తెలుగు లో ద్విపద సాహిత్యం Telugu lo dwipada sahityam

తెలుగు లో ద్విపద సాహిత్యం

ఐ.చిదానందం

ద్విపద పరిచయం

తెలుగు లో ప్రాచీన సాహిత్యం అత్యధిక భాగం చంపూ కావ్యరూపం గానే ఉంది. ద్విపద పదం సంస్కృత రూపం అయినా ఛందస్సు మాత్రం దేశీయమయినది. లౌకిక వాజ్న్మయమునందు నాలుగు పాదాలు ఉండుట సాధరణ లక్షణం.దేశీయ ఛందస్సులకు ఈ పాద నియతి లేదనే చెప్పాలి. నిజానికి ద్విపద 12వ శతాబ్దానికి కొత్తది ఏం కాదు.ఇది అతి ప్రాచీన పద్యం ఒకప్పడు శాసనాల వల్ల మరియు జానపద గేయ సాహిత్యం వల్లన ప్రజల నోళ్లలో నానిన పద్యమే ద్విపద. అయితే ఇదీ పాల్కురికి సోమనాధుడు వచ్చేంత వరకు అనాదరణకు గురైందని చెప్పవచ్చు.

ద్విపద లక్షణములు

ద్విపద గేయ ఛందస్సు. దీనికి సంగీత సంసర్గము అధికం. రెండు ద్విపద పాదములు కలిస్తే తరువోజ కావడం అందరికీ తెలిసిందే. ఈ పై పద్యాలే స్త్రీల దంపుళ్ళ పాటలలో ఛందస్సు. రెండు పాదాలు గల ద్విపద లో మొదటి పాదం యొక్క లయ రెండో పాదం పైన ఆధారమే ఉండటము వలన ఊపు వస్తుంది. పాదములలో మూడు ఇంద్ర గణములు ఒక సూర్య గణము వరుసగా ఉండుట ద్విపద లక్షణం. అనగా ఐదు లేదా నాలుగు మాత్ర గణములు లేదా దీని కల గలుపుగా ఉన్న మూడు మాత్రల గణాలు చివరికి త్రిమాత్ర గణము ఒకటి ఉండవలెను. ఈ లక్షణం గేయ వాజ్న్మయము లో ఉన్ననూ ద్విపద కావ్య రచనకు వాటిని వాడిన వాడు మాత్రం పాల్కురికి సోమనాథుడు. శైవ మతప్రచారం దీనికి కారణం. ద్విపద ప్రజల భాష కు వాడుకలో అనువుగా ఉండును కావున పాల్కురికి సోమనాథుడు స్వీకరించాడు. ద్విపద అనగా రెండు పాదములు కలది. సామాన్య నియమాలలో ప్రాసయతి కూర్చరాదు. మొదటి పాదంలో చెప్పదలుచుకున్న భావం మొదటి పాదంలోని పూర్తి చేయాలి. రెండో పాదంలో చొప్పించరాదు. కాని పై రెండు లక్షణాలను పాల్కురికి అతిక్రమించాడు. ఒక పాదం లో యతిని రెండో పాదము లో ప్రాస యతిని సోమన యధేచ్చగా వాడుతూ ద్విపద కు కొత్త నియమాలు నిర్దేశించాడు పాల్కురికి సోమనాథుడు. కానీ “యతుల లోపల ప్రాసయతి దక్క సకల యతులు చెల్లును ప్రయోగసారమున ” అనీ తాళ్ళపాక చిన్నన్న ద్విపదలో ప్రాస యతి కూడదు అని చెప్పాడు. అయితే ద్విపదలో ప్రాసయతి ఉంటేనే సంగీత పరంగా తాళం పడుటకు వీలుగా వుంటుందనీ నిడదవోలు వెంకటరావుగారు సోమన సృష్టించిన ఛందస్సు అనే వ్యాసంలో అభిప్రాయపడ్డారు.

మంజరి ద్విపద

మంజరి ద్విపద అన్నది ద్విపద కు బేధము. స్థూలంగా చూసినచో ఆటవెలదికిని ప్రకీతికిని గల బేధమేమంజరీ ద్విపద కు ఉందని చెప్పవచ్చు. మంజరీ ద్విపద కు ప్రాస నియతి ఉండదు. మంజరీ ద్విపద కు లాక్షణికులు స్పష్టంగా లక్షణాలు చెప్పారు. “శ్రీ మందిరకారు జితదైత్యధీరు గీర్తించుచో బుణ్యవర్తనుండనచో యతి మాఱఉ ప్రాసమిట్లచ్చొట నిడక —————————————- —————————————- రెండు పాదముల నీ క్రియబంచియిడక వెలయు ప్రాసము లేని ద్విపద యైబరంగ ” అని మంజరీ ద్విపద అగుననీ అనంత పండితుడు చెప్పినాడు. ఈ లక్షణము ను అనుసరించియే చిత్రకవి పెద్దన ; అప్పకవి పండితులు లక్షణములు చెప్పారు . ఆయితే పై లక్షణములన్నీయు మంజరి ద్విపద కే చెప్పబడినవి కాని ద్విపదకు చెప్పబడలేదు.

శాసనాలలో ద్విపద

శాసనాల విషయంలో క్రీస్తు శకం 6 వ శతాబ్దం నాటి పొట్లదుర్తి మాలెపాడు శాసనము లో ద్విపద రతి రగడ వచనాలు ఉన్నాయని దేవరపల్లి వెంకట కృష్ణారెడ్డి గారు తెలిపారు. తెలుగులో లభ్య శాసనములలో మొదటిదైన అద్దంకి శాసనం (క్రీస్తు శకం -848 )లో నాలుగు పాదములు గల తరువోజ పద్యము కలదు.
” పట్టంబు గట్టిన ప్రధమంబు నేడు
బలగర్వ మొప్పంగ బైలేచి సేన
పట్టంబు గట్టించి ప్రభు బండ రంగు
బంచిన సామంత బోయ పదవ తో బోయ “

ఈ శాసనం లో ఉన్న తరువోజ ను మనం గమనిస్తే రెండు ద్విపదలు గా మనం గుర్తించవచ్చు.

మల్లియ రేచన ద్విపద

కవి జనాశ్రయము నందు ద్విపద లక్షణం చేప్పబడింది. ఆయితే కర్త మల్లియ రేచన కాలం విషయం లో కోంత వివాదం కలదు. ఏదీ ఏమైనా చాలా మంది అంగీకారించినట్లు గా క్రీస్తుశకం 940 ప్రాంతంలో ఉన్నా మల్లియ రేచన తన కవిజనాశ్రయం లో ద్విపద కు ఇలా లక్షణం చెప్పాడు. ” ఇంద్ర గణములు మూడింద్ర గణంబోకటి చాంద్రాస్య ద్విపద కు జను చేప్పరేచ ” జైనులు రేచన కాలం నాటికే తెలుగు కవితలలో తరువోజ; ద్విపద ; చౌపద ; షట్పద వంటి ఛందస్సులు వాడేవారట. అందుకే సోమన్న కూడా ప్రధమమైన ద్విపదను ఎంచుకున్నాడని ఆరుద్ర పేర్కొన్నారు.

పాల్కురికి సోమనాధుని ద్విపద

శైవ మత ప్రచారం కోసం కథలను గాన యోగ్యము అయిన ద్విపద లో రాసాడు పాల్కురికి. సోమనాథుడు మతప్రచారంకు ప్రజల భాష వాడుక బాష కు ద్విపద అనువుగా ఉండున. కావున పాల్కురికి సోమనాథుడు స్వీకరించాడు. సోమన్న ద్విపదలో బసవపురాణం ; పండితారాధ్య చరిత్రము ; మరియు మల్లమ దేవి పురాణమును కూడా రాసినట్లు శ్రీ నిడదవోలు వెంకట్రావు గారు చెప్పారు. దీనిని పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి సమర్ధించారు గానీ ఆ గ్రంధం అలభ్యం. పాల్కురికి అనుభవసారం 243 పద్యాల గ్రంధం. దీనిలో ద్విపద లు లేవు గానీ ద్విపద కు రెట్టించిన రూపమైన తరువోజలున్నాయి. సోమన ఉత్తరోత్తర చెబట్టే ద్విపద కు ఇబ్బడి రూపమైన తరువోజ ఈ అనుభవ సారం లో ఆఖరు పద్యము. అందులోనే అతడు ద్విపదకు శ్రీకారం చుట్టాడు అనేట్టుగా చివర శ్రీ తో అంతమయ్యే మంగళ మహా శ్రీ లు వాడాడు. పాల్కుర్కి పూర్వమందు తెలుగులోనే కాదు పొరుగు భాషలైన తమిళ కన్నడ ల యందు కూడా ద్విపద లేదు. అందుకే సోమనాథుడు పండితారాధ్య చరిత్రము నందు… ” అటు గాన అభివినుతానంది తోక్తి పటు గద్య పద్య ప్రబంధ సామ్యముగ కావ్య కళా ప్రౌఢీ గల్పింతు ద్విపద కావ్యం భవ్యంబున ……….” అంటూ ద్విపదను గూర్చి ప్రతిజ్ఞ చేసి సమర్థించుకున్నారు. పూర్వ గ్రంధముల తో సమానముగా కావ్యత్వం కల్పిస్తానని వ్రాసినాడు.

పాల్కురికి అనంతర కవుల ద్విపద

సోమన్న తర్వాత ద్విపద కావ్య ప్రక్రియను కొనసాగించిన వాడు రంగనాథుడు. సోమన శైవ మత ప్రచారంకు వినియోగిస్తే రంగనాథ రామాయణ కర్త వైష్ణవ మతప్రచారంకై స్వీకరించాడు. బసవ పురాణం లాగే రామాయణం సైతం దేశీయ కథలు ఉండటం చేత ఆయన రంగనాథుడు ద్విపదనే ఉపయోగించాడు. ఆ తర్వాత మడికి సింగన భాగవత దశమ స్కంధమును ద్విపదలో రాసి ప్రచురణార్థం లక్షణము కొంత తగ్గించాడు. దీనిని తిరిగి శ్రీనాథుడు పునరుద్ధరించాడు. శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్రను ; క్రీడాభిరామం ను మంజరీ ద్విపదలో రాశాడు. గౌరన హరిశ్చంద్రోపాఖ్యానంను; నవనాధ చరిత్ర ను ; పిడపర్తి కుటుంబ కవులు ద్విపద లో రాసారు. వీరు శివ మతప్రచారం కై ద్విపద ను ఉపయోగించారు. పిడమర్తి బసవన్న దీప కళియారు కథ ; పిల్ల నైనారు చరిత్ర ; బ్రహ్మోత్తర ఖండము ; దీక్షా బోధ రచనలను పిడపర్తి సోమన ప్రభు లింగ లీల వంటి రచనలు ద్విపద లో రాశారు. తాళ్ళపాక వంశ కవులు సైతం ద్విపద ఆదరించారు. తాళ్ళపాక అన్నమాచార్యులు శృంగార మంజరి; పెద తిరుమలయ్య హరివంశ పర్వము రాశారు. తాళ్ళపాక చిన్నన్న “ద్విపద కేరుగును” అన్న పేరు పొందిన కవి. ఇతడు రచనలు అన్నీ కూడా ద్విపద లోనే రాశాడు. చిన్నన్న పరమయోగి విలాసము; అష్టమహిషీ కళ్యాణము; ఉషా పరిణయము లో ద్విపద లో కలవు. తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా పరిణయం కూడా ద్విపద మంజరి లో కలదు. భారతమును ద్విపదలో రాసిన కవులు తిమ్మన ; బాలసరస్వతి; సోమన వీరిని ద్విపద కవిత్రయంగా పిలుస్తారు. భాగవతం కూడా ద్విపదలో వచ్చింది. దీనిని టేకుమళ్ళ రంగశాయి రాసారు.

తెలుగు లో ద్విపద రచనలు

పాల్కురికి యుగం లో శైవ మత ప్రచారం కు ఎక్కువగా ద్విపద లు ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత తాళ్ళపాక కవులు ద్విపద ను వైష్ణవ ప్రచారం కు ఉపయోగించారు. ఇక క్షీణః యుగంలో మాత్రం ద్విపద మిశ్రమ బాహూల్యం పొందింది. శైవ మత సంబంధ ద్విపదలు రాసిన వారు కంచర్ల అయ్యన్న- కాశీఖండం (16వ శతాబ్దం ) ; వేటూరి భావన – ఘటికాచల మహత్యం ; చిత్తారు గంగాధర కవి-కొలిపాక మహత్యం (1123) ; కాసే సర్వప్ప-సిద్దేశ్వర చరిత్రం (17 వ శతాబ్దం) ; బచ్చు సిద్ధ కవి – మర్రి బసవ పురాణం. వైష్ణవ మత ప్రచారం కోసం ఉపయోగ పడిన రచనలు తాళ్ళపాక చిన్నన్న – అన్నమాచార్య చరిత్ర (1530) ;అష్ట మహిషి కళ్యాణం ; శేషం చిన భట్టాచారకుడు -అభిమన్యు కల్యాణం;బావనూరి రామానామామాత్యడు-కుశలవోపాఖ్యానం; ఇనుగుండ్ల కృష్ణ ప్రధాని-ధర్మజాశ్వమేధం; ద్విపద రామాయణం -ఆరవీటి తిమ్మరుసు; ఉలిచి భావనాజ్ఞనుడు-పరశురామాయణం ; కంకటి నరసింహ కవి -విష్ణుమాయ విలాసం; కర్పూరము కృష్ణమాచార్యులు -భగవద్గీత; ఘట్టూ శేష కవి – సత్యభామా విజయం;చక్రపురి రాఘవాచార్యులు-విష్ణు భక్తి చరిత్ర,నల చరిత్ర ; చేఢ రాఘవరెడ్డి-రామాయణం,పాతూరి తిమ్మన-మై రావణ చరిత్ర, ప్రొలుగంటి చెన్నయ్య మంత్రి -నరసింహ పురాణం;పెద తిరుమలయ్య-హరివంశం,గణవరపు వెంకట కవి -బాల రామాయణం. వేదాంత ప్రతిపాదిత మరియు ఇతర రచనలు పరమానంద తీర్ధుడు-అనుభవ దర్పణం,ఘట్టూ వీరాఖ్యుడు -అనుభవామృతం,యోగానంద అవధూత-ఆత్మైక బోధము; శేష దాసు తిరువెంగలాచార్యులు-ఆత్మానందం రసమంజరి , బడగలనాటి నరస కవి;-ఏకవీరా మహత్యం; ఉమాపతి కవి-చిదానంద మంజరి, కాండ్రీవేటి రామానుజాచార్యులు- తిరువాయ్ మొడి,అనంత కవి-మువ్వార వైభవం,కాకనూరి అప్పకవి-సాధ్విజన ధర్మం,ఢిల్లీ వేంకటకవి-జ్ఞాన సూర్యోదయం, పరశురాముడు-సారంగధర చరిత్ర;మరిగంటి వెంకటాచార్యుడు-మల్లాది చరిత్ర.

ద్విపదపై పరిశోధనలు

ద్విపద సోమన రూపొందినది కాదనీ మల్లియ రేచన ముందుగానే చెప్పాడనే ఒక వాదన కలదు.దీని కంటే ముందుగానే తరువోజ లో నుంచే ద్విపద పుట్టిందనే వాదాన్ని అమరేశం రాజేశ్వర శర్మ గారు ప్రతిపాదించారు.సోమన జానక తెనుగును ప్రవేశపెట్టిన పండితారాధ్య చరిత్రలో ద్విపద గౌరవం నిలబెట్టడం కోసం ఏకపాద సమాసాలు మొదలు సప్త సమాసాల వరకు వాడారని నిడదవోలు వెంకట్రావు పేర్కొన్నారు. కన్నడచ్చంధములోని ద్విపద కాను తెలుగు ద్విపదలకు జన్య జనక సంబంధం ఉందని చిలుకూరి నారాయణ రావు వంటి పండితులు పరిశీలించారు. వీరి ప్రకారం దువాయి,దువది, దువనిగ మొదలగు పేరుతో కన్నడచ్చంధమున ద్విపదలు కలవు. ద్విపద భవము దువయి అనీ కిట్టల దోర గారు రాశారు. దీనిని బట్టి చూస్తే దువయి పద్య లక్షణము ప్రాకృతము లోని “దోఅఇ” అను లక్షణమునకు సరిపోవునని చిలుకూరి నారాయణరావు తెలిపారు. అయితే సంస్కృత ప్రాకృత ద్విపద భేదములు మాత్రమే గాక కన్నడ,తమిళచ్చంధము లోని ద్విపదలు అన్న తగినవి తెలుగు ద్విపదతో జన్య జనక భావ సంబంధమును పొంది వుండలేదనీ , కేవలం Ahavalpa సంబంధమును కల్గి ఉందని అని కోరాడ రామకృష్ణయ్య లాంటివారు పై పరిశోధకులు ఖండించారు.

ద్విపద సాహిత్యం పై ద్విపద వాఙ్మయం (1966-శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ) అనీ జి.నాగయ్య; ఆంధ్ర ద్విపద వాఙ్మయచరిత్ర అనీ పి.సుశీల పరిశోధన చేసారు. ప్రస్తుతము తెలంగాణ ద్విపద సాహిత్యం సమగ్ర అధ్యయనం అనే పేరు తో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జీ.ఈశ్వర పరిశోధన చేస్తున్నారు.

*ఐ.చిదానందం*

తెలుగు భాషోపాద్యాయుడు

తెలుగు రీసెర్చి స్కాలర

ఉస్మానియా యూనివర్సిటీ

సంప్రదించిన రచనలు

  • తెలుగు ఛందో వికాసం-తెలుగు అకాడమీ
  • తరిగొండ ద్విపద భాగవత దశమ స్కంధం ఒక పరిశీలన- భూపతిరాజు బంగార్రాజు
  • సమగ్రాంధ్ర సాహిత్యం (మొదటి సంపుటి)-ఆరుద్ర

ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా stars in Telugu telegram channel లో join అవ్వండి Click here