తెలంగాణ అక్షర దీప్తి పొట్లపల్లి

తెలంగాణ అక్షర దీప్తి పొట్లపల్లి

ఐ.చిదానందం

తాను జన్మించినది దోరల కుటుంబ నేపధ్యంమే అయినా దొరల దర్పం ప్రదర్శించక సామాన్యుల తో కలిసి తన జీవనాన్ని సాగించి , సామాన్యుల వ్యతలను తన రచనలలో ప్రతిబింబ చేసినవారు పోట్లపల్లి రామారావు.

జననం:
పొట్లపల్లి రామారావు 1917 వరంగల్లు జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో జన్మించారు.వీరి తల్లిదండ్రుల పేర్లు చెల్లమ్మ , శ్రీనివాసరావులు. నలుగురు కుమారులు , ఒక కుమార్తె గల కుటుంబం లో పోట్లపల్లి మూడవ సంతానం.

బాల్యం:
పోట్లపల్లికీ చిన్న వయసులోనే (పన్నెండేళ్లకే) తండ్రి అకాలమరణం పొందారు. అలాగే పదహారవ యేట నే మేనమామ కూతురు వెంకట నరసమ్మ తో వివాహం జరిగింది. ఆ తర్వాత వీరికి ముగ్గురు కూతుర్లు , ఒక కుమారుడు జన్మించారు. ఇలా కుటుంబ బరువు బాధ్యతలు ఎన్ని వున్నా పొట్లంపల్లి సామాజిక ధృక్పధం మాత్రం కోల్పోలేదు. వివిధ ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గోన్నారు. నిజాం వ్యతిరేక ఉద్యమాల్లో జైలుకు కూడా వెళ్లారు.ఆ అనుభవం తోనే సామాజిక కోణం ల్లా రచనలు చేశారు. ఆయితే వీరు సభలకు సమావేశాలకు దూరంగా ఉండేవారట. రామారావుకు ప్రత్యేకించి చదువంటే ఇష్టం.ఎంత ఇష్టమంటే హైదరాబాద్ లోనీ స్టేట్ లైబ్రరీలోని అన్ని పుస్తకాలు కూడా చదవారట.

రచనలు
కవిత్వం

 • చుక్కలు
 • మెరుపులు
 • అక్షర దీప్తి
 • నాలో నేను

గేయాలు

 • ఆత్మ వేదన

కథలు

 • జైలు
 • జైలు డైరీ
 • న్యాయం
 • మా ఊరికి
 • ఆహ్వానం
 • ముత్యాల బేరం
 • మామూళ్ళు
 • వెన్న కథలు
 • హఠం

కథా సంపుటాలు

 • జైలు కథలు
 • ముల్లా కథలు (అముద్రితం)
 • ఆచార్యుల వారి కథలు (అముద్రితం)

నాటికలు

 • సర్ బరాహి
 • పగ
 • పాదదూళి
 • న్యాయం

మరికొన్ని

 • సైనికుని జాబులు (అముద్రితం)
 • నీలవేణి (అసంపూర్ణ నవల-అముద్రితం)
 • గ్రామ చిత్రాలు (అముద్రితం)

కవిత్వం
ఆత్మ వేదనలో జనతా గ్యారేజ్ అనే గేయం లో
సిలువేక్కించిన మేమే
నిలువేక్కించినఇచ్చినా
ఉరిమేక్కించిన మేమే
కరినెక్కించిన మేమే
అంటూ నిరంకుశ పాలన కలకాలం ఉండబోదని ప్రజలకు ఉద్భభోధించారు.
ఎవడు ఇక్కడ రైతు
ఎవడు ఇక్కడ రాజు
కష్టించు వాడొకడు
కాజేయు వాడొకడు
అంటూ ఆత్మ వేదన గేయంను రాసారు. ఈ సంపుటిని దేశోద్దారక మండలి ద్వారా వట్టికోట ఆళ్వారుస్వామి వెలుగులోకి తెచ్చారు. హైదరాబాద్ రాజ్యం లో నిజాం పాలన నిరంకుశత్వం కు ప్రతీక గా మిగిలిపోయింది. ఈ నిరంకుశత్వంను వ్యతిరేకిస్తూ ఎందరో కవులు, రచయితలు తమ రచనలు వెలువరించారు. అందులో పొట్లపల్లి ఒకరు.

తల బరువుగా పరిణమించిన
ఏ వ్యవస్థకు గాని
ఏదో ఒక దశలో ప్రజలు
చరమగీతం పాడక తప్పదు
( 1 )
ఎన్ని ప్రాణులు ఎండలో కలిమి వానలో నాని చలికి బిగిసి నిద్రలు కాచి కడుపు
అంట గట్టుకొని శ్రమిస్తే
ఈ అపార సంపద కూడింది
( 2 )
తుపాకీ గొట్టంలో నుండీ
అధికారం ఉద్భవిస్తుంది
అనే ఆలోచన ఎవరి తల నుండీ
ఉద్భవించిందో కాని
అది కంటబడ్డ పత్రివాడి
తల తిరగడం ఆరంభిస్తుంది ( 3 )
ఘర్మజలము కండబలము
కంటనీరు – ఒంటి నెత్తురు
కాన్కలెట్టే – గడన చేసిన
ధాన్య రాసులు తస్కరించే
రాజులుండేమి-రాజ్యముండేమి ( 4 )
గొర్రెపాటి వెంకటసుబ్బయ్య 1974లో 325 కవితలతో ఒక కవితా సంకలనం ను వెలువరించారు. దీనిలో నెలవంక పేరుతో ముందుమాటను సంజీవదేవ్ రాసారు. హైదరాబాద్ యువ భారతి ఇందులోని కవితలను కూర్చి మెరుపులుగా ప్రకటించారు. అలాగే మరికొన్ని కవితలను పొట్లపల్లి అభిమాని ఒకరు అక్షర దీప్తి గా ప్రచురించారు.పొట్లపల్లి చుక్కలు (1974) కవితాసంపుటి మిత్రమండలి తరుపున కాళోజీ , గొర్రెపాటి వెంకటసుబ్బయ్య , కె.సీతారామయ్య ఆర్థిక సాయంతో ప్రచురించబడింది.చుక్కలు (1965) కవితసంపుటి 27 కవితల సంపుటి.ఆత్మ వేదనలు 23 కవితలు కలవు. ఇందులో జనత , చూద్దాము, కాలిబాట చెప్పుకోదగినవి.కాళోజీ గారు పొట్లపల్లి రామారావు గారి కాలిబాట అనే గేయాన్నీ ఎన్నో సభలో చదివి వినిపిస్తూ ఉండేవారట.కాళోజీ అన్న రామేశ్వరరావు ప్రోత్సాహంతో ప్రభావంతో పొట్లపల్లి ఉర్దూలో కూడా కవిత్వం రాశారు.
కీర్తిప్రతిష్టలు దానం
ఇలాంటి క్షుద్రంత్వాలను అల్పత్వాలను
అన్ని తొలగించి వేయి
రచన కోసం సర్వస్వం
త్యాగం చేయనిదే
రచనల సృష్టి కావు
అంటూ నాలో నేను లో తన రచనా వ్యక్తిత్వాన్ని పొట్లపల్లి వ్యక్తం చేశారు.
2001లో వి.ఆర్.విద్యార్థి ప్రచురించిన దిక్కులు అనే వీడియో కవితా సంకలనం లో కూడా పొట్లపల్లి వారి కవితలు కలవు.
పొట్లపల్లి కథలు
నిజాం ప్రభుత్వం పాలన లో ఎన్నో లోపాలు కలవు. ప్రభుత్వం పన్నులు , వెట్టిచాకిరీ , రైతులపై అరాచకాలు, సైనికులు రజాకార్ల దౌర్జన్యాలు ఇలా ఎన్నో విషయాలు కలవు.వాటి నిరసిస్తూ ఎంతో మంది కవులు రచయితలు రచనలు చేశారు. ఇలాంటి నేపథ్యంలోనే పొట్లపల్లి రాసిన కథలు జైలు కథలు. ఇందులోని జైలు కథ డిగ్రీ కళాశాల విద్యార్థులకు బోధన గా కలదు.
పొట్లపల్లి మౌల్వీ నసిరుద్దీన్ కథలను తెలుగులో పిల్లల కథలుగా ఆనందవాణి లో ప్రచురించారు. వీటిలో ముల్లా ముక్తి , ముల్లా చమత్కారం , ముల్లా ఇతిహాసం , ముల్లా వివేకం, ముల్లా రసిత్వం వంటి కథలు కలవు.ఆచార్యులవారి కథలు కూడా బాలసాహిత్యం సంబంధించినవే.ఇవి కాక మరో 8 కథలు కూడా కలవు. భూపాల్ అనే పరిశోధకుడు తన రచనలలో వీటిని పేర్కొన్నారు.
పొట్లపల్లి నాటికలు
తెలంగాణలో మా భూమి ముందడుగు నాటకాలు ప్రదర్శించబడుతున్న సమయంలోనే పొట్లపల్లి నాటకాలు రావడం జరిగింది.నిజాం పాలన పై వారి దౌర్జన్యాలపై మొదటగా తిరగబడింది కమ్యూనిస్టులు. వారి ప్రాబల్యం గల గ్రామాల పై పోలీసులు అరాచకంగా విరుచుకు పడేవారు. ఇలాంటి నేపథ్యంలో పొట్లపల్లి 1948లో పగ అనే నాటికను రాశారు. ఇదీ 1948 లో అభ్యుదయ పత్రికలో ప్రచురించబడింది.సంఘం నాయకత్వం లో ప్రజలు చైతన్యవంతులు కావడంను రచయిత పగ నాటిక లో చెప్పారు. ఈ నాటికలో నరసింహరెడ్డి అనే నాయకుడు జాడ కై పోలీసులు ప్రజలను, రైతులను హింసిస్తారు. ప్రజలు అతని జాడను చెప్పరు. అయితే వారిలోనే ఉన్న ప్రజాద్రోహి అయినా పట్వారీ నరసింహారెడ్డిని పట్టిస్తాడు. చివర్లో రెడ్డి పోలీసుల కంట్లో కారం చల్లి పారిపోవడం ఇతివృత్తం.
పోలీసులు చేసే అకృత్యాలకు బలి అవుతున్న బడుగు వర్గాలను చిత్రీకరిస్తూ పొట్లపల్లి వారు 1949 లో న్యాయం అనే నాటికను రాశారు. ఇందులోని సంభాషణలు తెలంగాణ మాండలికం లో కలవు. ఇదీ నాటి విశాలాంధ్ర పత్రికలో ప్రచురించబడింది. న్యాయం నాటికలో చంద్రయ్య తన కోడిని మల్లయ్య ఇంట్లో చంపి తిన్నారనే నేరం మోపడం జరుగుతుంది. విచారణకు వచ్చిన అమీన్ (పోలీస్) భోజనం కు కోడి కావాలని ఎరుకల వాణ్ని బెదిరించడం జరుగుతుంది. అలాగే తన కోడిని అన్యాయంగా పట్టు కొని తెచ్చిన పోలీసులను మీరు కూడా దోంగలే కదా అనీ ఎరుకలవాడు ప్రశ్నించడం మనకు కనిపిస్తుంది.ఇందులో పోలీసుల అక్రమ వసూళ్లు సామాన్య జనం ఇబ్బందులు గురించి కలదు.
దొరలు జనం పై పడి దౌర్జన్యాలతో వారి శ్రమ ను ఎలా దోపిడి చేస్తున్నారో కలదు. సర్ బరాహి అనే నాటిక లో పేరమ్మ పాత్ర దొరల గడీలో వున్న తన గేదెను ధైర్యంగా విడిపించుకుని పోవడం మనం చూస్తాం. ఈ నాటికలో మనకు స్త్రీ చైతన్యం కనిపిస్తుంది.అస్సాంలోని ఒక ప్రాంతంలో దళితులపై దోపిడీ , హత్య జరిగింది. గాంధీజీ ఆ ప్రాంతమును సందర్శించినప్పుడు ఆ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ గాథ నే పాదదూళి గా రచయిత నాటిక గా రాసారు.ఇది నాటి అభ్యుదయ పత్రికలో ప్రచురితమయింది. జాతీయోద్యమం లోని పరిమితులను , లోపాలను ఈ నాటిక ద్వారా తెలిపారు పొట్లపల్లి.
ఇతర రచనలు
1947 లో సైనికులు జాబులు అనే రచన రాసారు పొట్లపల్లి. యుద్ధోన్మాదం తో వుండేనుండే దేశాధినేతల మనో గతం అలాగే సైనికుల మనో భావాలు ఎలా ఉంటాయో దీనిలో కలదు. దీనిలో యుద్ద వ్యతిరేకత తో పాటు సామాన్యుల ప్రేమానుబంధాలు కలదు. సరిహద్దుల్లోని యుద్ధ వాతావరణాన్ని సైనికుడు తన భార్య సీత కు రాసే ఉత్తరాలే సైనికుని జాబులు.
ఇతర విషయాలు
పొట్లపల్లికీ ప్రభుత్వ అవార్డులపై ఆసక్తి లేదు. అలాగే తీసుకొనే వారు దీని పై ఆలోచించాలి అనేవారు. అందుకే తనకు ఇష్టుడైనా కాళోజీ కీ పద్మవిభూషణ పురస్కారం వచ్చినప్పుడు ఇచ్చేవాడు ఎందుకు ఇచ్చాడు అనేది తీసుకొనే వాడు ఎందుకు తీసుకున్నాడు అనేదే ప్రశ్న అంటూ ఉర్దూలో విమర్శించారు.
పొట్లపల్లి బహుభాషావేత్త. వీరికి తెలుగు, ఉర్దూ లలో పాండిత్యం తో పాటు హిందీ, ఇంగ్లీష్ లో ప్రవేశం కూడా కలదు.పొట్లపల్లి అభిమాన కవులు , రచయితలు రాయప్రొలు, చలం , ప్రేమ్ చంద్, కిషన్ చందర్ , గోర్కీ , పెరల్ బక్ , విలియం సారాయన్ మొదలైన వారు.
పరిశోధన
2012 లో పొట్లపల్లి రామారావు వ్యక్తిత్వం , సాహిత్యం పేరిట ఎం.భూపాల్ రెడ్డి గారు సమగ్ర పరిశోధన చేసారు. అలాగే వీరి సంపాదకత్వం లోనే పొట్లపల్లి శత జయంతి సందర్భం గా పొట్లపల్లి సాహిత్యం 2-సంపుటాలు గా పొట్లపల్లి వరప్రసాద్ ఫౌండేషన్ ప్రచురించింది.
ముగింపు
పొట్లపల్లి వారి జైలు జీవితం గురించి కాళోజీ చెబుతూ నజ్ర్రుల్ ఇస్లాం సైనికుడిగా 1914 లో మొదటి ప్రపంచ యుద్ధంలోకి వేళ్లి తిరిగి వచ్చినట్లు గా రామారావు స్వాసంత్ర్య సమరయోధుడి గా జైలు కి వెళ్లి వచ్చినారు అంటారు. అలాగే రామారావు గారిని తెలుసుకోవడం మనకు పూర్తి గా తెలియని తెలంగాణ అంతరంగాన్ని తెలుసుకోవడమే అని వరవరరావు అనడం గుర్తుకు తెచ్చుకోవాలిసిన సమయం ఇదీ అనీ తెలుపుకుంటూ చివరగా పొట్లపల్లి కవిత తో ముగిద్దాం….

చీకటి లో చంద్రోదయం అయినట్టు ప్రతి దుఃఖానుభవం నుండీ ఓ సుందర భావం ఉదయిస్తుంది

ఐ.చిదానందం తెలుగు బాషోపాధ్యాయులు తెలుగు రీసేర్చి స్కాలర్