తెలంగాణ కథ గిరిజన జీవన చిత్రణ

తెలంగాణ కథ గిరిజన జీవన చిత్రణ

ఐ.చిదానందం

భిన్న జాతుల సమాహారమైన భారత ఉపఖండంలో అనేక గిరిజన సముదాయాలు నివసిస్తున్నాయి. ఆదివాసీలు తమదైన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, సామాజిక విలువలను కలిగి ఉన్నారు.

గిరిజనులు- నిర్వచనం
గిరిజనులు అంటే ఎవరు అని అర్థం చెప్పాలంటే నైఘంటికార్దంలో ప్రస్తుతం పట్టణాలకు దూరంగా ఉండి అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని సమాజం అని అర్థం. గిరిజనులు అంటే కొండలకు కోనలకు సమీపంగా జీవించేవారని అర్థం కూడా కలదు. వీరి లో చాలా తెగలున్నాయి.కోయ,గోండు, లంబాడి,ఎరుకల మొదలైన తెగలు కలవు.
తెలంగాణ గిరిజనుల ప్రధాన సమస్యలు
తెలంగాణ గిరిజన పోరాటాలలో ప్రధాన సమస్య భూ సమస్య.దీని చుట్టునే అనేక రకాలైన కథలు కనిపిస్తాయి.గిరిజనులు భూమిని వ్యవసాయం చేసుకొని జీవించేవారు. వీరు భూమిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు.1970లో దశకంలో తెలుగు కథలలో గుణాత్మకమైన మార్పు వచ్చింది. శ్రీకాకుళ గిరిజన పోరాటం వంటివి తెలుగు కథలు దారి చూపాయి.1952లో నూతన జాతీయ అటవీ విధానం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం అడవులు అందఱి ఆస్తి.గిరిజనుల సమస్యలు.

 • భూ సమస్య
 • పొలవరం ప్రాజెక్టు సమస్య
 • ప్రకృతి వైపరీత్యాలు
 • కరువు,ఆకలీ కేకలు
 • మతమార్పిడి
 • ఆచార వ్యవహారాలు
 • గిరిజన చైతన్యం
 • స్త్రీ సమస్యలు
 • వెట్టి సమస్య,శ్రమ దోపిడీ
 • వర్తమాన సామాజిక సమాజం,ఇతరములు


భూ సమస్య చిత్రణ కథలు
ఖమ్మం జిల్లాలోని గిరిజన,గిరిజనేతర ప్రజా జీవితాల్లోని సంఘర్షణను ఆగ్రహాన్ని ప్రతిఘటనను అక్షర బద్దం చేసిన వారు శిరంశెట్టి కాంతారావు. వీరు రాసిన ఊత కర్రలు కథలసంపుటి గిరిజనుల జీవన నేపథ్యంలో సాగుతాయి. కాంతా రావు రాసిన బిగిసిన పిడికిళ్ళు అనే కథలో గిరిజనుల భూ సమస్య చిత్రణ కలదు. కథలో తండ్రి కోదండయ్య కొడుకు యోగి రావులు భూస్వాములు. మంగలి గూడెం లో గిరిజనుల సాగు భూములను అక్రమంగా తన పేర పట్టా చేయించుకుంటాడు కోదండ య్య. ఆతర్వాత కాలం లో కొడుకు యోగి రావు కాలం వచ్చే నాటికీ గిరిజనులు విద్యావంతులు కావడం వల్ల నిజం తెలుసుకొని ఎదురు తిరగడం ఇతివృత్తం ఇది గిరిజనులలో వచ్చిన చైతన్యాన్ని చెప్పింది.


పొలవరం ప్రాజెక్టు సమస్య చిత్రణ కథలు
జీవన్ రాసిన పోటెత్తిన జనసంద్రం కథ. గోదావరి నది పై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన ముంపుకు గురి అవుతున్న గిరిజన గూడెం జీవన స్థితిని తెలియజేస్తుంది.దిలావర్ రాసిన అరణ్యరోదన కథ కూడా పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల గురించే సాగుతుంది. గిరిజనుల కు కలిగే ప్రకృతి వైపరీత్యాల గురించి కూడా కలదు.


ప్రకృతి వైపరీత్యాలు చిత్రణ కథలు

ఉదయమిత్ర రాసిన కథ దాడి.ఇది గిరిజనుల పై పొంచి ఉన్న ప్రకృతి వైపరీత్యాల వరదలను గురించి చెబుతుంది.కథలో ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనుల పరిస్థితిని తెలియజేస్తాడు రచయిత.


కరువు,ఆకలి చావుల చిత్రణ కథలు
తుమ్మెటి రఘౌత్తమ రెడ్డి రాసిన పనిపిల్ల కథలో కృష్ణారెడ్డి,యశోదమ్మ మహేంద్రలు ఉన్నత వర్గానికి చెందినవారు.శివయ్య,పని పిల్ల పేద వర్గానికి చెందిన వారు.వరుసగా రెండేళ్లు కరువు రావడంతోవీరి జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చింది అనీ రచయిత విశ్లేషించారు.ఈ కథలో రచయిత మహేంద్ర అనే పాత్రను మానసిక సంఘర్షణను చక్కగా చెప్పారు.
ప్రత్యేకంగా గిరిజన తెగలలో నాయక పొళ్లు అనే తెగ ప్రస్తావన ఇందులో కలదు.
గిరిజన బిడ్డల ఆకలి చావులను ఆర్ద్రత గా చిత్రించిన కథ అడవి పూలు. దీనిని బోయ జంగయ్య రచించారు. కథ లో రాం లాల్ కు ఉన్న ఏకైక సంతానం మోతి.తల్లి చిన్నతనంలో చనిపోయింది.తండ్రి అల్లారుముద్దుగా పెంచాడు.పేదరికంతో మగ్గిపోతున్న ఎప్పుడు చెయ్యి చాచలేదు. సంపాదించే రాం లాల్ కు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. మోతీ పనికి ఆహార పథకం కోసం ఏడు కిలోమీటర్లు నడిచిపోతోంది. పని తర్వాత కూలీ డబ్బులు అడిగితే బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు అని అబద్దం చెప్పాడు మేస్త్రి. మోతీ అభిమానంతో ఎవరి దగ్గర చెయ్యి చాచలేదు.మోతీ నాలుగు రోజుల తర్వాత ఇంటికి వెళ్తుంది. తండ్రీ కీ జ్వరం తగ్గింది.కానీ మరునాడు మోతి మరణిస్తుంది. అందరు పాము కరిచి మోతీ చనిపోయింది అని అనుకుంటారు.చివరికి మానవ హక్కుల కమిషన్ ప్రమేయంతో మోతీ కీ పోస్టుమార్టం చేయడం,ఆమె పేగుల్లో ఎలాంటి ఆహారం దొరకలేదనీ ఆమె అన్నం లేక తినక చనిపోయిందని రిపోర్టు లో ఉంటుంది.ఇలాంటి ఎందరో అభిమానవంతులు గిరిజనులు గిరిజనుల లో ఉన్నారని రచయిత వాస్తవిక చిత్రణకు శ్రమ దోపిడీకీ అద్దం పట్టే కథను రాశారు.


మత మార్పిడి నేపధ్య కథలు
పెద్దం అనసూయ రాసిన మూగబోయిన శబ్దం కథ గిరిజనుల జీవితం లోని మత మార్పిడి అని తెలిపింది. గిరిజన అమ్మాయి తీతుగుంపు అనే గూడెంకు చెందిన ఓ యువతి. గొప్పగా చదువుకొని ఉద్యోగం సంపాదించి,గూడెం కు దూరం అయిపోయిన నాగరిక పట్టణ జీవనంలో బతుకు కొనసాగించడం లను ఈ కథ తెలుపుతుంది. అలాగే మత మార్పిడి విషయం కూడా కలదు. ఇంకా దీనిలో కర్మకాండలను జరిపించే డోలోళ్ళు గా పిలవబడే ఆశ్రిత కులస్తుల గురించి కలదు.
ఆచార వ్యవహారాల చిత్రణ కథలు
ఖమ్మం జిల్లా వాసి సమ్మెట ఉమాదేవి వీరు అమ్మ కథలు,రేల పూలు అనే కథల సంపుటి వెలువరించారు. రేల పూలు సంకలనంలో గిరిజనుల జీవన వైవిధ్యాన్ని జీవిత పోరాటాన్ని వారి ఆచార వ్యవహారాలను నిక్షిప్తం చేశారు. దీనిలో 17 కథలు కలవు.
గిరిజనుల గోండు జీవితాలను అధారం చేసుకుని మలుపు నాగరికత అనే కథను రాసిన వారు అల్లం రాజయ్య. వీరు గిరిజనులను జీవనాన్ని వారి జీవన క్రమంలో మంచి మలుపు తిరగాలనే ఉద్దేశంతో రచయిత ఈ కథను రాశారు.


గిరిజనుల చైతన్య సంబంధింత కథలు
బి.ఎస్.రాములు రాసిన కథ అడవి లో వెన్నెల గిరిజనుల పోరాట చైతన్యాన్ని చిత్రీకరించింది.అడవిలో ఉండే అమాయక గిరిజన యువతులు దుర్మార్గుల చేతిలో ఎలా మోసపోతున్నారో వివరిస్తునే అలాంటి అక్రమార్కుల కాలం తప్పక సమాధానం చెబుతుందని గిరిజనులు అమాయకుల కాక ఆత్మస్థైర్యం తో ఉండాలని చెబుతూ జనపరెడ్డి సత్యనారాయణ (కరీంనగర్) గారు అడవి మల్లెలు అనే కథను రాశారు. ఇది 1961లో భారతి పత్రికలో ప్రచురితమయింది.


స్త్రీ ల సమస్య చిత్రణ కథలు
అదిలాబాద్ అవతల మహారాష్ట్ర ప్రాంతాలలో గిరిజనుల మధ్య తిరుగుతూ విప్లవదళం లోని ఒక మహిళ అనుభవ కోణంలో రాసిన కథ మా బడి. ఇది 1988 జూలై లో అరుణ తార లో ప్రచురించబడింది. దీనిని రాసినవారు మయూరి. ఈ కథ లో ఆదివాసి సుక్కు జీవితం ఆధారంగా వ్రాయబడింది. ఇందులో దళంలో పని చేసే మహిళ మయూరి.ఈ కథ లో తనకు వచ్చే బహిష్తు సమయపు సమస్యలు. మానసిక పరిస్థితిని గురించి ఉంటుంది.ఈ కథలో మహిళ భర్త యే ఆ దళ కమాండర్. ఉద్యమ బాధ్యతల వల్ల వారికీ దొరకని ఏకాంతం,యుద్ధవాతావరణం కఠినత్వం ఇవన్నీ విప్లవ కోణంలో కాక స్త్రీ మనో వికారాలను,మనోవిశ్లేషణ ను చెప్పే ప్రయత్నం చేసింది రచయిత్రి.
అదిలాబాద్ అడవి నేపథ్యంలో గోండు స్త్రీ చుట్టూ తిరిగే కథ బురద.దీనిని రాసిన వారు అల్లం రాజయ్య. దీనిలో ప్రపంచీకరణ వలన గ్రామాలలో కృతిమ కరువు వచ్చి గోండులు బతుకులు విచ్ఛిన్నమై బతుకుతెరువు కోసం బురద(పట్టణం) లోకి రావడం అక్కడ డబ్బుకోసం ఒళ్లు అమ్ముకోవాలిసి రావడం, బిడ్డల నమ్ముకునే దుస్థితిలో గిరిజనులు ఎలా వెళ్లాలరనే ఇతివృత్తంతో రచయిత కథను రాశారు.దీనికి పరిష్కారం సమిష్టి బాధ్యత అని గుర్తు చేస్తారు రచయిత.


వెట్టి సమస్య,శ్రమ దోపిడీ చిత్రణ కథలు
పి.చంద్ రాసిన రాధాబాయి కథలో పొఘ అనే ముసలివాడు. అడవిలో కట్టలు కొట్టుకుంటూ జీవించేవాడు. అతనికి నరసింహం అనే కొడుకు, ఇస్తు అనే మనవడు, రాధా బాయి అనే మనువరాలు కలరు. నరసింహ,ఇస్తు ఇద్దరు పోలీసుల చేతిలో అక్రమంగా చంపబడ్డారు.రాధా బాయి కాయకష్టం చేస్తూ రాఘవేంద్రరావు అనే కాంట్రాక్టర్ దగ్గర పనికి కుదురుతుంది.ఆమె మోస పోతుంది. ఈ కథ ప్రధానంగా ఇసుక వ్యాపారం పైన గిరిజనుల పై శ్రమదోపిడి పైన కలదు.


వర్తమాన సామాజిక సమాజ చిత్రణ కథలు
ఆదిలాబాద్ కు చెందిన వారు గోపీ భాగ్యలక్ష్మీ. వీరు దాదాపు గా ఏడు కథలు రచించారు. జంగు బాయి,నాగమణి,గంగ పొంగు,బాల్యాన్ని రక్షించు,బతుకు పయనం, దేవేంద్రీ,భాగీరథీ ఈ కథలలో ఈ కథలలో గిరిజనుల ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు నాగరికత కొన్ని విషయాలు ఉన్నాయి.అక్కడి గిరిజన స్త్రీలు కూడా ఆధునిక ప్రపంచానికి తగినట్లుగా వివాహం చేసుకోవాలని అలాగే అందఱి లాగే బాల్యాన్ని ఆస్వాధించాలనీ చెబుతూ వీరి కథలు సాగుతాయి. భాగ్యలక్ష్మి రాసిన కథలలో జంగుబాయి ప్రముఖమైంది. ఇది గోండు గిరిజనుల జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ కథ ఉత్తమ పురుష లో సాగుతుంది. కోత్తగా గూడెం లోకి వచ్చిన ఉపాధ్యాయుడి భార్యకు ఎదురైన అనుభవాలే ఈ కథ. గిరిజనులైన జంగు బాయి,లచ్చుంబాయి,రుకీ, నాందేవ్ ప్రవర్తన ఆచార వ్యవహారాలు మొదటగా ఉపాధ్యాయుడి భార్యకు వింతగా తోస్తాయి, కానీ ఆతర్వాత వారి ఆత్మస్థైర్యం ఆమె కు నచ్చుతుంది.
జంగు బాయి కీ చిన్నప్పుడే పెళ్లి అవుతుంది. యుక్త వయసు వచ్చాక అబ్బాయి పొట్టిగా ఉన్నాడని ఆమెకు నచ్చదు.ఒకరోజు తనకు నచ్చిన ఇంట్లోకి వచ్చిందట వంటి మాటలు గిరిజనుల స్త్రీ స్వేచ్ఛను తెలియజేస్తాయి. అలాగే జంగు బాయి స్నేహితురాలు కమల ప్రేమించిన వాడి వల్ల మోసపోయి ప్రాణ త్యాగం చేయడం వంటి వర్తమాన సమాన విషయాలతో ఈ కథ సాగుతుంది.
గిరిజనుల జీవితాల్లోని ఎత్తుపల్లాలను సామాజిక సమస్యలను చిత్రీకరిస్తూ కథలు రాసిన వారు శ్రీలత (పాలమూరు) వీరు రెల్లు పూల జల్లు, పచ్చిక గూళ్లు, కెరటం అనే కథా సంపుటాలను రాశారు.
బోయ జంగయ్య రాసిన ఇప్ప పూలు అనే కథ చిన్న తండా జీవితాలను చిత్రించిన కథ. గిరిజనులకు ఇప్ప సారా అంటే అది వారి ఆర్దిక సంబంధ విషయం కూడా . ప్రభుత్వం సారా మీద నిషేధం విధించాక చాటు మాటుగా తయారు చేయక తప్పని పరిస్థితి గిరిజనులదీ.అది అది అనివార్య ఆర్థిక స్థితి. కథలో ఇప్ప సారు కాచి జైలుకు బీక్యా కుటుంబం పోలీస్ స్టేషన్ కు తరలించి పడుతుంది. స్టేషన్కు వచ్చిన గిరి జన ఆడవారిని చూసి పోలీసులు అచ్చమైన సారా తాగి రంగు తేలి ఉన్నారు కోడలు కోడిపెట్ట లాగా ఉంది అన్న మాటలు బంజారా ఆడవారిపై సమాజం చూసే చిన్న చూపును తెలుపుతుంది.
అలాగే అదిలాబాద్ కు చెందిన రచయిత మోస్రాం మనోహర్. వీరు ఇప్ప పూలు అనే కథను 2008 లో రచించారు.ఇది ఆదిమ వాసుల జీవన వృత్తిని వారికున్న వైద్య విజ్ఞానమును ,గిరిజనులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను చిత్రీకరణ చేసింది.నిర్ణయం,రక్తపింజర,మరట్ తడుం పాయెనా,గంగిజిమ్మ వంటి కథలు రాసిన రచయిత సాహూ వీరు ఎక్కువగా గిరిజనుల జీవితాలను చిత్రీకరించారు.గూడూరు రాజేంద్ర రావు సంకలనం చేసిన ఇప్ప పూలు కథల సంకలనములో వివిధ రచయితలు రాసిన గిరిజన సంబంధిత కథలు కలవు. పై కథల విభజన హేతుబద్దం కాదు కానీ కేవలం కథ పరిధి ని సూచించటకు మాత్రమే ఉద్దేశించినది. ఎందుకంటే చాలా గిరిజన కథలు కేవలం ఏ ఒక్క అంశం కో పరిమిత కాలేదు. అనేక విషయాలను ఒకే కథలో స్పృశించాయి. పరిశోధన
తెలంగాణ కథానిక గిరిజన జీవన విధానం పై ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ లో ఎ.నరసింహ నాయక్ పరిశోధన చేస్తున్నారు.తెలుగు కథా సాహిత్యం గిరిజన జీవిత చిత్రణ (2010-పద్మావతి యూనివర్సిటీ-ఎం.ఫిల్)- జి.శైలమ్మ


ముగింపు
గిరిజనులు అనగానే తలలో ఈకలు,గొంతు మీద పూల దండలు,మొలకు గోచి అనీ గిరిజనులు రూపును ఒకప్పడు ఉంచుకునేవారు.కానీ నేడు గిరిజనులు పట్టణ వాసుల తో సమానంగా ఆహార్యం లోనేం కాదు ఉద్యోగము, వ్యాపార రంగాలలో అన్నీ విషయాలలో నగర వాసులకు ఏ మాత్రం తక్కువ కాదు.ఆయితే తెలుగు సాహిత్యం లో గిరిజన చిత్రణ కథలు తక్కువే వచ్చాయనీ చెప్పోచ్చు.

ఐ.చిదానందం తెలుగు బాషోపాధ్యాయులు తెలుగు రీసేర్చి స్కాలర్

ఉపయుక్త గ్రంధ సూచి

 • తెలంగాణ తెలుగు కథా వికాసం – వేలూరి శ్రీదేవి
 • తెలంగాణ కథ ,వర్తమాన జీవన చిత్రణ – ఎం.దేవేంద్ర