో ఒక అద్భుతం ఆవిష్కరించబడుతుంది. 2020 సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఆ రోజు ఏర్పడబోతోంది

జూన్ 21 ఏర్పడబోయేది వలయాకార సూర్య గ్రహణం. చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూవున్న క్రమంలో ప్రతీ నెలలో ఒకసారి భూమికి అతి దగ్గరగా, అతి దూరంగా ఉంటాడు. భూమికి అతి దగ్గరగా ఉండే స్థానాన్ని పెరిజీ (Perigee) అని, భూమికి అతి దూరంగా ఉండే స్థానాన్ని అపోజీ (Apogee) అంటారు. జూన్ 15 న చంద్రుడు ఆపోజీ స్థానంలోకి వచ్చాడు. భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు అపోజీ స్థానంలో ఉండటం వల్ల సూర్యబింబాన్ని పూర్తిగా కప్పెదంత సైజులో చంద్రుడు ఉండడు. తద్వారా సూర్యుడి యొక్క పరిధి బాగం కొంత కనిపిస్తుంది. అందువల్ల సూర్యబింబం వలయాకార రూపంలో ఉంటుంది. అందువలనే దీనిని వలయాకార సూర్యగ్రహణం అంటారు. లాటిన్ లో ఆన్యూలార్ అంటే ఉంగరం. ఈ అంగులీయక (వలయాకార) సూర్యగ్రహణం చూడటం ఓ అద్భుత దృశ్యం. మన దేశంలో ఈ గ్రహణం ఘర్యానా (రాజస్తాన్), సిర్సా(హర్యానా), డెహ్రాడూన్, టెహ్రా (ఉత్తరాంచల్), … ప్రాంతాల్లో మాత్రం సంపూర్ణంగా కనిపిస్తుంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పాక్షికంగా సూర్యగ్రహణం కనిపిస్తుంది. అంటే అంగులీయక సూర్యగ్రహణన్ని మనం చూడలేము.

మామూలు సమయంలోనైనా సూర్యుడిని నేరుగా చూస్తే చాలా ప్రమాదం అని మీకు తెలుసు కదా. రెటీనా దెబ్బతిని కనుచూపు పోయే ప్రమాదము ఉంది. సూర్యగ్రహణం సమయంలో కూడా అంతే. సూర్యుగ్రహణాన్ని కంటితో నేరుగా చూడడం ప్రమాదకరం.

ఎలా చూడాలి

 1. శాస్త్రీయంగా తయారు చేసిన సోలార్ ఫిల్టర్స్ ద్వారా మాత్రమే గ్రహణాన్ని వీక్షించాలి. జనవిజ్ఞాన వేదిక ఈ సోలార్ ఫిల్టర్స్ ను ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది.
 2. పిన్ హోల్ కెమెరా ద్వారా గ్రహణ ప్రతిబింబాన్ని చూడవచ్చు.
 3. Refractive telescope లేదా దర్పణం ద్వారా గ్రహణ ప్రతిబింబాన్ని గోడ పై/ తెర పై చూడవచ్చు.
 4. బాల్ – మిర్రర్ ద్వారా గ్రహణ ప్రతిబింబాన్నిగోడ పై/ తెర పై చూడవచ్చు
 5. ఒక అట్టముక్కకు గుండ్రని (వృత్తాకారంలో) రంధ్రం చేసి గోడకు దగ్గరగా సూర్యునికి ఎదురుగా అమర్చితే గోడపై గ్రహణ ప్రతిబింబం స్పష్టంగా చూడవచ్చు.

గ్రహణాలు: మూఢనమ్మకాలు – వాస్తవాలు

 1. సూర్యగ్రహణం అంటే రాహువు మింగడం…
  వాస్తవం: భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం వలన సూర్యగ్రహణము ఏర్పడుతుంది.
 2. గ్రహణ సమయంలో భూమి మీద, ఆహార పదార్థాలలో సూక్ష్మజీవులు విజృంభిస్తాయని, అందువలన గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు…
  వాస్తవం: రోగాలకు ఎటువంటి సూక్ష్మజీవులు, ఎలా కారణమో ‘రాబర్ట్ కాక్’ 1880 లలో నిరూపించారు! జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు వేలాదిమంది ప్రతీ గ్రహణ సమయంలో ఆహారం తీసుకొన్నారు. ఎవరికీ ఎలాంటి సమస్యా రాలేదు. అనేకమంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఔత్సాహికులతో పాటు సామాన్య ప్రజానీకం ముఖ్యంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు లక్షల సంఖ్యలో పాల్గొంటున్నారు. వారు కూడా ఆహారాన్ని తీసుకొంటున్నారు. ఎవరూ అనారోగ్యం బారిన పడలేదు. మీరు కూడా ఆహారం తీసుకోండి.
 3. ‘గ్రహణ మొర్రి’ అనేది గర్భవతులు గ్రహణాలు చూడటం వలన వస్తుంది…
  వాస్తవం: జన్యు పరంగా దగ్గరి సంబందం గల మేనరిక పెళ్లిళ్ల వలన మొర్రి గల పిల్లలు పుడతారు. పిండం ముఖం ఏర్పాటులో, కొన్ని ముఖ ఫలకాలు అతుక్కోవటంలో లోపం వలన ఇది ఏర్పడుతుంది.
 4. 2019 డిసెంబరు 16న ఏర్పడిన సూర్యగ్రహణం తో ‘కొరోనా వైరస్’ వ్యాప్తి మొదలైందని, అది ఈ జూన్ 21న ఏర్పడే గ్రహణంతో అంతమౌతుంది…
  వాస్తవం: యిది ఒట్టి పుకారు మాత్రమే. ఇవి కుతర్కంతో కూడిన వ్యాఖ్యలు. సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు ఎర్రటి రింగు సూర్యుని చుట్టూ కనిపిస్తుంది. దీనిని కరోనా అంటారు. ‘కరోనా’ అంటే సూర్యుడి బాహ్య వాతావరణంలోని వెలుగు. గ్రహణ కాలంలో, సూర్యుడి వెలుతురు తగ్గిపోయి, ‘కరోనా’ పూర్తిగా కనిపిస్తుంది. గ్రహణ సమయంలో కనబడే కరోనా కి, కొరోనా వైరస్ నకు ఎలాంటి సంబంధం లేదు.
 5. గ్రహణ సమయంలో రోట్లో రోకలి నిటారుగా నిలబడుతుంది…
  వాస్తవం: మామూలు సమయంలో కూడా రోకలి నిటారుగా నిలబడుతుంది. మీరూ మీ యింట్లో చేయవచ్చు.

గ్రహణాల వల్ల ఎలాంటి అనర్థాలు జరగవు, అద్భుతాలు కూడా జరగవు

సూర్యగ్రహణాలు నాలుగు రకాలు. అవి

 1. సంపూర్ణ (Total),
 2. వలయాకార (Annular),
 3. పాక్షిక (Partial),
 4. హైబ్రిడ్ (Hybrid).

సంపూర్ణ సూర్య గ్రహణం
ఆకాశంలో సూర్యుడు చంద్రుడు ఒకే సైజులో కనబడే దూరంలో భూమి నుండి చంద్రుడు ఉన్నప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయడం వల్ల ఇది జరుగుతుంది. అత్యంత ప్రకాశవంతమైన గోళం వలే కనిపించే సూర్యుడు చంద్రుడి ఛాయ వల్ల ఒక సన్నటి అంచువలే కనిపిస్తాడు. ఏదైన సమయంలో సంపూర్ణ సూర్య గ్రహణం భూమి మీద ఒక ప్రదేశములో వారికి మాత్రమే కనిపిస్తుంది.

వలయాకార (ఆన్యులర్) సూర్యగ్రహణం
సూర్యుడు చంద్రుడూ ఒకే కక్ష్య లోకి వస్తారు. కాని సూర్యుని కంటే చంద్రుని పరిమాణము చిన్నదిగా ఉండడం వలన, చంద్రుని చుట్టూ సూర్యుడు ఒక ప్రకాశవంతమైన ఒక ఉంగరం వలే కనిపిస్తాడు.

పాక్షిక సూర్యగ్రహణం
సూర్యచంద్రులు ఒకే కక్ష్యలో ఉండరు. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగానే అడ్డుకుంటాడు. అప్పుడు ఏర్పడే గ్రహణాన్ని పాక్షిక సూర్యగ్రహణం అని అంటారు. పాక్షిక గ్రహణం భూమి మీద చాలా భాగాలనుండి కనిపిస్తుంది.

హైబ్రిడ్ సూర్యగ్రహణం
ఇది సంపూర్ణ, వలయాకార సూర్య గ్రహణాలకు మధ్యస్తంగా ఉంటుంది. ఈ సంకర గ్రహణము భూమిపై కొన్ని ప్రదేశాలలో సంపూర్ణ గ్రహణంగా, మరి కొన్ని ప్రదేశాలలో పాక్షికంగాను కనిపిస్తుంది. సంకర గ్రహాణాలు చాలా అరుదు.

భూమి చుట్టూ ఉండే చంద్రుని కక్ష్య, సూర్యుడి చుట్టూ తిరిగే భూమి కక్ష్యా తలానికి 5 డిగ్రీల కంటే కొద్దిగా ఎక్కువ కోణంలో వంగి ఉంటుంది. దీని వలన అమావాస్య నాడు చంద్రుడు సూర్యుడికి పైనో క్రిందో ఉంటాడు. అమావాస్య నాడు, చంద్రుడు చంద్ర కక్ష్య, భూకక్ష్య ఖండించుకునే బిందువులకు దగ్గరగా ఉన్నపుడు మాత్రమే సూర్య గ్రహణము ఏర్పడుతుంది. అందుకే అన్ని అమావాస్యలలో సూర్య గ్రహణం ఏర్పడదు. ఈ సారి అమావాస్య రోజు చంద్రుడు, సూర్యుడిని దక్షిణం నుండి ఉత్తరం వైపు దాటుతుంది.

గ్రహణాలు ఖగోళ శాస్త్రవేత్తలకు ఒక పండుగ!
సంపూర్ణ సూర్య గ్రహణాలు, భూమ్మీద ఎక్కడైనా సరే, చాలా అరుదు. సంపూర్ణ సూర్య గ్రహణం చూడదలచిన శాస్త్రజ్ఞులు ఆ గ్రహణం పట్టే ప్రదేశాలు సుదూరంలో ఉన్నప్పటికీ అక్కడకు వెళ్ళి ఆ గ్రహణాన్ని పరిశీలిస్తారు. ఖగోళ రహస్యాలను ఛేదించడానికి శాస్త్రవేత్తలకు యిది మహత్తర అవకాశం. అనేక పరిశీలనలు, పరిశోదనలు చేస్తారు. Einstein ‘సాపేక్షత సిద్దాంతం’ కు ఋజువులు దొరికింది సూర్యగ్రహణం సమయంలోనే (కాంతిపై గురుత్వాకర్షణ శక్తి ప్రభావం).

రింగ్ ఆఫ్ ఫైర్:
వలయాకార సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు సూర్యుని చుట్టూ ఎర్రటి రింగు కనిపిస్తుంది. ఆ ఎర్రటి రింగు పేరే కరోనా. అంటే ఇది సూర్యుని వాతావరణంలోని ఒక భాగం. ఈ కరోనా లేయర్ సోలార్ ఫిజిక్స్ లో అంతుచిక్కని రహస్యంగా ఉంది. ఎందుకంటే భగ భగ మండే సూర్యుడి కన్నా ఈ కరోనా లేయర్ లో ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్టుగా శాస్త్రవేత్తల అంచనా. దీనిని కనిపెట్టడానికి నాసా పార్కర్ ప్రోబ్ అనే ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని 2019 లో పంపింది. 2020 ఈ సంవత్సరం ఐరోపా, నాసా కలిపి సంయుక్తంగా మరొక కృత్రిమ ఉపగ్రహాన్ని పంపింది. మన ఇస్రో కూడా ఈ సంవత్సరం ఆదిత్య L-1 అనే కృత్రిమ ఉపగ్రహాన్ని పంపడానికి సిద్ధంగా ఉంది. ఈ కరోనా లేయర్ ను మనం 21 జూలై, 2020 వలయాకార సూర్యగ్రహణం రోజున చూడవచ్చు.

1999లో ఐరోపాలో కనిపించిన సూర్యగ్రహణమును ప్రపంచంలో అత్యధిక ప్రజలు వీక్షించారని చెబుతారు. దీనివలన గ్రహణాల పట్ల ప్రజలకు అవగాహన పెరిగింది. తరువాతి గ్రహణాలు 2005, 2006 లలోను, 2007 సెప్టెంబర్ 11 న వచ్చాయి. తరువాతి సంపూర్ణ సూర్యగ్రహణము 2008 ఆగష్టు 1 న, 2019 డిసెంబరు 16న వచ్చాయి

రండి! మిత్రులారా….
ఈ వలయాకార సూర్య గ్రహణాన్ని ఆనందంగా వీక్షించి మూఢనమ్మకాల నడ్డి విరగ్గొట్టి సుందర ఖగోళ ప్రక్రియను ఆస్వాదిద్దాం. మన యింట్లో ఉన్న ఐన్ స్టెయిన్, హాకింగ్, సాగాన్… లను ప్రోత్సహిద్దాం.

జనవిజ్ఞాన వేదిక,
తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలు
ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ అనుబంధం

ఇక్కడ క్లిక్ చేయండి