తెలంగాణ రైతు చిత్రణ కథలు – వస్తు వైవిధ్యం | Telangana raitu chitrana kadhalu

ఐ.చిదానందం – Telangana raitu chitrana kadhalu

వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకునూ పండించే వ్యక్తిని రైతు(FARMER) అంటారు. ఎన్నో కష్టాలకు ఓర్చి పంటలను పండించే రైతులు నిత్యం పాత్రస్మరణీయులు. నిజాం ప్రభువుల పాలన వలన , ఆతర్వాత ప్రభుత్వాల రైతు విధానాల తెలంగాణ సామాన్య రైతులు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు.తెలంగాణా కథా సాహిత్యం ను లోతు గా పరిశీలన చేస్తే ప్రముఖ రచయితలందరు రైతుల సాధక బాధకాలను తమ కథలో చిత్రీకరణ చేసిన వారే. రైతు సమస్యలను వివిధ కోణాలలో స్పృశిస్తూ కథకులు కథలు రాసారు. అలాంటి కథ రచయతల కథలను స్థూలంగా పరిశీలన చేయడం ఈ వ్యాస ఉద్దేశ్యం.

రైతు కథలు వస్తువులు
తెలంగాణలో భూముల రేట్లు పెరగడం వల్ల రైతు బతుకుల్లో వచ్చిన మార్పులు చిత్రీకరించిన కథలు , నాటి నిజాం పరిపాలన రైతుల పరిస్థితులను చిత్రీకరించిన కథలు , భూస్వామ్య వ్యవస్థలో లోపాలు తెలిపిన కథలు, రైతులు వలస పోవాల్సిన పరిస్థితులను కరువు కాటకాలను విశ్లేషించిన కథలు, రైతు కుటుంబం లోని ఆత్మహత్య కారణాలను పరిశీలించిన కథలు, రైతు కుటుంబంలో మానవ సంబంధాలను చర్చించిన కథలు, శిస్తు చెల్లించలేక నలిగిన రైతు జీవితాల కథలు , దళారుల,వ్యాపారుల వలన మోసపోయిన రైతు కథలు , పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వలన దిగులు చెందే రైతు కథలు, వ్యవసాయం కు పెట్టిన పెట్టుబడి రాక పోవడం నేపథ్యంలో సాగిన కథలు, కరువు కాటకాలు చీడలు పీడలు గురించి తెలిపే కథలు, రైతు కుటుంబ అవసరాలకు ఖర్చులకు రుణ బాధలకు సంభందించిన కథలు, భూసమస్య నేపధ్యంలో కథలు, విప్లవనేపధ్యం లో చైతన్యం పొందిన రైతు కథలు మొదలైన అంశాలతో తెలంగాణ రైతు కథలు సాగాయి.


1.భూ సమస్యచిత్రణ కథలు
తెలంగాణ లో ఉన్న రైతుల ప్రధాన సమస్య భూ సమస్య. భూస్వామ్య వ్యవస్థలోనీ లోపాలను తెలుపుతూ,దున్నేవాడిదే భూమి అనే నినాదంతో ఎన్నో కథలు వచ్చాయి. ఈ వ్యవస్థలో రైతులు కూలీలుగా బానిసలుగా భూస్వామి దగ్గర మగ్గిపోవడం పై ఎన్నో కథలు కలవు. వాటిలో అల్లం రాజయ్య భూమి కథ , తాడిగిరి పోతరాజు ఎర్ర బుట్ట కథ, ఉప్పల నరసింహం ఇత్తనపు కోడె , చెరబండరాజు చిరంజీవి వంటి మొదలైన కథలు కలవు.మరో రచయిత ఇక్బాల్ రాసిన కఫన్ అనే కథలో ప్రభుత్వమే రైతుల దగ్గర భూమి హస్తగతం చేసుకునే అప్రజాస్వామిక పద్ధతులను చూస్తాం. ఎవరైనా అన్యాయం చేస్తే ప్రభుత్వం వైపు చూస్తాం.అట్లాంటిది సర్కారే అన్యాయం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి అనీ రైతులు బాధ పడే నేపథ్యంలో రచయిత కథను రాశారు. భూమి నేపథ్యంలోనే భూ సమస్య నేపథ్యంలోనే సాగిన మరో కథ ఉదయమిత్ర రాసిన గుప్పిట మట్టి.చొప్పదండి సుధాకర్ రాసిన కథ గంటిల మడి.దీనిలో భూమయ్యకు నాలుగు ఎకరాల భూమి కలదు. కరువు వల్ల దిగుబడి తగ్గింది. భూమయ్య పొలాన్ని అనుకొని సర్పంచ్ పొలం ఉంది, ఒకరోజు సర్పంచ్ ఒక జ్యోతిష్యుడి సలహాతో పొలానికి ఈశాన్యంలో బోరు వేయాలనీ అనుకుంటాడు. కానీ అది భూమయ్య గంటిల మడి, ఆ ఊరి సర్పంచి భూమయ్య పొలం కాజేయాలనుకుంటాడు.దాని కోసం విశ్వప్రయత్నం చేస్తాడు.చివఱి కి భూమయ్య కోర్టులో ఆ విషయమై కేసు వేస్తాడు. అయినప్పటికీ సర్పంచ్ ఎక్కడ గెలుస్తాడో అనీ నిరాశతో అదే భూమిలో పడి మరణిస్తాడు రైతుకు భూమి మీద ఉన్న ఆత్మీయతను తెలిపింది.


2.భూమి పై ప్రేమ గల రైతుల కథలు
రైతుకు తన ప్రాణం కంటే భూమి అంటేనే తీపి,భూమిని కన్నతల్లిలా పూజిస్తాడు. చిన్ననాటినుంచి మమకారం పెంచుకున్న భూమి చివరికి చేజారిపోవడం అనే ఇతివృత్తంతో రాసిన కథ భూమి స్వప్నం.కాలువ మల్లయ్య రాసారు. దీనిలో వెంకటయ్య రైతు బిడ్డ గా పుట్టినాడు. వ్యవసాయం చేయడం అతనికి చాలా ఇష్టం. కానీ తప్పనిసరి ఉద్యోగంలో చేరాడు. తండ్రి ఆస్తి కేవలం ఒక ఎకరం మాత్రమే లభ్యమవుతుంది.వ్యవసాయం పై ప్రేమ తో వాలంటరీ రిటైర్మెంట్ తో వచ్చిన డబ్బుతో భూమిని కొనుక్కొని అక్కడే గడపాలి అనుకుంటాడు.కొడుకు,భార్యలతో కలిసి ఊరికి వెళ్ళాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఉన్న భూమిని సైతం అమ్మాలిసి వస్తుంది. అది తట్టుకోలేక పోయిన వెంకటయ్య అదే భూమిలో విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం భూమిస్వప్నం లో కథ.కాలువ మల్లయ్య రాసిన నేలతల్లీ కథ లో రైతు కు , మట్టికి ఉన్న బంధం ను తేలియచేస్తుంది.కథ లో లసుమయ్య రైతు.అతని కొడుకు సింగరేణిలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు.ఎన్నిసార్లు తల్లిదండ్రులు తనతో పాటు తీసుకెళ్ళాలి అనుకుంటాడు. కానీ వారి ఒప్పుకోకపోవడం.రైతుకు మట్టి పై గల ప్రేమను తెలియజేస్తుంది


3.వెట్టి చిత్రణ కథలు
నిజాం కాలం నాటి తెలంగాణ రైతుల సమస్యలను, వెట్టిచాకిరీ విధానాన్ని నాటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో పొట్లపల్లి రామారావు గారు న్యాయం కథ ద్వారా తెలిపారు.


4.రైతు వలస నేపధ్య కథలు
పెద్దింటి అశోక్ కుమార్ రాసిన కన్నతల్లి కథ లో గల్ఫ్ దేశాలకు పని వెతుక్కుంటూ వలస వెళ్లిన జీవితాలను వ్యవసాయం గిట్టుబాటు ధర రాని దుస్థితిని రచయిత చెప్పారు.వలసల నేపధ్యంలో రైతు కూలీల పరిస్థితి ని గురించి బి.వి.వి.ఎన్.స్వామి గారు వలస అనే కథ రాశారు.


5.రైతు అత్మహత్య నేపధ్య కథలు
ముదిగంటి సుజాత రెడ్డి రాసిన కథల సంపుటి విసుర్రాయి.దీనిలో జవాబు లేని ప్రశ్నలు అనే కథ రైతు కుటుంబంలో ఏర్పడే సంక్షోభాలను స్త్రీల సహాయ స్థితిని తెలుపుతుంది.కుటుంబం పెద్ద యాదమ్మ భర్త ఆత్మహత్య చేసుకున్నప్పుడు ” గీ అప్పులన్నీ మెడకు బడ్డయి ఎట్లా తీరాలి ” అని భోరున ఎడ్చింది యాదమ్మ.ఆమె ప్రశ్నలకు జవాబులు లేవనీ రచయిత్రి చెప్పినట్లయింది.కస్తూరి గారు రాసిన కథ కాలం కరిచింది.ఇది 1975 జాగృతి పత్రికలో ప్రచురించబడింది.దీనిని యథార్థ సంఘటన ఆధారంగా రాసిన అని రచయిత్రి చెప్పుకున్నారు. భూములు పంచుకున్న ఇద్దరు అన్నదమ్ములు వ్యవసాయం చేసుకుని బతుకుతుంటారు. వీరిలో పెద్ద రామ్ రెడ్డి ,చిన్న లక్ష్మారెడ్డి. వీళ్లది నల్గొండ జిల్లా తెలుగా వల్లె గ్రామం. కొద్ది కాలం గడిచిన తర్వాత గ్రామం కరువు కాటకాలతో అల్లాడుతుంది. దాంతో తినడానికి తిండి లేక లక్ష్మ రెడ్డి దంపతులు మంచినీళ్ళతో గడుపుతుంటారు.వారికి సాయం చేయాలని రాంరెడ్డి అనుకున్నా ,అతని భార్య మాత్రం ఒప్పుకోదు. ఒకరోజు లక్ష్మారెడ్డి భార్య ఇంట్లో వంట వండుతుంది. వారి ఇంట్లో నుంచి పొగ రావడం చూసి , తన భర్థే వారికీ బియ్యం ఇచ్చాడనీ కోపం తో రామ్ రెడ్డి భార్య లక్ష్మారెడ్డి ఇంటికి వచ్చి కోపంతో అన్నం కుండను పగలగొట్టి పొయ్యి లో నీళ్ళు పోసి, అక్కడ చాటలో ఉన్న మిగతా బియ్యాన్ని తీసుకొని తిడుతూ వెళ్ళిపోతుంది. లక్ష్మా రెడ్డి భార్య ఏమీ చేయలేని దుస్థితిలో ఉంటారు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు లక్ష్మారెడ్డి కుటుంబం ఉంటుంది. వాళ్లు పగిలిన కుండ బోకుల్లోని అన్నం తీసి అందులో ఎండ్రీన్ కలిపి పిల్లలకు తినిపించి తాను చనిపోవడంతో కథ ముగుస్తుంది. గ్రామీణ జీవితంలో వుండే దాయాదుల ఈర్ష్యాద్వేషాలు రచయిత్రి కళ్లకు కట్టినట్లు చిత్రీకరించినారు. కాసుల ప్రతాపరెడ్డి రాసిన కథల సంపుటి ఎల్లమ్మ ఇతర కథలు.దీనిలో శిధిలం కథలో తెలంగాణ లో వ్యవసాయం ఎంత దారుణంగా తయారయ్యిందో రచయిత చెప్పారు. “ఎందీ ..నాయనా.. మా రైతులంతా చచ్చిపోయినంక ఈ దేశం ఎట్లా ఉంటుందంటావు,నోట్లు ముద్రించి కొని వాటిని నమిలి మింగుతారా…? అనీ రైతు అనడంలో రైతు జీవితాలలో బాధ ను తెలిపారు. ఇది కూడ రైతు ఆత్మహత్య నేపథ్యంలో సాగుతుంది.ఆత్మహత్య చేసుకున్న పత్తి రైతు కుటుంబం పడ్డ బాధల్ని అప్పులమంటలు కథ ద్వారా ఫర్జాన్ సింగ్ చిత్రీకరించారు.


మేరెడ్డి యాదగిరిరెడ్డి (నల్లగొండ) వీరు కొలిమి (2010) అనే కథలసంపుటిని రాశారు.దీనికి ముందుమాటను ముదిగంటి సుజాత రెడ్డి గారు రాసారు.ఈ సంపుటిలో గల వ్యవసాయ రంగానికి , గ్రామీణ జీవితానికి సంబంధించిన కథలు కలవు. కాలం కలిసి రాక, అప్పుల ఊబిలో దిగబడితే ఆత్మహత్యలు చేసుకున్న రైతన్నలకు అంకితమిచ్చారు రచయిత.మెదక్ కు చెందిన యాదగిరి పర్కపెల్లి. వీరు శికారి , శిల్లర జిత్తు అనే రెండు కథలు వ్రాశారు.ఈ రెండు వ్యవసాయం చేసుకునే రైతుల కష్టాలు తెలిసినవే. రైతులు ప్రకృతి భీభత్సాలను తట్టుకుంటూ అప్పులు చేసి వ్యవసాయం చేస్తే చివరికి ఆత్మహత్యలు చేసుకునే రైతులు జీవితాలు దీనిలో కలవు. ఈ కథలు బతుకమ్మ పత్రిక లో ప్రచురితం అయ్యాయి.


6.శిస్తు నేపధ్యంలో రైతు కథలు
రైతుల నుంచి బలవంతంగా పంటలు పండినా, పండకపోయినా శిస్తులు వసూలు చేసే దౌర్జన్యాలను చిత్రీకరిస్తూ పి.వెంకటేశ్వరరావు ఇది పంట కాదు అనే కథను రాశారు.అలాగే శిస్తు చెల్లించలేక ఆర్థికంగా చితికిపోయిన రైతు జీవితాన్ని చిత్రించిన కథ సర్కారు కిస్తు. దీనిని మంద రామి రెడ్డి రాసారు. ఇలాంటి నేపథ్యంలో భాస్కరభట్ల కృష్ణారావు ఇజ్జత్ కథ సాగుతుంది.


7.దళారులు,బుుణాలు,వడ్డీ వ్యాపారుల మోసాలు నేపధ్యం లో రైతు కథలు
కాలువ మల్లయ్య రాసిన కథ సంఘర్షణ లో రైతుల నిరక్షరాస్యత వలన వడ్డీ వ్యాపారులు ,దొరలు ఎలా మోసపూరిత ఆలోచనలు చేస్తారో రచయిత చెప్పారు. దీనిలో లసుమయ్య అనే రైతు తీసుకున్న అప్పు కింద షావుకారు కు వరుసగా పదేళ్లు పంట మీద ఒడ్లు ఇచ్చాడు. అయినా ఇంకా బాకీ కట్టాలంటూ లసుమయ్య పై పంచాయతీ పెడతాడు.”ఇన్రోజులు దాచిన ను సంగతి గీప్పుడు సిగ్గు విడిచి చెప్తున్నా నా భార్యను గూడా ఘోరంగా వాడుకున్నాడు షావుకారి” అని లక్ష్మయ్య నలుగురిలో ఆత్మాభిమానం చంపుకుని చెప్పావలసివచ్చిందంటే వడ్డీ వ్యాపారులు ఎంత అనైతికం గా ప్రవర్తిస్తారో మాటల్లో చెప్పలేము. మరో కథలో నర్సి రెడ్డి అనే తెలంగాణ రైతు సౌకారి దగ్గర అప్పు చేస్తాడు.షావుకారు అప్పు కింద పంట ను లాక్కొని వెళ్తాడు. గత్యంతరం లేక నర్సిరెడ్డి భూమిని బ్యాంకుల్లో తనఖా పెడతాడు.బ్యాంకు రుణం కోసం నర్సిరెడ్డి లంచాలు ఇస్తాడు. వచ్చిన డబ్బు తో కిస్తీలు కడతాడు.అప్పులు తీర్చు తాడు. డబ్బులు అన్నీ అయిపోయి మళ్ళీ రుణం కోసం అప్పులు చేయడం మొదలు పెడతాడు. ఇలా అప్పులే రైతుల పాలిట భస్మాసుర హస్తం లాంటివనీ కాలువ మల్లయ్య భస్మాసుర హస్తం అనే కథను రాశాడు. జంగయ్య రాసిన కథ చెదలు దీనిలో పేద రైతులు ఎందరి చేత ఎన్ని విధాలుగా దోపిడి చేయబడతారు రచయిత చెప్పారు. బెజ్జారపు వినోద్ భూమి గాయం అనే కథ లో మస్కట్ కి వెళ్దామని అప్పులు చేసిన రైతు జీవితాలను తెలిపారు.పేద రైతులు దళారుల చేతిలో ఎంత అమాయకంగా మోసపోతారో తెలిపిన కథ ప్రతీకారం,ఈ కథలో మోసపోయిన రైతులు,దళరులకు ఎలా బుద్ది చెప్పారో అనే ఇతివృత్తం కలదు. దీనిని రాసిన వారు పేర్వారం జగన్నాధం (వరంగల్)


8.గిట్టుబాటు ధర కుదరని రైతు కథలు
వెల్దండి శ్రీధర్ రాసిన కథా సంపుటి పుంజీతం.దీనిలో రైతు చెమటోడ్చి పండించిన పంటకు మార్కెట్ల లేక పనికి కుదిరి క్వారీ లో పని చేసి సోన్ క్రషింగ్ డస్ట్ తో ఊపిరితిత్తులు చెడిపోయి కుటుంబం అగాధమై కూలికెళ్లలేక కూలిపోయిన పేద రైతు దీనస్థితిని దేవయ్య అనే కథ రచయిత తెలిపాడు.2003 లో పెద్దింటి అశోక్ కుమార్ రాసిన కథ కీలుబొమ్మలు. దీనిలో ప్రపంచీకరణ వలన రైతుల కష్టాలను చెప్పారు. ఈ కథలో సర్పంచి లింగారెడ్డి ప్రజల తరఫున కాకుండా ప్రభుత్వానికి, పారిశ్రామిక విధానంకు , కంపెనీలకు వత్తాసు పలుకుతాడు.అలాగే తన కొడుకును రైస్ మిల్ యజమాని గా కాకుండా ఇంజనీర్ గా చూడాలనుకుంటున్నారు.గిట్ బాటు ధర లేకపోవడం,వాణిజ్య విధానము వల్ల రైతులు పడే అవస్థను రచయిత ఈ కథలో తెలిపాడు.

9.ప్రకృతి వైపరీత్య నేపధ్యంలో రైతుకథలు
రచయిత చైతన్య ప్రకాశ్ కథల సంపుటి రేణ.దీనిలో పుల్కాసి అనే కథ కలదు. దీనిలో వ్యవసాయంలో వచ్చిన మార్పులు రైతులు పరాధీనం కావడం ,కరెంటు కోతలు ప్రకృతి వైపరీత్యాలను విషాదకరంగా ఆవిష్కరించారు రచయిత.


10.విప్లవ చైతన్య నేపధ్యంలో రైతు కథలు
ఒక ముస్లిం రైతు (రహీం భాయ్) తను న్యాయం కోసం దొరను ఎదిరించి నిలిచాడు. తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టే ఇతివృత్తంతో వ్రాసిన కథ రహీం భాయ్ దీనిని పి.వెంకటేశ్వరరావు వ్రాశారు. కాలువ మల్లయ్య రాసిన కథల్లో అధికభాగం తెలంగాణ రైతు జీవితాన్ని చిత్రించిన కథలే కలవు. వీరి నేలతల్లీ కథ లో లసుమయ్య అనే రైతు కలడు.ఇతని కొడుకు సింగరేణి బొగ్గు గనుల్లో ఉద్యోగం చేసుకుంటాడు.పెట్టిన పెట్టుబడులు కూడా రాని భూమి అమ్మి వేయాలని అనుకుంటాడు కోడుకు ఆ సందర్భంలో లసుమయ్య ఆ సంధర్భంలో “మరి ముసలోల్లున్నరు వాళ్ళకు పని చేతగాదు చంపి పారేత్తే అయిపోతుంది గదా ” అని కొడుకుతో పలికిన మాటలు రైతుకు భూమిపై మీద ఉన్న ప్రేమను చెబుతాయి. అల్లం రాజయ్య రాసిన కథ భూమి(1978) రైతు తన భూమి కోసం చేసే ఉద్యమం రచయిత కథ చిత్రీకరించారు. నిజామాబాద్ చెందిన సి.హెచ్. మధు రాసిన కథ ముసలోడు. ఇది 2008 మార్చిలో ప్రజాసాహితి లో ప్రచురితమైంది.దీనిలో భూమిని నమ్ముకున్న ముసలి రైతు, మా భూమిని మీకీవ్వం అనీ వ్యవస్థని ఎదిరించిన తీరును రచయిత చెప్పారు.


11.సమాజ,సాంఘీక నేపధ్యంలో రైతు కథలు
కస్తూరి గారు రాసిన కథల సంపుటి అలక (1976) ఇందులోని పశువులు అనే కథలో వైద్యం కోసం కొడుకును మండల కేంద్రం కు తీసుకు వచ్చిన ఒక రైతు పోలీసుల చేతిలో తన కొడుకును కోల్పోవడం అనేది ఇతివృత్తం ఇందులో కలదు. దీనిలో ఒక రైతు విషయంలో పోలీసులు కూడా పశువుల్లా వ్యవహరించారని తెలిపారు రచయిత్రి.ఒక పల్లెటూరు బక్క రైతు కు ప్రభుత్వ శాఖల ద్వారా సామాజిక న్యాయాన్ని అభివృద్ధిని అందుకోవడం తీరును అల్లం రాజయ్య అడవి మనిషి అనే కథ తెలుపుతుంది.కాలువ మల్లయ్య రాసిన కథ ఎంగిలి చేత్తో. ఈ కథలో నేతగాని దుబ్బమ్మ నేత కాని పని చేసినా చేటడు చేరిగి శుభ్రం చేస్తే పిడికెడు వడ్లు మూడు సొళ్ళు మాత్రమే.ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టని తనం ఊర్లో కి ప్రవేశించిందని రైతులు తమకు ఏమీ మిగల్చడం లేదని దుబమ్మ ఆవేదన చెందుతుంది. ఈ కథలో రైతుల పిసినారి తనం ను చేబుతునే నాటి సాంఘిక పరిస్థితి ని కథ ద్వారా పరిస్థితిని వివరించాడు రచయిత .
హుమాయున్ సంఘీల్ (కామారెడ్డి) రాసిన కథ పచ్చశీర. ఇది రియల్ ఎస్టేట్ దందాల నేపథ్యంలో సాగింది.తన శివారులో ఉన్న పంట భూములను వెంచర్లు వేసి తక్కువ ధరకు రైతుల దగ్గర కొనుక్కున్నారు.ధర పెరుగుతుందనే ఆశ తో రైతులు పోలం పనులు చేయ కుండా ఆపుతారు. కానీ ఇండ్లు కట్టబడకుండా ఏండ్ల తరబడి పడావు పడటం వల్ల దీంతో సమాజానికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన రైతులు ఆ భూములను దున్నుకోవడం కథలోని సారాంశం.


12.నీటి సమస్య కథలు
బోధనం నర్సి రెడ్డి రాసిన బొరుపోక్కలు. కథలో నీటి కరువు గురించి ఉంది. కథలో పర్వతరెడ్డి భూమి బాగానే ఉంటుంది. కానీ నీరు లేక పర్వత రెడ్డి వ్యవసాయంను చేయలేక పోతాడు. పట్టణం లో వున్న తన కొడుకులు రమ్మని పిలిచిన చాలా రోజుల వరకు పర్వత రెడ్డి పట్టణం కు వెళ్లడు. కానీ నీళ్ల కోసం బోర్లు వేసి, వేసి ఇక లాభం లేదని పట్నం కు వెళ్తాడు పర్వత రెడ్డి. రైతులకు నీటి కరువు వల్ల ఎంత నష్ట పోతారో కథలో కలదు.ఎలికట్టే శంకర్ రావు రాసిన కథ తలగోరుకొండ.దీనిలో శివయ్య, రవిలు తండ్రి కొడుకులు. ఇద్దరూ తమకు వున్న నాలుగు ఎకరాలలో బత్తాయి తోటను సాగు చేస్తారు. కానీ బోరు నీళ్ళు పంట కు నష్టం వస్తుంది. కథలో “ఉన్నదంత ఉడ్చకపాయే ఇంకేముంది అయిన కాడ ? బొందిల పానం పిడికెడు కండ తప్ప అనీ రైతు ఆవేదన చెందుతాడు.
నేరెళ్ల శ్రీనివాస్ రాసిన చెరువు కథ , రేగులపాటి కిషన్ రావు మా ఊరి కథ , నరేందర్ ఉసుళ్ళు ఇవ్వన్నీ నీళ్ల అవసరం గురించి చెప్పే చెరువు నేపథ్యంలో సాగే రైతు కథలు.


13.విత్తనాల విషయం లో కథలు
అమెరికాకు చెందిన మోన్శాంటో ప్రపంచం లో అతిపెద్ద విత్తన కంపెనీ, ఈ కంపెనీ తయారు చేసే బీటీ విత్తనాలు, ఈ పద్ధతిలో విత్తనం మొలకెత్తగానే బీటీ బ్యాక్టీరియా మొక్క లోకి ప్రవేశించి మొక్క,ఆకు ను , కొమ్మల్ని మాత్రమే తింటుంది. భారత ప్రభుత్వం పత్తి పంటలో ఈ విత్తనం కు అనుమతించిన సందర్భంలో ఆ విత్తనంనే వేయాలనీ షరతు విధించింది. కానీ ఈ బీటీ పత్తి విత్తనం వేయడం వల్ల కొన్ని సంవత్సారాల తర్వాత భూమి సారం కోల్పోతుంది.పై సమస్య నేపథ్యంలో వచ్చిన కథ మేరెడ్డి యాదగిరిరెడ్డి 2008 ఆగస్టు లో సాహిత్య ప్రస్థానంలో రాసిన బీటీ విత్తనం అనే కథ.చొప్పదండి సుధాకర్ రాసిన కథ గడ్డి పరక.ఇది 2018 సెప్టెంబర్ లో వార్త పత్రిక లో ప్రచురితమైంది. విదేశీ బ్యాంకులు స్వచ్ఛంద సంస్థల పేరుతో వ్యాపారాన్ని ఏ విధంగా కొనసాగించే ఈ కథ తెలిపింది.


14.పాడి పశువుల నేపధ్యం కథలు
పెద్దింటి అశోక్ కుమార్ రాష్ట్ర కథ మాయిముంత. దీనిలో రైతు కుటుంబంలో పశువులకు తన స్థానాన్ని తెలుపుతుంది. ఈ కథలో దంపతులు సాయమ్మ,సాయాన్న లు. వీరు రైతు కుటుంబానికి చెందినవారు.బి మురళీధర్ రావు రాసిన కథ నెమలి నార.కథలో నారాయణ ఇంటి స్థలంలో స్థలంలో పశువుల వైద్యం కావలసిన చెట్లను పెంచుకుంటాడు నారాయణ.ముగ్గురు కొడుకులకు భూమి పంచే సమయం వచ్చేసరికీ ఆ చెట్ల ను కొట్టి వేయాల్సి వస్తుంది. నారయ్య బాధపడతాడు. చిన్న కొడుకు తండ్రి మాట వినిపించుకోకుండా నెమలినార చెట్లు సైతం నరికి ఇస్తాడు. కొన్ని రోజుల తర్వాత చిన్న కోడుకు సూక్కేద్దు చావుబతుకుల్లో ఉంటుంది. అది బతకాలంటే నెమలినార అవసరం. ఆ చెట్టు కోసం చిన్న కొడుకు అడవి అంతా గాలించిన అది దొరకదు. చివరికి చెట్టుకొట్టేసిన చోట మరో మొక్క మొలకెత్తడం దాన్ని ఆకుల రసం పోసి ఎద్దును బతికించడం జరుగుతుంది.ఇందులో గ్రామస్తులు పశువుల వైద్యం చేసి చేసే విధానం తెలియజేస్తారు.


15.ఇతర కథలు
దేశంలోనూ ,రాష్ట్రంలోనూ అమలయ్యే హరిత విప్లవం,సాంద్ర వ్యవసాయం దేశమంతటా అనుభవిస్తున్న పాలమూరు వ్యవసాయ మాత్రం ఇంకా కరువు,కాటకాలతో ఉండటం అనే ఇతివృత్తంతో 1964లో సంపత్ రావు గఅతకని బతుకులు అనే కథను రాశారు.ఓడిపోలే పల్లె అనే కథా సంకలనంలో ఇక్బాల్ , ఉదయమిత్ర లు రాసిన కథలు పోలేపల్లి సెజ్ వికృతి రూపానికి దాదాపు నలభై మంది బలైన తీరును చూపుతాయి.చైతన్య ప్రకాష్ రాసిన కథ ఫుల్కసి, దీనిలో రాజయ్య పెద్ద బిడ్డ పెళ్లి చేస్తాడు కొడుకు తనలాగా వ్యవసాయ వృత్తిలో కాకుండా మంచి ఉద్యోగం పట్టణంలో చేయాలనీ తండ్రీ కోరిక. ఇందులో రైతు జీవనం ఉంది.శ్రీధర్ దేశపాండే (అదిలాబాద్ ) తెలంగాణ పోరాటం లో చురుగ్గా పాల్గొన్నవారు. వీరు వ్యవసాయం వస్తువు గా కథలు రాశారు. వీరు మరే కిసాన్, అభిజాత్యం వంటి కథలు రాశారు.పుప్పాల కృష్ణమూర్తి (నల్లగొండ) వీరు జీవన చిత్రం, విషవలయం , స్వేచ్ఛ సౌందర్యం (2009) వంటి కథలు రాశారు. వీటిలో జీవితచక్రం సంపుటిలో 10 కథలు కలవు.ఇవన్నీ కుల వృత్తికి , వ్యవసాయంకు రైతులకు సంబంధించిన కథలు.


రామ చంద్రమౌళి భూమిదుఃఖం(2007) , మేరెడ్డి యాదగిరి రెడ్డి సెజ్ కథ, ఎల్కల ప్రశాంత్ కుమార్ (ఆదిలాబాద్) ఓ రైతుకథ,కాలువ మల్లయ్య రాసిన కథ సృష్టికర్తలు చిరునామా.ఇది రైతు జీవితానికి సంబంధించిన కథయే.సన్నకారు రైతు జీవితాలలో వ్యవసాయంలో మిగిలేది ఎంత , అనే విషయం పై దేవి యాదగిరి సిల్కడు,త్యాగధనుడు అనే కథలు రాశారు.కాలువ మల్లయ్య ఈ భూమి నాది, , అల్లం రాజయ్య పుడమి పుత్రులు సైతం రైతు నేపధ్యంలో రాసిన కథలే.
పరిశోధనలు

రైతు కథలు, సమగ్ర అధ్యయనం పేరిట ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో జి.సుకన్య గారు పరిశోధన చేస్తున్నారు. తెలుగు కథ రైతు జీవన చిత్రణ అనే అంశం పై 1990 లో వెంకటేశ్వర యూనివర్సిటీ లో ఎ.మద్దిలేటి రెడ్డి ఎం.ఫిల్ పరిశోధన. వీరే 1993లో వెంకటేశ్వర యూనివర్సిటీ లోనే తెలుగు సాహిత్యంలో రైతు జీవన చిత్రణ అనే అంశంపైన సిద్ధాంత వ్యాసాన్ని వెలువరించారు.

ఐ.చిదానందం

తెలుగు బాషోపాధ్యాయులు

తెలుగు రీసేర్చి స్కాలర్

ఉపయుక్త గ్రంధ సూచి

  • పాలమూరు జిల్లా కథా సాహిత్యం (వ్యాసం)-ఏటూరి జ్యోతి
  • కాలువ మల్లయ్య కథలు (వ్యాసం)-బన్న అయిలయ్య
  • తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ – ఎం.దేవేంద్ర