తెలుగు లో దివ్యాంగ (వికలాంగుల) సాహిత్యం

తెలుగు లో దివ్యాంగ (వికలాంగుల) సాహిత్యం

ఐ.చిదానందం

సమాజంలో వికలాంగులు అసమానతలకు వివక్షలకు బలి అవుతున్నారు. తీవ్రమైన మానసిక క్షోభ తో జీవనం గడుపుతున్నారు. దేశంలో 2011 లెక్కల ప్రకారం 2,68,10,557 మంది వికలాంగులు కలరు. వివిధ శారీరక లోపం లతోపాటు మూగ.చెవిటి , మానసిక రుగ్మతలు,బుద్ధిమాంద్యత ను వికలాంగులుగా పరిగణించవచ్చు. వికలాంగుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం 1995 లో వికలాంగుల చట్టం చేసింది.కానీ ఈ చట్టం అమలు క్షేత్రస్థాయిలో జరగలేదు. వికలాంగుడైన వ్యక్తీ కి ప్రభుత్వ రాయితీ లను పొందాలంటే ప్రస్తుతం వైకల్యం 40 శాతంగా ఉండాలి అనే నియమం కలదు. లేదంటే ఎలాంటి రాయితీ లు వర్తించవు. ప్రభుత్వము వికలాంగులకు ఆసరాగా నెలకు 1500 రూపాయలు ఇచ్చి వారి వికాసానికి తోడ్పడుతుంది. డిసెంబర్ 2 ప్రపంచ వికలాంగుల దినోత్సవం గా పరిగణిస్తారు. తెలుగు సాహిత్యంలో దివ్యాంగ సాహిత్యం వివిధ ప్రక్రియలలో వచ్చింది. సందర్భనుసారంగా వికలాంగులకు అండగా నిలిస్తుంది. వాటిని పరిశీలన గా చూద్దాం.

పురాణేతిహాసాలలో…
పురాణ ఇతిహాసాలు విషయానికొస్తే పూర్వమున్న ఏకపాదుడు అను బ్రాహ్మణుడు ఉండేవాడు.అతని భార్య సుజాత గర్భమున ఉండగానే తండ్రి వల్లే వేసే వేదాలు వినేవాడు గర్భస్థబాలుడు. ఒకరోజు ఆ బాలకుడు తండ్రి స్వరం తప్పినది అనీ పలికినాడు. దీనితో తండ్రీ కి తననే తప్పుపట్టడాని ఆగ్రహంతో తనకు పుట్టబోయే కుమారుడు వక్రముగా పుట్టాలని శపించాడు. అలా సుజాత ప్రసవించిన బిడ్డ ఎనిమిది వకరలతో పుట్టాడు. అతని పేరే అష్టావక్రుడు. ఇతని తండ్రీ ఇతడు పుట్టకముందే (ఏకపాదుడు) జనక మహారాజు వల్ల బంధికృతుడు అయ్యాడు తెలుసుకొని అష్టావక్రుడు జనక మహా రాజు తో జ్ఞాన వాదన లో నెగ్గి తండ్రిని వినిపించాడు. అష్టావక్రుని పితృభక్తికి సంతోషించి ఏకపాదుడు కొడుకు వైకల్యం ను పోగొట్టి సుందరాంగుడిని చేస్తాడు. ఇది అష్టావక్రుడు అనే దివ్యాంగుడు కథ.

అలాగే సూర్యుని రథం నడుపు వాడు అనూరుడు. అనగా తొడలు లేని వాడు అని అర్థం. ఇతడు కాళ్లు లేకుండా పుట్టడం వల్ల అనూరుడని పేరు వచ్చింది. ఇతడి తండ్రీ కశ్యప ప్రజాపతి, తల్లీ వినత. ఈమె బిడ్డలకు బదులుగా గుడ్లను ప్రసవించింది. తన సవతి కద్రువ తన తో పాటే గర్భం ధరించింది. పిల్లలను కూడా కన్నది. కానీ వినత కన్న గుడ్లు పొదగడం లేదు. గుడ్డు లోపల అసలు పిల్లలు ఉన్నారా లేరా అనీ ఆత్రం పట్టలేక ఒక గుడ్డును ఇప్పుడు చేసింది. వినత ఆ గుడ్డు లోపల ఇంకా ఎదగని అనూరుడు ఉన్నాడు. అతడు తల్లీ ని దాసీగా వుండమనీ శపించాడు. శాప విముక్తి గా రెండో గుడ్డు లో వున్న గరుడి వలన విముక్తి కలుగుతుందనీ చెప్పి అతడు సూర్యుడి కి రథసారథిగా వెళ్ళాడు.

ఇంకా భాగవతంలో కుబ్జ అనే కంసుని దాసీ ఉండేది. కుబ్జ అనగా మరుగ్గుజ్జు అనీ అర్దం. కుబ్జ సుగంధ లేపనాలు తయారు చేసేది. ఒకసారి ధనుర్ యాగం చేస్తున్న కంసుని కొలువు చూడడానికి మధుర కు బలరామకృష్ణులు రావడం జరిగింది. అప్పుడు కృష్ణుడు కుబ్జ పాదాల మీద తన కాళ్ళని అదిమిపట్టి ఆమెను పెట్టి పైకి లాగడట అంతే కుబ్జ మూడు వంకరలుగా పోయి తిన్నగా అయిపోయి పొడవుగా అందంగా అయిపోయిందట.మహా భారతం లో కౌరవుల తండ్రీ ధృతరాష్టుడు. ఇతడు పుట్టుక తోనే అంధుడు.

కవిత్వం లో….
ఆధునిక కవిత్వంలో గుర్రం జాషువ,దేవులపల్లి కృష్ణశాస్త్రి లాంటివారు దివ్య సాహిత్యాన్ని సృజించారు.
దివ్యాంగుల లో ఆత్మస్థైర్యాన్ని నింపాలని బిల్లా మహేందర్ 100 మంది కవులతో కాలాన్ని గెలుస్తూ అనే కవితా సంకలనం వెలువరించారు. తెలుగు సాహిత్యంలో వచ్చిన మొట్టమొదటి దివ్యాంగుల కవితా సంకలనం ఇది. దీనిలో అనిశెట్టి రజిత కవిత

లేకపోవడమనేది సృష్టిలో ఉన్నదే
మానసికం గా కొన్ని లేకపోవడం కన్నా
శారీరకంగా కొన్నీ లేకపోవడం
అన్యాయమూ కాదు
పాపమూ కాదు
అంటూ వికలాంగులను జీవన యోధులుగా చిత్రీకరించారు కవయిత్రి. దీనిలో వజ్జీరు సుధీర్ ప్రదీప్ నువ్వు మనిషి వైతే కూడా మంచి కవిత.ఇదీ నందిని సిధారెడ్డి గారిచే ప్రశంసలు పొందింది. ఇలాంటి మంచి కవితలేనో దివ్యాంగుల కు బలం ను ఇస్తాయి.

2015లో టింగరి వెంకటేష్ సంపాదకత్వంలో నన్ను మాట్లాడనివ్వండి కవితా సంకలనం లో కూడా దివ్యాంగుల గురించి ఉంది.2015లోనే బిల్లా మహేందర్ గారు తన స్వీయ అనుభవాలతో గెలుపు చిరునామా అనే కవితా సంపుటిని ప్రచురించారు. మరో కవి బి.వి.శివ ప్రసాద్ గారు రెక్కలలు కావాలి అనే కవితా సంపుటం లో చైతన్యం అనే కవిత వికలాంగులపై సమాజం ఎలా మెలగాలో చెప్పింది.మానవత్వ వైకల్యాన్ని ధిక్కార స్వరంతో ఆగ్రహం ప్రకటించిన కవయిత్రి శోభ. వీరు వికలాంగుల జీవితాలలో వెలుగులు రావాలని ఆశిస్తూ ధిక్కార నానీలు రాసారు. నెల్లూరుకు చెందిన కవి పెంచల నరసింహం. వీరు వికలాంగుల జీవితాలలో వెలుగు నిండాలని కోరుతూ వెలుగు పూలు (2007) అనే కవిత్వం ను రాసారు. దీనిని హిందీలో శ్రీ ఎస్. చిరంజీవి,ఆంగ్లంలోకి శ్రీమతి శైలజామిత్ర గారు అనువదించారు. అనంతపురం జిల్లాకు చెందిన కేరే జగదీష్ రాత్రి సూర్యుడు అనే రచన చేసారు. పై రెండు రచనలు అంధుల జీవన విధానాన్ని తెలిపే దీర్ఘ కవితా సంపుటాలు. అలాగే పాలమూరు జిల్లా పరిశోధక విద్యార్థి చిక్కాహరీష్ కుమార్ నేనైతే వికలాంగున్నే (2013) అనే కవిత్వం రాసారు. వీరే కాకుండా నందిని సిద్దారెడ్డి అవిటితనం, ఆచార్య సత్యనారాయణ దేహ చిత్రాలు , డాక్టర్ నలిమెల భాస్కర్ గుడ్డివాళ్ళ చూపు వంటి కవితలు దివ్యంగుల పై కలవు.

పాటల లో …

సంగారెడ్డి కి చెందిన కవి స్ఫూర్తి (ఇంద్రారెడ్డి ). వీరు దివ్యాంగుల జీవన విధానాల హక్కుల పై పాటలు రాశారు.

వైకల్యం శాపం అని దిగులు చెందకు
ఆత్మవిశ్వాసంతో సాగు ముందుకు
ఆకసాన నెలవంకను చూసినప్పుడు
వంకరగా ఉన్నానని దిగులుపడదేప్పుడు
రోజు రోజుకు పెరిగి పెద్దదవదా
అందాల చందమామ అందులుండదా
చెదరిపోయే శరీరంలో ఏది స్వంతమా
మంచితనం పంచేటి మనసే అందము
లక్ష్యాము ఛేదించినప్పుడే జన్మకర్థం
సాధించగా సాగాలి పోరు మార్గము
అంటూ గెలుచుకో లోకాన్ని అన్న పాటల క్యాసెట్లు 15 పాటలతో స్ఫూర్తి రాశారు.

నవలా సాహిత్యంలో…
నవల ప్రక్రియలో మోపురి పెంచల నరసింహం- వెన్నెల వర్షం నవలను , వెదన శకుంతల -ఆర్తి ,శివ లేంక ఉదయలక్ష్మి నాగ ఉదయలక్ష్మి జీవన రేఖలు వంటి నవలలు దివ్యాంగుల జీవన విధానాన్ని తెలిపాయి. అలాగే మరో నవల ఆరాధన. చిన్నపుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అన్నపూర్ణ నోరు లేని పిల్ల (మూగది) , చాకిరీ తప్ప ఏమీ ఎరగదు. అన్నపూర్ణ ని అనంత్ కి ఇచ్చి పెళ్లి చేస్తారు.మూగది అయిన ఆడపిల్ల గా భార్య గా ఒక స్త్రీ ఆవేదన ను మనో వేదన ను చిత్రీకరణ చేసిన నవల ఆరాధన. దీనిని రాసిన వారు యద్దనపూడి సులోచన రాణి. దివ్యాంగుడు అయిన సాగర్ కృషి,పట్టుదలతో పేదరికాన్ని జయించి తనతో పాటు తన చుట్టు వున్న వారిని ఆదుకొని అంగవైకల్యం కంటే మనోవైకల్యమే అత్యంత ప్రమాదకరమని చెప్పిన నవల పడిలేచే కెరటం. దీనిని రాసిన వారు సయ్యద్ సలీం.
కథా సాహిత్యం లో…
మనిషిని మనిషిగా ప్రేమించగలగాలి అనే ఉద్దేశ్యం తో వేముల ఎల్లయ్య , సంపంగి శంకర్ సంపాదకత్వంలో అవిటి కథలు కథా సంకలనం వచ్చింది. దీనిలో కథల గురించి వస్తే దీనిలో మొత్తం గా 25 కథలు కలవు. రోజు వారి పని చేసి చాలీ చాలని తిండి తింటూ కుష్టు రోగం వచ్చి ఇబ్బందులు పడేవాడు కిష్టయ్య. అందఱితో చీదరింపులకు గురైన కిష్టయ్య వికలాంగుల కోసం విద్యార్థుల కోసం బిచ్చగాడి గా మారడం ఇతివృత్తంతో కథను క్రిష్తాది కిష్టయ్య కథ చాలా గొప్పగా చెప్పారు వేముల ఎల్లయ్య. చూపున్న పాట అనే కథలో విశ్వనాథన్ పోలీస్ ఆఫీసర్. ఇతడికి నక్సలైట్లు అంటే,కమ్యూనిస్టులు అంటే కోపం. రోడ్డు దారి లో గుడ్డివాడు పేరు మురళి .అతడు రోజు పిల్లనగ్రోవి తో గద్దర్ పాటలు పాడేవాడు. విశ్వనాథంకు కోపం వచ్చి నువ్వు దేవుడు పాటలు కాక గద్దర్ పాటలు ఎందుకు పడుతున్నావ్ అని కోపంతో మురళి ని కాలు కింద వేసి తొక్కుతాడు. ఒక వ్యక్తికి ప్రజా సమస్యలపై పోరాడే హక్కు లేదా అని గుడ్డివాడు బాధపడే కథ ఇది. దీనిని పతాంజలి రాశారు.వికలాంగుల లో సైతం కులవ్యవస్థ ఉందని బాధతో విజయ్ కుమార్ రాసిన కథ పెద్ద రోగం. ఈ కథలో కుష్త్తు వ్యాధి కంటే ఫిర్యాదు కంటే ప్రమాదకరమని రచయిత అభిప్రాయం వెలిబుచ్చాడు.
నల్గొండ జిల్లా మాడుగుల పల్లెల్లో జీవించే వ్యక్తి లచ్చిమి.ఆమె నల్లగా ఉంటుంది అయినా ఆకర్షణీయంగా,అందంగా ఉంటుంది. ఆమె ను ఒంటరిగా చూసి దొర కొడుకు అత్యాచారం చేసి వెళ్ళిపోతాడు. ఆ బాధతో ఇంటికి వెళ్లలేక ఆమె అక్కడ నుండి రైలు పట్టాల వెంబడి నల్గొండ వచ్చి వెళ్లి చేరి కొంతమంది వికలాంగుల తో కలిసి బతుకుతుంది.తర్వాత ఈ విషయం తెలుసుకొని రాజు అనే వ్యక్తీ దొర కొడుకు పై కేసు వేస్తాడు. చివరికి కు దోర కోడుకు కి శిక్ష పడుతుంది. మిత్రులైన వికలాంగులను తన ఇంటికి తీసుకెళ్ళి తన భూమితో భూమిలో ఉపాధి కల్పిస్తుంది. వికలాంగుల బాధను లక్ష్మి కథ ద్వారా ఆర్థత గా చిత్రీకరించారు పిట్టల శ్రీనివాస్.దీనిలోనే జేజి అనే కథను భూతం ముత్యాలు ఇది పోలియో వ్యాధి భాదీతులను గురించి చెబుతుంది.అలాగే ఉంగరం కథను కొమ్ము సతీష్ రాసారు. ఇదీ అమ్మ త్యాగం ను చెబుతుంది. గుడ్డివాడు కథను రావులపాటి సీతారామారావు, బోయ జంగయ్య జ్ఞాననేత్రంను చక్కిలం విజయ్ లక్ష్మి విజయలక్ష్మి రాశారు. ఇవన్నీ సమాజంలో వికలాంగులపై చూస్తున్న చిన్న చూపు ను వారు ఎదుర్కొంటున్న కష్టాలను కళ్లకు కట్టినట్లు చెప్పినాయి.
నాగరాజు గారి ఆధ్వర్యంలో వికలాంగుల కథలు అస్తిత్వ చిత్రణ పేరుతో ఒక కథా సంకలనం వచ్చింది. దీనిలో పది మంది రాసిన మహిళల కథలు ఉన్నాయి. మేము సైతం అనే పుస్తకం సైతం దివ్యాంగుల ప్రపంచాన్ని వారి వ్యధను మనకు పరిచయం చేసింది. దీనిలో 30 దాకా కథలు ఉన్నాయి. దీనికి ప్రధాన సంపాదకులు డాక్టర్ నాగరాజు ఇతర సంపాదకులుగా చిట్కా హరీష్ హరీష్ కుమార్ ఉన్నారు. దీనిలో వేముల ఎల్లయ్య కాయ కన్నుల కాంతమ్మ, ఎం.వి.వి.సత్యనారాయణ సమాజ నాటకం అనేకథలు రాశారు. దీనిలోనే ఒక కథలో త్రివేణి ఒక ప్రైవేట్ కంపెనీలో రిసేప్షనిస్ట్ గా పని చేసే అంధురాలు. పెళ్లి కాదేమోనని తండ్రి భయాన్ని పటాపంచలు చేస్తూ మరో దివ్యాంగుడిని తన జీవితంలోకి ఆహ్వానిస్తుంది. త్రివేణిపాత్ర ద్వారా దివ్యాంగుల ఆత్మవిశ్వాసాన్ని చెప్పారు. దీనిని రాసిన వారు ఎస్.వివేకానంద. ఆ కథ పేరు సంగమం.కుంటి తనం కరాటే నేర్చుకోవడానికి అవరోధం కాదని చెప్పే కథ అతడే ఒక సైన్యం. దీనిని ముళ్లపూడి సత్య గణేష్ రాశారు. కళ్ళులేని పేదింటి రాధను వివాహం ఆడాడు చంద్రశేఖర్. ఆడపిల్లకు ఉండే అభద్రత చిత్రీకరించింది పరిపూర్తి కథ. చాలా ఏళ్ళనాటికే దీనిని విశ్వనాథ సత్యనారాయణ రాశారు.ఇది కూడా ఈ సంకలనంలో చోటు చేసుకుంది.ఇవే కాకుండా అడవి బాపిరాజు తిరుపతి కొండ మెట్టు,మల్లాది కృష్ణమూర్తి గుడ్డివాడు,గుమ్మా శశిబాల ఆదర్శం,జరుపులు రమేషు కూలీన బతుకులు వంటి కథలు ఈ సంకలనంలో కలవు.
వ్యాసం ప్రక్రియలలో….
గడ్డం కేశ మూర్తి (వరంగల్) వికలాంగుల జీవన విధానం పై ప్రత్యేకం గా వ్యాసం సంపుటిని వెలువరించారు. అలాగే రాజశేఖర్ జానకీ వికలాంగుల విద్యా జీవన విధానం పై వ్యాసాలు ప్రచురితం చేసారు. ఇంకా వికలాంగుల శ్రేయస్సుం కై విశేషంగా కృషి చేస్తున్న వారు బిల్లా మహేందర్. వీరు తెలుగు లో దివ్యాంగ సాహిత్యం అనే వ్యాసం రాసారు. (ఈ వ్యాసం కు కూడా ఉపయుక్త వ్యాసం ఇదీ)
పరిశోధనలు
తెలుగులో వికలాంగుల కథలు (ప్రస్తుతం-ఉస్మానియా యూనివర్సిటీ) లో వి.కృష్ణయ్య ,తెలుగులో వికలాంగుల సృజనాత్మక సాహిత్యం(ప్రస్తుతం-ఉస్మానియా యూనివర్సిటీ)ఎల్. ఉపేంద్ర విద్యార్దులు పరిశోధన చేస్తున్నారు.
ముగింపు…
పై వారే కాకుండా గురజాడ శోభ పెరిందేవి (హైదరాబాద్), శివలెంక నాగ ఉదయలక్ష్మి, పెండ్యాల గాయత్రి(ప్రకాశం),ఐతా చంద్రయ్య,సిరిసిల్ల రాజేశ్వరి (నల్లగొండ) వీరందరూ దివ్యాంగ కథా సాహిత్యాన్ని రాస్తున్నారు.

అంగవైకల్యం ఉన్న ఆత్మవిశ్వాసంతో అద్భుతాలు సృష్టించే వారు ఉన్నారు. వారిలో స్టిఫేన్ హాకింగ్ లాంటి వారు ఎందరో ఉన్నారు. మూగ చెవుడు, అంధత్వం ఉన్నా వికలాంగుల కోసం ప్రపంచాన్ని చుట్టి వచ్చి కదిలించినా హెలెన్ కెల్లర్ అందరికీ తెలిసిందే. ఉత్తరప్రదేశ కు చెందిన కృష్ణ గోపాల్ ,ఐ.పి.యస్ సాధించిన సుధా రామచంద్రన్, నాట్యమయూరి అన్నపూర్ణ, ఇంగ్లీష్ ఛానల్ ను ఈదిన హరిరామ ఇలా ఎందరో తమ వైకల్యాన్ని అధిగమించి గెలిచిన వారే. కావాలిసిందంతా వారికి కాసింత తోడ్పాటు మాత్రమే.ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేతులే మిన్న అన్న మదర్ తెరిసా సూక్తిని గుర్తుకు తెచ్చుకోవాలిసిన సందర్భం ఇదీ.

ఐ.చిదానందం తెలుగు బాషోపాధ్యాయులు తెలుగు రీసేర్చి స్కాలర్